అచ్చమైన తెలుగు కవిత్వం

Reading Time: 4 minutes

అక్కడ ఆ తరువోజ స్తంభం పక్కనే మరొక వేదిక పైన ఎర్రాప్రగడ విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహానికి పూలమాలలు వేయడానికి వీలుగా పక్కన ఒక నిచ్చెన కూడా ఉంది. ఎవరో ఒక తాజాలిల్లీ పూలమాల నా చేతుల్లో పెట్టారు. నేనా నిచ్చెన ఎక్కాను. ఆ విగ్రహం రోడ్డు పక్కన ఉండటంతో ఆ నిచ్చెన మెట్లమీదా, ఆ విగ్రహం మీదా బాగా దుమ్ము పేరుకుని ఉంది. ఎవరో ఎన్ని నెలలకిందటో ఆ విగ్రహానికి వేసిన పూలమాల ఒకటి ఎండకి ఎండి వానకి తడిసి జీర్ణావశేషంగా ఆ విగ్రహానికి అంటుకుపోయి ఉంది. నెమ్మదిగా ఆ నిర్మాల్యాన్ని తొలగించి ఆ దుమ్ము తుడిచి నవనవలాడుతున్న ఆ పూలమాల ఆ ప్రబంధ పరమేశ్వరుడి మెడలో అలంకరించాను. అప్పుడు ఆ వేదిక మీద నిలబడి గంభీర ప్రసంగం చేసాను.

కిందన పదిమంది ఉపాధ్యాయులకి మించి లేరు. నేను మాట్లాడుతున్న మాటల్ని రోడ్డు మీద ఎడతెగకుండా వచ్చీపోతున్న వాహనాల చప్పుళ్ళు పూర్తిగా మింగేస్తున్నాయి. ఆ మాటలు కిందనున్న శ్రోతల్ని చేరే అవకాశమే లేదని తెలుస్తున్నది. కానీ నేను జాజ్వల్యమానప్రసంగం చేసాను. నా మాటలు కిందనున్నవాళ్ళు కాదు, పైనున్న పూర్వమహాకవులు వింటారన్న నమ్మకంతో.

ఎర్రాప్రగడ తెలుగు కవుల్లో అంతగా ప్రశస్తికెక్కని కవి అని చెప్పవచ్చు. ఆయన్ని కవిత్రయంలో ఒకడిగానూ, అది కూడా నన్నయ వదిలిపెట్టిన భారతభాగాన్ని పూరించినవాడిగానూ మాత్రమే ఎక్కువ మంది గుర్తుపెట్టుకుంటారు. మరికొంతమంది అరణ్యపర్వ శేషాన్ని పూరించడంలో ఎర్రన అనితరసాధ్యమైన అల్లిక కనపరచాడనీ, ఆ భాగాన్ని ఆయన నన్నయ శైలితో మొదలుపెట్టి తిక్కన శైలితో ముగించాడనీ, ఆ విధంగా ఎక్కడా అతుకు కనిపించకుండా కావ్యనిర్మాణాన్ని పూర్తిచేసాడనీ చెప్తారు. నా వరకూ నేను కూడా చాలా కాలం కవిత్రయంలో ఒకడుకావడంలోనే ఎర్రన ప్రతిభ ఉందనుకునేవాణ్ణి. మా మాష్టారు హరివంశం గురించి ప్రస్తావించేదాకా.

‘ఎర్రన ఇటు పగలుగానో, అటు రాత్రిగానో కరిగిపోయే స్వభావం గల సంధ్యారాగం వంటి కవి! ఈయనలో దివానిశాలక్షణాలు సమపాళంగా ఉంటాయి. ఈయన అసలు స్వరూపం వ్రేపల్లెలలోని కీలారాలలోనే వెదకిపట్టుకోవాలి’ అన్నారాయన.

‘హరివంశము: సంవృతి మాధురి’ అనే అపురూపమైన ఒక వ్యాసంలో ఆయన భాగవతం లోని దశమస్కంధానికి లభించిన వ్యాప్తి హరివంశానికి రాకపోవడానికి కారణం జనుల కావ్యరసజ్ఞతా లోపమే అన్నారు. అంతే కాదు, ‘తెలుగులో ఒక సామాన్యాభిప్రాయముంది, భారతాన్ని కవిత్రయమే రాయాలి, భాగవతాన్ని పోతనగారే రాయాలి అని, కాని పోతనగారు భారతం రాయగలరో లేదో చెప్పలేముగాని, కవిత్రయము భాగవతము రాయగలరనడానికి ఎర్రన హరివంశమే సాక్షి’ అని కూడా అన్నారు.

కాని ఇక్కడ కూడా ఎర్రన ప్రతిభ వ్యాప్తి చెందకుండా నాచన సోమన, బమ్మెరపోతన అడ్డుపడ్డారు. కాని హరివంశ కావ్యగుణానుశీలనం చేసిన వారికి, ఎర్రన లేకపోతే శ్రీనాథుడు, పోతన కూడా శ్రీనాథుడిలాగా, పోతనలాగా కవిత్వం చెప్పి ఉండేవారు కాదని నిశ్చయంగా తెలుస్తుంది.

సాహిత్య అకాదెమీ కోసం సంకలనం చేసిన తెలుగు కావ్యమాలలో కాటూరి వెంకటేశ్వరరావుగారు ఎర్రన పద్యభాగాల్లో హరివంశంలోని ఆరవ ఆశ్వాసం నుంచి నందగోపుడు బృందావనానికి పోయే ఘట్టాన్ని ఎంపిక చేయడం ఆశ్చర్యమనిపించదు. ఎందుకంటే, ఆ పుస్తకం లోని ఎంపిక ప్రధానంగా మా మాష్టారిదే కాబట్టి.

ఎర్రన అసలు స్వరూపం హరివంశంలోని రేపల్లె గోపాలకజీవితంలో పట్టుకోవాలి అని మా మాష్టారు అన్న మాటలు ఎర్రాప్రగడ కవిత్వ రత్నకోశపు తాళం చెవులు. నన్నయ, తిక్కన ఒక mythopoetic space లో తమ కవిత్వం చెప్పారు. ఎర్రన మొదటిసారి దాన్ని భూమ్మీదకు దింపాడు. ఒకప్పటి పాకనాటిసీమ పల్లెటూరి జీవితం, ఆ రైతులు, గోపాలకులు, ఆ పశువులు, ఆ అడవులు, ఆ పొలాలు, ఆ సంతోషాలు, ఆ భయాలు అవన్నీ మొదటిసారి తెలుగు కవిత్వంలోకి ప్రవేశించాయి. ప్రాజ్ఞన్నయ యుగంలో శాసనాలకు పద్యాల్ని ప్రసాదించిన గుండ్లకమ్మ ఒడ్డున ఇప్పుడు మట్టివాసనలీనే అచ్చమైన తెలుగు కవిత్వం ప్రభవించింది. ఈ పద్యం చూడండి. చాలాకాలంగా నివసిస్తున్నందున రేపల్లె ఇంక నివసించడానికి యోగ్యం కాకుండా పోయిందని ఎలా చెప్తున్నాడో:

ఎరువు తిప్పలుగొని యెల్లమందలు గొను

జెక్కి మేపుడు చోటు ద్రొక్కువడియె

దరులోలి నరుక మొదళులు సిక్కంగ జొం

పము లేది జాడలు వడియె బొదలు

మడువులు పసుల కాల్మడి బ్రుచ్చె దొరుగండి

వ్రంతలు పెనురొంపి వ్రంతలయ్యె

పూరి పంటలు చెడిపోయె, రాయిడి గ్రంప

లోనుగా దవ్వుల గాని లేదు.

పులుగు పూరెడు పోపడి పొలములందు

మెలగి వదకిన పుట్టదు మెకము లడగె

కూరగాయ కట్టియ విల్చికొనగ వలసి

యునికి వ్రేపల్లె వీటి పట్టునకు దొరగె. (హరి.6:05)

(ఎక్కడికక్కడ పేడపెంట కుప్పలు పోగుపడటంతో పురుగులు చేరి పశువుల రక్తం పీల్చేస్తున్నాయి. ఆవులమందల గిట్టల తొడతొక్కిడితో పచ్చికబీళ్ళు అణగిపోయాయి. చెట్లు నరికేస్తుండటంతో అడవి పల్చబడిపోయింది. దట్టమైన గుబుర్లూ, పొదలూ బయటపడిపోయి అడవుల్లోంచి దారులు పుట్టుకొచ్చాయి. ఆలమందలు కలయదిరగడంతో చెరువులు పాడైపోయాయి. నీళ్ళు బయటికి పోయే అలుగులు పెద్దపెద్ద గుంటలైపోయాయి. మెట్టపంటలు దెబ్బతిన్నాయి. రకరకాల కంపలూ, తుప్పలూ దూరంగా జరిగిపోయాయి. చేలల్లో పురుగుల్ని ఏరి తినే పిట్టలు కూడా ఎక్కడో ఒకటీ అరా తప్ప కనబడటం లేదు. వన్యమృగాలు కూడా అరుదైపోయాయి. చివరికి కూరగాయలూ, వంటచెరుకూ కూడా కొనుక్కోవలసి వస్తున్నది. కాబట్టి ఇంక ఈ ఊరు మన గోకులానికి ఇంకెంతమాత్రం వాసయోగ్యం కాదు)

దాదాపు ఎనిమిది శతాబ్దాల కిందటి ఈ పద్యం చదువుతుంటే అద్దంకి సీమ పల్లెటూళ్ళు కళ్ళముందు కనబడం లేదూ! అటువంటి ఊరు వదిలిపెట్టి ఆ గోకులం బృందావనానికి బయలుదేరినప్పుడు ఆ హడావిడి ఎలా ఉందో చూడండి:

బండులు గట్టి పై బరువు లెక్కింపుమీ

దళ్ళను బూన్పు కావళ్ళనునుపు

పదిలంబుగా నేతిపనటులు క్రొత్త గో

నియల బియ్యము వడ్లు నెమిలివడ్లు

నొదివిరి ప్రాలును నొనరింగబోసి చా

పలు మంచములు మీద బలియగట్టు

దామెనలును వల్లెత్రాళ్ళును దలుగులు

గవ్వముల్ కొడవలి కత్తిసూడు

గొడుపు వాదోళ్ళు మొదలుగా జెడకయుండ

వలయు ముట్లెల్ల తెమ్ము కంటలపు తెడ్ల

నాయితము సేయు ముదుసళ్ళ నాడువారి

గంపమోపులు ముందర కదలుమనుము. (6:22)

(బళ్ళు కట్టండి. బళ్ళమీద ఎక్కిస్తున్న బరువులు లెక్కచూసుకోండి. బళ్ళకి అటూ ఇటూ దళ్ళు బిగించండి. కావళ్ళు పూన్చండి. నేతికుండలు జాగ్రత్తగా ఎక్కించండి. బియ్యమూ, వడ్లూ, నెమిలివడ్లూ కొత్త గోనెల్లో నింపండి. బళ్ళమీద చాపలూ, మంచాలూ కూడా కట్టిపెట్టండి. తాళ్ళూ, మోకులూ, పలుపులూ, కట్టె తాళ్ళూ, కవ్వాలూ, కొడవళ్ళూ, కత్తులూ, కత్తులు సానబెట్టే రాళ్ళూ, తోళ్ళూ, డప్పులూ అన్నీ చెడిపోకుండా పనికొచ్చేవేముంటే ఆ పనిముట్లన్నీ తీసుకురండి. సరుకుల మూటలు మోసే ఎడ్లని సిద్ధం చేయండి. ఆడవాళ్ళనీ, ముసలివాళ్ళనీ, గంపలెత్తుకుని నడిచేవాళ్లనీ అందరికన్నా ముందు నడవమని చెప్పండి.)

బహుశా తెలుగు కవుల్లో ఎర్రన ని మించిన చిత్రకారుడు మరొకరు లేరని చెప్పవచ్చు. ఆయన పద్యాలు బిగ్గరగా మాట్లాడకుండా మౌనంగా కళ్ళముందు చిత్తరువులు గీసిపెడతాయి. ఆయనకు రావలసిన ప్రసిద్ధి రాకపోవటానికి ఇది కూడా ఒక కారణం. రేపల్లెలో, ఒక సాయంకాలం నందుడు తన ఇంటికి వచ్చినప్పుడు ఎలా కనిపిస్తున్నాడో చూడండి:

పరిమిత పలితైక భాసురంబగు కేశ

సంచయం బారణ్య సంచరమున

దరువుల రాలు కేసరముల నత్యంత

ధూసరంబై కడుమాసరముగ

గోఖురోద్ధత రేణుకుంఠితంబగు మోము

చెమట బొట్టుల చాల చెన్ను మిగుల

కట్టిన చెంగావి కాసె లే చిగురుల

జిగనూని తనువతి స్నిగ్ధ కాంతి

నలర గర్కశగ్రంథిల యష్టి చేత

బట్టి గోపాల పరివార బహువిధోక్తు

లెలసి చెలగంగ గదుపుల వలననుండి

వచ్చె నందగోపుడు నిజావాసమునకు (5:182)

(అతడి జుత్తు అక్కడక్కడా నెరిసి ఉంది. అడవుల్లో పసువుల మందలు మేపడానికి వెళ్ళినప్పుడు అక్కడి పూలమీంచి రాలిన పుప్పొడి ఆ జుత్తుమీద పడి మెరుస్తూ ఉంది. ఆవుల కాలిగిట్టలవల్ల లేచిన దుమ్ము ముఖం మీద పడి, చిరుచెమటబొట్లతో తడిసి ముఖం వింతతళుకు తో గోచరిస్తోంది. అతడు చెంగావి రంగు పంచె కట్టుకున్నాడు. ఆ చెన్నుతో అతడి దేహం కూడా గొప్ప కాంతితో ప్రకాశిస్తూంది. బాగా కణుపులు తేలిన వెదురుకర్ర చేతబట్టి, కూడా వస్తున్న గోపాలకులతో ఏమేమో మాట్లాడుకుంటూ, నందగోపుడు తన ఇంట్లో అడుగుపెట్టాడు)

ఇందులో అత్యంత రమణీయమైన చిత్రంతో బాటు, ఆ రమణీయ నూతన పదబంధాలు-గోఖురోద్ధత రేణుకుంఠితమైన మోము, అరణ్యసంచారమున తరువుల రాలు కేసరముల వల్ల అత్యంత ధూసరమైన ఆ దేహం- ఒక కవి మనకి కొత్త లోకాన్ని బహూకరిస్తాడంటే ఇలానే కదా.

పోతన గారిది పారవశ్యం. కాని ఎంత గాఢ రసోద్విగ్నతలో కూడా ఎర్రన తన సంయమనం కోల్పోడు. ఆయన అనుభూతి సమపాళం అని మా మాష్టారు అన్నదానికి అర్థమిదే. ఎర్రన అనగానే ఒక్క పద్యం చెప్తాను అంటో ఆయన ఉదాహరించిన పద్యం చూడండి:

ఎనసిన నిండువెన్నెలల నింపగు రాత్రుల రత్నరమ్య కాం

చన చషకంబుల నరచందురు నీడలు దోచు సీధవుల్

గొని యదుసూను చుట్టులను గూడి మదోద్ధతి నాడు గోపికా

జనములు దారకైకొనిరి శారదవైభవలక్ష్మి యంతయున్ (8:39)

(వికసించిన ఆ నిండువెన్నెల రాత్రి రత్నాలు తాపడం చేసిన బంగారు పాత్రల్లో చంద్రుడి ప్రతిబింబాలు కనిపిస్తూండగా, యదుకుమారుడి చుట్టూ చేరిన ఆ గోపికలు, మధువులు గ్రోలుతూ, మదోద్ధతితో, ఆ శరత్కాల సౌందర్యాన్ని తనివితీరా కొల్లగొట్టుకున్నారు).

ఈ పద్యం ప్రస్తావిస్తూ ‘ఇది నన్నయ కవితా రీతి కాదు, తిక్కన మార్గమూ కాదు, ఇది ఎర్రన సొంతం ‘ అన్నారు మా మాష్టారు. అటువంటి పద్యాలు భారతంలో కూడా లేకపోలేవు. సావిత్రి, సత్యవంతుల సాహచర్యాన్ని వర్ణిస్తున్న ఈ పద్యం చూడండి:

కమనీయ కమలినీ కల్లోల వీథుల

కదలు రాయంచల గతుల యొప్పు

బహుపుష్ప పల్లవ ప్రకరచిత్రితములై

తనరారు తరులతా తతుల సొంపు

మకరంద రసపాన మదవిలోలంబులై

క్రాలెడి యెలదేటి గముల యులివు

పరిపక్వమంజుల ఫలరసోద్ధతములై

పలుకు రాచిలుకల పటురవంబు

ప్రియుడు వేరువేర ప్రీతిమై చూపుచు

చెప్పుచును జనంగ చిగురుబోడి

గనుచు వినుచు నిర్వికార సల్లాంపంబు

లార నతని తెరగు నరయు చుండె (అరణ్య: 7: 212)

ప్రకాశం జిల్లాలో గ్రానైటు గనులు కాదు, బంగారపు గనులు పోగుపడ్డాయనీ, మనమే కొల్లగొట్టుకోలేకపోతున్నామనీ ఎలుగెత్తి చాటాను అవాళ ఆ వేదికమీద.

15-1-2021

Leave a Reply

%d bloggers like this: