పెదకళ్ళేపల్లి

ఆ మధ్య తమిళనాడులో పాటలు పుట్టిన తావుల్ని సందర్శిస్తూ కుంభకోణం దగ్గర తిరువావడురై మఠానికి వెళ్ళాననీ, యు.వి. స్వామినాథ అయ్యర్ ను తలుచుకుంటూ నేను ఆ మఠంలో అడుగుపెట్టినట్టే, ఎవరేనా తమిళ సాహిత్య విద్యార్థి వేటూరి ప్రభాకరశాస్త్రిని తలుచుకుంటూ పెదకళ్ళేపల్లిలో అడుగుపెడతాడా అని ఎదురుచూస్తున్నానని కూడా రాసాను. కానీ అప్పటికి నేను పెదకళ్ళేపల్లి వెళ్ళి ఉండలేదు. ఆ భాగ్యం పోయిన శనివారం సాయంకాలం లభించింది.

అకాశమంతా నల్లమబ్బు కమ్మి తొలకరి చినుకులు కృష్ణాతీరాన్ని తడుపుతున్నవేళ, మోపిదేవి వెళ్ళిన నాకు, అక్కడి ఉపాధ్యాయ మిత్రులు పెదకళ్ళేపల్లి అక్కడికి దగ్గరలోనే ఉందని చెప్పినప్పుడు అవశ్యం వెళ్ళి తీరాలనుకున్నాను. అప్పటికే పొద్దు పోతూ ఉంది. మేమా గ్రామం చేరేటప్పటికి ఎక్కడ చీకటిపడిపోతుందోనన్న ఆతృతతో త్వరత్వరగా బయలుదేరాం. అక్కడ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు పుట్టిన ఇల్లు, ఆ వీథి, ఆయన స్మారక చిహ్నాలేమైనా ఉంటే వాటిని కూడా ఆ వెలుగు కుంకిపోకుండానే చూడాలన్న ఆర్తినాలో ఉరకలెత్తడం నాకే స్పష్టంగా తెలుస్తూ ఉంది.

మిత్రులు నన్ను ముందు అక్కడి దుర్గానాగేశ్వరస్వామి దేవాలయానికి తీసుకువెళ్ళారు. పదకొండో శతాబ్దిలో రాజేంద్రచోళుడు నిర్మించిన ఆ శివాలయంలో ప్రాచీన శివాలయాల్లో కనవచ్చే ఈశ్వరవిభూతి తేటతెల్లంగా ద్యోతకమవుతూ ఉంది. అక్కడ పూజలు చేసినతర్వాత, ఆ పక్కనే అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాక, మమ్మల్ని అర్చకులు పక్కన ఉన్న వనదుర్గ ఆలయంలోకి తీసుకువెళ్ళారు. ఉగ్రరూపిణి అయిన ఆ దుర్గాదేవి ఎదట అర్చకుడు ఒక పూజకి ఉపక్రమిస్తూన్నాడు. పూజారంభంలో సంకల్పం నా చెవిన పడ్డాక ఆయన ఖడ్గమాలతో అమ్మవారిని అర్చించబోతున్నాడని అర్థమయింది. ప్రదోషసమయంలో ఖడ్గమాల అర్చావేళ అడుగుపెట్టడం నిజంగానే నా భాగ్యమని తలుసూ, అక్కడ కూర్చుండిపోయాను. ఆ తర్వాత దాదాపు ఇరవై నిముషాల పాటు ఆ అర్చకుడు చేసిన ఖడ్గమాల స్తుతి, ఆ మంత్రమయ వాక్కు నాలో అనిర్వచనీయమైన సంవేదనలు రేకెత్తించింది. నా జీవితంలో అంతదాకా అంత మహిమోపేతమైన ఖడ్గమాల ఉచ్చారణ నేనెప్పుడూ విని ఉండలేదు. పూజ పూర్తికాగానే ఆ మాటే చెప్పాను. అప్పుడాయన మూడు సంధ్యల్లోనూ అమ్మవారి అర్చన సాగుతూనే ఉంటుందని సాయంసంధ్యావేళ ఖడ్గమాలతో అమ్మవారి అర్చన తప్పని సరి అని చెప్పాడు.

గుడి బయటకు వచ్చాక, వేటూరి వారి ఇల్లు ఎక్కడ అని అడిగాను. అది కోనేరు ఎదురుగా ఉన్న వీథి చివర ఉందనీ, కాని ఇప్పుడు ఆ ఇల్లు, ఆ స్థలం మరెవరో కొనుక్కున్నారనీ, ఇప్పుడక్కడ ఆయన పేరు మీద ఎటువంటి స్మారకం లేదనీ చెప్పారు అక్కడివాళ్ళు. కాని తిరుపతి తిరుమల దేవస్థానాల తరఫున ఎల్.వి.సుబ్రహ్మణ్యంగారు ఆ వీథి మొదట్లో వేటూరి విగ్రహాన్ని ఒకటి నెలకొల్పారని నాకు చూపించారు. నిలువెత్తు ఆ విగ్రహం పక్కనే వేటూరి సుందరరామ్మూర్తి, సుసర్ల దక్షిణామూర్తి విగ్రహాలు కూడా ఎండకు ఎండి వానకు తడుస్తున్నాయి.

వేటూరి ప్రభాకరశాస్త్రిగారి ఋణం ఎంతో కొంత టి.టి.డి తీర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నదిగాని, తెలుగు వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించలేదు. స్వామినాథ అయ్యర్ సంగం సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చినప్పుడు తమిళం రాత్రికి రాత్రే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటిగా మారిపోయిందని నేను రాసిన మాట మీకు గుర్తుండే ఉంటుంది. తిరుమల దేవస్థానంలో అన్నమాచార్య కీర్తనల రాగిరేకుల్ని బయటికి తీసినప్పుడు వేటూరి ప్రభాకరశాస్త్రి మధ్యయుగాల తెలుగు భక్తి సాహిత్యాన్ని, సంకీర్తనా సాహిత్యాన్ని, సంగీత వైభవాన్ని ఏడుకొండల ఎత్తున నిలిపారని ఎందరికి తెలుసు? అన్నమయ్య ఒక మహాసముద్రం, ఒక హిమాలయ పర్వతశ్రేణి, ఒక సతతహరితారణ్యం. అటువంటి మహనీయుణ్ణి మనకి చూపించినందుకు మనమాయన్ని ప్రతి ప్రాతఃసమయానా ఎంత భక్తిశ్రద్ధలతో తలుచుకుంటూ ఉండాలి!

తెలుగు వాజ్మయ పరిశోధనలో, ప్రాచీన కావ్యాల పరిష్కరణలో, విమర్శమూల్యాల నిష్కర్షలో వేటూరి చూపిన ప్రతిభ, చేసిన కృషి అన్నీ ఒక ఎత్తు, ఆయన తన జీవితకాలం పాటు, ఒక యోగిగా, ఆధ్యాత్మిక గురువుగా, వైద్యుడిగా ఎందరో జ్ఞానార్తులకి, మిత్రులకి, అస్వస్థులకి అందించిన సేవలు మరొక ఎత్తు. వేటూరిని ఒక సాహితీవేత్తగా మాత్రమే తెలిసినవాళ్ళు ఆయన ‘ప్రజ్ఞా ప్రభాకరము’ తప్పనిసరిగా చదవవలసి ఉంటుంది. తన జీవితకాలపు యోగాభ్యాస రహస్యాల ఒక సంక్షిప్త పరిచయం ఆ పుస్తకం.

కాని, వేటూరి ప్రభాకర శాస్త్రిగారు తలపుకు రాగానే నాకు గుర్తొచ్చేది నా చిన్నతనాన చదివిన ఒక పుస్తకం. మా ఇంట్లో మా నాన్నగారికి ఒక చిన్న లైబ్రరీ ఉండేది. వందా, నూటయాభై పుస్తకాల ఒక రాకు మా తొలి గ్రంథాలయం. ఆయన ఆ పుస్తకాలు ఎప్పుడెప్పుడు కొన్నారో, ఎక్కడ కొన్నారో, ఏ సాహిత్య పిపాస ఆయన్ని ఆ పుస్తకాల వైపు నడిపించిందో మాకు తెలియదుగాని అందులో వేటూరి వారి సాహిత్య వ్యాసాల సంపుటి కూడా ఒకటి ఉండేది. నా మరీ పసీవయస్సులో, అంటే పది పదకొండేళ్ళ వయసులో ఆ పుస్తకంలో చదివిన వాటిలో ఒక సంగతి మాత్రం నా మనసులో అచ్చుగుద్దినట్టు నిలిచిపోయింది. అది పోతన భాగవతం గురించి ఆయన రాసిన కొన్ని ముచ్చట్లు. తెలుగు వాళ్ళ నాలుక మీద పోతన ఎట్లా చిరంజీవిగా మిగిలిపోయాడో తెలిపే కొన్ని సంగతులవి.

ఆ పుస్తకం పేరేమిటో మర్చిపోయాను. పెదకళ్ళేపల్లి వెళ్ళి వచ్చిన ఈ వారం రోజులుగానూ, ఇంటర్నెట్లో ఆర్కైవ్ మొత్తం శోధించాను. అది ఏ వ్యాసం? ఏ పుస్తకంలోది? నా జ్ఞాపకాల్ని తవ్వి గుట్టగా పోస్తూనే ఉన్నాను. చివరికి, నిన్న రాత్రి ebooks.tirumala.org లో ఆ పుస్తకం దొరికింది నాకు.

‘తెలుఁగు మెరుఁగులు ‘

అదీ ఆ పుస్తకం పేరు. ఇక్కడ లింక్ ఇస్తున్నాను, చదవండి. https://ebooks.tirumala.org/read?id=679…

వేటూరి ప్రభాకర శాస్త్రి సాహిత్య వైదుష్యం ఎటువంటిదో మనకొక ఆనవాలు దొరుకుతుంది. కానీ, ఇప్పటికైతే, నా పసితనం నుంచీ నా మనసులో అచ్చుపడిపోయిన ఆ ముచ్చటని మాత్రం మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను.

~

… ఒక పూరి ఇల్లు.చిన్నది, తలుపు ఓరవాకిలిగా వేసి ఉన్నది. లోపల ముసలమ్మ వడ్లు దంచుచున్నది. రోకటిపోటుతో పాటు.

”ఓ రామ ఓ రామ ఒయ్యారి రామ!

ఓ రామ! ఓ రామ!

ఓ రామ! ఓ రామ!”

అనుచు ఉచ్ఛ్వాస నిశ్వాసములతో రామనామస్మరణ జోడించు చున్నది- మధ్యాహ్నము ఒంటిగంటవేళ. ఇంటనామె ఒక్కర్తయే. తాటాకు పుస్తకాలేవో ఉన్నవనగా చూడవెళ్ళినాను. ఇంటిలోనికి అడుగు సాగక వాకిటనే ఉన్నాను. కొంతసేపటికి దంపుడు ముగియగా చేటలో దంచిన బియ్యము చేర్చుకొని చెరుగబోవుచు, ఈ కింది పద్యము చదివినది.

”కలడందురు దీనుల యెడ

గలడందురు పరమయోగి గణముల పాలన్

కలడందురన్ని దెసలను

కలడు కలండనెడి వాడు కలడో లేడో!”

నాలుగవ చరణము గద్దించుచు మరి ముమ్మారు చదివినది. ఇదే సందర్భమురా అనుకొని ‘ఉన్నాడమ్మా’ అనుచు నేను లోపలకి వెళ్ళినాను… ఇట్లనుకున్నాను. ఆహో ! పోతరాజుగారెంత పుణ్యాత్ములు, భాగవతమెందరినో పవిత్రాత్ములను చేయుచున్నదిగదా!

బ్రౌనుదొరగారికెవరో దీనుడు ఈ కింది పద్యమును అర్జీగా రాసి పంపుకొన్నాడట.

”లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె, బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చె, దనువున్ డస్సెన్, శ్రమంబయ్యెడిన్

నీవే తప్ప నితః పరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్

రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!”

బ్రౌను దొరగారా దీనుని కేదో కొంత సొమ్ముతో పాటు, ఆ అర్జీ మీదనే ఎండార్స్మెంటుగా ఈ కిందిపద్యమును వ్రాసి పంపినారట!

”ఏను మృతుండనౌదునని యింత భయంబు మనంబులోపలన్

మానుము సంభవంబు గల మానవ కోట్లకు చావునిక్కమౌ

గాన హరిందలంపుమిక గల్గదు జన్మము నీకు ధాత్రిపై

మానవనాథ! చెందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్!”

బ్రౌను దొరగారికి కూడ భాగవతమింత పరిచితమయినది!

~

భాగవతం చదివిన వారికి ఆ దీనుడు అర్జీలో రాసుకున్న పద్యం పోతన గజేంద్రమోక్ష ఘట్టంలో ఏనుగు విలపించినప్పటి పద్యమనీ, బ్రౌను దొర రాసిన పద్యం భాగవత కథా ప్రారంభంలో పరీక్షిత్తుకి శుకమహర్షి చెప్పిన పద్యమనీ తెలుస్తుంది.

ముప్పై ఏళ్ళు పైబడి ప్రభుత్వంలో పనిచేస్తున్నాను. కాని తనకి వచ్చిన అర్జీ మీద ఒక పద్యంతో ఎండార్స్మెంటు రాయవచ్చునని తెలిసినవాడు నాతో సహా ఒక్క అధికారి కూడా లేడు!

11-7-2020

Leave a Reply

%d