
జపనీస్ క్లాసిక్ చిత్రం Late Spring (1949) చూసాను. ఇటువంటి క్లాసిక్స్ నా మిత్రులు చాలామంది చూసే ఉంటారు. ప్రపంచంలోని అత్యున్నత చలనచిత్రాల్ని నాకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో గంగారెడ్డి కొన్నేళ్ళ కిందట నాకొక హార్డ్ డిస్క్ పట్టేటన్ని సినిమాలు ఇచ్చాడు. కాని అప్పట్లో కొన్ని మటుకే చూడగలిగాను. చాలా సినిమాలు చూడాలని ఉన్నా చూడలేకపోయాను.
అందుకు కారణం సమయం లేకపోవడం కాదు. గొప్ప చలనచిత్రాలు, ఉదాహరణకి, ఇన్గ్మార్ బెర్గ్ మన్ లాంటి దర్శకుడు తీసిన చలనచిత్రాల్ని చూసినప్పుడు నా మనసంతా యాక్టివ్ అయిపోతుంది. మృదులమైపోతుంది. ఏదైనా ఊరు వెళ్ళాలనిపిస్తుంది. ఎవరినేనా కలవాలనిపిస్తుంది. ఏదో ఒక ఉత్సాహకరమైన పని ఏదేనా చేయాలనిపిస్తుంది. ఏమీ చేయలేకపోతే కనీసం ఒక కథేనా రాయాలనిపిస్తుంది. కథ రాయడమంటే ఏమిటి? నువ్వు విన్నదో నీకు తటస్తించిందో ఏదో ఒక అనుభవాన్ని చేతుల్లోకి తీసుకుని సాకల్యంగా పరిశీలించుకోవడం. సైంటిస్టు లాబరేటరిలో ఒక కాంతికిరణాన్నో, ఒక జీవకణాన్నో నిశితంగానూ, లోతుగానూ, సూక్ష్మవివరాల్లోకీ పోయి పరిశీలిస్తాడే అట్లా అన్నమాట. అట్లా ఏదో ఒక అంశాన్ని ప్రగాఢంగా పట్టుకుని చూడటంలో నీ జీవితాన్ని నువ్వు గాఢంగా, నిజంగా జీవించినట్టనిపిస్తుంది.
కానీ బద్ధకం వల్లనో, రోజువారీ పనులు తెరిపినివ్వకపోవడం వల్లనో, లేదా చాలినంత శారీరిక శక్తి సమకూరనందువల్లనో ఏమీ చెయ్యకుండానే రోజులకు రోజులు గడిచిపోతుంటాయి. ఆ సినిమా చూసిన కొన్నాళ్ళదాకా మొదట్లో స్ఫూరిదాయకంగా మాట్లాడే ఆ సినిమా అనుభూతి కొన్నాళ్ళకు సణుగుడుగా మారిపోతుంది. సున్నితమైన ఈ బాధ భరించలేక ఇక సినిమాలు చూడటం మానుకున్నాను. సినిమాలు అంటే బెర్గ్ మన్, తార్కోవస్కీ, కురొసవా, సత్యజిత్ రాయ్ ల సినిమాలు. ఎందుకంటే నా దృష్టిలో ఆ సినిమాలు చూడటం గొప్ప సాహిత్యం చదవడం లాంటిదే. చెకోవ్ నో, పాలగుమ్మి పద్మరాజునో చదవడం ద్వారా మనకి మనం ఎంతగా సన్నిహితులమవుతామో ఆ సినిమాలు చూస్తే కూడా అంతే.
కానీ ఎన్నాళ్ళిట్లా? నవతరం, యువతరం సాహిత్యం చదువుతున్నారో లేదో గాని సినిమాలు చూస్తున్నారు, వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళతో పోలిస్తే యుగాలు వెనకబడిపోయాన్నేను. వాళ్ళనందుకోవాలంటే ఎట్లా? ఎన్ని సినిమాలు చూడాలి? ఏమి సినిమాలు చూడాలి? ఏ వరసలో చూడాలి?
ఎక్కడో ఒక చోట మొదలుపెట్టవచ్చుకాబట్టి నేను చేసిందేమంటే బ్రిటిష్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ వారు రూపొందించిన జాబితా తో మొదలుపెట్టాను. ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే సర్వేతో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకునే ఒక లిస్ట్ అది. https://www2.bfi.org.uk/greatest-films-all-time.
ఆ జాబితాలో ఉన్న వంద సినిమాలూ బహుశా ప్రపంచ సినిమా గురించి నాకొక అవగాహన ఇస్తాయనుకుంటున్నాను. ఆ వరసలో ఇప్పటిదాకా చూసినవాటిలో Late Spring కూడా ఒకటి. 15 వ స్థానంలో ఉన్న సినిమా. జపనీస్ దర్శకుల్లో అగ్రగణ్యుడైన యసుజిరో ఒజు అనే ఆయన తీసిన సినిమా. ఆయన తీసిన మరొక సినిమా Tokyo Story కి ఈ జాబితాలో మూడో స్థానం లభించింది.
Late Spring రెండవ ప్రపంచయుద్ధానంతరం జపాన్ జీవితాన్ని చిత్రించే కథ. యుద్ధంలో కుప్పకూలిన ఒక దేశంలో మామూలు మనుషుల మామూలు రోజువారీ జీవితాన్ని చిత్రించే కథనం. చాలా సాధారణమైన మనుషుల ఒక కథని అంతే సాధారణంగా చిత్రించిన ఆ సినిమా చూస్తూండగా చివరికి నాకు తెలీకుండానే కళ్ళు సజలాలు కావడం మొదలుపెట్టాయి. నిజమైన కథన కౌశల్యమంటే అది. ఏ విషయమైనా ఏ ఆర్భాటమూ, ప్రచారమూ లేకుండానే హృదయానికి హత్తుకునేలా చెప్పడం. నీతో మాట్లాడుతూనే, ఏవో చిన్న చిన్న విషయాలో, వివరాలో నీతో చెప్పిస్తూనే నీకు ఇంజెక్షన్ ఇవ్వడం లాంటిదది. ఆ ఔషధం నేరుగా నీ రక్తనాళాల్లోకి పాకిపోతుంది.
Late Spring చూస్తున్నంతసేపూ మనకొక కుటుంబంతో మాత్రమే కాదు, ఒక దేశంతోనూ, ఒక సంస్కృతితోనూ కూడా పరిచయమవుతుంది. ఒక జాతి ఏ విశ్వాసాల్ని నమ్ముతూ వచ్చిందీ, వాటిని తన జీవనశైలిగా ఎలా మార్చుకుందో అర్థమవుతుంది. తన తండ్రి పట్ల తన బాధ్యతకీ, తనకంటూ తనకొక వైవాహిక జీవితాన్ని కోరుకోడానికీ మధ్య ఒక యువతి పడే సున్నితమైన సంఘర్షణని ఆ చిత్రదర్శకుడు చూపించిన తీరు అమోఘమనిపిస్తుంది. ఆ చిత్రం one of the most perfect, most complete, and most successful studies of character ever achieved in Japanese cinema అని విమర్శకులు అభివర్ణించడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది.
సినిమాలో చివరికి వచ్చేటప్పటికి, ఆ యువతీ, ఆమె తండ్రీ క్యోటో వెళ్ళినప్పుడు, తామిద్దరూ కలిసి అట్లా చేసే ప్రయాణాల్లో బహుశా అదే చివరిది కావొచ్చనుకుంటున్నపుడు, ఆ తండ్రి తన బిడ్డతో పెళ్ళి గురించి చెప్పిన మాటలు మరవలేనివి. ఆయనంటాడు కదా, పెళ్ళి సంతోషాన్ని తీసుకొస్తుంది కాని పెళ్ళి అయినవెంటనే సంతోషం సంభవిస్తుందని అనుకోవద్దు. అది వెంటనే వారానికో రెండువారాలకో సంప్రాప్తించేది కాదు. ఒక్కొక్కప్పుడు కొన్నేళ్ళ పాటు కూడా ఆ సంతోషమేమిటో మీకు అనుభవంలోకి రాకపోవచ్చు. కాని మీరు ఓపిక పట్టాలి. కలిసి సంతోషాన్ని స్వాగతించాలి. మీరిద్దరూ కలిసి మీకోసం సంతోషాన్ని సృష్టించుకోవాలి అని. ఆ మాటలు పెళ్ళికే కాదు, దేనికైనా వర్తించేవే. ఉదాహరణకి నువ్వొక ఉద్యోగంలో చేరావనుకో, అప్పుడు కూడా ఈ మాటలు తలుచుకోదగ్గవే, మంత్రంలాగా సాధన చెయ్యదగ్గవే. ఏ సంతోషమూ దానికై అది నేరుగా నిన్ను చేరుతుందనుకోవడం ఒక భ్రమ. ‘ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః/ నహి సుప్తస్య సింహస్య ప్రవిశన్తి ముఖే మృగాః’ అంటుందొక సుభాషితం.
సినిమా చూసినప్పణ్ణుంచీ మళ్ళా హృదయంలో ఒక జోరీగ చప్పుడు మొదలయ్యింది. ‘చినవీరభద్రుడూ, చూడు, అట్లాంటి ఒక కథ రాయాలి నువ్వు, మామూలు మనుషులు, మామూలు రోజువారీ జీవితం, మామూలు రొటీన్. కానీ నువ్వు కథ చెప్పడం పూర్తయ్యేటప్పటికి చదివినవాళ్ళ కళ్ళు సజలాలు కావాలి, రాయగలవా? ‘అంటో.
రాయగలనా?
18-9-2020
ఆ సినిమా నేనూ చూడాలి ఇప్పుడే అద్భుతమైన రివ్యూ..🙏🙏