
మరోసారి ఇల్లు మారాను. ఇంతకు ముందు ఇట్లానే ఇల్లు మారినప్పుడు భారతీయ రచయితల్లో ప్రేమ్ చంద్ తర్వాత ఎక్కువ సార్లు ఇల్లు మారింది నేనే అన్నాడు కవితాప్రసాద్. ఆయన ఆ మాట అన్న తరువాత కూడా నేను మరో నాలుగు ఇళ్ళు మారాను.
ఇన్నాళ్ళూ విజయవాడ నగరమధ్యంలో ఉన్నవాణ్ణి ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో దాదాపుగా ఊరి చివరకు చేరుకున్నాను. ఇంటి వెనక పొలాలు, దూరంగా కొండలు. నా చిన్నప్పటి తాడికొండలాగా. ఈ ఇల్లు కృష్ణశాస్త్రికి బాగా నచ్చుతుందనుకుంటాను. ఎందుకంటే, ఇక్కడ వీచే ప్రతిగాలీ పైరగాలినే.
ఎన్ని ఇళ్ళు, ఎన్ని స్థలాలు, ఎన్ని పట్టణాలు! ‘నావి కాని ఇళ్ళల్లో నాకు స్థానం కల్పించావు ‘ అన్నాడు కవి సర్వేశ్వరుడితో. ఆయన ఆ మాట విశాలార్థంలో అన్నాడు కానీ వాచ్యార్ధంలో కూడా ఆ మాట నాకు వర్తిస్తుంది. ‘నువ్వు పని చేసి వెళ్ళిన ప్రతి చోటా నీ ఆత్మని కొంత వదిలిపెట్టివెళ్తావు’ అన్నాడు జిబ్రాన్. నేను నివసించిన ప్రతి చోటా నా హృదయం కొంత వదిలిపెట్టే వస్తున్నాను. కొన్నిసార్లు పూర్తిగా వదిలిపెట్టినచోట్లు కూడా ఉన్నాయి. నిజానికి నేను పుట్టిన ఊరు ఎప్పుడు వదిలిపెట్టానో అప్పుడే అక్కడే నా హృదయాన్ని పూర్తిగా వదిలిపెట్టేసాను. కాని, ఆశ్చర్యం, నాది కాదనుకుంటూనే అడుగుపెట్టిన ప్రతి తావులోనూ కూడా నా హృదయం మళ్ళీ మళ్ళీ చివురు తొడుగుతూనే ఉంది. ‘నూరు సార్లు కొల్లగొట్టినా దిల్లీలాగా నా దిల్ కూడా మళ్ళీ మళ్ళీ ప్రేమించడం మానదు’ అన్నాడు కవిగాంధర్వుడు మీర్.
‘ప్రతి సాయంకాలం గోధూళి వేళ ఇంటి బాట పట్టే నీలోనే సొంత ఇల్లూ, సొంత ఊరూ లేని దేశదిమ్మరి కూడా ఉన్నాడు’ అన్నాడు జిబ్రాన్. దిమ్మరిలాగా ఊరినుంచి ఊరికి తిరుగుతున్న నాలో జీవితకాలం పాటు ఏదో ఒక ఇంటిపట్టుకి అంకితమైపోవాలనుకునే పూర్వకాలపు గ్రామీణుడు కూడా బలంగా ఉన్నాడు. బహుశా ఏదో ఒకనాటికి అట్లాంటి ఒక చెట్టునీడ మట్టి ఇంటి అరుగులమీదకు చేరుకుంటానన్న నమ్మకమే నాకీ ఇళ్ళూ, ఊళ్ళూ తిరిగే ఓపికనిస్తున్నట్టుంది.
ఒకప్పుడు ప్రాచీన చీనాలో తావో చిన్ అనే ఒక కవి ఉండేవాడు. అచ్చు మన పోతన లాంటి కవి. ఋషిశ్రేష్టుడు. ఆయన కూడా తక్కిన కవుల్లాగా మొదట్లో ప్రభుత్వోద్యోగం చెయ్యాలనుకున్నాడు. కొన్నాళ్ళు చేసాడు కూడా. కాని ఒకరోజు స్థానిక ప్రభువొకాయన వచ్చినప్పుడు రాజోద్యోగానికి సంబంధించిన దుస్తులు వేసుకోలేదని ఆగ్రహించాడట. ఆ క్షణమే తావోచిన్ ఆ ఉద్యోగం వదిలిపెట్టేసి పొలం దున్నుకోడానికి వెళ్ళిపోయాడు. ఆ పొలాల దగ్గర తన ఇల్లు ఎలా ఉండేదో ఒక కవిత రాసుకున్నాడు:
~
జనావాసాలకు దూరంగా నా కుటీరం కట్టుకున్నాను
బళ్ళు తిరగని చోటది, గుర్రాలు సకిలించని తావు,
అదెట్లా సాధ్యపడిందో తెలుసా నీకు? చూడు,
బెంగటిల్లే ప్రతి గుండె చుట్టూ ఒక సూక్ష్మలోకం.
నేనక్కడ తూర్పువేపు చామంతితోట పెంచుకుంటాను
దూరంగా వేసవి కొండల్ని తదేకంగా పరికిస్తుంటాను.
పొద్దున్నా, సాయంకాలం కొత్తగా వీచే కొండగాలి
జంటలు జంటలుగా గూటిదారి పట్టిన పక్షులు.
ఈ దృశ్యాల్లోనే ఏదో లోతైన అర్థం స్ఫురిస్తుంటుంది
తీరా చెప్పాలని చూస్తే మాటలు మూగబోతాయి.
~
ఇరవయ్యేళ్ళప్పుడు రాజమండ్రిలో ఉండగా తొలిసారి ఈ కవిత చదివాను. దాన్ని అనువదించి నా తొలికవితాసంపుటంలో చేర్చుకున్నాను. మా ఊళ్ళో నా తండ్రి నివసించిన ఇల్లు అచ్చం అట్లాంటిదే. ఆయన ఆ ఊరికి గ్రామాధికారిగా పనిచేసాడు. ఇన్నాళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన తావో చిన్ లానే జీవించారని అర్థమవుతోంది, ఒక్క పొలం దున్నలేదు తప్ప, తక్కినదంతా ఒక రైతు జీవితమే, ఇంకా చెప్పాలంటే ఒక ఆదివాసిలాగా జీవించాడాయన. మా ఇంటి ముంగిట్లో ఒక పందిరి, దాని మీద రాధామనోహరం తీగ. ఇంటిచుట్టూ వెదురు కంచె. ఆ కంచె మీంచి చూస్తే చేతికందే దూరంలో కొండలు. ప్రతి వసంతకాలంలోనూ ఆ కొండలమీద కోకిల.
తన ఉద్యోగం వదిలిపెట్టి ఒక రైతుగా బతకడం మొదలుపెట్టాక తన స్వతంత్రం ఎంత మధురంగా ఉండేదో తావో చిన్ మరొక కవితలో చెప్పుకున్నాడు:
~
నా చిన్నప్పుడు నేను మందలో కలవలేకపోయేవాణ్ణి
నామనసెంతసేపూ కొండలచుట్టూ తిరుగుతుండేది.
ఏదో అయిష్టంగానే నేనీ దుమ్ములోకి వచ్చిపడ్డాను
ముప్పై ఏళ్ళదాకా బయటపడలేకపోయాను.
వలసపోయిన పిట్ట తన అడవికోసమే తపిస్తూంటుంది
చెరువులో చేప తన చిన్నగుంటనే తలుచుకుంటుంది.
నా దిమ్మరి బతుకు వదిలి నేనో మడిచెక్క పట్టుకున్నాను.
పల్లెటూరిబైతులాగా ఒక చేనూ, తోటా పెంచుకున్నాను.
నాకున్న పొలం మొత్తం పదెకరాలు మించదు, గడ్డి
కుటీరం నా ఇల్లు, అందులో ఉన్నవల్లా ఏడెనిమిది గదులు.
కంచెమీద కాశీరత్నం, చూరుమీంచి పాకుతూ గుమ్మడితీగె.
ఇంటిముంగిట నిమ్మచెట్లు, మామిడిచెట్లు, కొబ్బరిచెట్లు.
దూరంగా మినుకుమినుకుమంటూ జనావాసాలు.
సగం నిర్జనమైన ఆ పల్లెమీద అల్లుకున్న వంటపొగ.
ఎక్కడో ఏ వీథిలోనో ఒంటరిగా మొరుగుతున్న కుక్క.
మల్బరీ చెట్టు కొమ్మల మీద కావుకావుమంటుంది కాకి.
వీథి గుమ్మందగ్గర, ముంగిట్లో వినిపించని లోకం చప్పుడు.
లోపల ఖాళీ గదుల్లో అపారమైన తీరిక, నిశ్చలనిశ్శబ్దం.
బతుకు పంజరం ఊచలు లెక్కపెట్టినంతకాలం లెక్కపెట్టి
ఇప్పటికి నేను ప్రకృతి ఒడి చేరాను, స్వతంత్రుణ్ణయ్యాను.
~
మా చిన్నప్పటి ఇల్లు కూడా ఇట్లాంటిదే గాని, మా నాన్నగారు మమ్మల్ని ఆ ఊరు వదిలిపెట్టి ప్రపంచంలోకి తరిమేసేదాకా విశ్రమించలేదు. ఆ ఊళ్ళో మా భవిష్యత్తు లేదనీ, మేము విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టి మా కాళ్ళమీద మేము నిలబడాలనీ ఆయన అహోరాత్రాలు పరిశ్రమిస్తూనే ఉండేవారు. పరితపిస్తూనే ఉండేవారు. ఇన్నాళ్ళ తరువాత, ఇప్పుడు ఆలోచిస్తూంటే అనిపిస్తూంది, ఒకవేళ నా జీవితం ఇన్నేళ్ళుగానూ అక్కడే గడిచిఉంటే ఎలా ఉండిఉండేది? నేను చూసిన తావులు, చదువుకున్న చదువులు, కలుసుకున్న మనుషులు, చేపట్టిన ప్రయత్నాలు ఏవీ లేకుండా, అక్కడే ఉండిపోయుంటే ఎలా ఉండి ఉండేవాణ్ణి?
చిన్న ప్రభుత్వోద్యోగంలో చిన్నపాటి బాధ్యతను కూడా నిర్బంధంగా భావించి ఆ ఉద్యోగానికే స్వస్తి చెప్పి రైతుగా మారిపోయిన తావోచిన్ పుట్టిన దేశంలోనే దు-ఫు అనే మరొక కవి పుట్టాడు. తన కాలం నాటి రాజుల కోసం, వాళ్లుచేపట్టిన యుద్ధాలకోసం, ఆ యుద్ధాలు నిష్ఫలం, నిరర్థకం అని తెలిసి కూడా, జీవితమంతా యుద్ధక్షేత్రాల్లోనే గడిపిన వాడు దు-ఫు. తన మీద వచ్చిపడ్డ బాధ్యత నిర్వహించడం కోసం తన చల్లని ఇంటినీ, వెచ్చని నెగడునీ వదులుకుని తనవి కాని సరిహద్దుల్లోనే జీవితమంతా గడిపాడతడు. చివరికి, తన చివరిరోజుల్లో, తన స్వగ్రామంలో గడపాలనుకుని బయలుదేరి తన ఊరికి చేరుకోకుండానే సగందారిలోనే ఈ లోకం వదిలిపెట్టాడు. అతడు తావో చిన్ గురించి ఏమనుకుని ఉంటాడు? ఆశ్చర్యంగా, అతడు తావో చిన్ మీద రాసిన కవిత ఒకటి నా కంటపడింది. అతడిట్లా రాస్తున్నాడు:
~
సాటిమనుషులకు దూరంగా బతికాడు తావోచిన్
అతడెందుకో దారితప్పాడనే అనిపిస్తుంది నాకు
అతడు రాసిన కవిత్వమంతా చదివాక నాకనిపించిదిదే
సారహీన జీవితాన్ని అతడు ప్రేమించలేకపోయాడనే.
చాలినంత సమకూరినంతమాత్రాన ఆ జీవితం
పరిపూర్ణమని ఎట్లా అనగలవు నువ్వు?..
~
దు-ఫు తావోచిన్ ని విమర్శించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రాచీన చీనాలో రెండు తాత్త్విక దృక్పథాలకు ప్రతినిధులు. తావో చిన్ తావోయిస్టు. దు-ఫు కన్ ఫ్యూషియన్. తావోచిన్ దారి తప్పాడని దు-ఫు అనడంలో శ్లేష అదే. తావో అంటే దారి. తావోయిస్టుగా ఒక దారి వెతుక్కుంటూ, ఆ క్రమంలో మనుషులకి దూరంగా జరగడంతో, తావోచిన్ దారి తప్పాడు అంటున్నాడు దు-ఫు.
జీవితమంతా ఒక ఇంటికీ, ఆ ఇంటిముందు చింతచెట్టునీడకీ, నిశ్చింతగా అంటిపెట్టుకోవడమనే ఊహలో గొప్ప పారవశ్యం లేకపోలేదుగానీ, అది మటుకే మన జీవితాన్ని పరిపూర్ణం చేస్తుందనుకోలేం. నీవి కాని తావుల్లో, నీవి కాని దారుల్లో సంచరించక తప్పని సవాళ్ళు జీవితంలో అడుగడుగునా ఎదురుకాకపోతే, నీవాళ్ళు కానివాళ్ళతో రోజులకి రోజులు గడుస్తూ, నెమ్మదిగా, వాళ్ళల్లోనే నీ వాళ్ళని చూసుకునే విద్య ఒకటి నువ్వునేర్వడం మొదలుపెట్టకపోతే జీవితానికి ప్రయోజనమేముంది?
అందుకనే ఆ చిన్నప్పుడు తావో చిన్ కవిత నన్నెంతగా ఆకట్టుకుందో, ఇలియట్ రాసిన ఈ కవిత కూడా అంతే ఆకట్టుకుంది.
~
ఆఫ్రికాలో అసువులు బాసిన భారతీయుల కోసం
ఏ మనిషికైనా చేరవలసిన చోటు అతడి స్వగ్రామమే
ఆ ఇంటి ముంగట వెచ్చటి నెగడు, భార్యవండిపెట్టే వంట
సంజెవేళ తన ఇంటిగుమ్మం దగ్గర కూచుని
తన మనవడూ, పక్కింటివాళ్ళ మనవడూ
కలిసి దుమ్ములో ఆడుకుంటూ ఉంటే చూడటం.
ఒకింత భయం కలిగించేవేగాని భద్రప్రదాలు
ఏవో పూర్వజ్ఞాపకాలు మాటల్లో మెదులుతాయి
(అవి వెచ్చనివా చల్లనివా ఆ వాతావరణాన్ని బట్టి)
తమవి కాని దేశాల్లో, తమవారు కానివారితో
ఒకరితో ఒకరు పోరాడుకున్న అపరిచితుల గురించి.
ఒక మనిషి చేరుకున్నచోటే అతడి గమ్యమని చెప్పలేం
ప్రతి ఒక్క దేశం ఒకరికి స్వదేశం, మరొకరికి
ప్రవాసం. ఎక్కడ మనిషి ధైర్యంగా పోరాడుతూ మరణిస్తాడో
అదే అతడి గమ్యస్థానం, ఆ నేల అతనిదే.
ఇక అతణ్ణి తలుచుకోవడం అతడి స్వగ్రామం పని.
ఈ నేల నీదీ కాదు, మాదీ కాదు, ఇక్కడ గానీ
లేదా పంచనదుల మధ్యగానీ, స్మశానమెక్కడేనా ఒకటే
ఇక్కణ్ణుంచి తిరిగి నీ ఊరికి పోగలిగినవారు
అక్కడ నీ కథచెప్పుకుంటారు,
ఏదో ఒక ఉమ్మడి ధ్యేయం కోసం
మీరు కలిసి పోరాడేరని చెప్పుకుంటారు
ఆ పోరాటం మంచికా చెడ్డకా అన్నది
అంతిమ తీర్పుదినందాకా
నీకూ, మాకూ కూడా తెలియకపోయినప్పటికీ.
2-9-2020