ఒక తల్లిదండ్రుల కథ

నరేంద్ర లూథర్ ఆంధ్రప్రదేశ్ కాడర్ కి చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేసారు. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో ఏదో ఒక సమావేశంలో ఆయన్ని ఒక్కసారే చూసాను. ఆయన హైదరాబాదు చరిత్రపట్లా, దక్కన్ పీఠభూమిలోని ప్రాచీన శిలలపట్లా గొప్ప మక్కువ కలిగిన మనిషి అని కూడా విన్నాను. నాకు ఆయన గురించి తెలిసింది అంతవరకే.

రెండేళ్ళ కిందట నా మిత్రుడూ, గొప్ప ఫొటోగ్రాఫరూ అయిన Venu Challa ఇండియా వచ్చినప్పుడు ఒక మధ్యాహ్నం మేమొక హోటల్లో లంచ్ చేస్తూండగా, అతడు నరేంద్ర లూథర్ తనకి మంచి మిత్రుడనీ, ఫొటోగ్రఫీ పట్ల ఇష్టం తమిద్దర్నీ కలిపిందనీ, తాను హైదరాబాదు ఎప్పుడు వచ్చినా ఆయన్ని కలవకుండా వెళ్ళననీ చెప్పాడు. అప్పుడే ఆయన గురించిన చాలా విషయాలు నాతో పంచుకుంటూ, ఆయన రాసిన A Bonsai Tree (2017) చదవమని చెప్పాడు. ఆ పుస్తకం కొన్నానుగానీ, ఆ రోజే ఆ కాపీ అట్లానే సోమయ్యగారికి ఇచ్చేసాను. తిరిగి ఇన్నాళ్ళకి మొన్న ఆ పుస్తకం మరొక కాపీ కొనుక్కోగలిగాను. నిన్న హైదరాబాదు నుంచి విజయవాడ వస్తూండగా, ఆ పుస్తకం తెరిచినవాణ్ణి, ముగించేదాకా పక్కన పెట్టలేకపోయాను. ముఖ్యంగా పుస్తకం చివరిపుటలకు వచ్చేటప్పటికి, కళ్ళనీళ్ళతో నా కళ్ళు మసకబారిపోయాయి. అందుకని, ఆ చివరి పేజీలు మాత్రం రాత్రికి గాని పూర్తిచెయ్యలేకపోయాను.

అది ఒక ఐ ఏ ఎస్ అధికారి ఆత్మకథ మాత్రమే అయి ఉండే ఆ పుస్తకం నాలో ఎటువంటి భావోద్వేగాన్నీ రేకెత్తించలేకపోయి ఉండేది. అందులో ఎక్కువపేజీలు ఆయన ఉద్యోగజీవితం గురించి లేకపోలేదుగాని, అది ప్రధాన ఇతివృత్తం కాదు. అది ముఖ్యంగా ఒక తండ్రి కథ. తన కొడుకు మద్యానికి బానిసగా మారడాన్ని కళ్ళారా చూస్తూ నిస్సహాయంగా నిలబడిపోయిన ఒక తండ్రి కథ. తన కుమార్తె ఆమె చిన్నతనంలోనే ఒక అబ్యూజ్ ను ఎదుర్కోవలసి వచ్చి, ఆ అనుభవం ఆమెను లోపల్లోపల ఛిద్రం చేసేస్తూ ఉంటే, ఆ సంగతి ఎన్నాళ్ళకో గాని తెలుసుకోలేకపోయిన ఒక తల్లిదండ్రుల కథ అది.

ఆరేడేళ్ళ కిందట డా. రఘురామ రాజు నన్ను హరిలాల్ గాంధి జీవితకథని తెలుగులోకి అనువదించమని అడిగినప్పుడు, ఆ పుస్తకం అనువాదం చేస్తున్నంతసేపూ నా కళ్ళు తడిసిపోతూనే ఉండేవి. రోజూ మిత్రుడు స్వామి మా ఇంటికి వచ్చి, పుస్తకం అనువాదం నేను చెప్తుంటే, కంప్యూటర్ మీద టైపు చేస్తూ ఉండేవాడు. చెప్పలేనంత దుఃఖంతో చాలాసార్లు మాట పెగలక నా గొంతు పూడుకుపోతుండేది. నేను చెప్తున్నంతసేపూ విజ్జి వంటగదిలో తన పని తాను చేసుకుంటూనే ఒక చెవి ఇటు వొగ్గి నేను చెప్తున్న కథ వింటూ తాను కూడా కన్నీళ్ళు గొంతులో కుక్కుకుంటూ ఉండేది.

మద్యపానం, సెక్సువల్ అబ్యూజింగ్ ప్రవృత్తి- ఈ రెండూ ఒక మనిషినే ఆవహిస్తే అది హరిలాల్ గాంధీ అవుతాడు. హరిలాల్-మహాత్ముడి పెద్దకొడుకు. ఒకరోజు స్వామి టైపు చేసి వెళ్ళిపోయిన తరువాత, నేనట్లానే ఆ కంప్యూటర్ టేబుల్ దగ్గర కూచుని ఉండగా విజ్జి నా దగ్గరకు వచ్చి అంది: ‘గాంధీ గారి గురించి నాకేమీ తెలీదు. కానీ ఆయన కొడుకు గురించిన ఈ సంగతులన్నీ వింటూంటే, ఆయన పట్ల నాకు అపారమైన గౌరవం, చెప్పలేనంత జాలీ కలుగుతున్నాయి. తన కొడుకుజీవితం తన కళ్ళముందే నాశనమవుతుంటే ఆయనంత నిబ్బరంగా ఎలా ఉండగలిగాడు. తక్కినవాళ్ళ కోసం ఎలా ఆలోచించగలిగారు! ‘ అని.

ఇప్పుడు నరేంద్ర లూథర్ ఆత్మకథ చదువుతూ ఉంటే మరొకసారి నా హృదయం రుద్ధమై పోయింది. కాని, ఈయన గాంధీ కన్నా అదృష్టవంతుడు. గాంధీదంపతులకి లభించని భాగ్యం లూథర్ దంపతులకి లభించింది. మద్యానికి బానిసగా మారిన తమ కొడుకు ముప్పై ఏళ్ళ పాటు సాగించిన పోరాటంలో చివరికి విజయం సాధించడమే కాక ఆల్కొహాలిక్ ల పునరావాసం కోసం ఒక సంస్థ నడిపే స్థాయికి చేరుకోగలిగాడు. ఆ రకంగా ఇది ఒక Prodigal son కథ మాత్రమే కాదు, Paradise Regained కూడా.

మద్యం తాగడం, సెక్సువల్ అబ్యూజ్- ఈ రెండూ ఈ రోజు మన యువతని పట్టుకున్న వ్యాథులు. ఈ రెండింటికీ ప్రధాన స్ఫూర్తి మన సినిమాలే. ఏ కమర్షియల్ చిత్రమైనా చూడండి- ప్రతి పావుగంటకీ తాగే సీను ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. ముప్పై నలభయ్యేళ్ళ కింద సినిమాల్లో ఆ దృశ్యాలు చాలా అరుదుగా ఉండేవి. ఉన్నా కూడా అదేదో ఇతివృత్తం కోసం చూపిస్తున్నట్టుగా, కథాగమనంలో భాగమన్నట్టుగా ఉండేవి. కాని ఇప్పుడు సినిమాల్లో చూపించే తాగుడు దృశ్యాలు చూడండి. ఆ తాగడంలో కేవలం ఒక వ్యసనం మాత్రమే కాదు, చెప్పలేనంత వైల్డ్ నెస్ కనిపిస్తుంది. హీరో తాగుతాడు. అతడి పోకిరీ మిత్రులు తాగుతారు. విలన్ తాగుతాడు. వాడి దగ్గర ఉండే కిరాయి గూండాలు తాగుతారు. హీరో తండ్రి తాగుతాడు. అతడి బావమరిది తాగుతాడు. వెరసి మొత్తం సినిమా అంతా తాగుడే ఉంటుంది.

తాగడం మంచిది కాదని ఇప్పుడెవరూ చెప్పేవాళ్ళు లేరు. ఒకప్పుడు ఉపాధ్యాయులు చెప్పేవారు. సంస్కర్తలు చెప్పేవారు, కవులూ, రచయితలూ చెప్పేవారు. కాని గత ఇరవయ్యేళ్ళుగా ఒక సాహిత్య సభ జరగ్గానే ఆ తర్వాత మరొక సభ, సభానంతర సభ, జరక్కుండా ఉండే దృశ్యాలు నేను చూసినవి చాలా తక్కువ.

ఒకప్పుడు మా ఊరినుంచి కాకినాడ లేదా రాజమండ్రి వెళ్ళేటప్పుడు రాత్రి తొమ్మిది దాటాక ఏ దుకాణాలూ కనిపించేవి కావు. ఇప్పుడు రాత్రి తొమ్మిది దాటాక మద్యదుకాణాలు తప్ప మరేవీ కనిపించవు. ఇంత మద్యం ఎవరు తాగుతున్నారు? ఆ కుటుంబాలు ఎవరివి? ఎవరి ఇళ్ళల్లో పెద్దలు, పిల్లలు ఆ మద్యానికి బానిసలై తమ జీవితాల్ని ధ్వంసం చేసుకుంటున్నారు? మద్యం ఏరులై పొంగిపొర్లిన తరువాతి ఘట్టం సెక్సువల్ అబ్యూజ్, అత్యాచారం, ఇప్పుడు కొత్తగా, ప్రతి అత్యాచారం తర్వాతా ఒక హత్య.

తాగుడు ఏమి చెయ్యగలదో హరిలాల్ గాంధీ జీవితకథ చదివితే తెలుస్తుంది. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కొడుకు- ఈడెన్ ఉద్యానంలాంటి ఒక కుటుంబంలో, సైతాను ఆపిల్ పండుతో కాదు, ఒక మద్యం సీసాతో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఆ కుటుంబం ఎంత నరకం అనుభవిస్తుందో ఇదిగో ఇటువంటి కథలు చదివితే తెలుస్తుంది. నరేంద్ర లూథర్ తల్లిదండ్రులు దేశవిభజన సమయంలో రావల్పిండి నుండి అమృత సర్ కి కాందిశీకులుగా వచ్చారు. యాభై కిలోమీటర్ల ప్రయాణం మూడు రోజుల పాటు ప్రాణాలు అరచేతపట్టుకుని ప్రయాణించిన ఆ అనుభవం నరేంద్ర లూథర్ తన జీవితం పొడుగునా గుర్తుపెట్టుకునే ఉన్నాడు. ఆ హత్యాకాండని కూడా అతడు తప్పించుకోగలిగాడుగాని, చాపకింద నీరులాగా తన ఇంట్లోకి ప్రవేశించి మద్యం ఒక రాక్షసిలాగా తన కన్నకొడుకు జీవితాన్ని తన కళ్ళముందే ఛిద్రం చేస్తూ ఉంటే చూడకుండా తప్పించుకోలేకపోయాడు.

కాని, ఇది ఒక అద్భుతమైన కథ. మద్యమో , మరొకటో చేతికి అందివస్తారనుకున్న పిల్లలు ఏదో ఒక వ్యసనం బారినపడ్డప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత నిబ్బరంగా నిలబడాలో చెప్పే కథ. తమ మానవత్వాన్ని కాపాడుకుంటూనే తమ పిల్లల్నెలా కాపాడుకోవాలో చెప్పే కథ. ప్రతి ఒక్క తల్లీ, ప్రతి ఒక్క తండ్రీ చదవవలసిన కథ. ‘లెక్కకు వచ్చేవిక్కడ ఒక కిరణం, ఒక నవ్వని, ఒక పువ్వని ‘ అంటాడు బైరాగి. అంతిమంగా మనిషి జీవితంలో మిగిలేది, నిజమైన ఆనందాన్నిచ్చేది, తన పిల్లాపాపల్తో, ఒక సాయంకాలం కలిసి భోంచెయ్యగలగడం, మామూలు మాటలు మామూలుగా మాట్లాడుకోగలగడం, తండ్రి కొడుకునీ, కొడుకు తండ్రినీ చూసుకోగలగడం, ఒకరి సన్నిధిని మరొకరు కోరుకోగలగడం.

‘తాగకండి, మద్యానికి దూరంగా ఉండండి’ అని చెప్తే అది బళ్ళో గోడమీద నీలిరంగులో రాసిన నీతివాక్యంలాగా ఎవరికీ పట్టదు, ఎవరికీ వినిపించదు. అందుకని ఇప్పుడెవరూ ఆ మాటలు చెప్పడానికి సాహసించడం లేదు. కాని ‘తాగండి, విచ్చలవిడిగా తాగండి, తాగుతూ ఉద్యోగం చెయ్యండి, తాగుతూ ప్రేమించండి, తాగుతూ హీరోలుగా మారండి’ అని సినిమాలు బిగ్గరగా రంగురంగుల్తో చెప్తూ ఉంటే మనమేం చెయ్యాలి? ఏమి చెయ్యగలమో నాకు తెలియదుగాని, ఇదిగో, ఇటువంటి ఒక్క జీవితకథ చాలు, ఒక ఇండుగపిక్కలాగా, మన చుట్టూ ఉన్న కలుషజలాల్ని శుభ్రం చెయ్యడానికి.

పుస్తకంలోంచి ఒకటి రెండు పేరాలు నా తెలుగులో:

~

…నా చుట్టూ జరుగుతున్నదాన్ని చూడకుండా ఉండటానికి నా కళ్ళు మూసుకోవడం అలవాటు చేసుకున్నాను. రకరకాలుగా నన్ను నేను బిజీగా ఉంచుకోడానికి ప్రయత్నిస్తూ వచ్చాను. ముఖ్యంగా నా రచనావ్యాసంగంలో కూరుకుపోవాలని చూసాను. కాని రాహుల్ మద్యవ్యసనం నా పక్కకొచ్చి నిలబడి నన్నొకటే సాధిస్తూ ఉండేది. దాని తీవ్రత ముందు నా వ్యాపకాలేవీ నిలబడలేకపోయాయి. మేమెక్కడ ఉన్నా కూడా రాహుల్ గురించిన ఆలోచనలు మమ్మల్ని నీడలాగా వెంబడించేవి. కాదు, నీడలు కూడా మన బయటే ఉంటాయి. కాని ఈ నీడ మాత్రం మాలోపల పడేది. మేము ఏ కవచం తొడుక్కున్నా కూడా ఆ నీడదానిలోకి చొచ్చుకు వచ్చేసేది. అది ఎక్కడ పడితే అక్కడ ఆ ప్రాంతాన్ని తినేసేది. అట్లాంటి ఎన్ని నీడల్ని మాలోకి మేము ఇంకించుకున్నామని? బయట సమాజం ఎదట మాత్రం మేము దర్పంగా, నిటారుగా నిలబడేవాళ్ళం. చిరునవ్వుతుండేవాళ్ళం. చుట్టూ ఉన్నవాళ్ళతో ఏదో ఒక లోకాభిరామాయణం మాట్లాడుతుండేవాళ్ళం. మామూలు మనుషుల్లాగా కనిపించడానికి మేమేమి చెయ్యాలో అదంతా చేస్తూండేవాళ్ళం. కాని మా గాయం చాలా లోతైనది. మేమెక్కడికి వెళ్ళినా మాతో పాటే ఒక శాపాన్ని రహస్యంగా మోసుకుంటూపోయేవాళ్ళం. మేము మోస్తున్న బరువు నానాటికీ పెరుగుతూ దాన్ని మొయ్యలేక అలసిపోయి ఎక్కడన్నా కొద్దిసేపు పక్కన పెడదామా అనుకుంటే అది పెట్టడానికి చోటే కనబడేది కాదు. ‘ఆశకి రెక్కలుంటాయి ‘ అన్నది ఎమిలీ డికిన్ సన్. మేం మోస్తూ వచ్చిన బరువుకి ఆ రెక్కలు పూర్తిగా ఉడిగిపోయాయి.’

~

రాహుల్ తిరిగి మళ్ళా మామూలు మనిషై, తాను ఒకప్పుడు విడాకులు ఇచ్చిన తన భార్యనే మళ్ళా పెళ్ళి చేసుకుని, ఆల్కహాలిక్ లకు పునరావాస కేంద్రం నడుపుతూ, ఆ కేంద్రం ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నాక, ఒక పేరా-

~

‘రాహుల్, రాజేశ్వరి మా పట్ల చూపిన ప్రేమ మమ్మల్నెన్నో విధాలుగా మైమరిపించింది. మా వివాహజీవితం యాభై ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంలో వాళ్ళు మాకోసం ఒక పండగలాగా చేసారు. దగ్గరవాళ్ళనీ, దూరంవాళ్ళనీ అందరినీ పిలిచారు. అట్లాంటిదేదో వాళ్ళు చేయబోతున్నారని ఉప్పందగానే మేం అలాంటిదేమీ చెయ్యొద్దన్నాం. అటువంటి ఆడంబరాల కోసం మేమెన్నడూ వ్యయం చేసి ఎరగం. కాని మమ్మల్ని పట్టించుకునే పిల్లలున్నారనే ఊహ మాకు చెప్పలేనంత సంతోషాన్నిచ్చింది…

2007 లో నేనూ, నా భార్య బిందీ చీనా యాత్రకి వెళ్ళేటప్పుడు, రాహుల్ నా జేబులో వెయ్యి డాలర్లు పెట్టాడు. అక్కణ్ణుంచి తనకోసమేమన్నా తేవాలా అని అడిగాను. కాదు, అది మేం కర్చుపెట్టుకోడానికే అని చెప్పాడు. ఏళ్ళతరబడి మాకు అలవాటైపోయిన పొదుపు మమ్మల్ని ఆ డబ్బుకి అనర్హుల్ని చేసింది. మేము ఆ పాకెట్ అట్లానే ముట్టుకోకుండా వెనక్కి తెచ్చేసాం. కాని ఆ దంపతులిద్దరూ ఆ డబ్బు మా నుంచి తీసుకోడానికి ససేమిరా వల్లకాదన్నారు.

ఇప్పుడు నాకనిపిస్తోంది, ఒకప్పుడు మాకొక చిన్నారి బిడ్డ ఒకడు ఉండేవాడనీ, ప్రేమాస్పదుడైన ఆ బిడ్డ బంగారు భవిష్యత్తు గురించి మాకు కొన్ని కలలుండేవనీ. ఆ బంగారు బొమ్మని, అపురూపమైన ఆ చిత్రాన్ని మానుంచి ఎవరో తస్కరించి ముప్పై ఏళ్ళ పాటు ఏ చెత్తకుప్పకిందనో దాచేసారు. దారుణమైన దుఃఖంతోనూ, బాధతోనూ, సుదీర్ఘకాలం పాటు వెతుక్కుంటూ, తవ్వుకుంటూ ఉండగా, ఇన్నాళ్ళకు మళ్ళా మాకా బొమ్మ దొరికింది. అది కూడా, శుభ్రపరిచి మరీ, పూర్తిగా చికిలీ చేసి, దాని పూర్వపు రూపానికి దాన్ని తీసుకొచ్చి మరీ మాకప్పగించారు. అత్యంత ప్రేమాస్పదుడిగా రాహుల్ మాకిప్పుడు కనిపిస్తున్నట్టుగా గతంలో మేమెప్పుడూ చూసి ఉండలేదు. మాకు ఏమేమి అవసరమని అతడు అనుకుంటాడో అదల్లా మేమడక్కుండానే మా కోసం తీసుకొస్తాడు. ఎప్పటికప్పుడు మమ్మల్నేదో విధంగా సంతోషచకితుల్ని చేస్తూనే ఉంటాడు. రోజూ పొద్దున్నే తన ఆఫీసుకు వెళ్ళేటప్పుడో, లేదా సాయంకాలం వచ్చేటప్పుడో మాదగ్గరికి వచ్చి మమ్మల్ని చూసి వెళ్తుంటాడు. మేము మాట్లాడుకునేవి చాలా మామూలు విషయాలు. అతడి పిల్లలగురించి, అంటే మా మనవల గురించిన చిన్న చిన్న విషయాలు. రోజు రోజుకీ వాళ్ళెట్లా ఎదుగుతున్నారో ఆ సంగతులు.. అప్పుడప్పుడు తన పని గురించిన కొత్త ప్రయత్నాలూ, కొత్త ప్రణాళికలూ మాతో పంచుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క సాయంకాలం హటాత్తుగా మమ్మల్నేదన్నా సినిమాకో, లేదా డిన్నర్ కో లాక్కుపోతుంటాడు..

~

పై పేరా తెలుగు చేస్తూండగా నాకు మళ్ళా కన్నీళ్ళు ఆగడం లేదు. ఒకప్పుడు అబ్దుల్ కలాం జీవిత కథని తెలుగు చేస్తుంటే ఇట్లా కళ్ళ నీళ్ళు ప్రవహించాయి. మళ్ళా గాంధీగారి పెద్దకొడుకు జీవితాన్ని తెలుగు చేస్తుంటే. ఇప్పుడు మళ్ళా.

నేను కోరుకునేది, ఎదురుచూసేది ఇటువంటి కథల గురించి, ఇటువంటి జీవితాల గురించి. మానవ జీవితానికి అద్భుతమైన స్వర్ణభవిష్యత్తు ఉందని చెప్పే మాటల్లో నాకేమీ నమ్మకం లేదు, ఉత్సాహం లేదు. రేపెన్నడో ఒక ఉజ్జ్వల భవిష్యత్తు రానున్నదని నమ్ముతూ ఈ రోజు తాగుడుతో గడిపే కవుల, రచయితల రచనలనుంచి నాకు స్ఫూర్తి లభించడం మానేసి చాలా ఏళ్ళే అయింది. నాకు కావలసింది మామూలు మనుషులు, పొరుగువాళ్ళని కూడా ప్రేమించనవసరం లేదు, తమ తల్లిదండ్రుల్నీ, తమ పిల్లల్నీ, తమ అన్నదమ్ముల్నీ ప్రేమిస్తో వాళ్ళతో మామూలు సాయంకాలాలు మామూలు మాటల్తో మామూలుగా గడపగలిగే మామూలు మనుషులు కావాలి నాకు.

14-7-2020

Leave a Reply

%d bloggers like this: