కొండవీడు-2

కొండవీడుకి ఇప్పుడు ప్రభుత్వం ఘాట్ రోడ్డు వేసింది. ఆ ఘాట్ రోడ్డు మొదట్లో కిందన ఒక దేవాలయం ఉంది. ముందు మమ్మల్ని ఆ గుడి దగ్గరకి తీసుకువెళ్ళారు. గోపీనాథ దేవాలయంగా పిలవబడుతున్న ఆ గుడి నిర్మాణం చెక్కుచెదరలేదుగానీ, లోపల శూన్యంగానూ, దిగులుపుట్టించేదిగానూ ఉంది. అక్కడొక వృద్ధుడు మమ్మల్ని చూస్తూనే మాకు దారి చూపిస్తూ ఆ దేవాలయ చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు. కత్తులబావిగా అప్రతిష్ఠ మూటగట్టుకున్న ఆ ప్రాంతం గురించి అతడు మాకేదో ఒక పెద్ద కథ చెప్పాడు. కాని అక్కణ్ణుంచి చూస్తే కొండవీటి కొండల మీద అల్లుకున్న మేఘసోపానాలు నన్నొకటే ఊరించడం మొదలుపెట్టాయి. ఎంత త్వరగా ఆ కొండమీదకు ప్రయాణిస్తానా అని మనసు ఉర్రూతలూగడం మొదలుపెట్టింది.

ఘాట్ రోడ్డు ఎక్కగానే దారి పొడుగునా వేమన పద్యాలు కనిపించడం మొదలుపెట్టాయి. ఒక మలుపులో శ్రీనాథుడి పద్యం కూడా. పైకి ఎక్కేటప్పటికి, ఆశ్చర్యం, ఆ కొండల మధ్య మైదానంలాగా విస్తరించి ఉన్న భూభాగం కనిపించింది. ఆ స్థలాన్ని ఒక దుర్గంగా మార్చుకోవచ్చనే ఊహ కలిగిన ఆ మొదటి వీరుడెవ్వరో అతడి వ్యూహరచనకి నమస్కరించకుండా ఉండలేకపోయాను. చుట్టూ కొండలు ఒక దుర్భేద్య ప్రాకారంగా అమరిన ఆ చోట ఒక సంస్కృతి వికసించడంలో ఆశ్చర్యమేముంది?

ఇక అక్కడ ఒకప్పుడు 14 వ శతాబ్దం నుండి 16 వ శతాబ్దందాకా గొప్ప వైభవాన్ని చూసిన ఆ కొండవీటి సామ్రాజ్యాన్ని తలచుకుంటూ ఇప్పుడు ఆనవాళ్ళుగా మిగిలిన ఆ స్థలాల్ని చాలానే చూసాం. అదంతా ఇప్పుడొక దట్టమైన అడవి. ఆ అడవి మధ్యలో ఒకప్పటి చరిత్రకి ఇప్పుడు ఆనవాళ్ళుగా మిగిలినవి కొన్ని శూన్యదేవాలయాలు, కొన్ని కూలిపోయిన బురుజులు, కొన్ని నిద్రపోతున్న చెరువులు, కొన్ని రాళ్ళు, కొన్ని వట్టి పేర్లు మాత్రమే. ఒకప్పుడు ప్రభుత్వం నిర్మించి ఇప్పుడు శిథిలంగా మారిపోయిన అతిథిగృహం మీదుగా అక్కడ కొండకొమ్ములాగా ఉన్న ఒక శిఖరం మీదకు ఎక్కాం. అక్కణ్ణుంచి నలువైపులా దిగంతం కనిపిస్తూ ఉంది. దూరంగా మరొక కొండకొమ్ము మీద కొన్ని శిథిలాలు కనిపిస్తున్నాయి. దాన్ని నెమళ్ళ బురుజు అంటారని చెప్పారు. ఆ నెమళ్ళ బురుజు మీదుగా ప్రకాశవంతమైన మేఘమండలం కనిపిస్తూ ఉంది. దాని వెనగ్గా నీలిరంగు దిగంతఛాయ. ఆ కిందన నేలా నింగీ కలిసే చోట ఆకుపచ్చని రేఖ.

అక్కడ నిలబడ్డప్పుడు స్ఫురించే పదం- lofty. అది పూర్తి sublime అని చెప్పలేను. ఈ లోకం నుంచి విడివడి మరోక లోకాన్ని అనుభూతిలోకి తెచ్చే చోటు కాదు.ఇక్కడే ఈ నేలమీదనే నిలబడి ఉంటావు, కాని తక్కిన ప్రాపంచికాంశాల్ని దాటి పైకి లేస్తావు. తక్కినవాళ్ళు చూడని, చూడలేని ఎత్తులేవో దర్శిస్తావు. కాని అక్కడే ఉండిపోవు, తిరిగి మళ్ళా దైనందిన జీవితంలో భాగమవుతావు. అటువంటి చోట కవులూ, రసజ్ఞులూ కలిసి వసంతోత్సవాలు జరుపుకోకుండా ఎలా ఉంటారు?

కొండవీటి పొగమబ్బుల్ని చూసినప్పుడు అవి విశ్వనాథకి ఎర్రాప్రగడ, శ్రీనాథుడు కవితలుగా మార్చకుండా వదిలిపెట్టిన భావాల్లాగా కనిపించాయట. ఎర్రాప్రగడకీ, కొండవీటికీ సంబంధం లేదు. ఆయన అద్దంకి సీమకు చెందినవాడు. అప్పటికింకా రెడ్డి రాజులు అద్దంకి నుంచి రాజధానిని కొండవీటికి మార్చలేదు. కాని శ్రీనాథుడు పూర్తి కొండవీటి కవి. కొండవీడు ఉచ్చ దశని, పతనాన్నీ కూడా ఆయన కళ్ళారా చూసాడు. కుమారగిరి రెడ్డి రాజ్యం చేస్తున్నప్పుడు ఇంకా ఒక సైనికాధికారిగా మాత్రమే ఉన్న పెదకోమటి వేమారెడ్డి, మామిడి సింగన్నా, శ్రీనాథుడూ ఒక యువసాహిత్యబృందంగా కలిసిమెలిసి తిరిగారు. పూర్వకవిత్వాల్ని నోరారా చదువుకున్నారు. ముఖ్యంగా గాథాసప్తశతిని కడుపారా ఆస్వాదించారు. ‘నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్త శతిని నుడివిన ‘అనుభవం శ్రీనాథుడిది. శాలివాహన సప్తశతీకి వ్యాఖ్య రాసిన వైదుష్యం వేమారెడ్డిది. కొండవీడు మీద వానపడుతున్నప్పుడో, లేదా హేమంత తుషారం దిగంతమంతా అల్లుకున్నప్పుడో సప్తశతిని చదువుకోవడమనే సౌభాగ్యాన్ని చవిచూసిన అదృష్టం వాళ్ళది. శ్రీనాథుడితో సాంగత్యమంటే సరస్వతితో స్నేహమేనని పెదకోమటి వేమారెడ్డికి తెలుసు. అందుకే తాను రాజు కాగానే అతణ్ణి విద్యాధికారిగా నియమించుకున్నాడు.

చిత్రమేమిమంటే, కొండవీటి కొలువులో విద్యాధికారిగా పనిచేసిన కాలంలో శ్రీనాథుడు ఒక్క కావ్యం కూడా రాయలేదు. 1402 నుంచి 1420 దాకా విద్యాధికారిగా అతడు చేసిన పనులేవై ఉండవచ్చో అరుద్ర కొంత వూహించాడు. అవి ప్రభువు చేసే దానాలకు శాసనాలు రాయడం, రాజసభలో తీరికవేళల్లో విద్యాగోష్టులు నిర్వహించడం, రాజసభకు వచ్చే పండితుల సామర్థ్యాన్ని పరీక్షించడం, రాజుతో కలిసి గ్రంథాలు చదువుకోవడం, రాజు ఇచ్చే సమస్యల్ని పద్యాల్లో పూరించడం, పుస్తక భాండాగారాల్ని సంరంక్షించడం, అరుదైన తాళపత్రాలకు ప్రతులు రాయించడం మొదలైనవి. వాటితో పాటు పాఠశాలల్ని పరీక్షించడం అనే ఒక బాధ్యత కూడా ఉందని రాసాడుగాని, ఆ పాఠశాలలు ఎలా ఉండేవి, అక్కడ ఏమి చదువు చెప్పేవారు, వాటి మీద రాజుకి ఎంతవరకూ అధికారం ఉంది అనే విషయాలు మనకేమీ తెలియవు.

శ్రీనాథుడి కావ్యాలన్నీ కొండవీటికి రాకముందో, కొండవీడు పతనమయ్యాక తాను ఎంతోమంది చిల్లరప్రభువుల్ని ఆశ్రయించవలసి వచ్చినప్పుడో రాసినవే అయినప్పటికీ, ఆ పద్యాల్లో కనిపించే loftiness మాత్రం కొండవీటి దిగంతానిదే అనిపిస్తుంది. కొండవీడుకు రాకముందు రాసిన కావ్యాల్లో అది ఊరించే దిగంతం. ఆ తర్వాతి కావ్యాల్లో అది మరపురాని దిగంతం. కథకాదు, సందేశం కాదు, కల్పన కాదు, అన్నిటికన్నా మించి ఆ కావ్యాలు ఒక తెలుగువాడి హృదయస్పందనం. కొండవీడు కూలిపోయింది కాని ఎన్నటికీ కూలని శాశ్వతనిర్మాణాలు ఆ పద్యాలు.

చాలా ఏళ్ళ కిందట, ఒక రాత్రి టాంక్ బండ్ వైపు నడుస్తున్నాం నేనూ, అజంతా. ఉన్నట్టుండి ఆయన ‘ఏమన్నాడయ్యా మీ మాష్టారు! ఏమి మాట! మంత్రమయవాణి! శ్రీనాథుడిది మంత్రమయవాణి అట! ‘ అని ఆ తర్వాత చాలాసేపటిదాకా ‘మంత్రమయవాణి, మంత్రమయవాణి ‘అని తనలో తాను గొణుక్కుంటూనే ఉన్నాడు. అప్పటికి కొద్దిరోజుల ముందట హైదరాబాదులో ఒక సాహిత్యసభలో మా మాష్టారు శ్రీనాథుడి పైన చేసిన ప్రసంగం విన్నాడు కాబోలు అజంతా, ఆ సమ్మోహనం నుంచి తేరుకోలేక మాట్లాడిన మాటలు అవి. మా మాష్టారికి శ్రీనాథుడంటే ప్రత్యేకమైన ఇష్టముండేది. ఎంత ఇష్టం లేకపోతే కాశీఖండానికి అంత విపులమైన వ్యాఖ్యానం రాస్తారు! దానికి ‘మణికర్ణిక ‘అని పేరు పెట్టారాయన. ఆ పేరు కూడా ఆయనకి ఎంతో ఇష్టం. తన మనవరాలికి కూడా ఆ పేరే పెట్టుకున్నారాయన. శ్రీనాథుడి మీద ఆయన ప్రసంగాలు నేను కూడా ఒకటి రెండు వినకపోలేదు. కాని, నాకు ఎప్పుడూ గుర్తువచ్చేది మాత్రం, శ్రీనాథుడు సరస్వతీదేవిని వర్ణించిన పద్యం:

సింహాసనము చారు సితపుండరీకంబు

చెలికత్తె జిలుపారు పలుకు చిలుక

శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు

పసిడికిన్నెర వీణ పలుకుదోడు

నలువ నెమ్మోముదమ్ములు కేళీగృహములు

తళుకుటద్దంబు సత్కవుల మనసు

వేదాదివిద్యలు విహరణస్థలంబులు

చక్కని రాయంచ యెక్కిరింత

యెపుడునేదేవికాదేవి ఇందుకుంద

చంద్రచందన మందార సారవర్ణ

శారదాదేవి మామక స్వాంతవీథి

నిండు వేడుక విహరింపచుండుగాత.

ఆయన ఈ పద్యాన్ని ఎత్తుకుని, దీని తర్వాత పెద్దన పద్యం ‘చేర్చుక్కగాబడ్డ చిన్ని జాబిల్లిచే ‘పద్యం వినిపించి, శ్రీనాథుడు వర్ణించిన పురాణ సరస్వతిని పెద్దన కావ్యసరస్వతిగా ఎలా మార్చేసాడో వివరించడం ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తూనే ఉంది.

మంత్రమయవాణి అంటే నాకు గుర్తొచ్చేది మరీ ముఖ్యంగా ఈ పద్యం. ఒక శివరాత్రి ప్రభాతాన మిత్రుడు కవితాప్రసాద్ ఫోన్ చేసి, దొరవారూ ఈ పద్యం వినండి అని నోరారా వినిపించాడు.

భవు, భవానీ భర్త భావసంభవ వైరి

భవరోగ భంజను భాలనయను

భోగప్రదుని భోగి భోగిరాజవిభూషు

భూనభోభివ్యాప్తు భువనవంద్యు

భగవంతు భర్గుని భసితాంగరాగుని

భానుకోటి ప్రభాభాసమాను

భాగీరథీమౌళి భగదృగ్విపాటను

భూరథాంగుని భద్రభూతిధరుని

భామినీసువిలాసార్థ వామభాగు

భక్తితోడ భంజింపరో భవ్యమతులు

భావనాభాజులకతండు ఫలములొసగు

భాగ్యసౌభాగ్య వైభవ ప్రాభవములు

ఆ రోజు పొద్దున్నే విన్న ఈ పద్యాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకోవడం కోసమే నేను భీమేశ్వరపురాణం కొనుక్కున్నాను. ఏముంది ఈ పద్యంలో? అసలు ఆ మాటకొస్తే శ్రీనాథుడి కవిత్వమంతటిలోనూ?

కవిత్రయం నుంచి ప్రబంధ యుగానికి శ్రీనాథుడు సేతువు అని తెలుగు సాహిత్య చరిత్రకారులు పదే పదే చెప్పేమాట. నేననుకుంటాను, 14 వ శతాబ్ది కవులు- నాచన సోమన, ఎర్రన, గోనబుద్ధారెడ్డి వంటి సాధు శైవ, వైష్ణవ కవులు శాంతమయ మనస్కులై కవిత్వం చెప్పారు. నిశ్చల సరోవరం మీద కురిసిన వెన్నెలలాంటిది వాళ్ళ కవిత్వం. 16 వ శతాబ్ది ప్రబంధ కవులు పూర్తి సూర్యోదయ సౌందర్యాన్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళు. ఒక నవోదయంలోని ఔజ్జ్వల్యమంతా వాళ్ళ పద్యాల్లో కనిపిస్తుంది. శ్రీనాథుడు రాత్రికీ, దినానికీ మధ్య తలెత్తే ఉషఃకాల సంధ్యలాంటివాడు. ఒక యుగసంధి కవి అతడు. కాకతీయ సామ్రాజ్యానికీ, విజయనగర సామ్రాజ్యానికీ మధ్యకాలంలో నెలకొన్న రాజకీయ-సామాజిక అస్థిరత్వం, దాన్ని నిలబెట్టగలదేమో అనే ఒక ధార్మిక చింతన, కానీ, ఆ ధార్మికతకు నిలబడలేని మానవప్రవృత్తి- దేహానికీ, దైవానికీ మధ్య పడే నలుగులాటని శ్రీనాథుడికన్నా స్పష్టంగా చెప్పిన తెలుగు కవి మరొకడు లేడు.

మన యుగంలో కవిత్వమంటే అభిప్రాయ ప్రకటన. వివిధ ప్రజాసమూహాల అస్తిత్వ ప్రకటన. పోయిన శతాబ్దంలో కవిత్వమంటే ఒక ఉద్బోధ. ఒక మేలుకొలుపు. శ్రీనాథుడి కాలంలో కవిత్వమంటే ఒక వ్యక్తీకరణ. గుండె తెరిచి నోరారా తన ఆర్తిని ప్రకటించుకోవడం. తన హృదయాన్ని అక్షరాలుగా కరిగించి పోతపొయ్యడం. అందుకనే ఆయన పద్యాలు వింటుంటే medium is the message అనిపిస్తుంది. హరవిలాసంలో సిరియాళుణ్ణి వాళ్ళమ్మ పిలుస్తున్న పద్యం వినండి:

రారా వణిగ్వంశ వారాశి హిమధామ!

రారా వికస్వరాంభోరుహాక్ష!

రారా మహాఘోర వీరశైవాచార!

రారా ఘనౌదార్య రాజరాజ!

రారా కుమార కంఠీరవేంద్ర కిశోర!

రారా సమగ్రధీరౌహిణేయ!

రారా మనోభవాకార రూపవిలాస!

రారా అసారసంసార దూర!

రార నా వన్నె వడుగ! రారా తనూజ!

రార సిరియాల! రార నా ప్రాణప్రదమ!

రార నా కుర్ర! నా జియ్య! రార అనుచు

చీరు గారాపు కొడుకు రాజీవ నయన!

ఒక జాతికి, ఒక యుగానికి ఒక గళాన్నివ్వడమంటే ఇది. ఇటువంటి ఒక గొంతు సిద్ధించాక, మామూలు దృశ్యాలు కూడా మహిమాన్వితంగా మారిపోతాయి. పందెం కోళ్ళని క్రీడాభిరామంలో ఎట్లా వర్ణించాడో చూడండి:

హా ! కుమారస్వామి యౌపవాహ్యములార

హా! మంత్రదేవతాస్వాములార

హా! కాలవిజ్ఞాన పాక కోవిదులార

హా! భూత భుక్తికుంభార్హులార!

హా! అహల్యా జారయభనహేతువులార

హా! బలాత్కార కామాంధులార

హా! నిరంకుశ మహాహంకార నిధులార

హా! కామవిజయకాహళములార

హా! ఖగేంద్రములార కయ్యమున నీల్గి

పోవుచున్నారె దేవతాభువనమునకు

మీరు రంభాతిలోత్తమామేనకాది

భోగకార్యార్థమై కోడిపుంజులార!

ఏక కాలంలో heroic గానూ, mock-heroic గానూ కూడా పద్యం చెప్పగలగడం శ్రీనాథుడికే చెల్లింది. ఎందుకంటే అతడు ఫిరోజ్ షాని చూసాడు, దేవరాయల్ని చూసాడు, కర్పూర వసంతరాయల్ని చూసాడు, పెదకోమటి వేమారెడ్డిని చూసాడు. పురిటిసుంకం వేసి అప్రతిష్టమూట కట్టుకుని, ఒక సామాన్యపౌరుడి చేతిలో హతమైన రాచవేమారెడ్డిని కూడా చూసాడు.

కవిత్వమంటే వర్ణన. Coloring. నిజమే. కాని, ముందది ఏదో ఒక స్థలానికీ, కాలానికీ తనని తాను కట్టిపడేసుకోవాలి. అప్పుడు మటుకే ఆ కాలానికీ, ఆ స్థలానికీ చెందనిచోటకి కూడా అది రంగుల గాలిపటంలాగా ఎగరగలుగుతుంది. హిమాలయ తపోవనాల్లో మునికన్యల్ని వర్ణించే నెపం మీద తాను నల్లమల అడవుల్లో చూసిన చెంచు కన్యల్ని వర్ణిస్తాడు కాబట్టే ఈ పద్యం (హ.వి.5:38) కాలాన్ని దాటి నిలబడుతున్నది:

సెలయేటి తెలినీట చిరుబంతి పసుపాడి

సేసక్రుమ్ముళ్ళ పిచ్చియలు తురిమి

గురువిందపేరులు గుబ్బచన్నుల దాల్చి

నెమిలి పించెంపు పుట్టములు గట్టి

పయ్యెద మారుగా పారుటాకులమర్చి

చాదున తిలకంబు సంతరించి

కంకేళి చిగురాకు కర్ణపూరము చేసి

కుసుమపూవుల ధూళి కురుల దాల్చి

చెంచు చిగురాకు బోణుల చేతలెల్ల

అభినయింతురు పర్ణశాలాంతరముల

తండ్రులెందేని జనునప్డు తల్లులెదర

గారవమ్మున మునికన్యకా జనంబు

కొండవీడులో చరిత్ర శిథిలాలు ఒక చిన్న అంశం మాత్రమే. ఆ కొండకొమ్ముల మీద తేలాడే ఆ మబ్బులముందు, మేఘాలముందు మనకి చరిత్ర గుర్తుకు రాదు. మీరు శ్రీనాథుడి కవిత్వం చదివి ఉంటే, ఆ పద్యాల్లోని loftiness ఎక్కడిదో తెలియాలంటే మాత్రం ఒకసారైనా కొండవీడు పోయి రావాలి.

10-8-2020

Leave a Reply

%d bloggers like this: