సంపూర్ణ ప్రతినిధి

గిడుగు వెంకట రామమూర్తి (1863-1940) ఆధునిక తెలుగు భాషానిర్మాతల్లో ముఖ్యుడు. ఉపాధ్యాయుడు, చరిత్ర, శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్త. ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలోనూ వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు కూడా ఒకరు. ఆయన ఒక జీవితకాలంలో అనేక జీవితాలపాటు చేయవలసిన మహోద్యమాలెన్నో చేపట్టారు. వాటిలో కొన్ని ఆయన జీవితకాలంలోనే ఫలితాలివ్వడం మొదలుపేట్టాయి. కొన్ని మహోద్యమాల ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోగలిగే స్థితికి జాతి ఇంకా పరిణతి చెందలేదు. ఒక విధంగా చెప్పాలంటే వాటి గురించిన అధ్యయనమే ఇంకా మొదలుకాలేదు.

గిడుగు వారు అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకీ, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాల పేట గ్రామంలో జన్మించారు. 1880 లో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టారు. అప్పటినుంచి 1911 దాకా పర్లాకిమిడి సంస్థానంలో విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు. పదవీ విరమణ తరువాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష,విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు తలకెత్తుకున్నారు. మధ్యలో 1913-14 కాలంలో విజయనగరంలో విజయనగరం సంస్థానంలో ఉద్యోగం చేసారు. 1936 లో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్సును ఏరాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించినప్పుడు, ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేసారు. అప్పటినుంచి తాను స్వర్గస్తులయ్యేదాకా నాలుగేళ్ళ పాటు రాజమండ్రిలోనే కడపటిరోజులు గడిపారు.

గిడుగు జీవితకాలంలో చేపట్టిన కృషి ఎన్నో శాఖలకు విస్తరించింది. వాటిలో ప్రధానంగా నాలుగు విభాగాల గురించి వివరించవలసి ఉంటుంది.

మొదటిది ఆయన ముప్పయ్యేళ్ళకు పైగా ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. పర్లాకిమిడి మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడిగా, పాఠశాలల పరీక్షకుడిగా, పర్యవేక్షణాధికారిగా పనిచేసాడు. 1813 లో బ్రిటిష్ ఇండియాలో మిషనరీలో మొదటిసారిగా ప్రాథమిక పాఠశాలలు తెరిచారు. అప్పణ్ణుంచి 1835 దాకా పాతికేళ్ళ పాటు భారతదేశంలో విద్యపట్ల ఈస్టిండియా కంపెనీ ఎటువంటి వైఖరి అవలంబించాలి అన్నదాని మీద పెద్ద చర్చ జరిగింది. కొందరు ప్రాచీన భాషలైన సంస్కృతం, పారశీకాల్లో విద్యాబోధన జరగాలన్నారు. వాళ్ళని ఓరియెంటలిస్టులు అంటారు. కొందరు ఇంగ్లీషులో విద్యాబోధన జరగాలని వాదించారు. వారిని ఆంగ్లిసిస్టులు అంటారు. ఈ చర్చను ముగిస్తూ మెకాలే 1835 లో ఒక నిర్ణయం ఒక ప్రకటించాడు. తరువాత ఆ మినిటు ఆధారంగా కంపెనీ ఆధ్వర్యంలో పాఠశాలల పాలనావ్యవస్థను ఏర్పాటు చేస్తూ సర్ ఛార్లెస్ వుడ్ 1854లో ఆదేశాలు విడుదలచేసాడు. మెకాలే, వుడ్ ఉద్దేశ్యం ప్రకారం విద్యాబోధన ఇంగ్లీషులో జరగాలి. అది ఆధునిక విద్య కావాలి. ఆ విద్యని అందిపుచ్చుకున్న మొదటి తరం భారతీయులు తాము అందుకున్న ఆధునిక విద్యని తిరిగి తమ తమ దేశభాషల్లో దేశప్రజలకి అందచేయాలి. కాని, 1882లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్ వారి నివేదిక ప్రకారం ఆ ఆదర్శాలు నెరవేరనే లేదు. ఆ పరిస్థితిని చక్కదిద్దాలని లార్డ్ కర్జన్ భావించాడు. 1899 నుంచి 1905 కాలంలో ఆయన భారతదేశంలో వైస్ రాయి గా పనిచేసిన కాలంలో విద్యకి సంబంధించిన ఎన్నో సంస్కరణలు మొదలుపెట్టాడు. ఆ నేపథ్యంలో విద్యారంగంలో గిడుగు చేసిన కృషిని మనం పరిశీలించవలసి ఉంటుంది. కర్జన్ కన్నా దాదాపు ఇరవయ్యేళ్ళ ముందే ప్రాథమిక విద్యారంగంలో ప్రవేశించిన గిడుగు విద్యాబోధన విషయంలో ఎన్నో కొంతపుంతలు తొక్కాడు. గిడుగు జీవితచరిత్రకారులు ఈ అంశం గురించి దాదాపుగా ఏమీ చెప్పలేదనే చెప్పాలి.

కాని విద్యకి సంబంధించి, ముఖ్యంగా పాఠశాల విద్యకి సంబంధించి గిడుగు ఆలోచనల్ని క్రోడీకరించి చూసుకున్నప్పుడు ఆయన భారతదేశంలోని మహనీయ విద్యావేత్తలైన వివేకానందుడు, జ్యోతిబా ఫూలేలకు సమస్కంధుడిగానూ, మహాత్మా గాంధీ, టాగోర్, అరవిందులు, రాధాకృష్ణన్, జిడ్డు కృష్ణమూర్తిలకన్నా ఎంతో ముందే విద్యాచింతన కొనసాగించినవాడిగానూ దర్శనమిస్తాడు.

ఇక రెండవ అంశం విద్యారంగంలో గిడుగు చేసిన కృషికి కొనసాగింపే గాని, అసాధారమైన కొనసాగింపు. పర్లాకిమిడి ప్రధానంగా గిరిజన ప్రాంతం. అక్కడి సవరల స్థితిగతులు చూసి వారికి విద్యాబోధన చేపట్టాలనే ఉద్దేశ్యంతో 1892 లో గిడుగు సవరభాష నేర్చుకోవడం మొదలుపెట్టారు. వారికోసం ఒక పాఠశాల తెరిచారు. వారి విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ 1894 లో ఒక మెమొరాండం రాసి అప్పటి మద్రాసు గవర్నరుకు సమర్పించారు. కాని ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనా లేకపోవడంతో తానే సవర మాధ్యమంలో ఒక పాఠశాల తెరిచి సవరభాషలో వాచకాలు రూపొందించారు. 1913 నాటికి, అంటే, మిషనరీలు ఇంగ్లీషు మాధ్యమం పాఠశాలలు తెరిచిన వందేళ్ళకు సవరమాధ్యమంలో పుస్తకాలు వెలువరించి, పాఠశాలలు తెరిచాడు గిడుగు. కాని అప్పుడు భారతదేశంలో భాషల సర్వే చేపడుతున్న గ్రియర్ సన్ ఆ వాచకాలు బాగున్నాయిగాని, వాటిని తెలుగు లిపిలో రాయడంవల్ల ప్రయోజనం లేదని చెప్పాడు. తెలుగు లేదా ఒరియా లిపి వాడటంకన్నా ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫబెట్ వాడితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సూచించాడు. కాని ఆ విధంగా గిరిజన భాషామాధ్యమంలో ఒక పాఠశాల తెరవడంలోనూ, వాచకాలు రూపొందించడంలోనూ, వారి విద్య గురించి ఆలోచించడంలోనూ భారతదేశంలో గిడుగునే మొదటివాడు. అందుకని మనం ఆయన్ని భారతదేశంలో మొదటి యాంత్రొపాలజిస్టు అనవచ్చు.

దాంతో 1913 నాటికి సవర భాషలో తన కృషి పూర్తయిందనుకున్న గిడుగు ఆ రోజు నుంచే తన కృషి నిజంగా మొదలయ్యిందని భావించాడు. అప్పటినుంచీ మరొక ఇరవయ్యేళ్ళు అపారమైన కృషి చేసి 1931 లో ‘మాన్యువల్ ఆఫ్ సోర లాంగ్వేజ్’ నీ, 1933 లో ‘ఇంగ్లీషు-సోర నిఘంటువు’ నీ వెలువరించాడు. భాషా శాస్త్రంలోనూ, ధ్వని శాస్త్రంలోనూ ఆయన చేపట్టిన ఈ అద్వితీయమైన కృషి వల్ల ఆయన్ని నేడు గొప్ప భాషాశాస్త్రవేత్త అనీ, కాలం కన్నా ముందున్న భాషావేత్త అని అంతర్జాతీయ స్థాయి లింగ్విస్టులు ప్రశంసిస్తున్నారు.

సవర భాషకి సంబంధించిన కృషి ఆయన్ని తెలుగు భాష గురించి కూడా ఆలోచించేలా చేసింది. కర్జన్ చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో మద్రాసు ప్రావిన్సులో భాషాబోధనకి సంబంధించి కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. 1906 లో విశాఖపట్టణం జిల్లా పర్యవేక్షణాధికారిగా వచ్చిన యేట్సు ఆలోచనలు గిడుగుని శిష్ట వ్యావహారికం వైపు నడిపించాయి. అప్పటిదాకా పాఠశాలల్లో బోధిస్తున్న తెలుగు, రాసిన పుస్తకాలూ, పరీక్షలూ అన్నీ కూడా ఒక కృతక గ్రాంథికంలో నడుస్తున్నాయనీ, వాటి స్థానంలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టవలసి ఉంటుందని గిడుగు వాదించాడు. ప్రామాణిక భాషగా చెప్పుకుంటున్న పండితుల భాష జీవరహితమైన ఒక కృతక భాష అని చెప్పడానికి, వారి పుస్తకాలనుంచే ఉదాహరణలు ఎత్తిచూపుతూ ఆయన చాలా పెద్ద పోరాటమే చెయ్యవలసి వచ్చింది. ఆ ఉద్యమంలో భాగంగా ‘బాలకవి శరణ్యము’, ‘ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము’, గద్యచితామణి’ వంటి రచనలు చేపట్టారు. ఆ పుస్తకాల్లో వెలిబుచ్చిన భావాల సారాంశంగా 1912 లో A Memorandum of Modern Telugu వెలువరించి ప్రభుత్వానికి సమర్పించారు. గిడుగు అనగానే ప్రజలకు స్ఫురించేది వాడుకభాష గురించి చేపట్టిన ఈ మహోద్యమమే. ఈ ఉద్యమం ఫలితంగానే నేడు మనం పాఠశాలల్లో, సమాచార ప్రసారసాధనాల్లో, సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించుకోగలుగుతున్నాం.

ఇక గిడుగు చేపట్టిన కృషిలో శాసన పరిశోధన, చరిత్ర పరిశోధన కూడా చెప్పుకోదగ్గవే. శ్రీముఖలింగం దేవాలయంలోని శాసనాల అధ్యయనంతో మొదలైన ఆయన చరిత్ర పరిశోధన చివరిదాకా కొనసాగుతూనే వచ్చింది. ఒక విధంగా గిడుగు వల్లనే గురజాడ కూడా శాసన, చరిత్ర పరిశోధన వైపు ఆసక్తి పెంచుకున్నాడని చెప్పాలి.

గిడుగు జీవితకాలం పాటు చేసిన కృషిని ప్రతిబింబించే రచనలన్నీ కీర్తిశేషులు వేదగిరి రాంబాబు చొరవవల్ల 2014-2016 లో రెండు పెద్ద సంపుటాలుగా వెలువడ్డాయి. ఆ రచనలమీద సమగ్ర అధ్యయనం ఇంకా మొదలుకావలసి ఉంది.

ఆయన గురించి తెలుసుకునేకొద్దీ, ఆయన శిష్యురాలు మిస్ మన్రో వర్ణించినట్టుగా ‘భారతదేశంలోని ఉదాత్తతకీ, సౌందర్యానికీ సంపూర్ణ ప్రతినిధి గిడుగు ‘ అని మనకి తెలుస్తూ ఉంటుంది.

29-8-2020

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s