కొండవీడు-1

Reading Time: 4 minutes

మచ్చుపిచు దక్షిణ అమెరికాలో పెరూలో ఆండీస్ పర్వత శ్రేణి మీద నెలకొన్న ఒక ప్రాచీన గిరిదుర్గం. ఇన్కా తెగవారు అక్కడ పదిహేనో శతాబ్దిలో గొప్ప నిర్మాణాలు చేపట్టారు. ఒక శతాబ్దం తర్వాత స్పానిష్ దండయాత్రల కాలంలో వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసారుగాని, అక్కడ వాళ్ళు నిర్మించిన దేవాలయాల్నీ, ఖగోళ అధ్యయన కేంద్రాల్నీ ప్రపంచం ఇప్పటికీ అద్భుతాలుగా భావిస్తూ ఉంది. గతశతాబ్దిలో లాటిన్ అమెరికా చరిత్రని Canto General (1950) పేరిట పాబ్లో నెరూదా ఒక మహాకావ్యంగా మలుస్తున్నప్పుడు మచ్చుపిచు శిఖరాగ్రం మీద ఏకంగా ఒక ఆశ్వాసమే కేటాయించాడు. The Heights of Machu-Picchu పేరిట ఆ కావ్యంలోని రెండవ ఆశ్వాసం నెరూదా కవిత్వంలోనే ఒక ప్రత్యేకస్థానాన్ని సముపార్జించుకుంది.

ఆ గీతాన్ని మొదటిసారి చదివినప్పటినుంచి ఇప్పటిదాకా కూడా నేనొక చెప్పలేని ఉద్వేగానికి లోనవుతూనే ఉన్నాను. దాన్ని ఎన్నోసార్లు తెలుగు చేయాలని ప్రయత్నించి కూడా విఫలమవుతూనే వచ్చాను. ఎందుకంటే, ఇంగ్లీషుని తెలుగు చేయడం సులభమే. కాని ఆ ఉద్వేగాన్ని, ఆ దర్శనాన్ని తెలుగు చేయడం కష్టం. అందుకు మానసిక శక్తి సరే, శారీరిక శక్తి కూడా కావాలి. ఒక్క గుక్కలోనే ఆయన భూనభోంతరాళాలు చుట్టబెటతాడు. ఉదాహరణకి ఆ గీతంలోని మొదటి వాక్యాలే చూడండి:

~

వసంతానికీ, హేమంతానికీ మధ్య

మహోజ్జ్వలమైన ప్రేమ ఒకటి సుదీర్ఘమైన వెన్నెలరాత్రిని

అనుగ్రహించినట్టుగా

సాగదీసిన సత్తునాణెంలాగా

ఆకులు రాలే శిశిరాగమనవేళ

గాలినుంచి గాలికి, ఒక ఖాళీ వలలాగా

వీథులకీ, వాతావరణానికీ మధ్య

ఇప్పుడే చేరుకుంటున్నాను,ఇప్పుడే పయనమవుతున్నాను.

(నిర్దయాత్మకంగా పరుచుకున్న కళేబరాల

విస్పష్టవైభవోపేత దినాలు,

క్షార నిశ్శబ్దంగా గడ్డకట్టిన ఉక్కు

పిండిలాగా పాలిపోయిన రాత్రి

చుట్టచుట్టుకుపోయిన కేసరాల శోభనరాత్రి)

గంధకవర్ణశబలితపత్రాల పారుష్యం మధ్య

కిందకి చొచ్చుకుపోతున్న ఒక సమాధిస్తంభం దిగువన

కొత్తగా కనుగొన్న ఒక లోకం నడుమ

వాయులీనాల మధ్య నాకోసమెవరో వేచి ఉన్నారు.

దానికి మరింత దిగువన, ఆ అగాధంలో

హిరణ్యతుల్య భూగర్భంలో

ధూమకేతువులతో సానబెట్టిన ఖడ్గంలాగా

నేను నా సంచలిత సుకుమారహస్తాన్ని

భూమి మూలాధారమాతృకలోకి జొనిపాను.

ఆ అగాధజలాల్లో నా నుదురు తాకించాను

ఆ గంధకనిశ్శబ్దం మధ్య

నీటిబిందువులాగా కిందకి ప్రయాణించాను

తిరిగి, ఒక అంధమానవుడిలాగా,

మల్లెపువ్వులాంటి వినష్టమానవవసంతంలోకి

మరలివచ్చాను.

~

వాస్తవిక, అధివాస్తవిక ప్రతీకలతో అతడు దక్షిణ అమెరికా చరిత్రని ఆ పద్యాల్లోకి ఆవాహన చేస్తాడు. ఐరోపీయ మానవుడు ఒక ఆక్రమణ దారుడిగా తన ఖండంలోకి అడుగుపెట్టకముందు అక్కడి మానవుడి వైభవోపేత, శాంతిమయ, సముజ్జ్వల జీవితమెలా ఉండేదో ఊహిస్తాడు, కలగంటాడు, ఆక్రోశిస్తాడు.

ఇటువంటి ఒక కవిత ఏదైనా తెలుగులో ఎవరేనా రాసేరా లేదా ఇటువంటి ఊహ ఎవరేనా చేయగలరా అని నేను చాలాకాలమే ఆలోచించాను. ఉన్నట్టుండి, ఒక రాత్రివేళనో, తెల్లవారు జాము మెలకువవేళనో నాకు ‘కొండవీటి పొగమబ్బులు’ గుర్తొచ్చింది. కొండవీడు కూడా మచ్చుపిచు దుర్గానికి సమకాలికమైన దుర్గమే. ఒక గిరిదుర్గం. ఒక వనదుర్గం. మచ్చుపిచు కన్నా ఒకటి రెండు శతాబ్దాల ముందే మొదలై ఆ తర్వాత కూడా కొనసాగినా, తన వైభవోజ్జ్వల దినాల్లో మాత్రం కొండవీడు దాదాపుగా మచ్చుపిచుకి సమకాలికం.

తన ఆంధ్రప్రశస్తి పద్యాల్లో విశ్వనాథ సత్యనారాయణ ‘కొండవీటి పొగమబ్బులు’ పేరిట పది సీస పద్యాలు రాసారు. ఊహలోనూ, రూపకాలంకారాల్లోనూ, ధారాధునిగా వర్షించిన ఆక్రోశంలోనూ ఈ పద్యాలు నెరూడా పద్యాలకు సాటిరావుగాని, ఒక నష్టగతం పట్ల ఆవేదనలో మాత్రం దాదాపుగా సమానాలనే చెప్పాలి. కొండవీడుకు సమకాలికంగా విలసిల్లిన ఒక గిరిదుర్గం గుంచి నెరుడా ఇటువంటి పద్యాలు చెప్పాడని విశ్వనాథకు తెలీదు. ఎందుకంటే, విశ్వనాథ కొండవీడు మీద రాసిన ముప్పై ఏళ్ళ తర్వాత నెరూదా పద్యాలు వచ్చాయి. ఇద్దరూ కవులూ ఒకరికొకరు తెలీదు. కానీ, పాశ్చాత్యమానవుడు అడుగుపెట్టకముందు తమ మాతృభూమిలో విలసిల్లిన సంస్కృతిపట్ల, నాగరికత పట్లా ఇద్దరి ఆరాధనా, ఆవేదనా ఒక్కలాంటిదే.

విశ్వనాథ బహుశా ఒక ఆషాఢమాసంలో కొండవీడు వెళ్ళి ఉంటాడు. అప్పటికి దారిలేని ఆ ప్రాంతంలో ఆయన కాలినడకన ఆ కొండలు ఎక్కి ఉంటాడు. అడుగడుగునా ఆయన్ని ఆ ఋతుపవన మేఘాలు తాకి, హత్తుకుని, తరలిపోయి మరలా ఇంతలోనే చుట్టుముట్టి దాగుడు మూతలాడి ఉంటాయి. ఆ గిరిదుర్గం వట్టి శిల. చరిత్ర. కాని ఆ మబ్బులు సజీవాలు, నిత్యనూతనాలు. ఆ రాళ్ళ మధ్య తూగాడుతున్న, ఊగాడుతున్న ఆ మబ్బులు ఆయనలో ఒక ప్రవాసినీ, ప్రేమికుణ్ణీ కూడా ఒక్కలానే నిద్రలేపాయి. ఆ పద్యాలు ఎత్తుకుంటూనే, మొదటి పద్యంలోనే ఏమంటున్నాడో చూడండి:

~

దగ్ధాంధ్ర రాజ్య విధూత ధూమమ్ము

వలె కొండ బురుజుల కెలనలేచి

బురుజు కొమ్మల వీడిపోలేని రెడ్ల కీ

రితి వోలె పెను రాళ్ళ నతుకులు పడి

రెడ్ల కందా వెన్కరేగు వంటింటి

పెన్బొగ వోలె కుమురులై ముందు సాగి

ద్రాగ్ధావదాంధ్ర స్వతంత్రతా రమవోలె

కొండలంటీయంటకుండ పోయి

శ్యామలీభవద్గ్రాస ఘాసాదనార్థ

మొలయు వెల్లావుల కదంబములుగ నిలిచి

కొండకొమ్ములు లో దాచుకున్న కొత్త

కొత్త పొగమబ్బులలమె నీ కొండ కొసల.

(దగ్ధమై పోయిన ఆంధ్ర రాజ్యం నుండి పైకి లేచిన పొగలాగా కొండబురుజుల మీద కొత్త కొత్త పొగమబ్బులు అలముకున్నాయి. ఇంకా ఆ కొండలమీది పాతబురుజుల్ని పట్టుకు వేలాడుతూ వదిలిపోలేని రెడ్డిరాజ్యపు కీర్తిలాగా ఆ మబ్బులు పెద్దపెద్ద రాళ్ళ మధ్య చిక్కుకున్నాయి. ఒకప్పటి రెడ్డి రాజుల పాకశాలల వెనక ఇంకా వంటలు నడుస్తున్నట్లుగా రేగుతున్న పెద్దపొగలాగా ముందుకు నడిచి, తగలబడిపోయిన ఆంధ్ర స్వాతంత్య్రలక్ష్మి లాగా అవి ఆ కొండల్ని అంటీ అంటకుండా ఉన్నాయి. ఆ మబ్బుల్లో కొన్ని నల్లబడ్డ గడ్డిని మేయడానికి వచ్చిన తెల్లావుల మందల్లాగా కనబడుతున్నాయి.)

~

ఏనాడు చదివానో ఈ పద్యాలుగాని ఒకసారైనా కొండవీడులో అడుగుపెట్టి ఆ పొగమబ్బుల్ని చూడాలన్న ప్రగాఢమైన కోరిక ఒకటి నాలో గూడు కట్టుకుంటూ వచ్చింది. ఏడెనిమిదేళ్ళ కిందట, మిత్రుడు కవితా ప్రసాద్ తో కొలిసి వెన్నముద్ద కృష్ణుడి గుడిదాకా వెళ్ళగలిగాను. అక్కణ్ణుంచి దూరంగా కొండవీటి పర్వతశ్రేణిని చూడగలిగాను. గంభీరంగానూ, ఏదో ఒక అపూర్వనిధినిక్షేపానికి తాళం వేసిన మంజూషలానూ కనిపిస్తున్న ఆ కొండల్ని చూసి ఆ కొండకొమ్ముదాకా ఎక్కగలిగే రోజు ఏనాడు వస్తుందో అనుకున్నాను.

ఏమైతేనేం, ఇన్నాళ్ళకి కొండవీడు వెళ్ళగలిగాను. ఈ ఆదివారం కాక, పోయిన ఆదివారం కొండవీడు లో అడుగుపెడుతూ, నెరుదా లానే నేను కూడా

And so I scaled the ladder of the earth

amid the attrocious maze of lost jungles

upto you..

అనుకున్నాను. అప్పుడు విశ్వనాథని తాకిపోయిన ఆషాఢమేఘాలకి బదులు ఇప్పుడు శ్రావణ మేఘ సోపానాలు. పట్టపగలు వెలిగించిన దీపాల్లాంటి ఆ మేఘాల మధ్య కొండవీడుని చూడటం, అక్కడ తిరుగాడటం ఒక అనుభవం. ఆ అనుభవాన్ని మాటల్లో పెట్టాలంటే, మళ్ళా నెరూదానో, విశ్వనాథనో స్మరించక తప్పదు.

~

ఇడుపుల విలిఖించినారేమొ నా ముక్తాక్ష

రములుగా దుర్గకుడ్యముల నొలసి

ఇచట ముగ్గులు పెట్టిరేమొ నా క్లప్తము

క్తా రేఖగా గిరిస్థలము మెరసి

ఇట వితానమమర్చిరేమొ నా మృదు మరు

చ్చాలిత మధ్యమై చదల తీర్చి

ఇటకేళకుళి పెట్టిరేమొ నా తుదల శీ

తల పృషత్పరిషించితముల కదలి

ప్రాత రనతిక్రమిత యామభానురోచి

రాసమాత్త ధావళ్యమర్యాదమైన

లేత ఈ పొగమబ్బు, పురాతనంబు

తవ్వుచున్నది రెడ్ల ఆంధ్ర ప్రశస్తి.

(దుర్గకుడ్యాల మీద వ్యాపించిన ఆ మబ్బుల్ని చూస్తుంటే ఎవరో ముత్యాలతో రాసినట్టుంది. ఆ కొండనేలమీద ముత్యాలతో ముగ్గులు పెట్టినట్లుంది. ఆకాశవీథిలో ఎవరో ఒక చాందినీ నిలబెట్టినట్టుంది. చల్లటినీటి జల్లు చిమ్మటానికి జలయంత్రాలు అమర్చారా అన్నట్టుంది. నల్లటి చీకటి రాత్రిని దాటి సూర్యకాంతి లాగా ఒక ధావళ్యమర్యాదని కనబరుస్తున్న ఈ లేతమబ్బులు ప్రాచీన కాలపు ఆంధ్రరాజప్రశస్తి మీద వెలుగుప్రసరింపచేస్తున్నట్టుంది.)

~

ఆ రోజు నేను చూసిన కొండవీడు కొంత నేల, కొంత నింగి. కొంత రాయి, కొంత మొయిలు. కొంత గాయం, కొంత గానం. ఆ మేఘాలు లేకుండా ఆ కొండవీడు నాకు గుర్తురాదన్నంతగా మేఘమయమైపోయింది ఆ నాటి దర్శనం.

కొండవీటి పొగమబ్బుల్లో చివరి పద్యం నిజంగా మహిమాన్వితమైన పద్యం. తొలివానపడ్డప్పటి మట్టివాసనలాగా నిన్ను జీవించినంతకాలం వదిలిపెట్టని పద్యం:

~

నా ప్రాణములకు నీ పొగమబ్బుల

కేమి సంబంధమో! యేను గూడ

పొగమబ్బునై కొండ చిగురుకోనలపైన

బురుజుల పైని, కొమ్ములకు పైని

వ్రాలిపోనో, మధ్య వ్రీలిపోనో, నేల

రాలిపోనో గాలి తేలిపోనో!

నా ఊహ చక్రసుందరపరిభ్రమణమై

ఈ పొగమబ్బులనే వరించె

ఎన్ని పొగమబ్బులెరిగిలే నేను మున్ను?

తూర్పుకనుమలు విడుచునిట్టూర్పులట్టి

విచటి ఈ పొగమబ్బులే యెడదలోని

లలితము మదీయ గీతినేలా వెలార్చు!!?

(నా ప్రాణాలకీ, ఈ పొగమబ్బులకీ ఏమి సంబంధమో! నేను కూడా ఒక పొగమబ్బునై కొండ చిగురుకోనల మీద, బురుజులమీద, కొండకొమ్ములమీద వాలిపోనా, మధ్యలో కూలిపోనా, నేల మీద రాలిపోనా, గాలిలో తూగిపోనా! నా ఊహ ఈ పొగమబ్బుల చుట్టూతానే అందంగా తిరుగాడుతోంది. నేను ఇంతకు ముందు ఎన్ని పొగమబ్బులు చూసి ఉండలేదు! కాని తూర్పు కనుమలు విడుస్తున్న నిట్టూర్పుల్లాంటి ఈ పొగమబ్బులేమిటో ఇలా నా లోపలనుంచి లలితగీతాల్నిబయటకి లాగుతున్నాయి!)

~

విశ్వనాథ చరిత్రని ప్రేమించాడు, నెరూదాలానే. కాని నాకు చరిత్ర పట్ల ఆసక్తి లేదు. చరిత్ర ఎక్కడ పద్యంగా రూపుదిద్దుకుంటుందో ఆ స్థలాలపట్లనే నాకు మక్కువ. చరిత్రని దాటి ఎక్కడ పద్యం నిలబడుతుందో ఆ తావులకోసమే నేను తపిస్తాను. అక్కడ కొండవీడు ఘాట్ రోడ్ మలుపు తిరుగుతుండగా, రోడ్డుమలుపు తిరిగే గోడ మీద శ్రీనాథుడి పద్యమొకటి, ఈ మధ్యనే అక్కడ రాసిపెట్టింది, చప్పున నా దృష్టిని ఆకర్షించింది. విజయనగరం వెళ్ళినప్పుడు శ్రీనాథుణ్ణి, మీది ఏ రాజ్యం, ఏ దుర్గం అని ప్రౌఢదేవరాయలు అడిగినప్పుడు శ్రీనాథుడు చెప్పిన పద్యం:

~

పరరాయ పరదుర్గ పరవైభవశ్రీల

గొనకొని విడనాడు కొండవీడు

పరిపంథి రాజన్యబలముల బంధించు

గురుతైన ఉరిత్రాడు కొండవీడు

ముగురు రాజులకును మోహంబు పుట్టించు

కొమరుమీరిన వీడు కొండవీడు

చటులవిక్రమకళాసాహసంబొనరించు

కుటిలాత్ములకు నూడు కొండవీడు

సాధు సైంధవభామినీ సరసవీర!

భటపటానేక హాటక ప్రకటగంధ

సింధు రాద్భుత మోహనశ్రీలం దనరు

కూర్మి నమరావతికి జోడు కొండవీడు.

7-8-2020

Leave a Reply

%d bloggers like this: