వంగపండుని చూసాకే అర్థమయింది

చాలా ఏళ్ళ కిందటి సంగతి. నేను రాజమండ్రిలో పనిచేస్తున్నప్పటి రోజులు. అప్పట్లో బెంగాల్ నుంచి ఒక విప్లవరచయితల బృందమొకటి ఏ కారణం చాతనో రాజమండ్రిలో కొన్నాళ్ళున్నారు. బహుశా తలదాచుకున్నారేమో, తెలీదు, కాని అట్లాంటి బృందమొకటి అక్కడికి వచ్చినట్టు మా మిత్రులకి ఎట్లా తెలిసిందో ఏమోగానీ, వాళ్ళని పోయి కలిసారు. ఆ తర్వాత చాలా రోజులు రాత్రిపూట సాహిత్య చర్చలు జరుగుతుండేవి. ఒకసారి అట్లాంటి గోష్టికి నన్ను కూడా తీసుకెళ్ళారు. నేను వాళ్ళని చూడగానే వాళ్ళతో ఎట్లా మాటలు కలపాలా అని ఆలోచించి, వాళ్ళు విప్లకవులు కాబట్టి, టాగోర్ గురించి ప్రస్తావించి లాభం లేదనుకుని, నజ్రుల్ ఇస్లాం గురించి నాకు తెలిసిందేదో చెప్పబోయాను. ఊరు కాని ఊళ్ళో, తమ భాష కాని భాషమాట్లాడేవాళ్ళ మధ్య తమ కవి గురించిన ప్రస్తావన వచ్చినందుకు వాళ్ళల్లో ఆశ్చర్యంగాని, సంతోషంగానీ ఏమీ కనిపించలేదు. నేను చెప్పాలనుకున్న నాలుగు మాటలూ చెప్పేదాకా ఆగి, ఆ బృందనాయకుడు అన్నాడు కదా ‘ నజ్రుల్ ఏనాటి మాట! ఈ మధ్య మేమొక గీతం విన్నాం. ఆ కవి ఎవ్వరో తెలీదు, ఏ భాషకి చెందిన కవినో తెలీదు, కాని ఎట్లాంటి కవిత! కవిత రాస్తే అలా ఉండాలి! అట్లాంటి కవిత బెంగాలీలో పుట్టాలంటే ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో ‘ అంటో ఒక కవిత బెంగాలీలో వినిపించాడు. ఆ కవిత వింటోనే నాలో ముందేదో జ్ఞప్తిలో కదలాడి, ఆ పైన తెలియని ఒక ఉద్విగ్నత ఒళ్ళంతా విద్యుచ్ఛక్తిలాగా కదలాడింది.

అనిసెట్టి సుబ్బారావు గేయం.

తెలుగులో ఆ గీతాన్ని చాలామంది చదివి ఉండవచ్చుగానీ, నజ్రుల్ ఇస్లాం ని కూడా మరిపించేతంటటి సముజ్జ్వల గీతంగా దాన్ని కీర్తించే వారుంటారని ఊహించి ఉండరు.

బహుశా నేడు అనేక భారతీయ భాషా సాహిత్యాల్లో, పీడిత ప్రజలు పోరు బాట పట్టక తప్పని ప్రతి చోటా, వంగపండు ప్రసాద రావు అటువంటి కవిగా గుర్తింపబడుతూ ఉండవచ్చు. మనిషి ఒక పాటగా మారే అత్యంత అపురూపమైన సామాజిక సందర్భం మన కళ్ళముందే సంభవిస్తున్నా కూడా వంగపండుని ఒక ప్రజాగాయకుడని పేర్కోడాన్ని మించి మనం అతడికీ, అతడి పాటకీ ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వకుండానే ఇన్నాళ్ళూ గడిపేసాం.

మామూలుగా ఒక కవి మన మధ్యనుంచి నిష్క్రమించిన తర్వాతనే మనం మన రాగద్వేషాల్నీ, ఉదాసీనతనీ విడిచిపెట్టి, అతడి కవిత్వ మూల్యాంకనం మొదలుపెడతాం కాబట్టి, బహుశా ఇవాల్టినుంచీ వంగపండు కవిత్వం గురించిన నిజమైన అంచనా మొదలవుతుందని ఆశిద్దాం. ఉదాహరణకి, అతడి పేరు తలవగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే, ‘ఏం పిల్లో ఎల్దమొస్తవా, ఏం పిల్లడో ఎళ్దుమొస్తవా ‘అన్న పాటనే తీసుకోండి. దేశంలోనూ, ప్రపంచంలోనూ సంభవిస్తున్న అన్నిరకాల పోరాటాల్నీ ఒక్కచోట, ఒక్కసారిగా తలుచుకోవడం కోసం తానా గీతం కూర్చానని చెప్పుకున్నాడాయన. అంటే ఒక విధంగా 1950 ల తర్వాతి దేశ చరిత్ర అంతా ఆ పాటలో ఉంది. కాని ఆ పాట మీద ఒక సవివరమైన విశ్లేషణ, వ్యాఖ్యానం ఏదీ కూడా ఇప్పటిదాకా ఎక్కడా ఎవరూ రాసినట్టు నేను చూడలేదు.

ఉత్తరాంధ్రలో వినవచ్చే ఒక జానపద బాణీని ఆధునీకరిస్తూ తానా గీతం కట్టానని ఆయన చెప్పాడు. ఆ జానపద గీతాన్ని ఆయన ఏ విధంగా ఆధునీకరించాడు, దాని జానపద, ప్రజారంజక లక్షణాల్ని ఏ మేరకు నిలిపాడు, ఏ మేరకు ఆ రంజకత్వంలోని వైయక్తిక, గ్రామీణ అంశాల స్థానంలో సామూహిక, చారిత్రిక అంశాల్ని చొప్పించాడు, అందుకు ఆయన ఎటువంటి నిర్మాణ వ్యూహాలు అనుసరించాడు, గాయకుడిగా సరే, జననాట్యమండలి కళాకారుడిగా సరే, అసలు ఒక కవిగా, శిల్పిగా ఆయన ఆ గీతరచనలో కనపరిచిన మౌలికమైన ప్రజ్ఞ ఏమిటి అన్నదాని మీద ఎంత చర్చ జరిగి ఉండాలి ఇప్పటిదాకా!

బహుశా ప్రపంచంలోని మరేదో భూభాగం నుంచి, ఒక సైప్రస్ నుంచో, ఒక క్రొయేషియో నుంచో, ఒక కాంగో నుంచో, ఒక శ్రీలంకనుంచో ఎవరో ఒక సాహిత్య విద్యార్థి ఈ అంశం మీద సమగ్రంగా పరిశోధన చేసి మనకి చెప్పేదాకా మనం ఈ పాటని కూడా చాలా సినిమా పాటల్లో ఒకటిగా వింటో విన్నంతసేపూ పులకిస్తో, విన్నాక పక్కన పెట్టేస్తో ఉంటాం.

వంగపండు రాసిన ప్రతి పాట మీదా, ఆ మాటకొస్తే గద్దర్ రాసిన ప్రతి పాట మీదా కూడా ఇట్లాంటి విశ్లేషణా, విమర్శా రావాలని కోరుకుంటాను. వారు రాసిన కొన్ని పాటల పల్లవులు విన్నప్పుడు, మహనీయులైన పూర్వ వాగ్గేయకారుల పల్లవులు విన్నప్పటిలానే నిశ్చేష్టుణ్ణవుతూ ఉంటాను. పాటకి పల్లవి ప్రాణం అని ఊరికే అనలేదు. పల్లవి అంటే ఒక కవి గుండె తెరుచుకునే చప్పుడు. కొన్నిసార్లు అతడి గుండె బద్దలయ్యే చప్పుడు కూడా.

‘నిధి చాలా సుఖమా, రాముని స

న్నిధి సుఖమా ‘

అనే పల్లవి త్యాగరాజాత్ములైనవారి ని ఎట్లా సంభ్రమపరుస్తుందో

‘నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా

తోడబుట్టిన ఋణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’

‘కొండలు పగలేసినం, బండలను పిండినం

మా నెత్తురె కంకరగా ప్రాజెక్టులు కట్టినం

శ్రమ ఎవడిదిరో

సిరి ఎవడిదిరో

అనే పల్లవులు ఎంత విద్యుత్తును సృష్టిస్తాయో

‘యంత్రమెట్లా నడుస్తు ఉందంటే ఓరన్నో లమ్మీ రైలూ

లారీ కారూ బస్సూ మిల్లూ మిషనూ, మోటారు సైకిలు

యంత్రమెట్లా నడుస్తు ఉందంటే ..’

అనే పాట మొదలుకాగానే నా వళ్ళంతా విద్యున్మయం కాకుండా ఉండలేదు. అయితే, ఆ పల్లవి ఆయనకెట్లా స్ఫురించిందో ఆ ఆల్కెమీనీ మనం వివరించలేకపోవచ్చుగానీ, ఆ పల్లవిని ఆయన నిర్మించిన తీరు నిస్సందేహంగా మనం మరింత మరింత అధ్యయనం చెయ్యవలసిన అంశం కాదా.

పల్లెటూర్లలో పంటలు ఇంటికొచ్చినప్పుడు జంగాలు ఇంటింటికీ తిరిగీ పాడుకునే ఒక జంగం పాట బాణీలో షిప్ యార్డు కార్మికుల కోసం రాసిన ఆ పాటలో ఒక ఫిట్టరుగా వంగపండు కార్మికానుభవం మాత్రమే కాదు, శిల్పిగా ఆయన కనపరిచిన అసామాన్యమైన నిర్మాణ కౌశల్యం గురించి కూడా మనం గురించవలసి ఉంటుంది. ఇంతకీ శిల్పి అంటే ఏమిటి? Fitter of words మాత్రమే కదా. గాయకుడంటే ఎవరు? Fitter of sounds నే కదా.

కవిత్వం వసంతం లాంటిది, అది అన్ని వేళలా అందరిమీదా వాలదు. శ్రీ శ్రీకి ఈ రహస్యం తెలుసు. ఆయన కవిత్వం రాయడం మొదలుపెట్టినప్పుడు అది చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిమీదా, కృష్ణశాస్త్రిమీదా, విశ్వనాథమీదా వికసిస్తుండటం చూసాడు. తన జీవిత చరమదినాల్లో అది చెరబండరాజులోనూ, వంగపండులోనూ వికసిస్తున్నదని గుర్తుపట్టాడు. ‘జంగమదేవర్ల గంటల చప్పుళ్ళల్లో నేను నా కవిత్వాన్ని వెతుక్కున్నాను ‘అని ఆయనొక చోట రాసుకున్నాడుగాని, అది ఆయనకి ఒక కల మాత్రమే. నిజంగా జంగం దేవర్ల పాటల్లోంచి కవిత్వం తెచ్చుకోవడమెలా ఉంటుందో వంగపండుని చూసాకే ఆయనకి అర్థమయింది.

బహుశా ప్రపంచంలోని ఏ భాషలోనూ లేనంతమంది శక్తిమంతులైన ప్రజాగాయకులు నేడు తెలుగు భాషలో మాత్రమే కనవస్తున్నారు. నా మాటమీద అనుమానం ఉన్నవాళ్ళు, protest song గురించిన సమాచారం నెట్ లో శోధించి చూడవచ్చు. తక్కిన నేల కన్నా తెలుగు నేల మరిన్ని పోరాటాల పురిటిగడ్డ అని నేను చెప్పలేనుగానీ, పోరాటాన్ని పాటగా మార్చగలిగే ఒక సౌలభ్యం, ఒక వేగం, ఒక సంప్రదాయం తెలుగు సాహిత్యంలో పుష్కలంగా ఉంది. తెలుగులో ఒక కవి ప్రయత్నం మీద పద్యకవికాగలడు, చాలా కష్టపడితే మంచి వచనకవి కాగలడు, కాని అప్రయత్నంగా ఒక గీతకారుడు కాగలడు. కావలసిందల్లా కొంత తడి గుండె. అటువంటి గుండె కనుక ఉంటే , నండూరి సుబ్బారావులాంటి వకీలుకి కూడా ఒక సాయంకాలం ట్రాము బండిలో ఇంటికొస్తున్నప్పుడు ‘గుండె గొంతుకలోన కొట్లాడటం ‘అప్రయత్నంగా అనుభవంలోకి వస్తుంది. ఇక అతడు వంగపండు ప్రసాద రావే అయితే, అతడి పార్వతీపురం నేపథ్యం, శ్రీకాకుళం పురిటినొప్పులు అతణ్ణొక అసమాన కవిగాయకుడిగా మార్చేస్తాయనడంలో ఆశ్చర్యమేముంది!

పార్వతీపురం గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అదృష్టానికి నోచుకున్నవాడిగా, వంగపండు గీతాలు అక్కడి నేల మీద నేనెన్నోసార్లు విన్నాను. పాఠశాలల్లో పిల్లలు మొదలుకుని, గ్రామాల్లో కళాకారులదాకా భూమిబాగోతం ప్రదర్శించగా చూసాను. బహుశా భూషణంగారో మరెవరో పరిచయం చేయగా వంగపండుని ఒకసారి కలుసుకోగలిగాను. కాని, ఆయన కవిత్వాన్ని అధ్యయనం చేయవలసినంతగా అధ్యయనం చేయలేదని మాత్రం ఇప్పుడు గ్రహిస్తున్నాను.

పాట చాలా చిత్రమైనది. ఒకరికి అది జయమాల, మరొకరికి ఉరితాడు. ఒకరినది అందలమెక్కిస్తుంది. పద్మశ్రీ, పద్మవిభూషణుల్ని చేస్తుంది. మరొకరిని ప్రవాసానికీ, కారాగారానికీ పంపిస్తుంది. కాని, శ్రోతల్ని మాత్రం ఒక్కలానే పరవశింపచేస్తుంది. గీతకారుడికి పాటనుంచి ఏమి దక్కుతుందనేది అతడి సామాజిక-రాజకీయ సందర్భాన్ని బట్టి ఆధారపడుతుంది. కానీ, జాతికి మాత్రం ఆ పాట మిగులుతుంది. గీతకారుడి సుఖసంతోషాలూ, కష్టనష్టాలూ పాటగా మారి ఆ పాట విన్న ప్రతి ఒక్క గుండెలోనూ గూడుకట్టుకోవడం మొదలుపెడతాయి.

తెలుగు భాష, తెలుగు పాట, తెలుగు శ్రోత ఉన్నంతకాలం వంగపండు చిరంజీవి.

5-8-2020

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s