మొదటి స్వతంత్ర కావ్యం

పోయిన శనివారం కూచిపూడి వెళ్ళడానికి ముందు మేము శ్రీకాకుళం, ఘంటశాల కూడా వెళ్ళాం. పాఠశాలలు చూసుకుంటూ శ్రీకాకుళం వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం మూడు గంటలయింది. నాతో పాటు ఉన్న సిబ్బందికి మధ్యాహ్న భోజనం ఆలస్యమయినందువల్ల ముందు ఎక్కడేనా చల్లని నీడన కూచుని భోజనం చెయ్యాలనుకున్నాం. అక్కడి సిబ్బంది మమ్మల్ని గుడికి తీసుకువెళ్ళారు. తెలుగు జాతి చరిత్రలో ఒకప్పుడు ఎంతో ప్రాముఖ్యాన్ని పొందిన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం అది. ఆ గుడి నేను గతంలో రెండు సార్లు సందర్శించి ఉన్నాను. అదీకాక అది అపరాహ్ణవేళ, దేవుడు విశ్రాంతి తీసుకునే సమయం కాబట్టి, ఆ గుడి తెరిచే ఏర్పాట్లు చెయ్యవద్దనీ, అక్కడ నెమ్మదిగా భోజనం చేసుకుని వెళ్ళిపోదామనీ అన్నానుగాని, మేం వచ్చిన వార్త అక్కడికి అర్చకులకు అప్పటికే చేరిపోయింది. మేమంతా అక్కడ ఆ మధ్యాహ్నభోజనం ముగించేటప్పటికి, ఆ అర్చకులు, ఆ గర్భగుడి తలుపులు తెరిచి పెట్టారు. కేవలం దర్శనం మాత్రమే చేసుకుని వెళ్తామనీ, అర్చనలు, పూజలూ ఏవీ చేసే ఏర్పాట్లు చెయ్యవద్దన్నాను. కానీ, ఆ గర్భగుడిలో అడుగుపెట్టి, ఆ స్వామి ముందు నిల్చునేటప్పటికి, అన్నీ మర్చిపోయాను. ఆ దివ్యమంగళ మూర్తి ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి స్వప్నంలో సాక్షాత్కరించినప్పుడు ఎంత సౌందర్యరాశిగా కనిపించాడో ఇప్పుడూ అంతే జేగీయమానుడిగా కనబడ్డాడు.

~

నీల మేఘపు డాలు డీలు చేయగ చాలు

మెరుగు చామన చాయ మేని తోడ

అరవిందముల కచ్చు లడగించు జిగి హెచ్చు

ఆయతంబగు కన్నుదోయి తోడ

పులుగు రాయని చట్టుపల వన్నెనొరవెట్టు

హొంబట్టు జిలుగు రెంటెంబు తోడ

ఉదయార్క బింబంబు నొరపు విడంబంబు

దొరలంగ నాడు కౌస్తుభము తోడ

తమ్మికేలుండ పెరకేల ఇచ్చు

లేములుడిపెడు లే చూపు లేమతోడ

తొలకు దయ తెల్పు చిరునగవుతోడ గలద

దంధ్ర జలజాక్షుడిట్లని ఆనతిచ్చె (ఆముక్తమాల్యద:1-12)

(నీలమేఘపు కాంతిని మరపించగల చామనచాయ మేనుతోనూ, తామరపూల గర్వాన్ని ఓడించేట్టుండే రెండు పెద్ద కళ్ళతోనూ, పక్షిరాజైన గరుత్మంతుని వన్నెకి కూడా వన్నెపెట్టగల సన్నని బంగారు పట్టు వస్త్రంతోనూ, ఉదయసూర్యకాంతిని కూడా తక్కువచేయగల కౌస్తుభరత్నకాంతితోనూ, ఒక చేత పద్మాన్నీ, మరొకచేత పేదరికాన్ని పోగొట్టే లేతచూపుల లక్ష్మీదేవికి ఊతమిస్తూనూ, కళ్ళనిండుగా దయ తొణికిసలాడుతూ ఆ ఆంధ్ర మహావిష్ణువు నాకు కలలో కనబడి ఇట్లా అనతిచ్చాడు)

~

ఈ పద్యంలోని మొదటి ఎనిమిది పంక్తులూ పెద్దన మనుచరిత్రలో కూడా కనిపిస్తాయి. బహుశా విజయనగరం వెళ్ళిన తరువాత ఆ స్వప్న వృత్తాంతాన్ని ముచ్చటించుకుంటున్నప్పుడు ఆ ఇద్దరు కవులూ జమిలిగా ఆ సాక్షాత్కారానికి మాటలు పొదిగి ఉండాలి.

