కళా సాఫల్యం

ఒక కళ ఒక సంపద. ఒక కుటుంబం లేదా ఒక గ్రామం ఒక ప్రాంతం ఒక నాట్యాన్నో, ఒక సంగీతాన్నో, ఒక శిల్పాన్నో లేదా ఒక కలంకారీనో తరతరాలుగా సాధన చేస్తూ ఉన్నదంటే అదొక పుణ్యభూమి. కళాభిమానుల తీర్థస్థలి. తెలుగునాట కూచిపూడి అటువంటి ప్రదేశం. కాని ఆ నాట్యభూమిలో ఇప్పటికి గాని అడుగుపెట్టలేకపోయాను.

మొన్న శనివారం నాడు కొన్ని గ్రామాలు, పాఠశాలలు సందర్శిస్తూ సాయం సంధ్యావేళకి కూచిపూడి వెళ్ళాను. ‘కూచిపూడి’ అని రాస్తుంటేనే నా వేళ్ళల్లో విద్యుత్తు ప్రవహిస్తోంది. తెలుగు వాళ్ళ అదృష్టం కొద్దీ ఇక్కడ ఏడు వందల ఏళ్ళ కిందట సిద్ధేంద్రయోగి ప్రభవించాడు. జానపదకవిత్వాన్నీ, నాట్యశాస్త్రాన్ని సమన్వయిస్తూ ఒక నవీన నాట్యరీతిని ఆవిష్కరించాడు. ఇప్పుడు ఆ నాట్యసంప్రదాయం ఖండాంతరాలకు విస్తరించింది. కూచిపూడి అనగానే ఒక గ్రామం కాక ఒక నర్తకి నాట్యభంగిమ మనకళ్ళముందు మెదిలే స్థాయికి ఈ రోజు కూచిపూడి చేరుకుంది.

అక్కడ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం ఒకటి గత కొన్ని దశాబ్దాలుగా నాట్యపాఠశాలగానూ, అధ్యయన కేంద్రంగానూ పనిచేస్తున్నది. ఆ పీఠాన్ని కొన్నేళ్ళ కిందట తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేసి నాలుగు ఎకరాల స్థలంలో కళాశాలకు, వసతిగృహానికి భవనసదుపాయంతో పాటు ఒక గ్రంథాలయాన్ని, ఒక రంగస్థలాన్ని కూడా ఏర్పాటు చేసారు. ఆ కేంద్రానికి ప్రధానాచార్యులుగా పనిచేస్తున్న డా.వేదాంతం రామలింగశాస్త్రిగారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి తమ ప్రాంగణమంతా తిప్పి చూపించారు. అక్కడ ఒక Hall of Fame వంటి ఒక మందిరంలో కూచిపూడి నాట్యకళను పరిపుష్టం చేసిన మహనీయులందరి ఫొటోలు, చిత్రపటాలూ ఉన్నాయి. ఆయన మమ్మల్ని ప్రతి పటం దగ్గరా ఆపి ప్రతి ఒక్క మహనీయుల గురించీ స్థూలంగా పరిచయం చేసారు. కాని ఆ స్థూల పరిచయమే ఒక సుదీర్ఘ చరిత్ర. అదొక నక్షత్రసముదాయం. అటువంటి మహనీయులు అక్కడ జీవించారనీ, కూచిపూడిని ఒక సమగ్ర కళగా తీర్చిదిద్దటమే తమ జీవితకాలపు తపస్సుగా భావించారనీ నాతో సహా బయటి ప్రపంచానికి ఏమీ తెలియదు.

ఆయన నాకు మరొక ఉపకారం కూడా చేసారు. ఆ ప్రాంగణం నుంచి వచ్చేటప్పుడు తన పుస్తకం ‘తెలుగులో కూచిపూడి నాటక వికాసం’ నాకు బహూకరించారు. ఆ పుస్తకం ఒక విజ్ఞాన సర్వస్వం. ఏడు శతాబ్దాల కిందట భామాకలాపంగా మొదలైన కూచిపూడి కాలక్రమంలో ఒక మార్గ-దేశి సంగమ స్థలిగా వికసించిందో ఆయన సవివరంగా వివరించారు. కూచిపూడి అంటే ఏమిటని తెలుసుకోగలిగేవారికి బహుశా ఆ పుస్తకాన్ని మించిన సమాధానం ఉండదనుకుంటాను.

అక్కణ్ణుంచి ఆ ఊళ్ళోనే ఉన్న శివాలయానికి వెళ్ళాం. అక్కడ ఆ దేవాలయ ధర్మకర్త, కూచిపూడి నాట్యాన్ని సంరంక్షించుకుంటున్న డా.పసుమర్తి కేశవప్రసాద్ మమ్మల్ని సంతోషంగా స్వాగతించారు. ఆయనకు నన్ను నేను పరిచయం చేసుకోగానే ఆయన వదనంలో విప్పారిన సంతోషం ఇంతా అంతా కాదు. అందుకు కారణం నేను ఒకప్పుడు ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి సంగీతరూపకాల మీద రాసిన వ్యాసం ఆయన చదివి ఉండటమే. ‘కూచిపూడి నృత్య రూపకాలు ‘ పేరిట సంగీతరూపకాల మీద ఆ వ్యాసం రాసేముందు నేను కూచిపూడి ఒక్కసారి వచ్చిఉంటే బాగుండేదని ఇప్పుడనిపిస్తున్నది నాకు. కాని కేశవప్రసాద్ గారు నన్ను కలుసుకోవాలని ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్నాననీ, ఇవాళ నా అంతట నేనే వారి గ్రామానికి రావడం తనకెంతో సంతోషం కలిగిస్తున్నదనీ చెప్పారు. ఆ సంతోషంతోనే ఆ దేవాలయంలో పూజలు చేయించారు. అక్కడే శేషవస్త్రాలతో మమ్మల్ని ఆశీర్వదించారు. ఆ సమయంలోనే నోరారా ఎలుగెత్తి భుజంగరాయ శర్మగారి పద్యమొకటి ఆలపించారు.

ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న వెంపటి చినసత్యంగారి విగ్రహం చూపించారు. అక్కడున్న చిన్న ఆవరణలో కూచిపూడి ప్రముఖుల విగ్రహాలున్నాయి. తాను ప్రతి ఏటా అఖిలభారత కూచిపూడి నాట్యోత్సవాలు జరుపుతున్నామని కూడా చెప్పారు. ‘కూచిపూడి కళాక్షేత్రంలో పాఠాలు చెప్పడం కాక, నాట్యోత్సవాలు జరపడం కాక, ఇప్పటికీ ఇళ్ళల్లో కూచిపూడి కళని నేర్పుతున్నవాళ్ళూ, అభ్యసిస్తున్న వాళ్ళూ ఎవరేనా ఉన్నారా, ఉంటే ఒక్క ఇంట్లోనేనా అడుగుపెట్టి చూడాలని ఉంది ‘ అన్నాను.

నా కోరికని మన్నించి ఆయన ఒక ఇంట్లోకి దారితీసారు. అది డా.చింతా రవిబాలకృష్ణ అనే నాట్యాచార్యుల ఇల్లు. ఆయన కూచిపూడి కళాపీఠంలో అధ్యాపకులు. వేదాంతం సత్యనారాయణ శాస్త్రిగారి మీద డాక్టొరల్ పరిశోధన చేసిన విద్వాంసులు. ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత దాదాపు అరగంట సేపు మాకు లభించినదొక అద్వితీయ అనుభవం. కూచిపూడి కళాసరస్వతి మామీద ప్రేమతో మాకు తన దర్శనాన్ని అనుగ్రహించిన అరుదైన సందర్భం.

కూచిపూడి నాట్యాన్ని పరిచయం చేసే ఒక్క నాట్యశకలమేదన్నా మాకు చూపించగలరా అని అడిగితే ఆయన ప్రహ్లాదచరిత్ర రూపకంలో హిరణ్యకశిపుడి ప్రవేశ దరువుని అభినయించి చూపించారు. ఆ దరువు మొదలుపెట్టబోతూ నట్టువాంగ తాళం కేశవప్రసాద్ గారి చేతుల్లో పెట్టారు. అంతే, అప్పటిదాకా ఒక ఇంట్లో చిన్న డ్రాయింగు రూముగా ఉన్న ఆ స్థలం కాస్తా ఒక రంగభూమిగా మారిపోయింది. ఆరుబయట, ఆముదపు దీపాల వెలుతుర్లో, అశేష ప్రజావాహిని చూస్తూండగా తాళాలు, మద్దెలలు, తంత్రీవాద్యాల మధ్య హిరణ్యకశిపుడు రంగస్థలం మీద ప్రవేశిస్తున్నట్టే ఉండింది మాకు. ఆ తర్వాత ఆ నాటకంలోంచే హిరణ్యకశిపుడూ, లీలావతీ, ప్రహ్లాదుల సంభాషణని ఆయనొక్కరే మూడుపాత్రల వాచికంతోనూ అభినయించడం మరొక విశేషం. ఇక చివరగా, క్షేత్రయ్య పదమొకటి పూర్తిగా అభినయించారు. ఆ ఒక్క పదం అభినయంలో యుగాలుగా కూచిపూడి చేస్తూ వచ్చిన సాధన మొత్తం ప్రతిబింబించింది. ఆ పదాభినయం చేస్తున్నది ఒక పురుషుడనీ, అది కూడా ఎటువంటి ఆహార్యం లేకుండా చేస్తున్నాడనీ అనిపించలేదు మాకు. విరహంతో కాగిపోతున్న ఒక విరహోత్కంఠితనే చూస్తున్నట్టనిపించింది. ఇది కదా కళ, ఇది కదా కళా సాఫల్యం అనిపించింది.

‘ఇక్కడ ఈ గుళ్ళో అమ్మవారిని వదిలి ఎక్కడికీ వెళ్ళాలనిపించలేదు. అందరూ వదిలిపెట్టివెళ్ళిపోతే అమ్మనెవరు చూసుకుంటారు ‘ అన్నారాయన.

ఆయన అభినయం చూస్తున్నంతసేపూ నాకు కథకళి, యక్షగానాలు తలపుకొస్తూ ఉన్నాయి. మళయాళ సాహిత్యంలో, సినిమాలో కథకళి ఒక ప్రధానభాగం. అక్కడి దేవాలయాల్లో ఏ ఉత్సవం కూడా కథకళి లేకుండా పూర్తికాదు. కన్నడంలో యక్షగానాలు గత రెండు శతాబ్దాలుగా కొనసాగుతూండటమే కాదు, శివరామకారంత లాంటి రచయిత, ఆ ప్రక్రియతో మమేకమై జీవితాంతం ప్రయోగాలు చేపడుతూనే ఉన్నాడు. కాని నిజానికి యక్షగానం ఎవరిది? అది తెలుగువాళ్ళ సృష్టి. నెట్ లోకి వెళ్ళి యక్షగానం గురించి చదవండి, అది కన్నడ కళాప్రక్రియగా కనిపిస్తుంది. కాని అది కృష్ణాతీరంలో వికసించిన ప్రక్రియ. పాల్కురికి సోమన, శ్రీనాథుడు ప్రస్తావించిన కళారూపమది. దాన్ని మరింత మార్గశైలితో తీర్చిదిద్ది కూచిపూడి భాగవతులు ఒక అపురూపమైన సంగీతనాట్య ప్రక్రియని రూపొందించారు. తర్వాత రోజుల్లో దాన్ని మేలట్టూర్ భాగవతులు తంజావూరు తీసుకుపోయారు. ఆ వారసత్వంలోంచే త్యాగరాజస్వామి ప్రహ్లాద విజయం, నౌకా చరిత్రమనే సంగీత రూపకాల్ని సృష్టించాడు.

కూచిపూడి ఆంధ్రుల ఒపేరా. యూరోపులో ఇటాలియన్ ఒపేరాతో ఆధునిక రచయితలు విస్తారంగా ప్రయోగాలు చేసారు. కూచిపూడితో కూడా అటువంటి ప్రయోగ పరంపర రావలసి ఉంది. కృష్ణశాస్త్రి, భుజంగరాయ శర్మ వంటి వారు ఎవరో ఒకరిద్దరు తప్ప ఆధునిక కవులు ఆ ప్రక్రియను సమీపించకపోవడం వల్ల నష్టపోయింది సాహిత్యమే. యక్షగానానికి పూర్వవైభవం తీసుకు వచ్చే క్రమంలో శివరామకారంత షేక్ స్పియర్ నాటకాల్ని యక్షగానాలుగా మార్చాడు. మనం కూడా అటువంటి ప్రయోగాలు చేపట్టాలి. యక్షగానం ప్రధానంగా దేశి ప్రక్రియ. అందులో ఉన్న రగడలు, కొరవంజి దరువులు, ఏలలు, పదాలు పూర్తిగా తెలుగు జీవనాడిని ప్రతిబింబించేవి. ఆ తాళాలు ముఖ్యంగా చాపుతాళం వంటివి తెలుగు వాళ్ళ అంతస్సత్త్వ్వాన్ని పట్టిచ్చినట్టుగా మరే కళారూపాలూ పట్టివ్వలేవు. తెలుగు సాహిత్యచరిత్రను పరిశీలించినా కూడా, తెలుగు నేల రాజకీయంగా అస్థిరత్వం నెలకొన్నప్పుడల్లా యక్షగానం ముందుకొస్తూండటం కనిపిస్తుంది. ఆ అపురూపమైన కళా ప్రక్రియ గురించి తెలుసుకోకపోవడం వల్లా, అందులో రచనలు చేయకపోవడం వల్లా నష్టపోయింది ఆధునిక తెలుగు కవులేనని మరో మారు అర్థమయింది.

22-7-2020

Leave a Reply

%d bloggers like this: