బాదల్ దేఖ్ ఝరీ

కట్టలు కట్టలుగా ఉత్తరాలూ, ఇ-ఆఫీసులో గుట్టలుగా పోగు పడుతున్న ఫైళ్ళు, నిర్విరామంగా సమావేశాలు, ఒక్క నిద్రపోయే సమయం మాత్రమే నాదని చెప్పుకోదగ్గ జీవితంలో ఎక్కడో లోపలనుంచి ‘బాదల్ దేఖ్ ఝరీ శామ్ మైన్ బాదల్ దేఖ్ ఝరీ’ అంటో ఒక వాక్యం నన్ను వెంటాడుతూనే ఉంటుంది.

ఈ ప్రపంచమంతా ఒక ఎత్తూ, ఆ మేఘమండలమొక్కటీ ఒక ఎత్తు. రూమీ రాసుకున్నాడని నేను రాసుకున్న వాక్యమొకటి ఇవాళ పొద్దున్నే నా కంటపడింది. ప్రతి సాధకుడి జీవితంలోనూ ఒక దశ వస్తుందట. ఆయన మాత్రమే ఉన్నాడు, నేను లేననే దశ. కాని నాకింకా, ప్రపంచమూ ఉంది, మేఘమూ ఉంది. ప్రపంచం అదృశ్యమై మేఘం మాత్రమే మిగిలే రోజెన్నడో!

ఇన్నేళ్ళ నా జీవిత ప్రయాణంలో ఎందరినో నేను రోల్ మోడల్స్ గా భావించాను. నా తండ్రిని, అన్నయ్యని, అక్కని, ఉపాధ్యాయుల్ని, ఉత్తమ అధికారుల్ని, కవుల్ని, రచయితల్ని. మేఘాన్ని చూడగానే శ్యామసుందరుడే తలపుకొచ్చే మీరా ని, ఇప్పుడు నా రోల్ మోడల్ గా సంభావించుకుంటున్నాను. ఇలా సంభావించుకోగల బుద్ధి పుట్టినందుకు నన్ను నేను మనసారా అభినందించుకుంటున్నాను.

ఆమెని ఎవరు రోల్ మోడల్ గా తీసుకున్నా వారు కూడా రోల్ మోడల్స్ గా మారిపోతారు. కబీరే కదా అన్నాడు: గురువుకీ, అయస్కాంతానికీ తేడా ఏమిటంటే, అయస్కాంతం ఇనపముక్కని ఆకర్షించగలదు, కాని మరొక అయస్కాంతంగా మార్చలేదు, గురువుట్లా కాదు, తన ని అనుసరించిన ప్రతి ఒక్కణ్ణీ కూడా తనతో సమానంగా మార్చగలడు అని.

ఇదిగో, నా ముందు, సంజీవనీ భెలాండె అనే ఒక గాయిక అనువదించిన Meera and Me (2012) అనే పుస్తకం ఉంది. ఆమె గాయిక, అనువాదకురాలు, హిందుస్తానీ, పాశ్చాత్య సంగీత సంప్రదాయాలూ రెండూ తెలిసిన విదుషి. ఆమె మీరా గీతాలు అనువదించి ఊరుకోలేదు, వాటిని తాను స్వయంగా పాడింది, రాజస్థానీ, ఇంగ్లీషు రెండూను. అందుకని తన అనువాదాల్ని ఆమె songslations అని చెప్పుకుంది.

ఆమె మీరాని వట్టి ఇంగ్లీషులోకి అనువదించలేదు. 21 వ శతాబ్దపు గ్లోబల్ ఇంగ్లీషులోకి అనువదించింది. పదహారో శతాబ్దపు ఒక సాధు కవయిత్రిని ఆమె గిటారు వాయించుకుంటూ తిరిగే ఒక బీట్నిక్కుగా, ఒక బాబ్ డిలాన్ గా, ఒక పాప్ గాయికగా ఊహించింది. ఈ గీతం చూడండి:

బాలా మైన్ బైరాగన్ హుయి హో

జీజీ భేస్ మ్హారా సాహేబ్ రీఝే

సోయీ భేస్ ధరూంగీ హో.

సీల సంతోష ధరున్ ఘట్ భీతర్

సమతా పకడ్ రఖ్యూంగీ హో

జాకో నాం నిరంజన్ కహియే

తాకో ధ్యాన్ ధరూంగీ హో

గురు గ్యాన్ రంగ్ తన్ కపడా

మన్ ముద్రా ఫేరూంగీ హో

ప్రేం ప్రీతస్ హరి గున్ గావూన్

చరనన్ లిపట్ రహూంగీ హో

యా తన్ కీ మైన్ కరు కింగారీ

రసనా రాం రటూంగీ హో

మీరా కే ప్రభు గిరిధర్ నాగర్

సాధా సంగ్ రహూంగీ హో.

ఈ గీతానికి ఆమె అనువాదం చూడండి:

Babes, I’ll be a nun, Oh yeah!

I’ll drape the very yarn spun

Calm and content within

that pleases by Dark one, Oh yeah!

I’ll hold by balance, Oh yeah!

I’ll chant and focus on the name,

Of the Eternal One, Oh yeah!

I’ll paint my body with wisdom,

And etch Him in my person, Oh yeah!

I’ll cling to His feet and hum,

Holy hymns with affection, Oh yeah!

Of my body I’ll make a guitar,

His songs on it I’ll strum, Oh yeah!

O Meera’s Lord of the Mountain

The saints are my companions, Oh yeah!

మొన్న మాటల మధ్యలో అక్క అంటున్నది, కవి పుట్టేది సహృదయుడి మనసులో అని. ఎందరు సహృదయులుంటే ప్రతి కవీ అన్ని సార్లు అంత కొత్తగా పుడతాడు. ఎవరి కవి వారికే. నా మీరా వేరు, రాబర్ట్ బ్లై మీరా వేరు, సంజీవనీ భెలాండె మీరా వేరు. కాని ఏ ఇద్దరు సహృదయులు కలుసుకున్నా వారిద్దరూ తమ తమ మనోభవులైన ఆ కవి స్వరూపాల్ని దగ్గర దగ్గరగా పెట్టుకుని గుర్తుపట్టే ప్రయత్నం చెయ్యకుండా ఉండలేరు. ఆ కవినే, కాని తమకి ఎట్లా అనుభవానికి వస్తున్నదో చెప్పుకోవడంలో, పోల్చుకోవడంలో ఒక అద్వితీయ సంతోషం ఉన్నది. తనకి సాక్షాత్కరిస్తున్న కవిస్వరూపాన్ని ఒక సహృదయుడు నీతో పంచుకుంటున్నప్పుడు ఆ కవి నీకిప్పటిదాకా గోచరిస్తున్న రూపంలో మరింత శోభాయమానంగా కనిపిస్తుంది. కాబట్టే సంత్ రైదాస్ మీరా గురించి చెపూ ఆమెలో ‘బైరాగినోంకా దర్ద్ ఔర్ సుహాగనోంకా రస్ హైఁ మీరా మేఁ ‘(విరాగిణుల వేదన, నవవధువుల రసపిపాస రెండూ ఉన్నాయి మీరాలో ) అని అన్నాడని విన్నప్పుడు, నాకింతదాకా అస్పష్టంగా తెలుస్తున్న మీరా ముఖచిత్రం మరింత స్పష్టపడుతున్నది.

ఒక కవిని అనువాదం చెయ్యడంలో కూడా ఉన్నది ఈ అన్వేషణనే. ప్రతి అనువాదకుడూ మూల కర్తని మనకి మరొక కొత్త కోణంలో పరిచయం చేస్తూనే ఉంటాడు. సంజీవని మీరా సారంగిని గిటారుగా మార్చినట్టే ఆ రాజస్తానీని కూడా పాప్ గాయకుల ఇంగ్లీషుగా మార్చినప్పుడు మీరా మరొక్కసారి ఎంతో energetic గా వినిపిస్తున్నది. ‘మీరా కే ప్రభు గిరిధర నాగర్’ కాస్తా Meera met her Mountain Man అనో, Meera’s is the mighty Milkman అనో, He who held the hill high అనో అని మారగానే, ఇంతదాకా మూసుకుపోయి ఉన్న పదప్రయోగాలకు తలుపులూ, కిటికీలూ తెరిచినట్టు అనిపిస్తుంది. Honey, my guy, my boss, baby లాంటి సంబోధనలు వింటుంటే, జీన్సుపాంటూ, టీషర్టూ వేసుకున్న మీరా ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రాజీనామా కాగితం పడేసి, గిటారు తీగెలు మీటుకుంటూ మెట్లు దిగివస్తూ కనిపిస్తున్నది నాకు.

ఒక్క వాక్యం చాలు, ‘మాయీ మ్హాణో సుపణామాఁ పరణ్యాఁ రే దినానాథ్ ‘- అన్న పల్లవిని Ma, He wed me/In my dream అని ఇంగ్లీషులో చదవగానే ఒక్కసారిగా ఉలిక్కిపడతాం. ఆ ఒక్క వాక్యం మనల్నెక్కడికో తీసుకుపోతుంది. మీరా కవిత్వంలో ‘ముక్తి భావమూ’, ‘ఆనంద భావమూ’, ‘ప్రేమ భావమూ’ మూడూ కలిసే ఉన్నాయని ఆమె చెప్తున్నది. ‘అన్ని రకాల సాంఘిక మర్యాదల్నీ పక్కన పెట్టి మరీ ఆమె తన ప్రియతముణ్ణి పలకరిస్తుంది’ అని అన్నాడట రాబర్ట్ బ్లై. అలా ఒక ప్రేయసి తన ప్రియుణ్ణి పిలుచుకోవడంలో ఉండే భావ, రాగఛాయలన్నీ ఆమె మనకాలపు ఇంగ్లీషులో పలికించడానికి ప్రయత్నించింది.

అలాగని సంజీవని చూసిన మీరా రాజస్తానీని మర్చిపోయిందని అనుకోకూడదు. మీరా ప్రతి పదప్రయోగాన్నీ ఆమె పదహారో శతాబ్ది రాజస్తానీలోనే అర్థం చేసుకుంది. ఆమెకి ‘ఘుంఘ్రూ’ కీ ‘పాయల్’ కీ మధ్య తేడా తెలుసు. ‘బాలా మైన్ బైరాగన్ హుయి హో’ అనే వాక్యంలో బైరాగిణి అంటే, విరక్త అని అర్థం కాదనీ, ప్రేమ కోసం మాత్రమే ప్రపంచపరిత్యక్త నీ ఆమెకి తెలుసు. సరిగ్గా అందువల్లనే ఆమె ఇంగ్లీషులో మీరా హృదయం మరింత కొత్తగానే కాదు, మరింత లోతుగా కూడా కనిపిస్తున్నది.

తన అనువాదానికి రాసుకున్న ముందుమాట ముగిస్తూ ఆమె ఇట్లా రాసుకున్నది: ‘ మోతీ మూంగే ఉతార్, బన మాలా పోయి ‘(ముత్యాలకీ, పగడాలకీ స్వస్తి చెప్పాను, తులసిమాల ధరించాను ) అని మీరా అంటున్నప్పుడు ఆ వాక్యాల్లో నన్ను నేను చూసుకున్నాను. గ్లామర్ ప్రపంచం ఎలా ఉంటుందో నేను చాలా దగ్గరగా చూసాను. నలుగురునీ ఆకట్టుకోవాలని పరితపించే ఆ చూపుల్నీ, ఆ కాస్మొటిక్స్ నీ చూసి చూసి నేను విసుగెత్తిపోయాను. ఎక్కడా రాజీపడని మీరా ధోరణి కి ఆరాధకురాలిగా మారిపోయాను. మనుషుల మధ్య తలెత్తే ప్రేమ తొందర తొందరగా నశించేది మాత్రమే కాదు, అత్యంత స్వార్థంతో కూడుకున్నది కూడా. నిర్మల ప్రేమ కన్నా తక్కువ ప్రేమను దేన్నీ మీరా అంగీకరించలేకపోయింది. అది భగవత్ప్రేమ!- అంత పరిపూర్ణంగా, అంత సంపూర్ణంగా ప్రేమించగల ఆమె సామర్థ్యాన్ని చూసి నేను నిశ్చేష్టురాలినైపోయాను.. ‘గున్ గాన్వా సుఖ్ పాస్యా ‘(గుణగానమొక్కటే సుఖసాధనం)-మీరా ఆత్మని పట్టిచ్చే వాక్యమిది. కంటికి కనిపించని ఒక సంపూర్ణత్వం పట్ల మీరా చూపించిన ఆ పరిపూర్ణ ప్రేమనే నా సుర్ సాధన కి నేను ఆదర్శంగా తీసుకున్నాను.’

తన సుర్ సాధన కి మీరా ని రోల్ మోడల్ గా తీసుకున్న ఒక మనిషి కనిపించాక నా సాధన నేనెట్లా కొనసాగించాలో నాకొక దారి కనబడుతున్నది. మేఘాన్ని చూడగానే మనసు వ్యాకులమయ్యే దశలోనే ఉన్నానింకా. కాని మేఘాన్ని చూడగానే వెక్కి వెక్కి రోదించే స్థితికి చేరుకోవాలని తెలుస్తున్నది నాకిప్పుడు.

3-7-2020

Leave a Reply

%d bloggers like this: