అంతరంగ ప్రయాణం

ఆంద్రే తార్కొవస్కీ Mirror (1975) చిత్రం ఒక కవిత అని అందరూ అంగీకరించిన విషయమే కాని, కవిత అంటే కృష్ణశాస్త్రి గీతంలాంటిది కాదనీ, వేగుంట మోహన ప్రసాద్ ‘చితి-చింత’ వంటి కావ్యమనీ కూడా చెప్పుకోవలసి ఉంటుంది. అటువంటి చలనచిత్రాన్ని తీయడం ఒక సాహసమని మాత్రమే అప్పట్లో అనుకున్నారుగానీ, ఇప్పుడది ఆయన చలనచిత్రాలన్నిటిలోనూ ఉత్తమోత్తమ కృతిగా గుర్తింపు పొందుతూ ఉన్నది. విమర్శకులు ఎంపిక చేసిన జాబితాలో తార్కోవస్కీ Sacrifice (1986) కి కాకుండా Mirror కి ప్రథమ స్థానం లభిస్తూండటం ప్రేక్షకుల్లో వచ్చిన పరిణతికి అద్దం పడుతూండటమే కాకుండా సినిమాల్లో కూడా ప్రయోగాత్మకతకు ఏదో ఒక రోజు గుర్తింపు రాకమానదనే హామీ కూడా లభిస్తున్నది.

Mirror పూర్తి ప్రయోగాత్మక సినిమా, ముఖ్యంగా మూడు అంశాల్లో: ఒకటి, కథనం ఏదో ఒక సరళరేఖలాగా సూటిగా చెప్పుకుంటూ పోవడం కాకుండా, ఒక కలలాగా, ఒక జ్ఞాపకంలాగా ఆదిమధ్యాంతాల్లేకుండా, చుట్టచుట్టుకుని మన మదిలో మెదిలినట్టుగా, కొంత అర్థమవుతూ, కొంత అర్థం కాకుండా, కొంత తెలిసిందే మరొకసారి గుర్తుకొస్తూ, కొంత ఎందుకు మళ్ళా మనకి గుర్తుకొస్తున్నదో మనకి అర్థం కాకుండా, కాలాన్నీ, స్థలాన్నీ పక్కనపెట్టి తలపులు చెలరేగినట్టుగా, ఆ సినిమాలో కథనం సాగటం. రెండవది, అందులో వాస్తవం, కల్పనలతో పాటు, కొంత డాక్యుమెంటరీ కూడా ఉండటం. వ్యక్తిగత అనుభవాలూ, జ్ఞాపకాలూ కథగానూ, సామూహిక, సామాజిక అనుభవాలు డాక్యుమెంటరీ ఫుటేజిగానూ మనకి కనిపించడం. అందుకని కొంత సినిమా రంగుల్లో, కొంత నలుపు తెలుపుల్లో కొంత పాతకాలపు ఫొటోల్లో కనవచ్చే సెపియా రంగులో చూపిస్తాడు దర్శకుడు. ఇక మూడవది, మూడు తరాల పాత్రల్లో ముఖ్యపాత్రధారులు ఒకరే కావడం. వారు ఎప్పుడు ఎవరి పాత్రలో కనిపిస్తున్నారనేది కొద్దిగా శ్రద్ధగా చూస్తేనో లేదా మళ్ళా మళ్ళా చూస్తేనో మనకి తెలియడం కష్టం కాదుగానీ, అలా ఒక పాత్రధారి ఒక పాత్రలో కనిపిస్తున్నప్పుడు, ఆ పాత్రకీ, ఆ పాత్ర గుర్తు చేస్తున్న మరోపాత్రకీ మధ్య సున్నితమైన సరిహద్దులు చెరిగి మళ్ళా మనమెవర్ని చూస్తున్నామో పోల్చుకోలేకపోవడంలో కూడా కథకుడు గొప్ప కావ్యధ్వనిని సాధించగలిగాడని చెప్పవలసి ఉంటుంది.

Mirror పట్ల రసజ్ఞుల స్పందనా, ప్రేక్షకుల స్పందనా ఇప్పటికీ మిశ్రమంగానే ఉంది. Rotten Tomatoes సైటు ప్రకారం ఈ సినిమా పట్ల ఇప్పటికీ విమర్శకుల్లో ఏకాభిప్రాయం లేదు. కాని, ఆశ్చర్యకరంగా ప్రేక్షకులు ఈ సినిమాతో తాదాత్మ్యం చెందగలుగుతూ ఉన్నారు. అందుకు కారణం సినిమా విస్తృతంగా allusive గా ఉన్నందువల్ల, తమ తమ జీవితానుభవాలో, తమ తమ దేశ చారిత్రకానుభవాలో వాళ్ళల్లో అస్పష్టంగా ఏవో సున్నితమైన సంవేదనల్ని రేకెత్తిస్తూనందువల్ల కావచ్చు. కాని, మొదటి సారి చూసినప్పుడు ఎంతో గజిబిజిగా కనిపించే కథనం మళ్ళా మళ్ళా చూసినప్పుడు మబ్బులాగా విచ్చిపోతుందని ప్రేక్షకులు చెప్తున్నారు. తాను పాతికసార్లు సినిమా చూసిన తర్వాత, ఆ సినిమా ఇతివృత్తం చాలా సరళమని తనకి అర్థమయిందని ఒక విమర్శకుడు కూడా పేర్కోక తప్పలేదు.

Mirror సినిమా ఇతివృత్తాన్ని మాటల్లో పెట్టడం కష్టమేమీ కాదు. కాని అందువల్ల ఆ సినిమా మనకి అందించే గాఢానుభవం మనకేమీ అర్థం కాదు. నిన్న రాత్రి నీకొక కల వచ్చిందనుకో, దాన్ని నువ్వు నీ మిత్రుడితో పంచుకుంటే అతడికేమి అర్థమవుతుంది? ఆ కల నీ స్వంతం. కాని ఆ కలని సంభావిస్తో, మననం చేస్తో, ఒక దారం కొసలాగా దాన్ని పట్టుకుని నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణిస్తే కలిగే అనుభవమూ, లోచూపూ అవి నీవి. నిన్ను మాత్రమే వెలిగించేవి. కాని ఆ కలని నువ్వొక కళగా మార్చావనుకో- ఒక చిత్రలేఖనంగా గీసావనుకో. అది చూసిన చూపరికి దాన్లో ఏదో విశేషార్థం గోచరించకుండా ఉండదు. అతడు ఆ చిత్రం ఆధారంగా, నీ వ్యక్తిగతానుభవాన్ని అర్థం చేసుకోవడానికి బదులు, తన అంతరంగంలోకి తాను ప్రయాణించడం మొదలుపెడతాడు. Mirror చిత్రం ద్వారా తార్కొవస్కీ చేసిందదే.

Mirror ఏకకాలంలో ఒక కవి అనుభవం, ఒక జాతి అనుభవం కూడా. ఒక రష్యన్ కావడమంటే ఏమిటి? ఒక రష్యన్ ఒక యూరపియన్ కన్నా ఏ విధంగా భిన్నుడు? ఒకప్పుడు రష్యన్ మహాకవి పుష్కిన్ ఈ ప్రశ్న వేసుకున్నాడు. అందుకు తనకు తోచిన జవాబుని ఒక మిత్రుడికి రాసిన ఉత్తరంలో (1886) ఇలా పంచుకున్నాడు:

