అసలైన స్వాతంత్య్ర ప్రకటన

థోరో గురించి, వాల్డెన్ గురించీ నా ఆలోచనలు పంచుకుంటూ న్యూ ఇంగ్లాండ్ రచయితలు అమెరికన్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారణమయ్యారని రాసాను. అందుకు మిత్రుడు కన్నెగంటి రామారావు ప్రతిస్పందిస్తూ నిజానికి అమెరికా ఇరవయ్యవశతాబ్దిలోనే తనని తాను ఆవిష్కరించుకోగలిగందనీ, న్యూ ఇంగ్లాండు రచయితలు ఇంగ్లాండు సాంస్కృతిక వారసత్వానికి ఎక్కువ సన్నిహితులుగా తమని తాము భావించుకున్నారనీ రాసాడు.

రామారావు నా కన్నా ఎక్కువ చదువుకున్నవాడు, చూసినవాడు. అమెరికా గురించి సాధికారికంగా మాట్లాడగలినవాడు. నేను అమెరికా గురించి తెలుసుకున్నది చాలా అరకొరగా, అది కూడా ఏవో కొన్ని పుస్తకాల సాయంతో మాత్రమే. కాని న్యూ ఇంగ్లాండు రచయితలు, ముఖ్యంగా ఎమర్సన్, థోరో ల గురించి తెలుసుకునే కొద్దీ సాహిత్య పరంగా, తాత్త్వికంగా అమెరికా ప్రపంచానికి ఇవ్వగలదేదో వారి రచనలనుమించి ఇప్పటిదాకా ఆవిష్కారం కాలేదనే అనిపిస్తున్నది.

ఉదాహరణకి, ఇదిగో, నా దగ్గర Ralph Waldo Emerson: Selected Essays, Lectures and Poems (బాంటం క్లాసిక్స్, 2007) ఉన్నది. ఈ రచనల్ని సంకలనం చేసిన రాబర్ట్ డి రిచర్డ్సన్ అమెరికన్ చరిత్రకారుడు. ఎమర్సన్, థోరో, విలియం జేమ్స్ ల పైన ఆయన వెలువరించిన జీవితచరిత్రలు ప్రసిద్ధిపొందాయి. ఆయన ఈ సంకలనానికి రాసిన ముందుమాటలో ఇలా రాస్తున్నాడు:

‘అమెరికాకి ఇప్పటికే తన గొప్ప తత్త్వవేత్తల్ని ఎమర్సన్, థోరో ల రూపంలో సంపాదించుకుందని స్టాన్లీ కావెల్ అన్నాడు, కాని వారిని ప్రధాన స్రవంతిలో అంతర్భాగం చెయ్యడం ఎలానో అమెరికాకి చాతకాలేదు. ఈ విషయమే జార్జి కాటెబ్ మరికొంత ఆశావహంగా వివరించాడు. ఈ అణ్వస్త్రాంతర యుగానికి మనం అందించగల గొప్ప రక్షణ తత్త్వశాస్త్రం ఎమర్సన్, థోరో, వాల్ట్ విట్మన్ ల ప్రజాస్వామిక ఆదర్శవాదమే అన్నాడతడు. ఎందుకంటే వీరి ఆలోచనల్లో సమతావాదంతో పాటు జీవితం పట్ల అపారమైన గౌరవం కూడా కూడుకుని ఉంది. ‘

పద్ధెనిమిదవ శతాబ్దపు చివరి సంవత్సరాల్లో అమెరికన్ స్వాతంత్య్రకారులు ఒక సుప్రసిద్ధ స్వాతంత్య్ర ప్రకటన చేసారు. నా చిన్ననాడు తాడికొండ హైస్కూల్లో మా వెంకట రత్నం మాష్టారు ఆ స్వాతంత్య్ర ప్రకటన మాకు చదివి వినిపిస్తూ ఎంత ఉద్వేగభరితులైపోయేవారో నాకు ఇప్పటికీ గుర్తుంది. అందులో ముఖ్యంగా ఈ వాక్యాలు:

‘..మనుషులంతా సమానంగా సృష్టించబడ్డారు. సృష్టికర్త వాళ్ళందరికీ జన్మసిద్ధంగానే కొన్ని హక్కులు ప్రసాదించాడు. వాటినెవరూ వాళ్ళనించి లాక్కోలేరు. జీవించడం, స్వేచ్ఛ గా జీవించడం, సంతోషంగా జీవించాలనుకోవడం అట్లాంటి కొన్ని హక్కులు. ఈ సత్యాలకి మరి ఎటువంటి నిరూపణా అవసరం లేదు. .. ఈ హక్కులు సాధించుకోవడం కోసమే మనుషులు ప్రభుత్వాల్ని ఏర్పరుకున్నారు. అలా ప్రభుత్వాలు ఏర్పర్చుకున్న మనుషుల సమ్మతిలోంచే ప్రభుత్వాలకు అధికారం సిద్ధిస్తూ ఉంది. ఎప్పుడేనా ఏదేనా ప్రభుత్వం మనుషుల ఈ ప్రయోజనాలకి భంగం వాటిల్లేలాగా ప్రవర్తిస్తుంటే, ఆ ప్రభుత్వాల్ని మార్చడానికి గాని, కూలదొయ్యడానికి గాని ఆ ప్రజలకు పూర్తి హక్కు ఉంది. అట్లా ఆ ప్రభుత్వాన్ని కూలదోసాక తమకు మరింత భద్రత, మరింత సంతోషం కలిగించే సూత్రాలతో, నియమనిబంధనలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు వారికుంది..’

1776 లో ఈ స్వాతంత్య్ర ప్రకటన రాసిన స్వాతంత్య్ర వీరుల ఇళ్ళల్లో ఆఫ్రికన్ నీగ్రోలు బానిసలుగా పనిచేస్తూండేవారు. మనుషులంతా సమానంగా స్వాతంత్య్రానికి అర్హులని భావించిన ఆ స్వాతంత్య్ర వీరులకి తమ ఇళ్ళల్లో, పొలాల్లో, తోటల్లో, గనుల్లో పనిచేస్తున్న బానిసలు కూడా అందుకు అర్హులే అన్న విషయం గుర్తు రాలేదు.

కాని యాభై, అరవయ్యేళ్ళ తరువాత ఎమర్సన్, థోరోలు తమ పూర్వపు స్వాతంత్య్ర వీరులు రాసుకున్న ఆ స్వాతంత్య్ర ప్రకటనని పూర్తిగా నమ్మారు. ఆ నమ్మకం వాళ్ళని రాజకీయ స్వాతంత్య్రపు పరిధి దాటి, నైతిక, మానసిక స్వాతంత్య్రాల వైపు నడిపించింది. తన కాలం నాటి అమెరికా, బానిస వ్యాపారుల ప్రయోజనాల కోసం మెక్సికోతో యుద్ధం ప్రకటించినప్పుడు థోరో ఆ యుద్ధాన్ని వ్యతిరేకించడమే కాదు, ప్రభుత్వానికి పన్ను కట్టడానికి నిరాకరించాడు కూడా. అప్పుడాయన్ని ప్రభుత్వం అరెస్టు చేసి ఒక రాత్రి జైల్లో పెట్టింది. ఆ రాత్రి ఆ జైలు గోడల మధ్య థోరోకి తానొక్కడే పూర్తి స్వంతంత్రంగా ఉన్నాడనే భావన కలిగింది. తన సుప్రసిద్ధ ప్రసంగం Civil Disobedience (1848) లో అతడిట్లా రాస్తున్నాడు:

“ఆరేళ్ళ పాటు నేను ఎన్నికల పన్ను కట్టలేదు. అందుకని ఒక రోజు నన్ను అరెస్టు చేసి ఒక రాత్రి జైల్లో పెట్టారు. ఆ రాత్రి రెండు మూడు అడుగుల వెడల్పుండే ఆ రాళ్ళ గోడల్నీ, చెక్కతోటీ, ఇనుముతోటీ తయారు చేసిన ఆ తలుపునీ, దీపాల కాంతికి అడ్డునిలుస్తున్న ఆ ఇనప ఊచల్నీ చూస్తూంటే ఆ చెరసాల ఎంత మూర్ఖమైనదో అని అనుకోకుండా ఉండలేకపోయాను. ఎందుకంటే అది నన్ను రక్తమాంసాలూ, ఒట్టి ఎముకలూ మాత్రమే ఉండే దేహంగా భావించి ఆ దేహాన్ని కైదు చేయగలని భావించింది. బహుశా నన్ను ఇంతకన్నా ప్రయోజనకరంగా వాడుకోలేనని భావించి చాలా ఆలోచించినమీదటనే వాళ్ళు నన్నిట్లా బందీ చేసేరేమో అని కూడా అనుకున్నాను. నాకూ, నా తోటి పట్టణవాసులకీ మధ్య ఒక రాతిగోడ అడ్డుగా ఉందనుకుంటే, ఆ పట్టణవాసులు నాలాగా స్వేచ్ఛాభావనని అనుభూతిలోకి తెచ్చుకోవాలనుకుంటే ఇంతకన్నా పెద్ద గోడని దాటవలసి ఉంటుందని అనిపించింది. అది నిజానికి వాళ్ళెవరూ బద్దలు కొట్టలేని గోడ. ఆ రాత్రి నాకు ఒక్క క్షణం కూడా బంధించబడ్డానన్న భావన కలగలేదు. ఆ రాళ్ళూ, సున్నమూ పూర్తిగా నిరుపయోగమైనట్టే అనిపించింది. నిజానికి ఆ మొత్తం పట్టణవాసుల్లో పన్ను చెల్లించింది నేనొక్కణ్ణే అని కూడా అనుకున్నాను. ఆ జైలు సిబ్బందికి నన్ను ఎలా చూడాలో అర్థం కాక నాతో మొరటుగానే ప్రవర్తించారు. వాళ్ళు నాతో మాట్లాడిన ప్రతి మంచిమాటలోనూ, ప్రతి హెచ్చరికలోనూ కూడా పొరపడుతూనే ఉన్నారు. ఎందుకంటే నేను గోడకి అవతల ఉండాలని అనుకుంటున్నట్టుగా వాళ్ళు పొరబడ్డారు. వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఆ తలుపులు మూసినప్పటికీ నా భావాలకు తాళం వెయ్యలేకపోవడం చూసి నాకు నవ్వొచ్చింది. వాళ్ళు తలుపులు వేసి అటు తిరగ్గానే ఆ భావాలు నిరాఘాటంగా వాళ్ళని ఎట్లా వెన్నాడాయో వాళ్ళకి తెలీదు. ఆ భావాలు ఎంత ప్రమోదకరమైనవో కూడా వాళ్ళకి తెలిసినట్టు లేదు. వాళ్ళు నా అంతరంగాన్ని సమీపించలేరు కాబట్టి నా శరీరాన్ని శిక్షించాలని నిర్ణయించుకున్నట్టున్నారు. ఇదెలా ఉందంటే నీకో పెద్దమనిషితో తగాదా ఉందనుకో, అతణ్ణేమీ చెయ్యలేవుకాబట్టి అతడి కుక్కమీద కోపం చూపించినట్టుంది. రాజ్యం నా కళ్ళకి చాలా మూర్ఖంగానూ, చాతకానిదానిలానూ కనిపించింది. దానికి తన స్నేహితులెవరో తన శత్రువులెవరో తెలిసినట్టు లేదనిపించింది. రాజ్యం పట్ల నాలో ఏ లేశమాత్రమైనా గౌరవం మిగిలి ఉంటే ఆ రాత్రి అది పూర్తిగా నశించిపోయింది. ఆ రాత్రి ఆ రాజ్యాన్నీ, ఆ ప్రభుత్వాన్నీ చూసి నాకు గొప్ప జాలి కలిగింది.”

ఆయన ఇంకా ఇలా అంటున్నాడు:

“ప్రభుత్వం తాలూకు అధికారం నేను దానికి విధేయంగా ఉండటానికి ఇష్టపడ్డా కూడా, అది నాకన్నా విజ్ఞులూ, సమర్థులూ నడుపుతున్నా, నడపకపోయినా కూడా, ప్రభుత్వాధికారం ఎప్పటికీ కళంకితమే. అది నిజంగా న్యాయబద్ధంగా ఉండాలంటే అది ఎవరిని పరిపాలిస్తున్నదో వారి పూర్తి సమ్మతికి అది నోచుకుని ఉండాలి. నేను ఏ మేరకు దానికి విధేయంగా ఉండటానికి ఇష్టపడతానో అంతకు మించి నా దేహం మీద గాని, వ్యక్తిత్వం మీద గాని, నా ఆస్తిపాస్తులమీద గాని దానికి అధికారం ఉండకూడదు. నిరపేక్ష నిరంకుశ రాజరికం నుంచి పరిమిత రాజరికానికీ, పరిమిత రాజరికం నుంచి ప్రజాస్వామ్యానికీ మనం చేసిన పురోగమనం నిజానికి వ్యక్తి పట్ల చూపించవలసిన గౌరవం దిశగా చేస్తున్న ప్రయాణమే. చివరికి చీనా తత్త్వవేత్త కూడా ఒక సామ్రాజ్యానికి ఆధారబిందువు వ్యక్తి అనే అన్నాడు. అది అతడి వివేకం. మనం చూస్తున్న మనకి తెలిసిన అర్థంలో ఈ ప్రజాస్వామ్యమే ప్రభుత్వపాలన తాలూకు పరిపూర్ణ రూపమా? ఇంతకు మించిన పురోగతి మరేదీ లేదా? మనుషుల తాలూకు హక్కుల్ని గుర్తించడంలోనూ, కూడదీసుకోవడంలోనూ ఇంతకన్నా మరొక అడుగు ముందుకు వెయ్యలేమా? వ్యక్తినుంచే తన సమస్త అధికారమూ, రాజకీయశక్తీ సమకూరుతున్నాయని గ్రహించి రాజ్యం వ్యక్తిని తనకన్నా అత్యున్నత, స్వతంత్ర శక్తిగా భావించనంతవరకూ నిజంగా ఏ రాజ్యమూ స్వతంత్రమని గాని పూర్తిగా వికసించిందని గాని చెప్పలేము.నా వరకూ నాకు కనీసం రాజ్యమనేది వ్యక్తులందరి పట్లా న్యాయసమ్మతంగా ఉండాలనీ, వ్యక్తిని తన ఇరుగుపొరుగుగా గౌరవించాలనీ, ఇంకా వీలైతే ఎవరేనా కొద్ది మంది వ్యక్తులు ఇరుగుపొరుగు పట్లా, తోటిమనుషుల పట్లా తమ బాధ్యతలు నిర్వహిస్తూ తమ మానాన తాము బతకడానికి ఇష్టపడుతుంటే వాళ్ళ జోలికి పోకుండా వాళ్ళని మానాన వాళ్ళని బతకనివ్వాలని కూడా కోరుకుంటాను. ఏ రాజ్యమైతే ఈ విధంగా ఫలప్రదమవుతుందో, ఆ ఫలం కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పండి తొడిమ విదుల్చుకుంటుందో అటువంటి రాజ్యం అంతకన్నా మరింత పరిపూర్ణమైన, మరింత యశోవంతమైన రాజ్యానికి దారి తీస్తుంది. అయితే అటువంటి రాజ్యాన్ని కలల్లో తప్ప ఇంతదాకా కళ్ళారా చూడలేకపోయాను.”

అటువంటి రాజ్యం గురించిన అన్వేషణలోనే అమెరికా ప్రపంచానికి ఇవ్వగల ఉపాదానం ఉంది. అందుకనే ఆ వ్యాసం చదివి ఒక టాల్ స్టాయి, ఒక గాంధి, ఒక మార్టిన్ లూథర్ కింగ్ ప్రభావితులు కావడంలో ఆశ్చర్యం లేదు.

ఎమర్సన్ కోరుకున్నది ప్రధానంగా నైతిక స్వాతంత్య్రం. థోరో అంతకన్నా ఒక అడుగు ముందుకు వేసాడు. ఆయన దృష్టిలో ఏదో ఒక ముందస్తు ప్రణాళికలు ఏర్పరచుకుని దాని ప్రకారం జీవితాన్ని, సమాజాన్ని నడుపుకోవడంలో ఎంతో కొంత డంబం, హింస, ఆత్మవంచన తప్పనిసరిగా వచ్చిచేరతాయి. అందుకని Life Without Principle (1863) అనే తన వ్యాసంలో ఇలా అంటున్నాడు:

“మనం మన ఇళ్ళకీ, కొట్టాలకీ పునాది గట్టిగా ఉండటం కోసం గ్రానైటు వాడతాం. ఇళ్ళ చుట్టూ రాతి గోడ కట్టుకుంటాం. కాని మనం మాత్రం సత్యమనే బ్రహ్మాండమైన శిల మీద నిలబడాలని మాత్రం అనుకోం. సత్యం అత్యంత ఆదిమ శిల. మన ఇళ్ళ కిటికీలూ, తలుపులూ తుప్పుపట్టిపోయాయి. మన అంతరంగంలో మనం సంభావించగల అత్యంత నిర్మలం, అత్యంత సూక్ష్మమైన సత్యంతో సహజీవనం చెయ్యని మానవుడు ఏమి మానవుడు? నేను నా దగ్గరి మిత్రుల మీద, సన్నిహితులమీదా తరచు చేసే ఆరోపణ ఇదే. వాళ్ళు జీవితం పట్ల ఉండవలసినంత గంభీరంగా ఉండటంలేదనే. పరస్పర మర్యాదల్నీ, ప్రశంసల్నీ పక్కన పెట్టి, మనం జీవితం గురించి ఒకరికొకరం ఎంత నిజాయితీతో, ఎంత సత్యసంధతతో చెప్పుకుంటున్నాం? శిలలాగా స్థిరసంఘటనగా ఎందుకు మనలేకపోతున్నాం? నేననుకుంటాను, ఈ దోషం పరస్పరం. ఎందుకంటే మనం ఒకరి పట్ల ఒకరం ఎలా ఉండాలో మనమెప్పుడూ నేర్చుకోలేదు. “

ఇంకా ఇలా రాస్తున్నాడు:

“మనం రోజూ ఒకరితో ఒకరం మాటాడుకునే మాటలు చూడండి. ఎంత డొల్లగా ఉంటాయో. ఒకరినొకరు ప్రభావితం చేసుకోగల శక్తి మన సంభాషణలకి లేదు. మనదంతా పైపైన వ్యవహారం మాత్రమే. మన జీవితం ఎప్పుడు ఆంతరంగికక్షేత్రంలోంచి వికసించదో, మన అత్యంత వ్యక్తిగత అనుభూతిని ప్రకటించలేదో, అప్పుడు మన సంభాషణ తప్పనిసరిగా గాసిప్ గా మారిపోతుంది. తాను చదివిన వార్తాపత్రికలో విషయాలు మళ్ళీ మనకి చెప్పనివాడు, లేదా తన పొరుగువాడు చెప్పిన విషయాలే మళ్ళా మనదగ్గర ఏకరువు పెట్టనివాడు మనకి కనిపించడం చాలా అరుదు. మనకీ, మనల్ని కలిసే మనిషికీ తేడా అంటూ ఉంటే, ఇదొకటే: అతడు పొద్దున్నే న్యూస్ పేపరు చూసాడు, లేదా వీథి చివర హోటలుకి వెళ్ళి టీ తాగాడు, మనమింకా ఆ పని చెయ్యలేదు, అంతే. మన ఆంతరంగిక జీవితం ఏ మేరకు మూసుకుపోతే ఆ మేరకు మనం పోస్టాఫీసుకు పరుగెడతాం. తనకి వచ్చిన ఉత్తరాల కట్టని చూసి మురిసిపోయే మనిషి గురించి నిశ్చయంగా చెప్పగల సంగతేమిటంటే, అతడికీ అతడి లోపలి మనిషికీ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు ఆగిపోయాయనే.”

1776 స్వాతంత్య్ర ప్రకటన సమానులూ, స్వతంత్రులూ అయిన మనుషుల్ని సంభావించింది. స్వతంత్రం కోరుకునేవారు ముందు మనుషులుగా జీవించడం నేర్చుకోవాలని ఎమర్సన్ అన్నాడు. మనుషులు కాదు, ఇప్పటిదాకా ముందు ఒక మనిషి కూడా రూపొందలేదంటున్నాడు థోరో. తన ప్రసంగంలో ఇలా అంటున్నాడాయన:

“నీ ప్రభాతాలూ, సాయంసంధ్యలూ నీ కోసం కొత్త వార్తలు మోసుకొస్తున్నాయని నీకిప్పుడు తెలిసి వస్తుంది. పొద్దున్నా, సాయంకాలం నువ్వు నడిచే నడక పొడుగునా ఎన్ని సంఘటనలు. ఇప్పుడు నువ్వు గమనిస్తున్నది యూరోప్ లో జరుగుతున్న విషయాలు కాదు, ఇక్కడ మసాచుసెట్సులో ఈ పొలాల్లో నీకెదురవుతున్న సంఘటనలే. నువ్వు సంచరిస్తున్న ఈ సూక్ష్మలోకం చాలా పలచన, అది వార్తాపత్రికలు ముద్రించే కాగితంకన్నా ఎంతో పలచన. ఆ సూక్ష్మ ప్రపంచంలో నువ్వు సంచరించగలిగితే ఎన్ని వార్తలు. కాని నువ్వు ఆ ప్రపంచం కన్నా ఒక అడుగు పైన తిరిగినా, ఒక అడుగు కింద నడిచినా నీకు ఆ వార్తలు వినిపించవు. రోజూ పొద్దున్నే సూర్యుడు ఉదయించడం, సాయంకాలం అస్తమించడం, వాటిని నీ మనోప్రపంచంలోకి సమన్వయించుకోవడం, మనల్ని నీజంగా ఆరోగ్యంగా ఉంచగలిగేవి ఇవే. ఇంక జాతులా? రాజ్యాలా? ఏమి జాతులు? హూణులు, తార్తార్లు, చీనావాళ్ళు-కీటకాల్లాగా ముసురుకున్నారు వాళ్ళు ఈ ప్రపంచమంతా. వాళ్ళ జీవితాల్ని మనమేదో విధంగా గుర్తుపెట్టుకోవడం కోసం ఇప్పుడు చరిత్రకారుడంటూ ఒకడు కొత్తగా బయల్దేరాడు. నేనకుంటాను, ఒక్క మనిషి దొరకడం దుర్లభమైపోయింది కాబట్టే, అంత మంది అసంఖ్యాక మానవుల గురించి మనం ఆలోచించవలసి వస్తున్నది.”

అమెరికా స్వాతంత్య్ర ఉద్యమానికి కారణం taxation without representation అని మనకు తెలుసు. కాని ప్రాతినిధ్యం లేకుండా పన్నులు కట్టవలసి రావడాన్ని థోరో ఒక మెటఫర్ గా చూసి ఇలా అంటున్నాడు:

“ఈ దేశం నిజంగా స్వతంత్ర దేశమని మనం అనగలమా? అసూయాద్వేషాలనే శక్తులనుంచి మనం విముక్తులం కానంత కాలం జార్జి చక్రవర్తినుంచి విముక్తులమై ఏమి లాభం? మనం స్వతంత్రంగా మనలేనప్పుడు స్వతంత్రులుగా పుట్టడంలో అర్థమేముంది? నైతిక స్వాతంత్య్రం కోసం కాకపోతే రాజకీయ స్వాతంత్య్రానికి విలువ ఏమిటి? మనం రొమ్ము విరుచుకుని బిగ్గరగా ప్రకటించుకుంటున్న స్వాతంత్య్రం స్వతంత్రంగా ఉండటానికి అనువైన స్వాతంత్య్రమా లేక బానిసలుగా బతకడానికి అనువైన స్వాతంత్య్రమా? ఒక జాతిగా మనది కేవలం రాజకీయనాయకుల జాతి. మనమెంతసేపూ స్వాతంత్య్రాన్ని ఎలా రక్షించుకోవాలో మాత్రమే మాట్లాడుతుంటాం. బహుశా మన పిల్లల పిల్లలు మాత్రమే ఏ మేరకో నిజంగా స్వతంత్రులుగా మనగలరేమో. మనం మనల్నించి ఏదో ఒక రాబట్టుకోవాలనే చూస్తుంటాం. కాని మనలోని విలువైన భాగానికి మాత్రం అక్కడ ప్రాతినిధ్యం ఉండదు. ప్రాతినిధ్యానికి నోచుకోకుండా పన్నులు కట్టవలసి రావడమంటే ఇదే.”

కాబట్టి నిజమైన అమెరికాని చూడటానికి న్యూ ఇంగ్లాండు రచయితలు తిరిగిన దారుల్లోనే తిరగాలనిపిస్తున్నది నాకు.

24-5-2021

Leave a Reply

%d bloggers like this: