అతులిత మాధురీ మహిమ

శ్రీకాళహస్తి ఇంతకు ముందు వెళ్ళిన ఊరే, దేవాలయం కూడా ఇంతకుముందు దర్శించుకున్నదే కాని, సంబంధ నాయనారు తిరిగిన దారుల్లో తిరిగి, పాడిన పాటలు విన్నాక ఇదే మొదటిసారి చూడటం. ఇంతకు ముందు తమిళ భక్తి కవుల పాటలు పుట్టిన తావుల్ని పరిచయం చేస్తూ జ్ఞానసంబంధులు కాళత్తి కొండ మీద రాసిన పాటని పరిచయం చేసాను.

కొండలన్నిటిలోకీ ఏ కొండ అంటే

ఆయనకెక్కువ మక్కువ అని అడిగావనుకో

అది కాళత్తి కొండ అని చెప్తాను.

జటలుకట్టిన శిరసుమీద నెలవంకతగిలించుకున్నవాడు

మూడునగరాల్ని ఒక్క శరంతో క్షణంలో దహించినవాడు

ఇష్టపడే కొండ కాళత్తి కొండ.

ఎండినవెదుళ్ళు ఒకదానికొకటి రాచుకున్నప్పుడు

నిప్పుతునకలు ఎగిసిపడే కొండ

అడవిపందులు నేలని పెళ్ళగించినప్పుడు

వజ్రాలు బయటపడిమెరిసే కొండ కాళత్తి కొండ.

పోలింగు జరిగిన రోజు పోలింగు స్టేషన్లన్నీ చూసుకుంటూ కాళహస్తి చేరేటప్పటికి చీకటి పడుతూ ఉంది. పార్లమెంటు ఎలక్షనుకోసం తీసిన పెద్ద ఊరేగింపు ఒకటి గుడి చుట్టూ మోహరించింది. ఏ దారిలో ముందుకు వెళ్ళాలన్నా కారు దిగి చాలా దూరం నడిస్తే తప్ప వీలయ్యేలాగా లేదు. కాని నాతో ఉన్న సిబ్బంది నన్ను ఎలాగేనా గుడికి తీసుకువెళ్ళాలనుకున్నారు. దాంతో ఊరంతా చుట్టి మరొకదారిలో గుళ్ళోకి తీసుకువెళ్ళారు. ఆ రోజు ఆ సాయం సంధ్యవేళ ఆ దర్శనం నిజంగా నా భాగ్యం.

శ్రీకాళహస్తీశ్వరుడు తన గదినిండా దీపాలు వెలిగించుకుని కూచున్నాడు. ఏ పూర్వజన్మ సుకృతమో కొన్ని క్షణాల పాటేనా జ్ఞానప్రసూనాంబ పాదాలకు దగ్గరగా నిలబడే అవకాశం లభించింది. దీన్నేనా శివసాన్నిధ్య సుఖం అంటారు?

ఒకప్పుడు ధూర్జటి గురించి ప్రసంగిస్తూ మా మాష్టారు ఇలా అన్నారు:

‘నాకు అయిదు-ఆరేళ్ళప్పుడు మా పెద్దన్నయ్య ఈ తిన్నడి కథ వినిపించడం జరిగింది. కాళహస్తి మాహాత్మ్యంలో ఈ పద్యాలే నాకు మొదటగా వచ్చాయి. అయినా మద్రాసు వెళ్ళిన పిమ్మట నా ఇరవయ్యో యేటగానీ-నేను కాళహస్తి మాహాత్మ్యం చదవడం పడనే లేదు. అప్పటికి నేను చదివింది పాండురంగ మాహాత్మ్యమే. అప్పట్లో ఆ కావ్యమంటే నాకు తెగని మోజుగా ఉండేది. ఇప్పటికీ ఆ గ్రంథం నాకు కంఠస్థమే.

అదేమి చిత్రమో! కాళహస్తి మాహాత్మ్యం చదివిన పిమ్మట అంతటి మోజూ నాకు తెలియకుండానే ఎలా విరిగిపోయిందో విరిగిపోయింది. అచ్చమైన కవితా మాధుర్యం ఎలా ఉంటుందో సహజమైన భక్తి లక్షణం ఎలా ఉంటుందో తొలిసారిగా తెలిసింది.

తెనాలి కవి కావ్యంలో సాహిత్య ప్రౌఢి యెంత ఉన్నా, ఈ మాధుర్యం లేదే అనిపించింది. గురువు గారు శ్రీ విశ్వనాథ వారు ఒకసారి మద్రాసు విచ్చేసినప్పుడు- ఈ విషయం మనవి చేసాను. వారిలా అన్నారు ‘నీవు అనుకునేది నిజమే. ధూర్జటి ఆత్మకు శివసాన్నిధ్య సుఖం తెలుసు.’

సాధారణంగా తెలుగునాట ధూర్జటిని తలుచుకునే వారు శ్రీకాళహస్తీశ్వర శతకాన్నే ఎక్కువ తలుచుకుంటారు. కాని ‘అతులిత మాధురీ మహిమ’ అని రసజ్ఞ ప్రపంచం ప్రస్తుతించిన ధూర్జటి పలుకు తేనే ఎటువంటిదో కాళహస్తీశ్వర మాహాత్మ్యంలో చూడవలసి ఉంటుంది. ఇంతకీ మాధుర్యం అంటే ఏమిటి? శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యానికి పీఠిక రాసిన విశ్వనాథ ‘ఈ కాళహస్తి మాహాత్మ్యం వంటి గ్రంథము తెలుగులో మరియొకటి లేదు.. తక్కినవారి కవిత్వము మనస్సునకు వాడిపెట్టి హృదయమును పాటుకు తెచ్చును. ఈ కవిత్వము మనస్సు వాడిమిని దాటి గుండె యొక్క పాటు దాటి దూరాన శివుడు కనిపించునట్లు చేయును ‘ అని రాసాడే కాని, ఆ మాధురీ మహిమ ఏమిటో వివరించడానికి ప్రయత్నం చేయలేదు.

‘ధూర్జటి కావ్యాలు తెలుగు నుడి గుడులు’ అనే తన ప్రసంగ వ్యాసంలో మా మాష్టారు ఆ మాధుర్యలక్షణాన్ని వివరించడానికి చాలా ప్రయత్నం చేసారు. ఆయన ఇలా రాస్తున్నారు:

‘ఓహో! ఏమి తెనుగు భాష! ఏమి తెనుగు దేశం! మిగిలిన వారి మాట నాకు అనవసరం. పుడితే నేను ఎన్ని జన్మలకైనా ఈ దేశంలోనే పుట్టాలి. ఈ కావ్యాలే చదవాలి. ఈ దైవాలనే సేవించాలి. అందులో శ్రీ కాళహస్తీశ్వర స్వామిని తలచుకున్నప్పుడు అసలు – ఈ స్వామి తియ్యదనమే వేరు, కేవలమూ ఇది పొత్తపినాటి అడవుల తేనె! ఈ తేనె తియ్యదనమంతా తెనుగుభాషలోనికి అందులోనూ ఒక్క ధూర్జటి పలుకులలోనికే సరాసరి దిగినదేమో అనిపిస్తుంది. ఈ నేలకు, ఈ భాషకు ఈ దైవం ఏనాటి చుట్టమో కదా.’

ఆ మాధుర్యాన్ని ఆయన తనకై తాను అర్థం చేసుకుని మనకు వివరించడానికే ఆ ప్రసంగమంతటా ప్రయత్నించారు. ముఖ్యంగా మాధుర్యమంటే సర్వావస్థామనోహరత్వం అని అంటారని చెప్తూ ఆ సర్వావస్థామనోహరత్వం ఆ కావ్యంలో ఎలా ఉందో కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఆయన చెప్పినదాన్ని బట్టి ఆ కావ్యమాధుర్యం ఎక్కువగా మన మననశీలత మీద ఆధారపడ్డదని అర్థమవుతూ ఉంది. నాసరరెడ్డి ఒక కవితలో అన్నట్టుగా రహస్యంగా, లోతుగా ఉన్న ఆ బావి ‘నీలో దాహం ఉంటే ప్రియంగానూ ఉంటుంది.’

కాని నన్నయ అక్షరరమ్యత కన్నా , పోతన మందారమకరంద మాధుర్యం కన్నా మించి ధూర్జటి పలుకుబడి ప్రత్యేకత ఎక్కడ ఉంది? మా మాష్టారి ప్రసంగంలో దానికి జవాబు లేదు. నేనకుంటాను, అది కవి cadences లో ఉంది. ఈ శిల్ప విన్యాసంలో ధూర్జటి అత్యాధునికుడు. ఇప్పుడు ప్రపంచం పూరిగా వచనకవిత వైపు మళ్ళిపోయినతర్వాత, రసజ్ఞులు, ఒక కవిలోని కవిత్వ సాంద్రతనీ, ఆ కావ్యకమనీయతనీ ఆ కవి వాగ్ధారలోని cadences ని బట్టే కొలుస్తున్నారు. అంటే ఒక కవి కవిత చెప్పినప్పుడు, వస్తువూ, భావమూ, అనుభూతీ, భావోద్వేగమూ అన్నిటితో పాటు, ఆయన తన పదాల్నీ, పదబంధాల్నీ ఎలా పేర్చుకుంటున్నాడు, మధ్యలో ఎక్కడెక్కడ ఆగుతున్నాడు, ఎక్కడెక్కడ ఆగలేకపోతున్నాడు అన్నదాన్ని బట్టి చూస్తున్నారు. అలా చెప్పడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ధోరణి ఉంటుంది, శైలి ఉంటుంది. కొందరి పోహళింపు ధారాపాతంగా ఉంటుంది, పోతనలాగా. ధూర్జటి పద్ధతి వేరే. అతడు ఆగి ఆగి పూర్తి వాక్యాన్ని నెమ్మదిగా మన రక్తనాళాల్లోకి ఇంజెక్టు చేస్తాడు. చూడండి:

అలరుందీవెలు, పువ్వు గుత్తులు కురంగాలోకముల్, పల్ల వం

బులు, పంచానన మధ్యముల్, మధుకరంబుల్, బింబముల్, దాడిమీ

ఫలబీజాదులు నద్రిజావయవ సౌభాగ్యంబుతో నీడురా

గలవో లేవో యటంచు చూచు గతి నా గ్రావంబునన్ ద్రిమ్మరున్ (1:100)

ఉదయగ్రావము పానవట్ట, మభిషేకోదప్రవాహంబు వా

ర్ధి, దరీధ్వాంతము ధూపధూమము జ్జ్వలద్దీప ప్రభారాజి కౌ

ముది తారా నివహంబు లర్పిత సుమంబుల్ గా దమోదూరసౌ

ఖ్యదమై శీతగభస్తిబింబ శివలింగంబొప్పె ప్రాచీదిశన్ (2:133)

చిట్లపొట్లాకాయ, సిరిసింగణావంతి

గుడుగుడు గుంచాలు, కుందెన గుడి

డాగిలిముచ్చులాటలు, గ్రచ్చకాయలు

వెన్నెలకుప్పలు, తన్నుబిల్ల

తూరనతుంకాలు, గీరన గింజలు

పిల్లదీపాలంకి, బిల్లగోడు

చిడుగుడువ్వలపోటి, చెండుగట్టిన బోది

యల్లి యుప్పన బట్టె, లప్పళాలు

చిక్కనాబిళ్ళ, లోటిళ్ళు, చిందరాది

యైన శైశవ క్రీడా విహారసరణి

చెంచుకొమరులతో నుద్దులించు కాడు

తిన్నడభినవ బాల్య సంపన్నుడగుచు (3:33)

మంకెన పూవులో విడిసి మత్తిలి యుండెడు తేటి రీతి మీ

నాంక సరోజరాగ కలితాభరణాంతర నీల లీల, హా

లాంకురితారుణచ్ఛవి సమంచిత లోచన తారకద్యుతుల్

బింకము చూప పానముల పెక్కువచొక్కిరి భిల్లదంపతుల్ (3:44)

ఓ సామీ, యిటువంటి కొండదరిలో ఒంటింబులుల్ సింగముల్

గాసింబెట్టెడు కుట్రనట్టడివిలో కల్జువ్వి క్రీనీడ ఏ

యాసంగట్టితి వేటిగడ్డ నిలు? నీ వాకొన్నచో కూడు నీ

ళ్ళే సుట్టంబులు తెచ్చి పెట్టెదరు? నీ కిందేటికే లింగమా (3:65)

ఇల్లో, ముంగిలియో, యనుంగుజెలులో, ఈడైన చుట్టంబులో

యిల్లాలో, కొడుకో, తరింపవశమే, ఏ పోడుముల్ లేక, మా

పల్లెం కోరిన వెల్లనుం గలవు తెప్పల్ కాగ, నీ కిచ్చెదన్

చెల్లం బో! యిట నొంటినుండ కటు విచ్చేయంగదే లింగమా (3:70)

ఇలా ఎన్ని పద్యాలైనా ఉదాహరించవచ్చు. మరొక గుణం ఆయన syntax లో ఉందనిపిస్తుంది. అది అన్వయక్లిష్టత లేని సూటి వాక్యనిర్మాణం. బంగారు తీగ కమ్మెచ్చున లాగినట్టు, పద్యమంతా ఒక వాక్యం. సూటి వాక్యం. అటువంటి వాక్యశిల్పం వినడానికి శ్రవణ సుభగంగా ఉంటుంది. చూడండి:

కాలవొ క్రొవ్వవొ, మాడం

గాలెనొ, చవిగావొ, కమ్మగావో, నీకున్

జాలవొ, యలవడవొ, తిన

వేలా కరకుట్లు, పార్వతీశ్వర! చెపుమా (3: 88)

ప్రాణము వోవునో, తనువు భంగము నొందునో, నాక, తూణికా

బాణము చిర్రునం దిగిచి భల్లముఖాగ్రము రక్తపద్మ దృ

క్కోణము చేర్చి గుచ్చి ఒక గుడ్డు వడిం పెకలించి శోణిత

ద్రోణికయైన దైవతశిరోమణి కంట నమర్చె నంతటన్ (3:115)

ఒక కవితని రసాభ్యుచితం చేసేదేది? అందరు కవుల్లానే ధూర్జటిని కూడా ఈ ప్రశ్న వేధించింది. తాను రాసి ఇచ్చిన పద్యాన్ని నత్కీరుడు రాజసభలో తప్పుపట్టాడని విన్నప్పుడు సాక్షాత్తూ శివుడే రాజసభకి వచ్చి ఇలా అడిగాడు:

ఈ రాజన్యుని మీద నే గవిత సాహిత్యస్ఫురన్మాధురీ

చారు ప్రౌఢిమ చెప్పి పంప, విని మాత్సర్యంబు వాటించి, న

త్కీరుండూరకె తప్పు పట్టెనట! యేదీ! లక్షణంబో, యలం

కారంబో, పదబంధమో, రసమొ! చక్కంచెప్పుడీ తప్పినన్ (3:167)

గమనించవలసిందేమిటంటే, శివుడు కూడా తాను చెప్పిన కవితలో ‘సాహిత్య స్ఫురన్మాధురీ చారు ప్రౌఢిమ’ ఉందని చెప్పుకుంటున్నాడు. మాధుర్యముంటే సరిపోదు, ఔచిత్యం కూడా ఉండాలన్నాడు నత్కీరుడు. బహుశా ఈ అనుభవం ఎవరో సమకాలిక లాక్షణికుడి చేతుల్లో ధూర్జటికి ఎదురయ్యే ఉంటుంది. ఈ ధూర్జటి ఆ ధూర్జటి నెపాన తన సమకాలిక సాహిత్యలోకాన్ని ప్రశ్నిస్తున్నాడు. ‘ఏది లోపించింది చెప్పండి? లక్షణమా? అలంకారమా? పదబంధమా? రసమా?’ అని. సాక్షాతూ ముక్కంటి వచ్చి గద్దించినా కూడా ఔచిత్యం తప్పితే దాన్ని తాను కవితగా అంగీకరించలేనన్నాడు నత్కీరుడు. చివరకు శివుడు అతణ్ణి శపించక తప్పలేదు. ఇంతకీ నత్కీరుడు చేసిన తప్పేమిటి? కవితలో ఔచిత్యం ఉండాలనడమేనా? కాదు. ఆ కవిత ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారన్నది మర్చిపోడమే అతడు చేసిన తప్పు. అది ‘మనిషి మనిషిని తినే కరువు కాలం ‘, అటువంటి కాలంలో ఆకలి బాధపడలేక ఒక అన్నార్తుడు దేవుణ్ణి యాచించి తెచ్చుకుని వినిపించిన కవిత అది. లోకం ఆకలిలో చిక్కి నలుగుతున్నప్పుడు కవిత్వ రత్నపరీక్ష చేయబోవడం నత్కీరుడి తప్పు. అతడికి ఔచిత్యం తెలియలేదు. కావ్యంలోని ఔచిత్యం గురించి మాట్లాడాడే కాని, జీవితంలో ఔచిత్యం పాటించడం అంతకన్నా ముఖ్యమని తెలియకపోయినందువల్లనే నత్కీరుడు శివాగ్రహానికి గురయ్యాడు.

ధూర్జటికి తాను ఎటువంటి కాలంలో జీవిస్తున్నాడో, ఆ కాలనిష్టురత్వమేమిటో పూర్తిగా తెలుసు. ఆ ఎరుక ఆయన వాక్కుకి ఒక అదుపుని ప్రసాదించింది. ఆ సంయమనమే ఆయన పద్యనిర్మాణంలో మనల్ని ముగ్ధుల్ని చేసే cadence. అపురూపమైన ఒక మహాసౌందర్యాన్ని వర్ణించేటప్పుడు కూడా ఆ cadence ఎంత సమతూకంగా సంచరిస్తుందో, సంచలిస్తుందో చూడండి:

వెన్నెల గుజ్జు నంజుకొని, వెన్నెలప్రోవు భుజించి, నాలిక

న్వెన్నెల గొజ్జు జాలగొని, వెన్నెలతేటల ద్రావి, వేడుకన్

వెన్నెల కామ జుర్రుకొని, వీథుల యందు చకోర దంపతుల్

మిన్నులు ముట్టి వెన్నెలలు మేపుచు పిల్లలు తాము నాడగన్ (4:93)

5-5-2021

Leave a Reply

%d bloggers like this: