ప్రతిభావంతుడైన రచయిత

రానున్న రోజుల్లో నొబెల్ పురస్కారం పొందనున్న రచయితల్లో విక్రమ్ సేథ్ తప్పకుండా ఉంటాడు. బహుశా టాగోర్ తర్వాత నొబెల్ పురస్కారం పొందబోనున్న భారతీయ రచయిత సేథ్ నే కావొచ్చు. అలాగని సేథ్ ని నేను మహాకవిగానూ, మహారచయితగానూ భావించడం లేదు. కాని విభిన్న ప్రక్రియల్లో సమర్థవంతంగా రచనలు చేసిన ప్రతిభావంతుడైన రచయిత అని మటుకు చెప్పగలను. ముఖ్యంగా ఇంగ్లీషులో సాహిత్య సృజన కొనసాగిస్తున్న సమకాలిక ఇండోఆంగ్లికన్ రచయితల్లో ఆయన మొదటి వరసలో ఉంటాడు.

ఈ మధ్య సేథ్ తొలి రచనల్లో ఒకటైన The Humble Administrator’s Garden (1985) నా చేతుల్లోకి వచ్చింది. అది సేథ్ రెండవ కవితాసంపుటి. ఆయన అందులో రెండు ఖండాల్లో, మూడు దేశాల్లో గడిపిన తన క్షణాల్ని అక్షరబద్ధం చేసాడు. చీనా, భారతదేశం, అమెరికాలలో సంచరించినప్పటి తన జీవనానుభూతిని పదచిత్రాలుగా మల్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆయా దేశాల సాహిత్య సంప్రదాయంలోనే ఆ కవితల్ని కూర్చే ప్రయత్నం చేసాడు. చీనాలో గడిపినప్పటి అనుభవాల్ని Wutong పేరిట, భారతదేశ జ్ఞాపకాల్ని Neem పేరిట, కాలిఫోర్నియాలో సంచరించినప్పటి గుర్తుల్ని Live Oak పేరిట గుదిగుచ్చాడు.

ఉటాంగ్ అంటే చీనాలో ఒక ప్రాంతం. దానికొక పౌరాణికార్థం కూడా లేకపోలేదు. ఆ పేరిట గుదిగుచ్చిన పన్నెండు కవితల్లోనూ అతడు ప్రాచీన చీనా మహాకవుల స్ఫూర్తితో కవితలు కట్టడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఆయన చాలాచోట్ల సఫలుడు కావడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు చీనా కవితాత్మను చూడగలిగాడు.

ఉదాహరణకి ఈ కవిత, పుస్తకంలోని మొదటి కవితనే చూడండి:

ఒకింత రాత్రి సంగీతం

తెల్లటిగోడలు, చంద్రకాంతి, ఏదో

తంత్రీవాద్యం నన్ను దారం కట్టి

లాక్కున్నట్టు ఆ వీథుల్లో తిరుగాడేను.

అక్కడొక ముంగిలి, రెండు కుర్చీలు.

నేనా రాత్రి తన దగ్గరికి వస్తానని

తనకి తెలిసినట్టు అతడి ముఖకవళికలు

ఆ చేతుల్లో రాజసంతో కంపిస్తున్న కమాను

అనుకోకుండానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

ఈ భూమ్మీద మనుషులంతా అన్నదమ్ములేమో

అన్నంత నమ్మకంతో వినిపించాడతడు

ఆ ఉటాంగ్ చెట్ల కింద, ఆగి ఆగి, ఆ సంగీతం

తనకోసం, తనముందున్న అపరిచితుడికోసం.

చీనా విభాగంలోని కవితలన్నీ కూడా ఈ స్థాయిలోనే ఉన్నాయి. ఆ కవితల్లో అతడికి చీనా కవితాత్మ కనబడ్డట్టుగా, భారతదేశం గాని, అమెరికా గాని అతడికి సాక్షాత్కరించలేదనే అనిపించింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. సేథ్ చైనాలో ఉన్నప్పుడు చైనీస్ నేర్చుకున్నాడు. కొంత పట్టు కూడా సాధించాడు. ఆ ధైర్యంతో ప్రాచీన చీనా కవులు ముగ్గురిని ఇంగ్లీషులోకి అనువదించాడు కూడా.

చీనా కవిత్వంలో స్వర్ణయుగంగా ప్రఖ్యాతి చెందిన తాంగ్ వంశ కాలపు కవులు వాంగ్-వెయి, లి-బాయి, దు-ఫు లను చైనీస్ లో చదివి ఇంగ్లీషులోకి అనువదించాడు. నా దృష్టిలో అది గొప్ప భాగ్యం. అటువంటి భాగ్యం కోసం చిరకాలంగా తపిస్తున్నవాణ్ణి కాబట్టి సేథ్ నాకు ఈర్ష్యాపాత్రుడయ్యాడు కూడా.

సేథ్ అనువాదాలకి నేను పూర్తిగా నూటికి నూరు మార్కులు వెయ్యగలను. నాకు చైనీస్ వచ్చినందువల్ల కాదు, ఇప్పటికే ఆ మహాకవుల కవిత్వాన్ని కనీసం పది పన్నెండు అనువాదాల్లో చదివి ఉన్నాను కాబట్టి, ఆ చుట్టుచూపును బట్టి చెప్పగలను. సేథ్ ఆ కవితల్ని అనువదించడానికి ముందు ఆ మహాకవుల కవిత్వాన్ని హృదయదఘ్నంగా ఆస్వాదించేడని చెప్పవచ్చు. ఎందుకంటే తన అనువాదాలకు అతడు రాసుకున్న పరిచయ వ్యాసంలో అతడు చీనా కవిత్వాన్ని ఒక రసజ్ఞుడు ఏ విధంగా సమీపించాలో ఆ మర్యాద తెలిసినవాడిలానే మాట్లాడేడు. ఉదాహరణకి, ఈ వాక్యాలు, తాను అనువదించిన కవుల మధ్య ఉన్న సూక్ష్మ వ్యత్యాసాన్ని వివరిస్తూ రాసిన ఈ మాటలు చూడండి:

‘.. వాంగ్ వెయి ప్రధాన మనఃస్థితి ఏకాంతం. ప్రశాంతి, ప్రకృతిలోకీ, బౌద్ధంలోకీ పోయి తలదాచుకునే మనస్తత్వం. అతడి కవిత్వం గుర్తురాగానే మన మదిలో మెదిలేవి పారే ఏరు, సాయంసంధ్య, సూర్యోదయం, వెదురుతోపులు, మనుష్యగళాలు వినిపించని నిశ్శబ్దం. లి-బాయి కవిత్వమంతా ఒక ఉద్విగ్నత, ఒక్కొక్కప్పుడు మరీ అదుపు తప్పుతున్నదా అనిపించేంతగా పొంగిపొర్లే జీవశక్తి, చెప్పలేనంత ఉల్లాసం. ఖడ్గం, అశ్వం,మద్యం, స్వర్ణం, చంద్రుడు, పాలపుంత, అసంఖ్యాకమైన సముదాయాలు అతడి కవిత్వంలో పదే పదే కనిపించే ప్రస్తావనలు. కవిత్వంవల్లనో, మధువువల్లనో సంగీతం వల్లనో మత్తెక్కి జీవితాన్నో వలపుగానో, మరపుగానో మార్చుకోగలిగే స్వర్ణవిద్య అతడికి తెలుసు. ఇక దు-ఫు కవిత్వమంతా సామాజిక స్థితిగతులు, చరిత్ర గమనం, రాజ్యం, తాను జీవించిన సంక్షుభిత సమయాల విషాదభరిత పర్యావలోకనలు కనిపిస్తాయి. మరేదో అంతరార్థం స్ఫురింపచేస్తున్నట్లుండే ఆ కవితలు పూర్తిగా కన్ ఫ్యూషియన్ తత్త్వపు పాదులో వికసించినట్లే వినిపిస్తాయి. యుద్ధం, క్షామం, పేదరికం చుట్టుముట్టిన కాలంలో తనని తాను నిరాకరించుకుంటూ పీడితుల పట్లా, నిరాశ్రయుల పట్లా అతడు కనపరిచిన అపారమైన సహానుభూతివల్ల అతడు చీనాప్రజలకి అత్యంత ప్రీతిపాత్రుడైన కవిగా గుర్తుండిపోయాడు.’

ఈ ముగ్గురి కవుల గురించీ ఎందరో ఎంతో విస్తారంగా రాసి ఉండవచ్చుగాక, కాని, ఈ కొన్ని వాక్యాల్లోనే ఇంత సమగ్రంగా చెప్పినవాళ్ళు అరుదు. వాళ్ళ హృదయాలకు చేరువగా పోగలిగినందువల్లా, అదే సమయంలో తనను తాను పక్కనపెట్టేసుకోగలిగినందువల్లా ఆ అనువాదాల్లో ఒక స్వచ్ఛత, ఒక సరళత కనిపిస్తున్నాయి. చూడండి:

వాంగ్-వెయి: హరిణవనం

శూన్యపర్వతశ్రేణి, కనుచూపుమేరంతా నిర్జనం

ఎక్కడో మనుషులు మాట్లాడుకుంటున్న ప్రతిధ్వని

చిక్కటి అడవులమధ్య ప్రతిఫలిస్తున్న కాంతిలో

మరింత ప్రకాశభరితంగా నీలాకుపచ్చ నాచు.

లి-బాయి: లు-షాన్ జలపాతం

సూర్యకాంతిలో ధూమశిఖరముఖాన ఊదారంగు శ్వాస

కొండవాగు జలపాతంగా తుళ్ళిపడే చోట ఆవిరిపొర

అది మూడువేల అడుగుల కిందకి దూకేచోట, అల్లంతన,

ఆకాశం పాలపుంతను నేలపైన జారవిడిచినట్టుంటుంది.

దు-ఫు: యుద్ధ కాలంలో వసంతాగమనం

రాజ్యం కూలిపోయింది, కొండలూ, వాగులూ మిగిలాయి

శిథిలనగరంలో వసంతం, కలకల్లాడుతున్నది గడ్డి ఒక్కటే

కాలగమనానికి చలిస్తున్నట్టు మంచు విదిలిస్తున్న పూలరేకలు

పక్షులు కూడా గడ్డకట్టుకుపోయాయి, రెక్కలాడించడం లేదు

ఆరని మంటలు ఆ కొండలమీద గత మూడునెలలుగా.

ఇట్లాంటివేళ ఇంటినుంచివచ్చే ఒక్క మాటైనా బంగారం.

ఏమీ తోచక నెరిసిన జుత్తు తడుముకుంటాను, అది కూడా

సన్నబడింది, ముడివేసుకోడానికి నాలుగు కేశాలైనా మిగల్లేదు.

ఈ కవితలతో పోలిస్తే The Humble Administrator’s Garden లో విక్రమ సేథ్ ఏమి సాధించాలని ప్రయత్నించాడో, ఆ ప్రయత్నంలో ఏమి సాధించలేకపోయాడో కూడా తెలుస్తున్నది. కాని, ఏ కవికైనా పూర్వమహాకవుల దారి పట్టడం, ఆ దారిలో విఫలమయినా కూడా, అనుసరణీయమూ, చూసేవాళ్ళకు ఆరాధనీయమూనూ.

28-8-2020

Leave a Reply

%d bloggers like this: