శ్రీముఖలింగం

వేసరశైలి మహానిర్మాణాలైన కోణార్క సూర్యదేవాలయం, భువనేశ్వరంలోని లింగరాజ దేవాలయం వంటివి చూసినప్పుడు శ్రీముఖలింగం ఎప్పుడు చూస్తానా అనుకునేవాణ్ణి. ఇన్నాళ్ళకి మొన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు శ్రీముఖలింగదర్శన భాగ్యం లభించింది.

విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్రప్రశస్తిలో ముఖలింగం క్షేత్రం పైన పన్నెండు సీసపద్యాలు రాసారు. ఆయన ఆ క్షేత్రానికి వెళ్ళినప్పటికి అది గంజాం జిల్లాలో భాగంగా, గంజాం జిల్లా మద్రాసు ప్రావిన్సులో భాగంగానూ ఉండింది. ఇప్పుడు గంజాం జిల్లా ఒరిస్సాకు పోగా, శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లాలోకి వచ్చింది. విశ్వనాథ ముఖలింగం చూడటానికి వెళ్ళినప్పుడు వంశధార వరదలతో పోటెత్తి మూడు వైపులా ఆయన్ని దిగ్బంధించి ఒక్క అడుగుకూడా కదలనీయలేదట. ఆయన పద్యాలన్నిటిలోనూ ముఖలింగ స్థలపురాణం తో పాటు, ఆ పూర్వప్రశస్తితో పాటు ఆ వరదనీరు కూడా పొంగిప్రవహించింది. ఈ పద్యం చూడండి.

~

నా జాతి పూర్వప్రథా జీవరహితమై

శక్తి నాడుల యందు చచ్చిపోయి

నా మాతృభూమి తేజోమహ శ్చ్యుతిని బ్ర

హ్మక్షత్ర తేజంబు మంట గలిపి

నా మాతృభాష నానా దుష్టభాషల

యొఇద్ధత్యమును తల నవధరించి

నా తల్లినేల నేనాటి వాచారముల్

పై మెరుంగులు చూచి బ్రమసిపోయి

ఏమి మిగిలినదీనాటికిట్లు పొంగు

లొలయు వర్షానదీ గభీరోదకముల

దైన్యగర్భ చారిత్రముల్ తక్క? భిన్న

గిరిశిఖర దుర్గ పరిదీన గీతి దక్క.

(నా తెలుగు జాతి పూర్వ వైభవాన్ని పోగొట్టుకుని జీవరహితంగా మిగిలిపోయింది. నాడుల్లో శక్తి చచ్చిపోయింది. నా మాతృభూమి బ్రహ్మ, క్షాత్ర తేజస్సు మంటకలిసిపోయింది. నా మాతృభాష నానా దుష్టభాషల పెత్తనాన్నీ తలకెత్తుకున్నది. నా నేలతల్లి పై పై మెరుగులు చూసి భ్రమసిపోయి చక్కటి ఆచారాల్ని పోగొట్టుకుంది. ఇక నేటికి ఏమి మిగిలింది? ఈ వర్షాకాలపు వరదలో దీనంగా కనిపిస్తున్న పూర్వకాలపు చరిత్రలు తప్ప? కూలిపోయిన కోటగోడల్ని పట్టి వేలాడుతున్న విషాద గీతికలు తప్ప?)

~

నేను కూడా వర్షాకాల దినాల్లోనే ఆ క్షేత్రంలో అడుగుపెట్టాను కాని, ఒక మహమ్మారి ప్రపంచాని చుట్టబెట్టిన కాలమిది. అందుకని ఆ క్షేత్రంలో సందర్శకులెవరూ లేరు. అప్పటికే మిట్టమధ్యాహ్నమైంది. అర్చకులు, దేవాలయ సిబ్బంది మా కోసమే ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ గుడి ముంగట నిలబడగానే నాకొక చెప్పలేని తుళ్ళింత కలిగింది. దాదాపు పన్నెండు వందల ఏళ్ళుగా కొలువైన ఒక విశిష్ఠ ప్రాచీన దేవాలయంలో అడుగుపెడుతున్నానని అర్థమయింది నాకు. గుడిలో అడుగుపెట్టాక ఒక అర్చకుడు నన్ను గుడిచుట్టూ ప్రదక్షిణంగా తీసుకువెళ్తూ, అక్కడి కుడ్యాలమీదా, లోపల ప్రాకారంలోనూ, కోష్టాల్లోనూ నెలకొన్న ప్రతి ఒక్కదేవతనీ, దేవుణ్ణీ పరిచయం చేస్తూ తీసుకువెళ్ళాడు. మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిందేమో ఎర్రని ఎండకి అరికాళ్ళు కాలుతున్నాయి. కాని ఆ అర్చకుడు వెన్నెల పరిచిన దుప్పటిమీద నడుస్తున్నట్టుగా ప్రతి ఒక్క అర్చాప్రతిమ ముందూ ఆగి ఆ దేవతని పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క దేవతకీ నేను నమస్కరిస్తూ ఉన్నాను గాని, అన్నిటికన్నా ముందు, ఆ శిల్పవైభవం ముందు నా పంచేద్రియాలూ చేష్టలుడిగిపోతూ నిలబడుతున్నాయి. అది ఏమి సౌందర్య దృష్టి! అవి గోడల్లాగా లేవు, బాగా మరగకాచిన పాలమీంచి పేరుకున్న మీగడతో తీర్చిదిద్దిన ముగ్గుల్లాగా ఉన్నాయి. గులాబి రంగు వస్త్రమ్మీద అల్లిన లేసు పొందికలాగా ఉన్నాయి. రాగి, ఇత్తడి,పుత్తడి లోహాలమీద గొప్ప నైపుణ్యంతో తీర్చిదిద్దిన ఫిలిగ్రీలాగా ఉన్నాయి. ఆ అర్చకుడు పరిచయం చేస్తూండగా ఆ దేవతలు అక్కడెప్పుడో అక్కడికి వచ్చారనీ, యుగాలుగా అక్కడే నిల్చిపోయారనీ అనిపించింది. ఆ దేవతల మధ్య లోపల నిత్యపూజలందుకుంటూ శ్రీముఖలింగేశ్వరుడు.

అభిషేకం, పూజ పూర్తయిన తర్వాత, ఆ అర్చకసభ మమ్మల్ని ప్రేమారా ఆశీర్వదించారు. అప్పుడు ఆ అర్చకుడు ‘మీకు కొంత సమయముందంటే ఈ స్థల పురాణం వివరిస్తాను’ అన్నాడు. ఆ కథ మొదలుపెట్టగానే, ఒకప్పుడు దేవుడు ఇక్కడ ఇప్పచెట్టు రూపంలో ప్రత్యక్షమయ్యాడని వినగానే నాకు స్పృహతప్పింది. శ్రీకాళహస్తినుంచి చిదంబరందాకా గాలిగా, నీటిగా, నిప్పుగా, మట్టిగా, శూన్యంగా దర్శనమిచ్చిన సర్వేశ్వరుడు ఇక్కడ ఇప్పచెట్టులో ప్రత్యక్షమయ్యాడట! నా ఉద్యోగ జీవితపు తొలిదినాల్లో గుమ్మలక్ష్మీపురం అడవుల్లో నేను చూసిన, నిలబడ్డ, నిండారా ఆఘ్రాణించిన మధూకవనాలన్నీ నా కళ్ళముందు మెదిలాయి. మాఘమాసపు అడవుల్లో విరబూసిన ఇప్పచెట్టుని చూడటం ఒక అనుభవం. మీరు ఆ చెట్టుకిందకు పోయి నిలబడనక్కర్లేదు, ఆ దారిన వెళ్ళినా కూడా మత్తెక్కిపడిపోతారు. ఆ అనుభవాన్నే నేను పునర్యానంలో ఒక కవితగా రాసుకోకుండా ఉండలేకపోయాను.

~

మాఘమాసపు అడవిలో విప్పారింది ఇప్పచెట్టు

అతల సుతల రసాతలాలన్నీ కదిలిపోయాయి

తూర్పు కనుమల మెట్లు దిగి నడచి వచ్చారు యక్షులక్కడికి

రాలిన ప్రతి పువ్వొక మధుభాండమని మురిసిపొయ్యారు

నేలన విచ్చిన ప్రతి పువ్వు చుట్టూ తీపి గూడు అల్లింది గాలి

లోయలో యువతికేదో సంకేతమందింది.

పువ్వునుంచి పువ్వుకి చేరేలోపే మత్తెక్కి కూలుతున్నాయి మధుపాలు

పయనమయ్యారా దారిన పూర్వ సవరజాతి పితామహులు

ఏ కొత్తగోడనో ఎవరో సవరపూజారి ఎడిసింగ్ చిత్రిస్తూండచ్చు

నివేదన ఇంతకు మించినదేముంటదని స్పృహతప్పి పడిపొయ్యారక్కడే.

~

ఎడిసింగ్ అంటే సవరలు చిత్రించే ఒక కుడ్యపటం. అది వాళ్ళ ఇళ్ళల్లో దైవస్థానంలో గోడమీద చిత్రించే ఒక చిత్రసముదాయం. అందులో వాళ్ళ ప్రపంచమంతా ఉంటుంది. దేవీదేవతలు, మనుషులు, పశుపక్ష్యాదులు సమస్తం ఉంటుంది. నా కవితలో ఊహ ఏమిటంటే, ఎవరో సవర పూజారి తన ఇంట్లో గోడమీద ఆ చిత్రపటం చిత్రిస్తూ దేవతల్నీ, తన పితృదేవతల్నీ ఆవాహన చేస్తూ ఉన్నాడనీ, అక్కడికి బయలు దేరిన ఆ దేవతలంతా నిండుగా విప్పారిన ఇప్పచెట్టు కనిపించగానే ఆ చెట్టుకన్నా మించిన నివేదన ఏముంటుందని అక్కడే స్పృహతప్పి పడిపోయారనీ.

నేనా కవిత రాసినప్పటికి శ్రీముఖలింగ క్షేత్రాన్ని చూడలేదుసరికదా, ఆ కథ కూడా నాకు తెలియదు. కాని నా కవితలో నేనేది ఊహించానో అదే శ్రీముఖలింగ గాథ. ఒకప్పుడు అదంతా కూడా దండకారణ్యంలో భాగంగా ఉండి ఉంటుంది. ఆ క్షేత్రమంతా ఇప్పచెట్ల అడివిగా విప్పారి ఉండి ఉంటుంది. ఎవరో పొరపాటున ఒక ఇప్పచెట్టు నరికాడు. మొదలంటా నరికిన ఆ చెట్టు మొదట్లో సర్వేశ్వరుడు సాక్షాత్కరించాడు వాళ్ళకి. గదతో మోదిన స్తంభంలోంచి సర్వేశ్వరుడు ప్రకటితమయిన కథ తెలుసు మనకి. అడవిలో ఎవరూ చూడని చోట, గొడ్డలితో నరికిన చెట్టులోంచి కూడా దేవుడు ప్రత్యక్షం కాగలడని అక్కడే విన్నాను. ఎంత కృపామయుడు ఆయన. ఎంత రసలుబ్ధుడాయన!

శ్రీముఖలింగేశ్వరుడు మధూకేశ్వరుడు కూడా. విశ్వనాథకి ఇప్పచెట్ల గురించి పూర్తిగా తెలిసినట్టు లేదు. తెలిసి ఉంటే వంశధార వరదలకన్నా ఇప్పచెట్ల రసవృష్టి గురించే పద్యాలు రాసి ఉండేవాడు. స్థలపురాణం ప్రకారం ఆ ఇప్పచెట్టుని నరికినప్పుడు ఆ చెట్టు మొదట్లో మంటలు రేగాయట. విశ్వనాథ ఆ మంటల్నీ, తాను అక్కడ అడుగుపెట్టినప్పటి వర్షోదకాల చల్లదనాన్నీ పదేపదే మార్చిమార్చి తలచుకుంటూ పద్యాలు రాసాడు. తలుచుకున్నదే పాడుకుంటూ, పాడుకున్నదాన్నే మరలా తలుచుకుంటూ, ఇలా అంటున్నాడు:

~

పాడిన గీతమే మరల పాడెద, కూడిన భావమే మరిం

గూడెద, నేమి సేయవలె? గుండియ శోషిలి దుఃఖ వేదనన్

గాడిన నా హృదంతర ముఖంబున మా తొలినాటి కీర్తి రా

పాడిన నాదువాక్కు తెగబారదు నూత్న పథాల వెంబడిన్

(పాడిన పాటలే మరలా పాడతాను. కూర్చిన భావాన్నే మళ్ళా మళ్ళా కూరుస్తాను. మరేమి చెయ్యాలి? గడిచిపోయిన పూర్వ వైభవాన్ని తలుచుకుంటూ నా గుండె నీరసించి దుఃఖంతోనూ, వేదనతోనూ కృశించిపోయింది. దాన్నే పట్టుకు రాపాడుతున్న నా పాట కూడా మరొక దారితొక్కకుండా అక్కడే ఆగిపోయింది)

~

ఆ ఇప్పచెట్ల అడివిలో అటువంటి సౌందర్యప్రతిష్ట చేసిన కామార్ణవ గాంగుడి రసదృష్టికి నమోవాకాలు అర్పించకుండా ఉండలేకపోయాను. అనంతవర్మ చోడగంగదేవుడి కాలంలో అంటే పదకొండో శతాబ్దంలో శ్రీముఖలింగం రాజధానిగా కూడా విలసిల్లిందట. అడివిలో అటువంటి శాశ్వత సౌందర్యాన్ని నేను చూడటం ఇది రెండవసారి. ఒకప్పుడు రామప్పని చూసి కూడా ఇట్లానే అప్రతిభుణ్ణయిపోయాను. రామప్ప అడవిలో నడిచే ఒక శాశ్వత సంగీత సమారోహం, ఒక నృత్యప్రదర్శన. శ్రీముఖలింగం నగిషీలు చెక్కిన ఒక దంతమందిరంలో నడిచే ఒక శాశ్వత దేవసభ.

మధూకేశ్వరస్వామి ఆలయంతో పాటు స్థానిక మిత్రులు నాకు సోమేశ్వరాలయం, భీమేశ్వరాలయాలు రెండింటినీ చూపించారు. అక్కణ్ణుంచి గుడిపక్కగా ప్రవహిస్తున్న వంశధారని చూపించారు. వరదలతో పోటెత్తకపోయినా ఆ నది దూరంగా ఒక ఎర్రటిగీతగా కనిపిస్తూ ఉంది. ఆ నది ఒడ్డునే ఒక గుడి. ఆ నదినీ, ఆ గుడినీ మార్చిమార్చి చూసుకున్నాను. మనసులో ఒక కవిత అంకురించింది.

~

నది ఒడ్డున గుడి

ప్రవహిస్తున్నది నది అనాదిగా

వంశధారల వేణుగానఝరిగా.

ప్రవహిస్తున్నది గుడికూడా

ఇప్పపూల తావిగా,

వెనక్కి, పైకి, లోలోపలకి,

ప్రవహించాలి నేను కూడా

మనిషి అంచులు దాటి

మధుపంగా.

17-8-2020

Leave a Reply

%d bloggers like this: