కొండవీడు-3

వేమన గురించి తలుచుకోకుండా కొండవీటి యాత్రావర్ణన పూర్తికాదు. అక్కడ అడుగడుగునా వేమన పద్యాలు దర్శనమిస్తూనే ఉన్నాయి. లోపల కొండవీటి శిథిలాల మధ్య కూడా ఒక వేమన యోగి మందిరమో, గుహనో కనిపించింది. ఒక కొండకొమ్ము మీంచి దూరంగా నెమళ్ళబురుజు చూపిస్తూ నాతో వచ్చినవాళ్ళు ఆ పక్కనే వేమనయోగి మందిరం కూడా ఉందన్నారు. అంటే కొండవీడులో కూడా ప్రతి కొండచరియలోనూ ఒక వేమన స్మారకం ఉందన్నమాట.

వేమనకీ కొండవీటికీ ఏమీ సంబంధం లేదనే నా నమ్మకం. కాని వేమన కొండవీడు వాడని చెప్పుకునే ఐతిహ్యాన్ని గౌరవించడానికి నేను కూడా ఉత్సాహపడతాను. అందులో ఆశ్చర్యమేమిలేదు. తమిళనాడులో ప్రతి జిల్లాలోనూ కూడా తిరువళ్ళువర్ పుట్టిన ఊళ్ళు ఉన్నప్పుడు వేమనకి కూడా ఉండటంలో విచిత్రమేముంది?

వేమనది కొండవీడు అని చెప్పడానికి అందరూ ఉదహరించే పద్యం:

ఊరు కొండవీడు, ఉనికి పశ్చిమ వీథి

మూగచింతపల్లె మొదటి ఇల్లు

వెర్రి వేమననంగ వేదాంత వేత్తరా

ఇందులో మొదటి పంక్తి తప్ప, రెండవ, మూడవ పంక్తులకి అనేక పాఠాంతరాలు ఉన్నాయి. అన్నిటిలోనూ నిశ్చయంగా కనిపించే పదాలు మాత్రం ‘ఊరు కొండవీడు’, ‘ఉనికి పశ్చిమ వీథి’ అనేవి మాత్రమే. ఆ రెండు పదాల్ని పట్టుకుని వేమనకీ, కొండవీటికీ మధ్య ఒక సంబంధాన్ని అల్లుతూ ఎన్నో కథలు, ఎన్నో గాథలు పుట్టుకొచ్చాయి. ఒకవేళ వేమన నిజంగానే కొండవీటి వాడని అనుకున్నా కూడా ఆయన పెదకోమటివేమారెడ్డి కొడుకు కాడనీ, రాచవేమారెడ్డి తమ్ముడు కాడనీ మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు. వేమన కొండవీటిలోనే పుట్టాడని మనం నమ్మడానికి సిద్ధపడ్డా, అతడు కొండవీడు ఉచ్చదశకి చెందిన వాడు కాడనీ, ఆ రాజ్యం, ఆ దుర్గం, ఆ కోట జీర్ణపతనావస్థకు చెందిన కాలంలో జీవించాడనీ అనుకోవలసి ఉంటుంది.

వేమన ఏ కాలానికి చెందినవాడు? పోయిన శతాబ్దిలో ఈ ప్రశ్నకి జవాబు వెతకడం తెలుగు సాహితీవేత్తలకి ఒక తీరికసమయపు వ్యాపకం. తనకు లభ్యమైన సమస్త ఆధారాల్నీ తూకం వేసి ఆరుద్ర వేమన్న కాలం గురించి నిర్ద్వంద్వంగా చివరి మాట చెప్పానని అనుకున్నాడుగాని, ఇప్పుడు ఆ పరిష్కారాన్ని కూడా పూర్తిగా అంగీకరించలేమని అనిపిస్తున్నది. వేమన ఎప్పటివాడైనప్పటికీ, 1730 కన్నా ముందటివాడని చెప్పవచ్చు. ఎందుకంటే, ఆ ఏడాదే వేమనపద్యాల్ని సంజీవనాథ స్వామి అనే ఒక జెసూటు పారిస్ పంపించాడు. ఆ పద్యాల్ని బట్టి, వేమన పట్ల ఆకర్షితుడై వాటిని ఇంగ్లీషులోకి అనువదించి వేమనకి అంతర్జాతీయ ఖ్యాతిని సంతరించిన బ్రౌన్ వేమన 1652-1725 మధ్యలో జీవించినట్టు రాసుకున్నాడు. కాని 1725 నాటికి మరణించిన ఒక కవి పద్యాలు 1730 కల్లా పారిస్ వెళ్ళాయని నమ్మలేం. ఆ పద్యాల్ని బట్టి వేమన గురించి కొంత సమాచారం సేకరించిన అబే దుబాయ్ తన పుస్తకంలో (1808) వేమన నూటయాభై ఏళ్ళ కింద జీవించినట్టు తెలుస్తున్నదని రాసాడు. అంటే 1650 ప్రాంతమన్నమాట.

ఇటువంటి వివిధ రకాల సాక్ష్యాలవల్లా, పద్ధెనిమిదో శతాబ్ది తెలుగు కవులైన కనపర్తి అబ్బయామాత్యుడు, కూచిమంచి జగ్గకవి, శహాజీ వంటివారి సాహిత్యం పైన కనిపిస్తున్న వేమన పద్యాల ప్రభావం వల్లా, వేమన పదిహేడో శతాబ్ది కవి అని మాత్రం రూఢిగా చెప్పగలం.

వేమన పద్యాల్లో (ఏవి వేమన పద్యాలో మనం నిశ్చయంగా తేల్చలేకపోయినప్పటికీ) కనిపించే సామాజిక-ధార్మిక పరిస్థితుల్ని బట్టి, ఆయన విజయనగర సామ్రాజ్యపతనానికీ (1565) మొదటి కర్ణాటక యుద్ధానికీ (1746) మధ్యకాలానికి చెందినవాడు అని నిశ్చయంగా చెప్పవచ్చు. అప్పటికి వైష్ణవం మాత్రమే కాదు, మహ్మదీయ రాజ్యాల ప్రాభవం కూడా క్షీణించింది. ఐరోపీయ దేశాల వ్యాపారులు వలసలు ఏర్పరచుకుంటూ ఉన్నారు. క్షీణిస్తున్న, కూలిపోతున్న సామాజిక సమగ్రతని నిలబెట్టడానికి ఒక దేవుడుగాని, ఒక రాజు గాని, ఒక తత్త్వశాస్త్రం గాని కనిపించని కాలం. అటువంటి కాలంలో వేమన బహుశా కొండవీడులో పుట్టి ఉండవచ్చు. కాని అనతికాలంలోనే కొండవీడు వదిలిపెట్టి కడప ప్రాంతమంతటా సంచరిస్తూ, చివరికి అనంతపురం జిల్లాలోని కటారుపల్లెలో తనువు చాలించి ఉండవచ్చునని నమ్ముతున్నాను. నిజానికి ఈ జిల్లాల పేర్లు ఇప్పటివి. అప్పటికి కొండవీటినుంచి కటారుపల్లెదాకా మనిషిలోపలా, సంఘంలోపలా విధ్వంసం ఒక్కలాగే ఉందని చెప్పవచ్చు.

వేమన పద్యాల్ని సేకరించి ఇంగ్లీషులోకి అనువదిస్తూ బ్రౌను దొర వాటిని ప్రధానంగా నీతిప్రధానం, వ్యంగ్యాత్మకం, యోగప్రధానంగా అభివర్ణించాడు. పందొమ్మిదో శతాబ్దంలో తాను వాటిని అనువదిస్తున్నపుడు ఆయన వాటిలోని యోగపార్శ్వానికి పెద్ద పీట వేసాడు. వేమనని యోగి అని వర్ణిస్తూ, వేదాంతిగా కూడా పరిచయం చేసాడు. ఆ తర్వాత ప్రతి శతాబ్దంలోనూ వేమన ఎప్పటికప్పుడు సరికొత్తగా సాక్షాత్కరిస్తూనే ఉన్నాడు. పందొమ్మిదో శతాబ్దంలో బ్రౌన్ కి ఆయన ప్రధానంగా ఒక యోగిగానూ, మిస్టిక్ గానూ కనిపిస్తే, ఇరవయ్యవశతాబ్దిలో ఆయనలోని వ్యంగ్య,అధిక్షేప, సామాజిక విమర్శాపార్శ్వానికి పెద్ద పీట లభించింది. కట్టమంచి, రాళ్ళపల్లి వేమనకి మళ్ళా ప్రాణం పోస్తే శ్రీశ్రీ కి ఆయన కవిత్రయంలో ఒకడైనాడు. ఒక సంఘసంస్కర్తగా, అభ్యుదయవాదిగా, భావవిప్లవకారుడిగా కనిపించడం మొదలుపెట్టాడు. ‘గుద్ది మరీ బుద్ధి చెప్పినవాడిగా ‘ కనిపించాడు. మరొక వైపు పాఠ్యపుస్తకాల్లో వేమన ఒక నీతి శతక కర్తగా పిల్లలకు పరిచయం కావడం మొదలుపెట్టాడు.

కాని వేమన గురించి ఇంతదాకా వచ్చిన పుస్తకాలన్నీ వేమన గురించి మనకి కొత్త స్పష్టతనిచ్చేలాగా లేవని సడ్డా సుందరరామిరెడ్డి రాసిన ‘వేమన్న వెర్రి'(1998) చదివితే అర్థమవుతుంది. వీరందరికన్నా కూడా, బిరుదురాజు రామరాజు గారు వేమనని మరింత సన్నిహితంగా చూడగలిగారని ఆయన ‘ఆంధ్రయోగులు’ (1998) మొదటిసంపుటం చదివినప్పుడనిపించింది.

కాని ఇరవై ఒకటవ శతాబ్దిలో వేమన జీవనతత్త్వవేత్తగా, విద్యాప్రదాతగా కనిపించడం మొదలుపెట్టాడు. అనుమాండ్ల భూమయ్య రాసిన ‘వేమన అనుభవ సారం'(2012), యలవర్తి భానుభవాని రాసిన ‘వేమన తాత్త్వికత'(2016) గ్రంథాల్లో వేమన పూర్తిగా ఒక జీవనవిద్యావేత్తగా కనిపించడం నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది.

వేమన ప్రతిపాదిస్తున్న జీవనవిద్య ఏమిటి? అది ఎప్పటికాలానికి తగ్గట్టుగా అప్పటి ప్రజలకి ఒక మెలకువని ప్రతిపాదించే విద్య. ఒక కొత్త ఎరుకని ప్రతిపాదించే విద్య. మూడు వందల ఏళ్ళ కిందట, పూర్తినిమ్నోన్నతాలతో కుళ్ళిపోయిన సమాజంలో అది మనిషి తనను తాను కాపాడుకోవలసిన ఆత్మవిద్య, యోగవిద్య, బ్రహ్మవిద్య. వందేళ్ళకిందట సాహిత్యంలో సామాజిక స్పృహ ఉదయిస్తున్నప్పుడు అది హెచ్చుతగ్గులకీ, ఆత్మవంచనకీ తావులేని ఒక నిర్మల విద్య. ఇప్పుడు సమాజం ఒక వస్తు సంచయంగా మారిపోతున్న కాలంలో అది పూర్తిగా మనుషుల్ని రూపొందించే విద్య.

వేమనకీ, కొండవీటికీ ఏదన్నా ఒక సంబంధం ఉండవచ్చునా అంటే అది ఆల్కెమీకి సంబంధించి అనుకోవచ్చును. కొండవీటి చరిత్ర గురించి, మద్దులపల్లి గురుబ్రహ్మ శర్మ అనే ఆయన రాసిన ‘శ్రీ కొండవీటి సామ్రాజ్యము’ (1920) అనే పుస్తకాన్ని ఈమని శివనాగిరెడ్డిగారు నాకు కానుక చేసారు. ఆ పుస్తకంలో కొండవీటి పతనావస్థలో స్వర్ణవిద్య పట్ల ఏర్పడ్డ నమ్మకాల గురించి రాసుకొచ్చారు. పరుసవేది ద్వారా లోహాన్ని బంగారంగా మార్చవచ్చుననే ఒక నమ్మకాన్ని మనం అల్కెమీ అనీ, రసవాదమనీ వ్యవహరిస్తున్నాం. తెలుగు కవిత్వం మీద అల్కెమీ ప్రభావం గురించి ఇంతదాకా ఎవరూ పరిశోధన చేసినట్టు కనిపించదు గానీ, మనుచరిత్రనుంచి వేమనదాకా ఆల్కెమీ ప్రస్తావన లేని కవిత్వం మనకు కనిపించదు. వేమన జీవితం గురించిన కథల్లో ఒకటి ఆయన ఒక గురువుని మోసగించి స్వర్ణవిద్య నేర్చుకున్నడనీ, కానీ వెనువెంటనే విరక్తుడైపోయాడనీ.

యూరోప్ తాత్త్వికత మీద ఆల్కెమీ ప్రభావాన్ని అధ్యయనం చేసిన మనస్తత్వవేత్త యూంగ్ ఆల్కెమీని ఒక ప్రాకృతిక శాస్త్రంగా కాక, మనస్తత్వ శాస్త్రంగా గుర్తించాలని వాదించాడు. మట్టిని బంగారంగా మార్చడమనేదాన్ని ఒక రూపకాలంకారంగా గుర్తుపట్టాలని ప్రతిపాదించాడు.

మధ్యయుగాల కొండవీడులో స్వర్ణవిద్య అంటే మట్టిని బంగారంగా మార్చడం. అంటే ఒక రాజ్యం మరొక రాజ్యం మీద దండెత్తి ఆ రాజ్యాన్ని దోచుకోవడం. ఆ నేపథ్యంలోంచి వచ్చిన వేమన దృష్టిలో నిజమైన స్వర్ణవిద్య మట్టిలాంటి మానవప్రవృత్తిని బంగారంగా మార్చుకోవడం.

ఇహమున సుఖియింప హేమతారక విద్య

పరమున సుఖియింప బ్రహ్మవిద్య

కడమవిద్యలెల్ల కల్ల మూఢులకురా

హేమతారక విద్య బ్రహ్మతారకవిద్య కాదు. కనకమృగం వెంటబడ్డవాడు దేవుడైనా కూడా వేమనకి అంగీకారయోగ్యం కాదు.

కనకమృగము భువిని కద్దులేదనలేక

తరుణి విడిచిపోయె దాశరథియు

తెలివిలేని వాడు దేవుడెట్లాయెరా.

మూడువందల ఏళ్ళ తరువాత మన కాలంలో కూడా మనమొక స్వర్ణవిద్యావ్యామోహాన్ని చూస్తున్నాం. సమస్త రియల్ ఎస్టేట్ వ్యవహారాలూ మట్టిని బంగారంగా మార్చుకోవాలన్న యావ కాక మరేమిటి? ఇటువంటి కాలంలో మనకి మళ్ళా దారిచూపేది ఒక వేమన ఒక గురజాడ మాత్రమే. గురజాడ ‘కాసులు’ కవితలో ఇలా అంటున్నాడు:

వినుము,… ధనములు రెండు తెరగులు,

ఒకటి మట్టిని పుట్టినది, వే

రొకటిహృత్కమలంపు సౌరభ

మదియు నిది యొక్కెడను కలుగుట

యరుదు, సతులకు వేడ తగినది

యెద్దియో?

ఇది 21 వ శతాబ్దపు విద్యకి మూలం. నాలుగేళ్ళ కిందట వేమన గురించి తలుచుకుంటూ కొన్నివాక్యాలు రాసాను. తిరిగి చూస్తే, అప్పటికన్నా ఇప్పుడు అదనంగా ఒక్క మాట కూడా చెప్పనవసరం లేదనిపిస్తోంది. చూడండి.

అసలు విద్య అంటే accumulation అనే భావనలోనే దాన్నొక సరుకుగా చూసే లక్షణముంది.నిజమైన విద్య, క్రియేటివ్ కావాలన్నా, కమ్యూనికేట్ చెయ్యాలన్నా, కొలాబరేట్ చేసుకోవాలన్నా కూడా ముందు నీలోపలకి చూసుకోవాలి. తోటిమనిషిని సమాదరించగలగాలి. మీరిద్దరూ కలిసి ఒక మానవీయ సంఘంగా రూపొందాలి. అది పుట్టుకతో వచ్చేది కాదు, కొనుక్కుంటే దొరికేది కాదు. నిరంతర ప్రయత్నంవల్లా, నిర్విరామ సాధనవల్లా , చిత్తశుద్ధివల్లా మాత్రమే రూపొందుతుందది.

సరిగ్గా వేమన ఈ విద్య గురించే మాట్లాడుతున్నట్టుగా ఆ పద్యాలు, మన చిన్నప్పుడు మనకేమీ తెలియకుండానే వల్లెవేసిన పద్యాలు, మనకిప్పుడు వినబడుతున్నాయి:

అనగననగ రాగమతిశయిల్లుచునుండు

తినగతినగ వేము తియ్యనగును

సాధనమున పనులు సమకూరు ధరలోన

ఆత్మశుద్ధిలేని ఆచారమదియేల

భాండశుద్ధిలేని పాకమేల

చిత్తశుద్ధిలేని శివపూజలేలరా

ప్రతి యుగంలోనూ కూడా విద్య టెక్నాలజీగా మారిపోతూంటుంది. ఆ టెక్నాలజీ చేతిలో ఉన్నవాడే ప్రభావశీలుడిగా, పాలకుడిగా మారిపోతుంటాడు. కాని కొద్ది రోజులకే ఆ టెక్నాలజీ పాతబడుతుంది, ఆ ప్రభుత్వం కూలిపోతుంది. అందుకనే నిజమైన విద్యార్థి, విద్యనెప్పటికీ, విద్యనుంచి, కాపాడుకుంటూనే ఉండాలి. అసలు టెక్నాలజీలన్నింటికీ ఆధారమైన సత్యాన్వేషణనే నిజమైన విద్య అనీ, మనుషులు కోరుకోవలసిందీ, అభ్యసించవలసిందీ అదేననీ యుగాలుగా విద్యావేత్తలంతా చెప్తూవస్తున్నారు.

వేమన కూడా ఆ మాటే అంటున్నాడు:

వేదవిద్యలెల్ల వేశ్యలవంటివి

భ్రమలబెట్టి తేటపడగనీవు

గుప్తవిద్య ఒకటె కులకాంత వంటిది

మర్మమెరుగలేక మతములు కల్పించి

ఉర్విజనులు దుఃఖమొందు చుంద్రు

గాజుటింట కుక్క కళవళ పడురీతి

పెక్కు చదువులేల పెక్కు వాదములేల

ఒక్క మనసుతోను ఊరకున్న

సర్వసిద్ధుడగును, సర్వంబు తానగును

అది తెలినవాళ్ళు మాత్రమే విద్యావంతులు. తక్కినవాళ్ళంతా

నేరుపగలవారు, నెరతనము గలవారు

విద్యచేత విర్రవీగువారు

పసిడికలుగువాని బానిస కొడుకులు.

16-8-2020

Leave a Reply

%d