ఆ వేళ మామూలుగా దేవాలయాల్లో దేవుడు ఒకింత సొలసి మధ్యాహ్నపు కునుకు తీసేవేళ. కాని ఆ మహావిష్ణువు నిజంగానే కారుమబ్బు కాంతిని కూడా పక్కకునెట్టే మేనిపై పీతాంబరంతో ధరించి, మెడలో సాలగ్రామాలమాల ధరించి కనిపించినప్పుడు నాకు నిజంగానే ఒళ్ళు గగుర్పొడిచింది.

ఇప్పటికి అయిదువందల ఏళ్ళ కిందట, కృష్ణరాయలు కళింగం పై దండయాత్రకు బయలుదేరినప్పుడు, విజయవాడలో కొన్నాళ్ళు విడిదిచేసాడు. అప్పుడొక హరివాసరం నాడు, అంటే చరిత్రకారుల లెక్క ప్రకారం, 1515 జనవరి 15 వ తేదీనాడు ఆయన శ్రీకాకుళం వెళ్ళాడు. అక్కడ ఆ రాత్రి దేవాలయ ప్రాంగణంలో నిద్రించాడు. అప్పుడు తెల్లవారుజామున ఆయనకి కలలో కనబడి ఆంధ్రమహావిష్ణువు ‘నువ్విప్పటికే సంస్కృతంలో ఎన్నో కావ్యాలు రాసావు, నా కోసం ఆంధ్రభాషలో ఒక కావ్యం రాయకూడదా ‘ అనడిగాడు. ఇంకా ఇలా అన్నాడు:

~

ఎన్నిను గూర్తునన్న, విను , మే మును దాల్చిన మాల్యమిచ్చు న

ప్పిన్నది రంగమందయిన పెండిలి సెప్పుము, మున్నుగొంటి నే

వన్నన దండ, ఒక్క మగవాడిడ, నేను తెలుంగు రాయడ

న్గ న్నడ రాయ, యక్కొదువ కప్పు ప్రియాపరిభుక్తభాక్కథన్ (1:14)

(నీ గురించి చాలా కథలు ఉన్నాయి కదా, ఏ కథ చెప్పమంటావా అని అడుగుతావా, అయితే విను, ఒకప్పుడు తన కొప్పులో తాను ముందు ధరించి ఆ తర్వాత ఆ పూలదండలు నాకు పంపించిన ఆ చిన్నదాని కథ చెప్పు. పూర్వం నేను ఏవగించుకుంటూనే ఒక మగవాడిచ్చిన దండల్ని స్వీకరించక తప్పలేదు. నా ప్రియురాలిచ్చిన దండని నేను స్వీకరించిన కథ చెప్పి నా మనసులో ఉన్న ఆ వెలితి తొలగించు. నేను ఆంధ్రవల్లభుణ్ణి. నువ్వో కన్నడరాయడివి. ఈ కథ చెప్పడానికి నువ్వే సమర్థుడివి)

~

మగవాడిచ్చిన దండ స్వీకరించడమేమిటి? అంటే ఆంధ్రమహావిష్ణువు స్థలపురాణంలో ఒక కథ ఉంది. ఒకప్పుడు అక్కడి అర్చకుడు ప్రతి రోజూ పూలదండని ముందు తన వేశ్యకి సమర్పించి ఆ తర్వాత తెచ్చి దేవుడికి సమర్పించేవాడట. ఒకరోజు అక్కడి రాజు దైవదర్శానికి వచ్చినప్పుడు నిర్మాల్యంగా దేవుడి మెడలోని పూలదండని ఆ రాజు చేతుల్లో పెట్టినప్పుడు ఆ దండలో ఒక కేశం కనిపించిందట. ఆ రాజు ఆగ్రహించి ఆ పూజారిని నిర్బంధించాడట. అప్పుడు ఆ పూజారి భయంతో వణికిపోతూ, అయ్యా అది దేవుడికొప్పులోది, మీరు పొద్దున్నే రండి, దేవుడి కొప్పు మీకు చూపిస్తాను అన్నాడట. ఆ మర్నాడు నిజంగానే దేవుడు కొప్పుతో దర్శనమిచ్చాడట.

బహుశా కృష్ణరాయలు శ్రీకాకుళంలో విడిది చేసిన రాత్రి ఆయనకి ఆ స్థలపురాణం వివరిస్తూ ఈ కథ కూడా చెప్పి ఉంటారు. ఆయన మదిలో శ్రీరంగనాథుడి అపురూపమైన కథ మెదిలి ఉంటుంది. ఒక అర్చకుడు చేసిన ఆ పనిలోని జుగుప్స, కాని, దాన్ని కూడా మన్నించిన ఆ జలజాక్షుడి దయ ఆయన హృదయాన్ని లోబరుచుకుని ఉంటాయి. ఆ రాత్రంతా అదే ఆలోచిస్తూ నిద్రపోయి ఉంటాడు. ఆ నిద్రలో ఒక కలగా, ఒక మెలకువగా, ఒక మహాకావ్యానికి అంకురార్పణ జరిగిందని ఇప్పుడు మనకి అర్థమవుతున్నది.

తెలుగు సాహిత్యంలో శ్రీకాకుళం ప్రస్తావన మనకి మొదటిసారి క్రీడాభిరామం కావ్యంలో కనిపిస్తుంది. అందులో శ్రీకాకుళం తిరునాళ్ళ గురించి శ్రీనాథుడు వర్ణించాడుగాని, అవి పోకిరీ పద్యాలు. శ్రీకాకుళానికి నిజమైన ప్రశస్తి తెచ్చినవారు ఇద్దరు కవులు. ఒకరు శ్రీకృష్ణదేవరాయలు, మరొకరు కాసుల పురుషోత్తమకవి. ఆ దేవాలయ ప్రాంగణంలో ఇద్దరికీ విగ్రహాలు చెక్కి, మందిరాలు కట్టారు. కాసుల పురుషోత్తమ కవి పద్ధెనిమిదో శతాబ్ది కవి. ఆయన రాసిన ఆంధ్రనాయక శతకంలోంచి రెండు మూడు పద్యాలేనా తెలుగు వాచకాల్లో పెడుతూ వస్తున్నారు కాబట్టి దాదాపుగా ఆయన పేరు వినని వారుండరు. వ్యాజస్తుతి (అంటే పైకి నిందిస్తున్నట్టు కనబడుతున్నా లోపల స్తుతించేట్టుగా ఉండే మాటలు) తో కూడుకున్న ఆ పద్యాలు తెలుగుపలుకుబడికి పండ్ల గంపలని చెప్పాలి.

పురుషోత్తమ కవిగురించి తలుచుకున్నప్పుడల్లా మా మాష్టారు చెప్పిన ఉదంతమొకటి గుర్తొస్తూ ఉంటుంది. ఒకప్పుడు తిరుపతివెంకట కవులు తమ శిష్యుల్లో కావ్యప్రీతి పెంచడంకోసం వారికి రకరకాల చిక్కు ప్రశ్నలు ఇస్తూ ఉండేవారట. వాటిని ఒకరకంగా పోటీ పరీక్షలని కూడా చెప్పవచ్చు. తమ శిష్యుల్లో కావ్యపండిత్యంతో పాటు ఒక అభిరుచిని నిర్మించడం కూడా ఆ పరీక్షల ఉద్దేశ్యం. అటువంటి చర్చల్లో భాగంగా ఒకరోజు ఒక ప్రశ్న అడిగారట. ‘ఏమర్రా, తెలుగులో బమ్మెర పోతన అనే కవి పుట్టి ఉండలేదనుకోండి. కాని, పోతన వాక్కు వంటి వాక్కు తెలుగులో లేకుండా పోతే ఎట్లా? కాబట్టి, పోతన లేకపోయినా ఆ లోటు పూరించగల కవి ఎవరై ఉండవచ్చునో ఊహించండి ‘ అన్నారట.

శిష్యులు చాలా సమాధానాలే చెప్పారు. కాని వెంకటశాస్త్రిగారికి అవేవీ రుచించలేదు. ఆయన పుట్టింది గోదావరి ఒడ్డునే అయినప్పటికి, జీవితమంతా కృష్ణాతీరంలోనే గడిపినవాడు.

‘ఓరి దద్దమ్మల్లారా, కాసుల పురుషోత్తాన్ని మర్చిపోయారుట్రా ‘ అని అన్నాడట ఆయన.

కాని ఆ మధ్యాహ్నం, అక్కడ దేవాలయ ప్రాంగణంలో నేను మొదటిసారిగా మూడవ కవి ప్రస్తావన చూసాను. అనంతామాత్యుడు కూడా శ్రీకాకుళానికి చెందిన కవి అని అక్కడ రాసి ఉంది. నేనాశ్చర్యపోయాను. అక్కడి అర్చకుల్ని అడిగాను గాని వారికేమీ తెలిసినట్టు లేదు.

తిరిగి వచ్చిన తరువాత అనంతామాత్యుడి గురించి చదవడం మొదలుపెట్టాక నా ఆశ్చర్యానికి హద్దులేదు. భోజరాజీయ కర్తగా అనంతుడు నాకు తెలుసు. ఆ కావ్యంలోని గోవ్యాఘ్రసంవాదం కూడా మనకి తెలుగు పాఠ్యపుస్తకాల ద్వారా పరిచయమే. ఆ సంవాదంలో, ఆవు తన బిడ్డకు చెప్పిన సుద్దుల్లోంచి కొన్ని పద్యాలు నేను నాలుగవ తరగతిలోనో, అయిదవ తరగతిలోనో చదువుకున్నాను. ఆ పద్యాలు నాకొక చెప్పలేని బెంగ పుట్టించేవి, మరీ ముఖ్యంగా ఈ పద్యం:

~

చులుకన జలరుహ తంతువు,

చులుకన తృణకణము, దూది చులుకన సుమ్మీ

ఇల నెగయు ధూళి చుల్కన

చులుకన మరి తల్లిలేని సుతుడు కుమారా!

(భోజరాజీయము:6:35)

~

కానీ, ఇప్పుడు మొదటిసారిగా భోజరాజీయం మొత్తం కావ్యం చదవడానికి మొదలుపెట్టాను. ఆ కావ్యాన్ని ఇన్నాళ్ళ పాటు గుర్తించనందుకు సిగ్గుపడుతున్నాను కూడా. ఎందుకంటే, సాహిత్య విమర్శకులు దాన్ని తెలుగులో మొదటి స్వతంత్ర కావ్యంగా పేర్కొన్నారు. ఆయన కవిత్రయం వేసిన బాటలో కవిత చెప్పాడు. ఆ శుశ్రూష వల్ల తన తరువాతి కవులమీద కూడా గాఢమైన ప్రభావం చూపించగలిగాడు. శ్రీకృష్ణదేవరాయలు, పెద్దన, పింగళి సూరన మొదలైన కవులు ఆయన్నించి చాలానే సంగ్రహించినట్టు సాహిత్యం సాక్ష్యమిస్తోంది.

అనంతామాత్యుడు పదిహేనవ శతాబ్ది కవి. శ్రీనాథుడికన్నా వయసులో కొద్దిగా చిన్న, కాని సమకాలికుడే. తనది పెరుమగూరు అనే ఊరని చెప్పుకున్నాడు కాని ఆ ఊరెక్కడో ఇతమిత్థంగా తేల్చలేకపోయారు. కాని ఆయన తండ్రి తాతలు ‘నెమ్మి ప్రత్యక్ష పరమపదమ్మనంగ నొప్పు శ్రీకాకుళంబున కొడయడైన ఆంధ్రవల్లభ హరిసేవలో ‘ గడిపేవారని మటుకు చెప్పుకున్నాడు. ఆయన ముత్తాతని తిక్కన ప్రశంసించాడట. తిక్కన అంటే అనంతామాత్యుడికి చెప్పలేనంత ఆరాధన. తిక్కనలానే అతడికి కూడా దేవుడు స్వప్నంలో కనబడి ఒక కావ్యం రాసిమ్మని అడిగాడు. ఆ దేవుడు అహోబిల నరసింహుడు. ఆయనకి కానుక చేయడం కోసమే అనంతుడు ‘భోజరాజీయం ‘ రాసాడు. తిక్కన, అనంతామాత్యుల తర్వాత, దేవుడు కలలో కనబడి ఒక కావ్యం రాసిమ్మని అడిగిన మూడవ తెలుగు కవి కృష్ణదేవరాయలు మాత్రమే. బహుశా, శ్రీకాకుళంతో గడిపిన రాత్రి కృష్ణరాయలు అక్కడివాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ సంగతులన్నీ చర్చకు వచ్చి ఉంటాయి.

ఎందుకంటే, ఆముక్తమాల్యదలోని దాసరి కథకి మాతృక అని చెప్పదగ్గ కథ భోజరాజీయంలోని మదనరేఖ కథ. మీకు దాసరి కథ తెలిసే ఉంటుంది. మదన రేఖ కథ కూడా అటువంటిదే.

అందులో ఒక గురుపుత్రికను, గురువు ఇంటిలోలేని సమయంలో ఒక శిష్యుడు బలాత్కరించబోతాడు. ఆమె అతణ్ణి నిరాకరించబోతే అతడు నేలకూలి చచ్చిపోయినట్టుగా నటిస్తాడు. ఆమె తన మాటల వల్ల ఒక మనిషి చావుకి కారణమయ్యానన్న దుఃఖంతో అతడు బతకడం కోసం తానేమైనా చెయ్యడానికి సిద్ధమే అని విలపిస్తుంది.అతడు లేచి, అయితే, తన కోర్కె తీర్చమంటాడు. ఆమె అతణ్ణుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక, ఒక్క వరం కోరుకుంటుంది. అదేమంటే, తనకి వివాహమయిన తర్వాత, తన భర్తని కలవడనికి కన్నా ముందు అతడిదగ్గరకొచ్చి అతడి కోరిక తీర్చి వెళ్తానని, తనన్ని వదిలిపెట్టమని అడుగుతుంది. కొన్నాళ్ళకు ఆమెకి వివాహమయ్యాక మొదటిరాత్రి తనని సమీపించిన భర్తతో చెప్పలేక చెప్పలేక విషయమంతా చెప్తుంది. తాను అన్నమాట నిలబెట్టుకోకపోతే అసత్యదోషం తనని పట్టుకుంటుందనీ, కానీ తన భర్తకి చెప్పకుండా చెయ్యడం అంతకన్నా దోషమనీ చెప్తూ, ఆయన ఏమి చెప్తే అలా నడుచుకుంటానని చెప్తుంది. ఆమె భర్త ఖిన్నుడై, చివరికి తేరుకుని, ఆమెని తన మాట నిలబెట్టుకు రమ్మని పంపిస్తాడు. ఆమె ఆ అర్థరాత్రి ఆ కాముకుడి ఇంటికి బయలుదేరుతుంది. ఆ దారిలో ఒక రాక్షసుడు ఆమెని చూసి పట్టుకుని తినబోతాడు. ఆమె తన కథంతా అతడికి చెప్పి, తానొకరికి ఇచ్చిన మాట చెల్లించుకుని తిరిగి వస్తాననీ, అప్పుడు ఆ రాక్షసుడికి తనని తాను సంతోషంగా ఆహారంగా సమర్పించుకుంటాననీ చెప్తుంది. రాక్షసుడు ఆ మాట నమ్మడు. కానీ ఆమె అతణ్ణి ఒప్పించి వెళ్తుంది. ఆ రాత్రి ఆ పూర్వమిత్రుడి ఇంటికి వెళ్ళి ఆమె తన మాట చెల్లించుకోడానికి వచ్చానని చెప్పినప్పుడు అతడు నిశ్చేష్టుడైపోతాడు. ఆమెని సహోదరీ అని పిలుస్తాడు. ఆమెని క్షేమంగా తిరిగి తన భర్త దగ్గరికి వెళ్ళిపొమ్మని ప్రార్థిస్తాడు. ఆమె తిరిగి బయలుదేరి మార్గమధ్యంలో ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి తనని ఆహారంగా స్వీకరించమంటుంది. ఆమె సత్యసంధత చూసి ఆ రాక్షసుడిలో కూడా పరివర్తన వస్తుంది.

ఈ కథని అనంతుడు నిర్వహించిన తీరు అద్భుతం. ఆ పద్యాలు, ఆ పాత్ర చిత్రణ, ఆ కథాకథన చాతుర్యం నిజంగా అమోఘం. ఒక్క ఉదాహరణ. తన భర్తకి తన విషయం చెప్పాలా వద్దా అని ఆ నవవధువు సతమతమవుతున్న దృశ్యం:

~

చెప్పగ చూచి సిగ్గుపడు, చెప్పగ, చెప్పకయున్న తీర దే

చెప్పెద కాక యంచు తెగి చెప్పదలంచు, నిదేమి మాటగా

చెప్పుదు, చెప్పినం పతియు, చిత్తమునం కలుషించునో, పరుల్

చెప్పెదు వార్త కాదనుచు చెప్పగ పూనును, చెప్ప కాదనున్

~

అసలు తెలుగు సాహిత్యంలో పదిహేనో శతాబ్ది కవులందరిదీ ఒక ప్రత్యేకమైన అధ్యాయం. పిల్లలమర్రి పినవీరన, శ్రీనాథుడు, పోతన, అన్నమయ్య- ఈ నలుగురూ పదిహేనో శతాబ్ది పొడుగునా శృంగార, వైరాగ్యాల మధ్య నలిగిపోయారు. ఇందులో పినవీరన స్పష్టంగా శృంగార మార్గాన్ని పట్టగా, పోతన శృంగారం నుంచి వైరాగ్యానికి ప్రయాణించాడు. అన్నమయ్య శృంగారవైరాగ్యాలు రెండింటినీ శ్రీవెంకటేశ్వరుడికే సమర్పించేసాడు. కాని ఒక్క శ్రీనాథుడు మాత్రమే జీవితమంతా రక్తికీ, ముక్తికీ మధ్య డోలాయమానంగా ఊగిసలాడుతూనే ఉన్నాడు. ఈ కవులు అర్థమయితేగాని, పదహారో శతాబ్దపు ప్రబంధ కవులు మనకి బోధపడరు.

ఆ మహాకవుల మధ్య అనంతామాత్యుడు తన అహోబిల నరసింహుణ్ణి నమ్ముకుని సత్యవాక్యమొక్కటే మనుషుల్ని ఈ సంసారం నుంచి బయటపడవెయ్యగలదని భావిస్తూ కథల్ని కావ్యంగా మలుచుకుంటూ ఉన్నాడు.

అంతేకాదు, ఆ దేవుడు కవిగా తనని అమరుణ్ణి చేస్తాడని ఎంత బలంగా నమ్మి ఉండకపోతే, ఇంత బలంగా చెప్పుకుంటాడు!

~

అఖిల జగత్సేవ్యమై భూమిపై అహో

బలము తా నెందాక వెలయుచుండు

ఆ తీర్థమందు ప్రఖ్యాతమై భవనాశ

నీ నది ఎందాక నెగడుచుండు

ఆ మహానది పొంత అత్యంత పూజ్యమై

గరుడాద్రి ఎందాక కదలకుండు

అయ్యది శిఖరంబునందును ఎందాక

శ్రీ నృసింహ స్వామి స్థిరతనుండు

అస్మదీయ కృతియు అందాక సంతత

శ్రావ్యమై సమస్త సభలయందు

విస్తరిల్లు గాత, వివిధ కథా నూత్న

రత్నభూషణాభిరామ మగుచు.

~

ఈ సారి శ్రీకాకుళ సందర్శనం నిజంగా మరవలేనిది. అది మహనీయుడైన మరొక తెలుగు పూర్వకవిని నాకు ఎరుకపరిచింది.

26-7-2020

Leave a Reply

%d bloggers like this: