
ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన The Oldman and the Sea (1951) ప్రపంచ ప్రసిద్ధి పొందిన రచన అని తెలిసినప్పణ్ణుంచీ అది చదవాలని అనుకుంటూనే ఉన్నాను గాని వీలు కాలేదు. మళ్ళీ మళ్ళీ ఆ పుస్తకం కొనుక్కుంటూనే ఉన్నానుగానీ కనీసం మొదటి పేజీ కూడా తెరిచి చదివింది లేదు. బహుశా ఆ పుస్తకాన్ని తెలుగులో చదవడం కోసమే ఇన్నాళ్ళూ వేచి ఉన్నాననుకుంటాను. అందుకనే, ఇప్పుడు రవి వీరెల్లి, స్వాతి కుమారి చేసిన అనువాదం చేతికందగానే గంటలోనే చదివేసాను.
వారం రోజుల కిందట నందకిశోర్ ఆ పుస్తకం నాకు అందిస్తూ రవి పంపిచాడని చెప్పాడు. అందుకు రవి వీరెల్లికి నా ధన్యవాదాలు. ఎందుకంటే పట్టుమని వందపేజీలు కూడా లేని ఈ చిన్న పుస్తకం నేనిన్నేళ్ళుగా చదవనేలేదని ఆయనకు ఎలా తెలిసిందో!
‘ప్రజాదరణ పొందిన రచనల పట్ల నాకు కొంత అనుమానం. అందుకనే చాలా కాలం పాటు ఆభిజ్ఞాన శాకుంతలం పుస్తకం తెరవలేకపోయాను’ అన్నారు మా మాష్టారు ఒకసారి నాతో. కాళిదాసు కవిత్వంతో మరీ పసివయసులోనే ప్రేమలో పడ్డ ఆ రసజ్ఞుడు.
హెమింగ్వే రాసిన మరొక నవల For Whom the Bell Tolls తెలుగులో ‘ఘంటారావం’ పేరిట అనువాదమైంది, ఆ పుస్తకాన్ని దాదాపు నలభై ఏళ్ళ కిందటే చదివిన నేను, ఈ చిన్న పుస్తకం తెరిచే సాహసం మాత్రం చేయలేకపోయాను.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన నవలల్ని కనీసం వందపుస్తకాలేనా తెలుగులోకి తీసుకురావాలని నాకొక ఆలోచన ఉండేది. నేను వేసుకున్న జాబితాలో కొన్ని పుస్తకాలు ఇప్పటికే తెలుగులోకి వచ్చేయి కూడా. ఉదాహరణకి, చినువా అచెబె రాసిన Things Fall Apart. కొన్ని ఇంకా రావలసి ఉంది, ఉదాహరణకి మార్క్వెజ్ రాసిన One Hundred Years of Solitude, కాఫ్కా రాసిన The Trial. నేను చదవకపోయినప్పటికీ, ఆ జాబితాలో ఈ పుస్తకాన్ని కూడా చేర్చిపెట్టుకున్నాను. ఇప్పుడు ఈ అనువాదం వెలువడంతో ఆ జాబితాలో ఈ పుస్తకం ఎదుట టిక్కు కొట్టుకున్నాను.
ఈ అనువాదం మంచి అనువాదమనే చెప్పాలి. ‘ హెమింగ్వే వాక్యం లాగా నీట్ గా , బ్రిస్క్ గా, ఓవర్ టోన్స్ లేకుండా నడిచి వచ్చాడు’ అని రాస్తాడు త్రిపుర ఒక కథలో ఒక పాత్రని వర్ణిస్తూ. హెమింగ్వే కథనొకటి ( A Clean Well-lighted Place) నేను అనువదించినప్పుడు నాకు హెమింగ్వే వాక్యంలోని మహిమ బోధపడింది. ఆయన వాక్యంలో ‘ఓవర్ టోన్స్’ ఉండవు అంటే అర్థం అందులో అనవసరపు భావావేశమేదీ ఉండదని. కామూ రాసిన The Stranger నవలని తాను అనువదించాలనుకున్నానని చెప్తూ, బొమ్మకంటి సింగరాచార్యగారు నాతో, ఆ నవలకి తెలుగులో ‘నిర్లిప్తుడు’ అని పేరు పెట్టాలనుకున్నాను అని చెప్పారు. కామూ నవల గురించి తెలుగులో పరిచయం చేసేవారు దాన్ని ‘అపరిచితుడు’ అని అనువదిస్తూ ఉంటారు. వారికి ఆ నవల స్ఫూర్తి బోధపడలేదనే చెప్పాలి. ఆ నవల వెనక ఉన్న అస్తిత్వవాద భావజాలాన్ని బట్టి, దాన్ని ‘నిర్లిప్తుడు’ అని అనువదించడమే సమంజసం. ఇప్పుడు ఆ మాటని హెమింగ్వే వాక్యానికీ, ఈ నవలకీ కూడా ఆపాదించవచ్చు.
రవి, స్వాతి కుమారి తమ అనువాదంలో హెమింగ్వే వాక్యంలోని ఆ మహిమను ఎంతవరకు పట్టుకున్నారో నాకు తెలియదు. ఎందుకంటే నేనిప్పటికీ ఆ ఇంగ్లీషు మూలం చదవలేదు కాబట్టి. కాని, తెలుగులో చదువుతున్నప్పుడు కొన్ని వాక్యాలు నన్ను బలంగా తాకకపోలేదు. ఉదాహరణకి కొన్ని వాక్యాలు:
‘ఓసారి వెనక్కి చూశాడు. భూమి ఛాయామాత్రంగా కూడా కనిపించడం లేదు. కనిపించకపోతేనేం, హవానా వెలుగుల్లోకి ఎప్పుడైనా తిరిగి వెళ్ళొచ్చు అనుకున్నాడు. ఇంకా మూడు గంటల్లో సూర్యుడు అస్తమిస్తాడు. కానీ ఈ లోపే చేప పైకి రావొచ్చు. లేదంటే చంద్రోదయంతోనో లేదా రేపటి సూర్యోదయంతోనో రావొచ్చు. నాకేం, ఎలాంటి నొప్పులు లేవు. కావలసినంత శక్తి కూడా ఉంది. ఏమైనా ఉంటే గింటే నోట్లో గాలం చిక్కుకున్న ఆ చేపకే ఉండాలి. కానీ అంత బలంగా లాగుతుందంటే దాన్ని మెచ్చుకోవాలి. కొక్కెం తీగ దాని మూతిని గట్టిగా పట్టేసి ఉంటుంది. నేను చూడగలిగితే బాగుండు, నాతో పోరాడుతున్నది ఏంటో తెలుసుకోడానికైనా ఆ చేపని ఒక్కసారి చూడగలిగితే బాగుండు.’ (పే.47-48)
‘కానీ మనిషి ఓడిపోడానికి పుట్టలేదు. వాణ్ణి నాశనం చెయ్యొచ్చేమో కానీ ఓడించడం కష్టం..'(పే.105)
‘తెడ్డు చివర్లో చాకుకి కట్టిన ముడిని సరిచూసుకుని ‘ఈ చాకుని నూరడానికి ఒక రాయిని తెచ్చుకుంటే బాగుండేదీ అనుకున్నాడు.
‘ఆకురాయిని తేవాల్సింది.’
ముసలాయనా, నువ్వు చాలా వస్తువులు తెచ్చుండాల్సింది కానీ, ఏ ఒక్కటీ తేలేదు. లేనివాటి గురించి ఆలోచించడం అనవసరం. ఉన్నవాటితో ఏం చెయ్యగలవో ఆలోచించు.’ (పే.112)
‘ముసలాయనకి ఊపిరి అందడం కష్టమయింది. నోట్లో ఇదీ అని స్పష్టంగా చెప్పలేని ఒక చిత్రమైన తియ్యటి, రాగి రంగులాంటి వింతరుచి అనుభవానికి వచ్చింది. ఒక్క క్షణం అతను బెదిరిపోయాడు. కానీ ఎక్కువసేపు అలా అనిపించలేదు.'( పే.121)
ఈ వాక్యాల్లో ఇంతకు మించిన బరువైన తెలుగు లేకపోవడం వల్ల ఈ అనువాదం మూలానికి న్యాయం చేసి ఉంటుందనే అనుకుంటున్నాను.
రాజమండ్రిలో వంక బాలసుబ్రహ్మణ్యం అనే మిత్రుడుండేవాడు. గొప్ప రసజ్ఞుడు. ఒకసారి ఆయన ఈ నవల గురించి ప్రస్తావిస్తూ ‘అందరూ ఈ నవలలో ఒక ముసలి జాలరి ఒక పెద్ద చేపని పట్టుకోవడం గురించి మాట్లాడతారు. కాని ఆ నవల సారాంశంలో ఆ ముసలాడు హెమింగ్వేనే. ఆ చేప అతడి జీవితకాలపు సాహిత్య కృషి’ అన్నాడు. ఈ నవలని అటువంటి రూపకాలంకారంగా చదివే ఒక సంప్రదాయం కూడా ఉందని నేనిప్పుడే తెలుసుకుంటున్నాను.
చివరగా ఒక మాట.
కొన్నేళ్ళ కిందట, సదాశివరావుగారు కేశవరెడ్డి గురించి మాట్లాడుతూ ‘అతడు అడవిని జయించాడు’ నవల హెమింగ్వే రాసిన ఈ నవలకి అనుసరణ అని చెప్పారు. ఆ మాట మరికొందరి నోటమ్మట కూడా విన్నాను. ఇన్నాళ్ళూ ఈ నవల చదవలేదు కాబట్టి ఆ విషయమై నేనేమీ ప్రతిస్పందించలేకపోయాను. కాని, ఇప్పుడు రెండు నవలలూ చదివినవాడిగా, నేను చెప్పకుండా ఉండలేని మాట ఏమిటంటే, హెమింగ్వే నవల నాకు కలిగించిన స్ఫూర్తికన్నా కేశవరెడ్డి రచన ఎన్నో రెట్లు అత్యధిక స్ఫూర్తి నాలో కలిగించింది.
ఆ స్ఫూర్తితో పోలిస్తే హెమింగ్వే రచనలో ఏమి కొరవడిందో లేదా ఏది నన్ను ఆకట్టులేకపోయిందో చెప్పలేకపోతున్నాను. బహుశా కేశవరెడ్డి కథనంలో అంతర్లీనంగా ఒక భావావేశం ఉందేమో, హెమింగ్వే తన రచనలో అటువంటి భావావేశాన్ని సెంటిమెంటాలిటీ గా భావించి, పూర్తిగా పరిహరించాడేమో తెలీదు. అయితే ‘కానీ మనిషి ఓడిపోడానికి పుట్టలేదు. వాణ్ణి నాశనం చెయ్యొచ్చేమో కానీ ఓడించడం కష్టం..’ (పే.105) అనే వాక్యం చదవగానే కూడా మనకి భగవద్గీత గుర్తుకు రాకుండా ఉండదు. కాదు, మరేదో ఉంది. ఎందుకో నన్ను హెమింగ్వే ఆకట్టుకోలేకపోయాడు. అయితే అందుకు రవి, స్వాతికుమారి మాత్రం బాధ్యులు కారు.
19-1-2015