మన బడి నాడు నేడు

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన బడి నాడు నేడు’ కార్యక్రమం ఎలా అమలు జరుగుతున్నదో చూద్దామని మొన్న నాలుగురోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించి వచ్చాను. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, గార, జలుమూరు, సరుబుజ్జిలి, నరసన్నపేట, హీరమండలం మండలాల్లోనూ, విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, గరివిడి, విజయనగరం, బొండపల్లి, గజపతినగరం మండలాల్లోనూ, విశాఖపట్టణం జిల్లాలో ఆనందపురం, సబ్బవరం, చోడవరం, వడ్డాదిమాడుగుల, మునగపాక, ఎస్.రాయవరం, పాయకరావు పేట మండలాల్లోనూ దాదాపు ఇరవై అయిదు పాఠశాలలదాకా సందర్శించాను. అక్కడ తల్లిదండ్రులతో మాట్లాడాను. అక్కడ జరుగుతున్న పనులు ప్రతి ఒక్కటీ శ్రద్ధగా చూసాను.

ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల విద్య ప్రభుత్వ పాఠశాలలనుంచి ప్రైవేటు పాఠశాలల చేతుల్లోకి పోవడానికి ఒక ప్రధాన కారణం ప్రభుత్వ పాఠశాలల వాతావరణం. అరకొర వసతులు, కూలిపోయే భవనాలు, కనీస వసతులు లేకపోవడం, నల్లబల్లలు, ఫాన్లు, లైట్లు కూడా లేకపోవడం కూడా ఒక ముఖ్యకారణం. ఈ పరిస్థితులనుంచి ప్రభుత్వ పాఠశాలల్ని బయటకు తీసి, వాటిలో సమూల పరివర్తన తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ‘మనబడి నాడు నేడు ‘ కూడా ఒకటి.

ఈ కార్యక్రమంలో ముందుగా రాష్ట్రంలో ఉన్న పాఠశాలల స్థితిగతులన్నింటినీ ‘నాడు ‘కింద రికార్డు చేసాం. పోయిన ఆగష్టులో మొత్తం 45000 పాఠశాలల పరిస్థితుల్నీ పట్టిచ్చే విధంగా దాదాపు ముప్పై లక్షల ఫొటోలు తీసి ఆన్ లైన్ లో పొందుపరిచాం. అప్పుడు ఆ పాఠశాలల రూపురేఖలు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తం పాఠశాలల్ని మూడేళ్ళ కాలవ్యవధిలో అభివృద్ధి చేయడం కోసం ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అందులో భాగంగా మొదటి సంవత్సరానికిగాను 15,715 పాఠశాలల్ని ఎంపిక చేసాం. దాదాపుగా ప్రతి గ్రామపంచాయితీకీ ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్ని ఎంపికచేసాక ప్రతి పాఠశాలలోనూ తొమ్మిది కనీస సౌకర్యాలు కల్పించడానికి అంచనాలు రూపొందించడం జరిగింది. అవి మంచినీటి సరఫరా, బాలబాలికలకి టాయిలెట్లు, ప్రహరీగోడ, ఫాన్లు, లైట్లు, విద్యుదీకరణ, గ్రీన్ చాక్ బోర్డులు, ఫర్నిచరు, ఇంగ్లీషు లాబ్, పెయింటింగ్సూ, ఫినిషింగ్సూ. వీటితో పాటు పదవ అంశంగా కిచెన్ షెడ్డు కూడా కల్పించాలని ఈ మధ్యే నిర్ణయించడం జరిగింది.

మామూలుగా పాఠశాలకు కట్టే భవనాలు, కల్పించే సదుపాయాలు నాసిరకంగా ఉండటానికి కారణం ఆ పనులు కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టడమే. కాని, ఇంత ప్రతిష్టాత్మకంగా, ఇంత పెద్ద ఎత్తున, ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా తల్లిదండ్రుల ద్వారానే చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను పోయిన ఆగష్టులోనే తల్లిదండ్రుల కమిటీలకి ఎన్నికలు జరిపించాం. అప్పటికి మూడేళ్ళుగా పాఠశాలలు పాతకమిటీలతోనే నడుస్తున్నాయి. కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పేరిట దళారులు లేకుండా నేరుగా తల్లిదండ్రులే ఇలా పాఠశాల పనులు చేపట్టడం అనేది భారతదేశంలోనే ఇది మొదటిసారి. ఇంత పెద్ద ఎత్తున చేపట్టడం బహుశా ప్రపంచంలోనే మొదటిసారి కావచ్చు.

ప్రతి పాఠశాలకీ ఒక తల్లిదండ్రుల కమిటీ ఉంటుంది. దానికి ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్ గా ఉంటాడు. ప్రభుత్వం ఆ కమిటీకి పనులు చేపట్టడం కోసం అంచనా వ్యయంలో ముందే ఏడున్నర శాతం నిధులు అడ్వాన్సుగా విడుదలచేసింది. ఆ పనులకి కావలసిన సామగ్రి తల్లిదండ్రుల కమిటీయే కొనుగోలు చేసుకుంటుంది. కూలివాళ్ళని, మేస్త్రీలనీ, ప్లంబర్లనీ, ఎలెక్ట్రీషియన్లనీ కమిటీయే మాట్లాడుకుని పనిలో పెట్టుకుంటుంది. ఏ పనికి ఎటువంటి సామగ్రి వాడాలో, ఎటువంటి బ్రాండెడ్ ఐటంస్ కొనాలో స్పష్టంగా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక పనులు జరుగుతూండగా ఎప్పటికప్పుడు అవసరమైన నిధుల్ని వారం వారం ప్రభుత్వం తల్లిదండ్రుల కమిటీలకి విడుదల చేస్తున్నది. ఇక ఫాన్లు, గ్రీన్ చాక్ బోర్డులు, ఫర్నిచరూ, పెయింటింగులూ మొత్తం రాష్ట్రస్థాయిలోనే టెండర్లు పిలిచి అత్యంత నాణ్యమైన సామగ్రిని రివర్సు టెండరింగ్ పద్ధతిలో వీలైనంత సరసమైన ధరలకి నిర్ణయించడం జరిగింది.

ఇలాంటి పనులు తల్లిదండ్రుల కమిటీల ద్వారా చేయించడమనేది ప్రతి ఒక్కరికీ కొత్త అనుభవం. ఈలోగా కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని చుట్టుముట్టింది. ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు ముందుకు తీసుకుపోలేరనీ, కాంట్రాక్టర్లను రంగంలోకి దింపక తప్పదనీ సలహాలు బిగ్గరగానే వినిపించడం మొదలుపెట్టాయి. కాని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారి సంకల్పం అజేయం. ఆయన ఈ పథకాన్ని విద్యాశాఖ ఎలా ప్రణాళిక చేసిందో అలానే అమలు జరగాలనీ, నాణ్యతలో ఎక్కడా రాజీపడవద్దనీ, ఎవరి ఒత్తిడీ ఉండదనీ అడుగడుగునా నిలబడి వెన్నుతట్టి ప్రోత్సహిస్తూనే ఉన్నందువల్ల పాఠశాల విద్యలో ఒక నవశకం మొదలయ్యిందని చెప్పవచ్చు.

మొన్న నాలుగు రోజులూ అన్ని పాఠశాలల్లో అమలు జరుగుతున్న పనుల్ని దగ్గర్నుంచి చూసాక ముఖ్యమంత్రిగారికీ, రాష్ట్రప్రభుత్వానికీ తల్లిదండ్రుల, పిల్లల ఆశీస్సులు పుష్కళంగా ఉంటాయనిపించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఢిల్లీలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల గురించి మాట్లాడుతున్నారు, కాని రేపటినుంచీ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన సంస్కరణల గురించి ప్రపంచం మాట్లాడబోతున్నది.

పాఠశాలల్లో ‘నాడు నేడు ‘అమలవుతున్న తీరు నిజంగానే ఒక నిశ్శబ్ద విప్లవం. శ్రీకాకుళం జిల్లాలో పనులు జరుగుతున్న ప్రతి పాఠశాలలోనూ గ్రానైట్ ఫ్లోరింగు, గాజు అద్ద్దాల స్లైండింగ్ కిటికీ తలుపులూ, బాత్రూముల్లో జాన్సన్, కజారియా టైల్సూ, జాగ్వార్ కుళాయిలూ-అవన్నీ తల్లిదండ్రులే స్వయంగా మాట్లాడుకుని, తక్కువ ధరకి బేరమాడుకుని, దగ్గరుండి పనులు చేయించుకుంటున్నారంటే నమ్మడం కష్టం. చూస్తే తప్ప అర్థం కాని అద్భుతమిది. ఈ మొత్తం పనులన్నీ ఆన్లైన్ ద్వరా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేపట్టడం జరుగుతున్నది. ఇందులో నిధులు విడుదల, ఖర్చు, పర్యవేక్షణ ప్రతి ఒక్కటి రియల్ టైం లో End-to-end online monitoring జరుగుతున్నది.

నేను చూసిన ప్రతి ఒక్క పాఠశాల గురించీ, అక్కడ నాడు నేడు పనులు ఎలా జరుగుతున్నాయో, ఆ పనులు ఆ తల్లిదండ్రుల్లో ఎంత సంతోషాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ నింపాయో చెప్పాలని ఉంది. కాని, ఒక్క పాఠశాల గురించి మాత్రం చెప్తాను. విశాఖపట్టణం జిల్లాలో మునగపాకలో ఉన్న ప్రభుత్వ ఆదర్శ ప్రాథమిక పాఠశాల మొన్నటిదాకా ఒక అనాథ. నూటయాభై మంది విద్యార్థులు ఉండవలసిన పాఠశాలలో పిల్లలు 94 మంది మాత్రమే మిగిలారు. దాన్ని జిల్లావిద్యాశాఖాధికారి దత్తతతీసుకుని నాడు నేడు కింద ఒక డెమో స్కూలుగా పనులు చేపట్టాడు. ఇప్పుడు ఆ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. మొన్న ఆ స్కూల్లో అడుగుపెట్టినప్పుడు ప్రధానోపాధ్యాయిని ఒక పెద్ద కట్ట చూపించింది. ఏమిటని అడిగితే మూడువందల మంది పిల్లలు అడ్మిషన్లకోసం అప్లికేషన్లు పెట్టుకున్నారని చెప్పింది. రోజూ తల్లులు తమ పిల్లల్ని తీసుకుని ఆ పాఠశాల ప్రాంగణంలో అడుగుపెట్టి ఆ గోడలమీద గీసిన రంగు రంగు బొమ్మల దగ్గర నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారని చెప్పిందామె.

ప్రభుత్వ సర్వీసులో చేరి ఇది నాకు 34 వ సంవత్సరం. ప్రాథమిక పాఠశాలల గురించి ఇంతగా ఆలోచించి, ఇంతగా ఆవేదన చెంది, ఇంతగా తపిస్తున్న ముఖ్యమంత్రిని నేనిప్పటిదాకా చూడలేదు. పాఠశాల గోడలమీద ఎటువంటి బొమ్మలు వేయించాలన్నదానిమీదనే ఆయన కనీసం నాలుగుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసారంటే అర్థం చేసుకోవచ్చు. ‘నాకు కావలసింది ఒక్కటే, ఆ పాఠశాలలో తల్లులూ, పిల్లలూ అడుగుపెట్టినప్పుడు వాళ్ళకి అక్కడ పండగ కళ కనిపించాలి’ అన్నారాయన! ఈ కార్యక్రమం పూర్తిగా ఆయన ఆలోచన. ఆయన కన్న కల. ఆయన సంకల్పం. ఆయన కోరుకుంటున్న శుభాకాంక్ష.

ఎందరో అనుమానించినా, నిరుత్సాహ పరిచినా, ఈ కార్యక్రమం ఆగకుండా పురోగమించడానికి విద్యాశాఖ అమాత్యులు డా. సురేష్ గారితో పాటు ప్రధానంగా ఇద్దరు అధికారులు కూడా కారణమని చెప్పాలి. ఒకరు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి డా. రాజశేఖర్. ప్రజలభాగస్వామ్యంలో,ముఖ్యంగా బీదప్రజల భాగస్వామ్యంలో ఆయనకి ఉన్న నమ్మకం ఒక భక్తుడికి భగవంతుడి పట్ల ఉండే నమ్మకంలాంటిది. అచంచలమైన ఆయన ఆత్మవిశ్వాసాన్ని దగ్గరగా చూడటం నాకొక అనుభవం. మరొకరు ఈ కార్యక్రమానికి సలహాదారుగా పనిచేస్తున్న మురళి. ఆయన వృత్తిరీత్యా ఇంజనీరు. ప్రజల భాగస్వామ్యంతో ఆయన అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయనకి అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చాయి. ఆయన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి ఎంపిక కావడమే కాకుండా, తెలంగాణాలో భూపాల్ పల్లి జిల్లా కలెక్టరుగా కూడా గొప్ప సేవలు అందించారు. కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ వ్యూహ రూపకల్పనలోనూ, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సూచనలివ్వడంలోనూ, జిల్లాయంత్రాగానికి మార్గదర్శకత్వం చెయ్యడంలోనూ ఆయన కృషి అంతా ఇంతా కాదు. ఇక వివిధ శాఖల ఇంజనీర్లు, జిల్లా కలెక్టర్లు, జిల్లా జాయింట్ కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి సిబ్బంది- కొన్ని వేలమంది ఈ యజ్ఞంలో అనుక్షణం, అహర్నిశం భాగస్వాములుగా పనిచేస్తున్నారు.

ఈ బృహద్యజ్ఞంలో పాఠశాల విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్షా సిబ్బంది, ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు నిర్వహిస్తున్న పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. విశాఖపట్టణం జిల్లాలో ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడి తల్లిదండ్రులు తమ ప్రధానోపాధ్యాయుడు గత మూడు నాలుగు నెలలుగా తినీ తినకా పాఠశాలలోనే ఉంటూ, అక్కడే ఒక పంచన నిద్రపోతూ, పనులు చూసుకుంటున్నాడని చెప్పారు. అతడు తనకొక సొంత ఇల్లు కట్టుకోగలనని ఎన్నడూ అనుకోలేదనీ, అది చాలా పెద్ద పని అనీ, తనకి చాతకాదనీ అనుకున్నాడనీ, కాని ఇప్పుడు దాదాపు నలభై లక్షల విలువైన పనులు తానే దగ్గరుండి చేయించాడనీ కూడా చెప్పారు వాళ్ళు. ఈ మాటలు దాదాపుగా ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడికీ వర్తించేవే.

పాఠశాలలు అంతిమంగా తల్లిదండ్రులవి. అవి ప్రభుత్వానివి కావు. పాఠశాలని తల్లిదండ్రులు తమ స్వంతంగా భావించేట్టు చేసే క్రమంలో నాడు నేడు ఒక entry-point activity మాత్రమే. రేపు ఆ బడుల్లో పిల్లలకి ఏమి చదువు చెప్తున్నారు, ఏమి చదువు చెప్పాలి, తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారో చూసుకునేదాకా తల్లిదండ్రుల భాగస్వామ్యం విస్తరించాలి. ఆ కల సాకారమయ్యే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయనే అనిపిస్తున్నది.

1-8-2020

Leave a Reply

%d bloggers like this: