
రాజమండ్రి గురించి ఆరుద్ర రాసిన పాటలో ‘శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట’ అని రాసాడు. ఒకప్పుడు శ్రీనాథుడు కొండవీటినుంచి వెళ్ళి రాజమండ్రిలో కొన్నాళ్ళున్నాడు. అక్కడున్నప్పుడే ఆయన భీమఖండం రాసాడు కూడా. కొందరు సాహిత్యవేత్తలు కొన్ని స్థలాల్లో ఉన్నప్పుడు వారికీ, ఆ స్థలాలకీ మధ్య అనిర్వచనీయమైన ఆత్మీయత కలుగుతుంది, పెరుగుతుంది. తక్కిన ప్రపంచం ఆ రచయితల్ని గుర్తుపెట్టుకోనీ, మర్చిపోనీ, ఆ ఊళ్ళు మాత్రం వారిని ఎన్నటికీ మరవవు. విశ్వనాథ సత్యనారాయణగారు కరీం నగర్ లో నివసించడం కూడా అటువంటిదే. ఆ కోవలోనే కవితాప్రసాద్ వరంగల్ వాసం కూడా వస్తుంది. ఆయన అక్కడ ఉన్నప్పుడే భద్రకాళి అమ్మవారి గుడిలో ఒక రోజు ఆశువుగా ఒక శతకం చెప్పిన సంగతి విని ఇప్పటికీ వరంగల్ పరవశించిపోతూ ఉంటుంది.
ఆయన్ని ఎంత గుర్తుపెట్టుకోకపోతే వరంగల్ లోని సహృదయ సాహిత్య, సాంస్కృతిక సంస్థ వారు ఆయన పేరిట ఒక అనుబంధ పురస్కారం ఏర్పాటు చేస్తారు! 2016 నుంచీ, అటు సాహిత్యంలోనూ, ఇటు పాలనలోనూ కూడా సమానమైన కృషి చేసిన రచయితలని ఎంపిక చేసి ఆ సంస్థ రాళ్ళబండి కవితా ప్రసాద్ ను తలుచుకుంటూ, ప్రతి ఏటా ఆయన పుట్టిన రోజు నాడు సహృదయ అనుబంధ పురస్కారాన్ని అందిస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా పి.వి.ఆర్.కె.ప్రసాద్, డా.ఎ.విద్యాసాగర్, జె.బాపురెడ్డి వంటి వారికి ఆ పురస్కారం లభించింది. ఇప్పుడు 2020 సంవత్సరానికిగాను నాకు, 2021 సంవత్సరానికి డా.నందివెలుగు ముక్తేశ్వరరావుగారికి ఆ పురస్కారం ప్రకటించారు. నిన్న జూమ్ లో, గిరిజామనోహర బాబుగారి అధ్యక్షతన ఎందరో సుప్రసిద్ధ కవిపండితుల సమక్షంలో ఆ పురస్కార ప్రదానం కూడా జరిగింది.
మిత్రుడి పేరు మీద ఒక పురస్కారం అందుకోవడంలో నేను సంతోషం కన్నా నిర్వేదమే ఎక్కువ అనుభవించాను. కలకాలం జీవించివలసినవాడు, కలకల్లాడుతూ మనమధ్య కలిసి ఉండవలసినవాడు అర్థాంతరంగా నిష్క్రమించడం ఏమిటి, అతడి పేరుమీద నేను ఇక్కడ పురస్కారం తీసుకోవడం ఏమిటి? నాకైతే, నా అన్న పేరుమీదనో, తమ్ముడిపేరుమీదనో ఒక పురస్కారం ఇస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అలానే అనిపించింది.
కవితాప్రసాద్ నేను జీవితంలో చూసిన అత్యంత ప్రతిభామూర్తుల్లో ఒకడు. సాహిత్యం, సంస్కృతి, పాలన, ప్రేమానురాగాల విషాయంలో అంత జీవశక్తి ఉన్న మనుషులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఆయన ప్రతిభ ఎటువంటిదంటే, ఆయన రాసిన ‘ఒంటరి పూలబుట్ట’ ని ఒక పండితుడు సంస్కృతంలోకి అనువదిస్తే, ఆ సంస్కృతానువాదానికి కేంద్ర సాహిత్య అకాదెమీ పురస్కారం లభించింది!
నేను గిరిజన సంక్షేమశాఖలోనూ, ఆయన సాంఘిక సంక్షేమశాఖలోనూ పనిచేస్తున్నప్పుడు మేమిద్దరం సంక్షేమభవన్ లో ఉంటున్నప్పుడు కొన్ని సంవత్సరాలపాటు మేమిద్దరం ప్రతి రోజూ, ప్రతి పూటా కలుసుకునేవాళ్ళం. ఆయన నా రూమ్ లోకి ఎప్పుడు వచ్చినా పదిమంది వచ్చినంత సందడి ఉండేది. ‘దొరవారూ’ అంటూ ఆయన నా రూమ్ అడుగుపెడుతూనే ఏదో ఒక పద్యం అందుకునేవాడు. లేదా ఎవరేనా ఒక కళాకారుడిని తీసుకువచ్చి ఆయనతో పద్యాలు పాడించేవాడు. ఒకసారి అట్లా గుమ్మడి గోపాలకృష్ణని తీసుకువచ్చి నాకు పరిచయం చేసాడు. ఈయన కంఠంలో తిరుపతివేంకట కవుల్ని వినాలి మీరు అన్నాడు. గోపాలకృష్ణ కంచుకంఠం మోగడం మొదలుపెట్టింది. నా రూమ్ ని ఆనుకునే మా కమిషనర్ రూమ్. నేను తలుపులు మూసేసాను. కిటికీ తలుపులు కూడా మూసేసాను. తెరలు దగ్గరగా లాగేసాను. ఆ పద్యాలు మా కమిషనర్ చెవిన ఎక్కడ పడతాయోనని నా గుండె కొట్టుకుంటూనే ఉంది. కాని ఆ కవికీ, ఆ కళాకారుడికీ ఇదేమీ పట్టలేదు. ఇంత అరసిక, అమానుష ప్రపంచంలో కవితాప్రసాద్ అన్నేళ్ళు ప్రభుత్వోద్యోగం ఎలా చేసాడా అన్నది నాకిప్పటికీ ఆశ్చర్యమే.
ఒకసారి కె.సదాశివరావుగారు కవితాప్రసాద్ ని పరిచయం చేయమంటే వాళ్ళింటికి తీసుకువెళ్ళాను. మామూలుగా తెలుగు సాహిత్యకారులు ఎవరు కనిపించినా వారిని తన పాశ్చాత్య సాహిత్య పరిజ్ఞానంతో ఉక్కిరిబిక్కిరి చేసే సదాశివరావుగారు అవాళ అప్రతిభుడై, కళ్ళు పెద్దవి చేసుకుని, శరీరమంతా ఒక చెవిగా కవితాప్రసాద్ ని వింటో, చూస్తో ఉండిపోయేరు. ‘కవిత్వం, చదివితే దాని స్వారస్యం తెలీదు. దాన్ని బిగ్గరగా చదవాలి. అభినయిస్తో చదవాలి. Poetry is a performance’ అంటో ‘ఏమేమీ కలహాశనుండచటికై ఏతెంచి ఇట్లాడెనా ‘అనే పద్యాన్ని ఆయన ఆ రోజు అభినయిస్తూ చదివిన తీరు నా మనసులోంచి ఎప్పటికీ చెదరదు.
ఒక శివరాత్రి నాడు పొద్దున్నే ఫోన్ చేసి, ఇదిగో, శ్రీనాథుడి ఈ పద్యం వినిపించాడు. ఇప్పటికీ, ఈ పద్యం శంఖం మోగినట్టుగా నా హృదంతరాళంలో ధ్వనిస్తూనే ఉంటుంది:
భవు, భవానీ భర్త, భావసంభవ వైరి
భవరోగ భంజను, భాలనయను
భోగప్రదుని, భోగి, భోగిరాజవిభూషు
భూనభోభివ్యాప్తు, భువన వంద్యు
భగవంతు, భర్గుని, భసితాంగరాగుని
భానుకోటి ప్రభాభాసమాను
భాగీరథీ మౌళి, భగదృగ్విపాటను
భూరథాంగుని, భద్రభూతిధరుని
భామినీ సువిలాసార్థ వామభాగు
భక్తితోడ భజింపరో భవ్యమతులు
భావనా భాజులకతండు ఫలములొసగు
భాగ్యసౌభాగ్యవైభవ ప్రాభవములు.
ఒకరోజు పొద్దున్నే ఉట్నూరు బస్ స్టాండ్ లో దిగాను. మార్చినెల. ఉగాది సందర్భంగా మా రవీందర్ ఒక సాహిత్యసమావేశం ఏర్పాటు చేసాడు. నేనూ, మా అక్కా ఆ ఊళ్ళో అడుగుపెట్టగానే ఆ తెల్లవారు జామున నిండుగా పూసిన వేపచెట్ల తీపిగాలి మమ్మల్ని గుప్పున తాకింది. అప్పుడు వినిపించింది ఒక కోకిల కూత. నేను ఉలిక్కిపడ్డాను. అది ఎందుకో నా మిత్రుడే కోకిలగా మారి నా వెంట వస్తున్నాడనిపించింది. బహుశా ఈ భ్రమ ఈ జన్మకి వీడదు.
7-7-2021