‘చర్చిలు వేరుపడటంతో మనం కూడా యూరోప్ నుంచి వేరుపడిపోయాం. అందువల్ల యూరోప్ ని అతలాకుతలం చేసిన ప్రతి ఒక్క మహాసంఘటనకీ మనం దూరంగా ఉండిపోయాం. కాని మనకంటూ మనకొక చాత్రిక గమ్యం ఉన్నది. తన అపారమైన సీమావైశాల్యంతో రష్యా మంగోల్ దాడుల్ని మింగెయ్యగలిగింది. తార్తారులు మన పడమటి సరిహద్దు దాటి ముందుకు అడుగుపెట్టడానికి సాహసించలేకపోయారు. వాళ్ళు వాళ్ళ అడవుల్లోకి పారిపోయారు. క్రైస్తవ నాగరికత బతికిపోయింది. ఆ చారిత్రిక కర్త్యవ్యాన్ని నెరవేర్చడం కోసం మనమొక ప్రత్యేక జీవనశైలిని అనుసరించవలసి వచ్చింది. ఏకకాలంలో మనం క్రైస్తవులుగా జీవిస్తూనే క్రైస్తవ ప్రపంచానికి పరాయివాళ్ళుగా కూడా ఉండవలసి వచ్చింది.’

Mirror చిత్రానికి ఈ వాక్యాలు కీలకం. ఇరవయ్యవ శతాబ్దంలో రష్యాని కుదిపేసిన రెండవ ప్రపంచ యుద్ధాన్ని కేంద్రంగా తీసుకుని అల్లిన కథ అది. యుద్ధానికి ముందూ, యుద్ధకాలంలోనూ, యుద్ధం తరువాతా ఒక కుటుంబం లోనైన అనుభవాల కథనం. ఆ అనుభవాల్ని కథకుడు తన వ్యక్తిగత అనుభవాలుగా చెప్తున్నప్పటికీ, అవి ఏకకాలంలో సోవియెట్ రష్యా అనుభవాలు కూడా. పుష్కిన్ తరహాలోనే తన సినిమాలో కూడా తార్కొవస్కీ ఒక కవినే కథానాయకుడిగా తీసుకున్నాడు. ఆ కవి ద్వారా తన తండ్రి అర్సెనీ తార్కొవస్కీ రాసిన కవితల్ని మనకి వినిపిస్తాడు. సినిమాలో మనకి వినిపించే మొదటి కవిత, First Meetings చూడండి:

~

మనం కలిసి ఉన్న ప్రతిక్షణాన్నీ

ఈ ప్రపంచంలో మనమొక్కరమే ఉన్నామన్నంతగా

సంభ్రమంగా పండగచేసుకున్నాం

పక్షి రెక్కలాగా తేలిగ్గా

ధైర్యంగా, కళ్ళు బైర్లుకమ్మేటంతగా

నువ్వా మెట్లమీంచి కిందకి పరిగెడుతో

నన్ను కూడా నీ వెంట లాక్కుపోయావు

అద్దానికి ఆవలివైపు, తేమగొన్న పుష్పంలాంటి

నీ సామ్రాజ్యంలోకి.

రాత్రికాగానే, నాకొక వరం

అనుగ్రహించావు. అర్చామందిర ద్వారాలు

తెరుచుకున్నాయి, ఆ చీకటిలో

మన నగ్నత్వం ప్రకాశిస్తోండగా

మనం నెమ్మదిగా వినమితులమయ్యాం

ఇక మళ్ళా మేల్కోగానే నేను

నిన్ను మనసారా దీవించకుండా ఉండలేకపోయాను.

కాని నాకు నా ఆశీర్వాదం పరిమితులేమిటో తెలుసు

నువ్వింకా నిద్రలోనే ఉన్నావు, బల్లమీంచి

ఆ పూలగుత్తితో నీ కనురెప్పల్ని తాకాను

ఒక నీలివిశ్వం ఆ రెప్పలమీద వాలినట్టుగా

ఆ నీలిమ తాకిన తర్వాత కూడా, నీ కనురెప్పలట్లా

నిశ్చలంగానే ఉన్నాయి

నీ చేతుల్లో అదే వెచ్చదనం.

నువ్వు నీ అరచేతిలో ఒక స్ఫటికం పెట్టుకుని

ఒక విరాజమాన సింహాసనం మీద నిద్రపోతున్నావు

ఆ స్ఫటికంలో నదులు పరవళ్ళు తొక్కాయి

పర్వతాలు మంచుతో పొగవిరజిమ్మాయి, సముద్రాలు తళుకులీనాయి

అత్యంత సత్యసంధురాలువి, నువ్వు, నిజంగా నా దానివి.

నువ్వు మేలుకోగానే

రోజువారి మాటల్ని మార్చేసావు

నీ వాక్కులో మాధుర్యం అంచులు పొంగిపొర్లి ప్రవహించింది

నువ్వు మాట్లాడటం మొదలుపెట్టగానే ‘నువ్వు ‘ అనే మాట

తన కొత్త అర్థాన్ని కనుక్కుని ‘రాజూ ‘అని వినిపించింది.

ప్రపంచంలోని ప్రతి ఒక్కటీ మారిపోయింది

మామూలు వస్తువులు కూడా- వాష్ బేసిన్, జగ్గు-లాంటివి కూడా

నీకూ నాకూ మధ్య దొంతరలు పేర్చినట్టుగా,

జలం ఒక్కటే స్థిరంగా, మనల్ని కాచి రక్షిస్తున్నట్టుగా .

మనల్నెక్కడికో నడిపించుకుపోయారు

మహిమోపేత నగరమొకటి ఎండమావిలాగా

మన కళ్ళముందే వెనక్కి వెనక్కి జరుగుతున్నది.

మన కాళ్ళ ముందు విస్తారంగా పరుచుకున్న అడవిపొద

మనతో పాటే ప్రయాణిస్తోన్న పక్షులు

ఏటికెదురీదుతున్న చేపలు

మన కళ్ళముందే విచ్చుకుంటున్న ఆకాశం..

చేతిలో చాకు పట్టుకున్న ఒక ఉన్మాదిలాగా

విధి మనని వెంబడిస్తున్నది.

~

ఈ కవిత చదువుతున్నప్పుడు మనకి కలిగే స్ఫురణలూ, Mirror సినిమా చూస్తున్నప్పుడు కలిగే స్ఫురణలూ దాదాపుగా ఒక్కలాంటివే. కవిత అంటే హృదయస్పందనని మాటలుగా కూర్చడం. సినిమా అంటే హృదయస్పందనని క్షణాలుగా కూర్చడం. సినిమా అంటే కాలంతో చెక్కే శిల్పం. అందుకే తార్కొవస్కీ తన ఆత్మకథకి Sculpting in Time అని పేరుపెట్టుకున్నాడు.

నాకు అన్నిటికన్నా ఆరాధనీయంగా అనిపించింది, తార్కొవస్కీ తాను చెప్పాలనుకున్న కథ ఏమిటో సినిమా తీయడం ద్వారానే తెలుసుకోవడం. మామూలుగా కథకులు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు కొ.కు లాగా తాము రాయాలనుకున్న కథలో ఏ పాత్రలు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తాయో, ఏమి మాట్లాడతాయో ముందే తెలుసుకుని ఉండేవాళ్ళు. అటువంటి కథల్లో కథకుడికి అదనంగా లభ్యమయ్యే సత్యమంటూ ఏమీ ఉండదు. అతడి పని ఒక విలేకరిలాగా తాను చూసినదాన్ని ప్రపంచానికి నివేదించడమే. కాని రెండవ తరహా కథకులు కథ రాయడానికి పూనుకోవడం ద్వారా తమని వేధిస్తున్న కథ ఏమిటో తెలుసుకోవాలనుకుంటారు. అక్కడ ఆ కథ చెప్పడం వల్ల అన్నిటికన్నా ముందు ఆ కథకుడికే ఒక సాక్షాత్కారం సిద్ధిస్తుంది. ఆ కథ చెప్పడం ద్వారా కథకుడు తనని అణచివేస్తున్నబరువునించి బయటపడతాడు. అక్కడ కళ ప్రపంచానికి విముక్తి నివ్వడం కన్నా ముందు కథకుడికి విముక్తి ప్రసాదిస్తుంది. తార్కొవస్కీ అటువంటి కథకుడు. Mirror అటువంటి కథనం.

27-9-2020

Leave a Reply

%d