ఎస్. రాయవరం

Reading Time: 5 minutes

విశాఖపట్టణం జిల్లాలో ‘నాడు-నేడు’ పనులు చూడటానికి వెళ్ళినప్పుడు జిల్లా విద్యాశాఖాధికారితో ఒక మాట చెప్పాను, రోజంతా నన్నే గ్రామాలేనా తిప్పండి, కాని వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఎస్.రాయవరం మీంచి హై వే ఎక్కించండి అని. పాతికేళ్ళ కిందట విశాఖపట్టణంజిల్లాలో ఒక జిల్లా అధికారిగా పనిచేసినప్పటికీ, ఎన్నోసార్లు, ఎలమంచిలి మీంచే విశాఖపట్టణం వస్తూపోతూ ఉన్నప్పటికీ ఎస్.రాయవరం వెళ్ళడానికి ఇన్నేళ్ళుగా ఎందుకు వీలుపడలేదో నాకే ఆశ్చర్యంగా ఉంది. విజయనగరంతో నాకున్న అనుబంధంవల్ల గురజాడ సొంతమనుషుల్లో నేను కూడా ఒకడినని చెప్పుకోవచ్చుగానీ, ఆయన పుట్టిన ఎస్.రాయవరంలో అడుగుపెట్టనంతకాలం ఆ అనుబంధం లో ఏదో ఒకింత వెలితిగానే అనిపిస్తూ ఉండింది.

ఏమైతేనేం, ఇన్నాళ్ళకు ఎస్. రాయవరం వెళ్ళగలిగాను. పర్వతాల పేటలోలాగా అక్కడ కూడా గురజాడ ఒక పేరుగా మాత్రమే మిగిలి ఉంటాడేమో అనుకున్నానుగానీ, మేము ఆ ఊళ్ళో అడుగుపెట్టేటప్పటికే ఊరిమధ్య సెంటర్ లో గురజాడ నిలువెత్తుగా ప్రతిష్టితుడై ఉన్నాడు. ఆ విగ్రహం దగ్గర అప్పటికే చాలామంది చేరుకుని ఉన్నారు. వారి చేతుల్లో పూలమాలలున్నాయి. మేము ఆ విగ్రహం దగ్గర బండి దిగగానే వారు నన్ను గురజాడను పూలమాలతో అలంకరించమని అడిగారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అది స్ట్రాట్ ఫర్డ్ ఎట్ ఏవన్ దగ్గరికి వెళ్ళి షేక్ స్పియర్ కు నివాళి ఘటించడం లానూ, యాస్నయా పొల్యానా క్షేత్రంలో అడుగుపెట్టి టాల్ స్టాయికి శ్రద్ధాంజలి సమర్పించడం లానూ అనిపించింది. ఒకప్పుడు మా మాష్టారు వాల్మీకి కవిత్వం తనకు తల్లి వంటిదనీ, వ్యాసుడు తనకి తండ్రి వంటివాడనీ చెప్పుకున్నారు. నాకు గిడుగు తల్లితో సమానమైతే గురజాడ తండ్రి వంటివాడు. ఆయన నాకు విద్యాబుద్ధులు నేర్పించాడు. మనిషిగా నాకేదైనా సంస్కారం అలవడి ఉంటే అది గురజాడ అలవర్చిన సాహిత్యసంస్కారం అనే చెప్పాలి.

రాయవరం గురజాడను పూర్తిగా స్వంతం చేసుకుంది. ఆ నాలుగువీథుల సెంటర్ లో ఆయన విగ్రహంతో పాటు పక్కనే ఉన్న గురజాడ కళామందిరం పేరిట ఒక స్టేజి, ఆ వేదిక మీద కూడా ఆయన విగ్రహం ఉన్నాయి. మరొక పక్క, మార్కెట్ కి కూడా ఆయన పేరు పెట్టుకున్నాం చూడండి అని చూపించారొక స్థానికులు. అందరం కలిసి ఆ విగ్రహం దగ్గర ఒక ఫొటో తీసుకున్నాం. అది గురజాడ తల్లిగారి ఊరనీ, వారి తాతగారు అక్కడ కోర్టులో పనిచేసేవారనీ, ఇంకా విశేషాలు చెప్పారు అక్కడి వాళ్ళు. గురజాడకి రాయవరంతో చాలానే అనుబంధం ఉండింది. వాళ్ళ తాతగారు రాయవరం వదిలి గురువిందాడకు మకాం మార్చినదాకా కూడా ఆయనకు రాయవరంతో అనుబంధం ఉండింది. ఆ ఊళ్ళల్లోని ఏ శక్తులు, ఏ సామాజిక పరిస్థితులు గురజాడని గురజాడగా తీర్చిదిద్ది ఉంటాయి? గురజాడకి సమకాలికుడూ, అధునిక ఒడియా సాహిత్య వైతాళికుడూ ఫకీర్ మోహన్ సేనాపతి గురించి తలుచుకున్నప్పుడు కూడా నాకు ఇటువంటి ప్రశ్ననే కలుగుతుంటుంది. నా ప్రశ్నకి రాయవరం గాలిలో ఏదైనా సమాధానం దొరుకుతుందేమో అని చూసాను.

ఒకప్పుడు శ్రీ శ్రీ గురజాడ గురించి ఒక వ్యాసం రాయడానికి మొదలుపెడుతూ ‘మళ్ళా ఇవాళ కొత్తగా గురజాడ గురించి ఏమి చెప్పగలనా అని అనుకున్నానుగానీ, ఆయన్ను తలుచుకుంటే చాలు, ఎన్నో కొత్త ఆలోచనలు ఉప్పొంగుతున్నాయి ‘అని రాసుకున్నాడు. 1986 లో మొదటిసారి గురజాడ మీద విజయనగరంలో ఒక ప్రసంగం చేసాను. గత నలభయ్యేళ్ళుగా గురజాడని చదువుతూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను. కాని, ఎప్పటికప్పుడు ఆయన సరికొత్తగా సాక్షాత్కరిస్తూనే ఉన్నాడు, నన్ను విభ్రమపరుస్తూనే ఉన్నాడు. మేల్కొల్పుతూనే వస్తున్నాడు.

గురజాడ పేరు మీద అచ్చులో వచ్చిన ప్రతి ఒక్క అక్షరం చదివేసాను అనుకున్న తరువాత, డా.పెన్నేపల్లి గోపాలకృష్ణ, డా.కాళిదాసు పురుషోత్తం, ఎం.వి.రాయుడు ల సంపాదకత్వంలో వచ్చిన ‘గురుజాడలు’ (2009) నాకు పెద్ద కనువిప్పు. ఇంతదాకా గురజాడ డైరీలూ, ఉత్తరాలూ, అవీ ఇవీ తెలుగు అనువాదాల్లో మాత్రమే చదివిన నాకు, నాలాంటివారికి చాలామందికి, ఆ పుస్తకంలో ఆ రచనలు మొదటిసారిగా ఇంగ్లీషుమూలంలో లభ్యమయ్యాయి. ఆ రచనల్లో ప్రతి ఒక్క పుటనీ ఎంతో కూలంకషంగా చదువుకోవలసి ఉంది. దీర్ఘకాలంగా భూమిలో కప్పడిపోయిన ఒక ప్రాచీన సంస్కృతికి ఆనవాళ్ళుగా లభించిన కొన్ని పూసలు, శకలాలు, ముద్రలు మటుకే దొరికినప్పుడు, వాటిని ఆధారం చేసుకునే పురాతత్త్వజ్ఞులు ఎంత ఓపికతో, శ్రద్ధతో, పరిశీలనతో ఆ సంస్కృతిని తిరిగి నిర్మిస్తారో అంత జాగ్రత్తగానూ గురజాడ సంపూర్ణ చిత్రపటాన్ని ఇప్పుడు మనం ఆవిష్కరించుకోవలసి ఉంటుంది. లభించిన ప్రతి ఒక్క సాక్ష్యాధారం ఆధారంగా ఆయన సాహిత్యవ్యక్తిత్వాన్ని మనం మరింత సంభావించుకోవలసి ఉంటుంది. కన్యాశుల్కమూ, కథలూ, ముత్యాల సరాలూ రాసిన గురజాడ సరే, కాని ఎక్కువభాగం జమాకర్చులే రాసుకుని ఉండవచ్చుగాక, ఆ డైరీల్లో కనిపించే గురజాడ మనల్ని మరింత నివ్వెరపరిచే గురజాడ.

ఉదాహరణకి, 19-1-1895 న డైరీలో మహారాజా ఆనందగజపతి పుస్తకాల్లోంచి తాను తీసుకున్న పుస్తకాల జాబితా రాసుకున్నాడు గురజాడ. అందులో టాల్ స్టాయి ‘కోసక్కులు’ కూడా ఉంది. టాల్ స్టాయి ఆ నవల 1863 లో రష్యన్ లో రాసాడని మనం గుర్తుపెట్టుకుంటే, ఇరవయ్యేళ్ళు కాకుండానే ఆ పుస్తకం ఇంగ్లీషు అనువాదం మహారాజా ఆనంద గజపతీ, గురజాడ అప్పారావూ చదువుతున్నారంటే, వాళ్ళ ప్రపంచం ఎంత విశాలమో మనకి బోధపడుతుంది. ఒక పురావస్తు శాస్త్రజ్ఞుడు తవ్వకాలు చేస్తున్నప్పుడు అక్కడొక ప్రాచీన రోమన్ నాణెం దొరికితే ఎంత ఉబ్బితబ్బిబ్బవుతాడో ఆ డైరీ ఎంట్రీలో ఆ చిన్న ప్రస్తావన నన్నట్లా ఆశ్చర్యచకితుణ్ణి చేసింది.

డా.పెన్నేపల్లి గోపాల కృష్ణ సేకరణ, కృషి నిజంగా అసాధారణం. ఇంతవరకూ గురజాడ రచనల ఇంగ్లీషు మూలపత్రాలు తాము మాత్రమే చదువుతూ, మనకి మాత్రం తమ అభిప్రాయాలు మాత్రమే పరిచయం చేస్తూ వచ్చిన ఆరుద్ర, నార్ల, కె.వి.ఆర్ వంటి పరిశోధకులూ, అవసరాల సూర్యారావు, సెట్టి ఈశ్వరరావు వంటి అనువాదకులూ మనకి ఇవ్వలేకపోయిన ఎంతో అంతర్దృష్టి ఈ కొత్త పుస్తకం మనకి అపారంగా అనుగ్రహిస్తూంది. ఉదాహరణకి, 1915 లో మద్రాసు విశ్వవిద్యాలయానికి బి ఏ డిగ్రీ కి తెలుగు సాహిత్యంలో ప్రశ్న పత్రాన్ని గురజాడ రూపొందించారట. రెండు పేజీల ఆ ప్రశ్న పత్రం గురజాడ రాసిన సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్రగా చెప్పవచ్చు. తెలుగు సాహిత్యంలో పట్టభద్రులమయ్యామని చెప్పుకునేవారు ప్రతి ఒక్కరూ ఆ ప్రశ్న పత్రాన్ని ఒక సవాలుగా స్వీకరించి తాము ఏ మేరకు ఆ పరీక్ష రాయగలరో తమకు తాము పరిశీలించుకోవాలి. అందులో గురజాడ అడిగిన ప్రశ్నలు చూడండి. మొదటి ప్రశ్ననే ఇలా ఉంది:

‘ తెలుగు భాషా సాహిత్య చరిత్రలో నన్నెచోడుడి కుమారసంభవం విలువను అంచనా వెయ్యండి. తిరిగి ఆ రచన ఇటీవలికాలంలో అచ్చయ్యేదాకా, ప్రజల స్మృతిలోంచి ఎందుకు కనుమరుగయ్యిందో వివరించండి.’

మూడవ ప్రశ్న: ‘తెలుగు సాహిత్య చరిత్రను చారిత్రిక పరిస్థితులు ఏ మేరకు ప్రభావితం చేసాయనుకుంటున్నారు?’

మరొక ప్రశ్న: రావు బహద్దూర్ వీరేశలింగం గారు కావ్యభాషను సంస్కరించారా? అయితే ఆ సంస్కరణ ఏ సూత్రాలమీద ఆధారపడిందో వివరించండి.’

చివరి ప్రశ్నలో మళ్ళా రెండు ప్రశ్నలు. అందులో రెండవ ప్రశ్న చూడండి: ‘దక్కనీ ముసల్మాను విజేతల భాష తెలుగులో ఏ శాఖల మీద ప్రభావం చూపించింది? తెలుగు, ముసల్మాను పదజాలాన్ని ఇంగ్లీషు పదాలు ఏ ప్రకారం పక్కకు నెట్టివేస్తూ వచ్చాయో అభివర్ణించండి.’

ఈ పేపర్లో నాకు కనీసం పాసు మార్కులు కూడా వస్తాయని నమ్మకం లేదు.

ఈ సమగ్రమైన సంపుటాన్ని చదువుతుంటే, మనం ఇన్నాళ్ళూ అప్రధానంగా భావించిన ‘సారంగధర’, ‘నీలగిరి పాటలు’ వంటి రచనలు కూడా కొత్త వెలుగులో కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి నీలగిరి పాటలు గురజాడ 1907 లో అచ్చు వేయించి మహారాజా ఆనందగజపతి స్మృతికి అంకితమిచ్చాడని చదివినప్పుడు, గురజాడ పైన మహారాజా ప్రభావం ఎటువంటిదో మనకి తెలుసు కనుక, ఆయనకి అంకితమివ్వడం ద్వారా గురజాడ తన పాటలకి అపారమైన గౌరవాన్ని సంతరించాడని అర్థమవుతున్నది. ఆ సంపుటంలోని ఆరుపాటలకూ రాగనిర్దేశంతో పాటు స్వర రచన కూడా చేసుకున్న గురజాడ, వాటి ఇంగ్లీషు అనువాదంలో మాత్రం సంగీతాన్ని పరిహరించాడు. టాగోర్ తన గీతాంజలిలో ఇటువంటి వివేకాన్ని చూపించడానికి ఆరేళ్ళ ముందే గురజాడ ఇటువంటి ఒక పనిచేసి ఉన్నాడని మనమిన్నాళ్ళూ ఎందుకు గుర్తించలేకపోయాం?

కన్యాశుల్కం రెండవ కూర్పు (1909) నడుస్తున్న కాలంలోనే గురజాడ నీలగిరిపాటలు రాసాడన్నది ఒక ఆశ్చర్యం. అప్పటికే ఆయన కన్యాశుల్కం మొదటి కూర్పుని (1897) మహారాజాకి అంకితమిచ్చి ఉన్నాడు. అంటే నీల గిరిపాటల్ని కూడా ఆయన కన్యాశుల్కంతో సమానంగా పరిగణించి ఉన్నాడని అర్థమవుతూంది. మహారాజా ఆనందగజపతి పారశీక కవిత్వప్రేమికుడనీ, అందులోనూ, పారశీక ప్రేమకవిత్వపిపాసి అనీ గురజాడ రాసుకున్న వివరాల్ని బట్టి చూస్తే తాను కూడా పారశీక కవిత్వ స్థాయిలో ఉండే ప్రేమకవితలు కొన్ని రాసి ఆయనకు అంకితమివ్వాలని గురజాడ భావించినట్లుగా మనం అనుకోవచ్చు. కాని, ఆ గీతాల్ని ఘజళ్ళుగాకాక, క్షేత్రయ్యతరహా తెలుగు పదకర్తల రీతిలో కూర్చడంలో గురజాడ వివేకం మనకి తెలుస్తున్నది. ఉదాహరణకి, ఆరుపాటల్లో చివరి పాట చూడండి:

పల్లవి

చిత్తరువని చూడ చిత్తము గొంటివి

చిత్తజు నపరంజి చిలుక యెవ్వతవే

అను పల్లవి

వత్తువొ నా మ్రోల వలరాజు వేఁడిన

మత్తకాశిని నీదు మనమైన నీగదె.

చరణములు

ఇచ్చిపుచ్చుకొంట ఇలలోని మర్యాద

ముచ్చిలి మౌనము మెచ్చుదురటవే

వచ్చి చూచినంత వంచనఁ జేయుదె

పచ్చి దొంగతనము పడతిరొ పరువె

మనసులేని తనువు మరి యేలనే నాకు

చెనటి దీనిఁ గూడ చేకొనఁ గదవె

వానికి బదులొక్క వాక్కు నే వేడెద

మానిని ఈ పాటి మన్నింపఁ జెల్లునె.

విలువ చాలదన్న విరివిల్తుపై నాన

కలుగు జన్మములఁ గానుక కొనవె

ఎలమి నానందేంద్రు నేలిన వెన్నుఁడు

పలు తెరఁగుల మేలు పడతి నీ కిచ్చునె.

రాజుగారి పట్ల ఈ ఋణం తీరిన తర్వాతనే ఆయన కవిత్వంలోంచి అరసున్నలు అదృశ్యమయ్యాయి. 1907 లో రాసిన ఈ కవితని 1910 లో రాసిన ‘కాసులు’ కవితతో పోలిస్తే, ఆ మూడేళ్ళ మధ్యకాలంలో గురజాడలో ఏమి జరిగి ఉంటుందో ఊహకు అందకుండా ఉంది. కావ్యవస్తువులోనూ, భాషలోనూ, వ్యక్తీకరణలోనూ నీలగిరిపాటలు క్షీణాంధ్రయుగపు జాడల్ని తలపిస్తున్నప్పటికీ, ఆ పాటలద్వారానే, 20 వ శతాబ్ద ప్రారంభంలో ఆయన మళ్ళా పాటకి పట్టాభిషేకం చేసాడన్న విషయం కూడా మర్చిపోలేం.

ఈ అరసున్నలనుంచి ఏడేళ్ళు తిరక్కుండానే ఆయన డిసెంటు నోటు (1914) దాకా ప్రయాణించాడు. ఆయనలో ఏ సారస్వత మథనం ఎంత తీవ్రంగా జరిగి ఉండకపోతే, ఆ పత్రంలో ఇలా రాసి ఉంటాడు!

Social political and literary ideals have changed. Literature is no longer confined to a cult; and mass education which is one of the greatest blessings of British rule has necessitated the creation of modern prose in Telugu.’

అధునిక యుగవైతాళికుడైన ఈ గురజాడ గురించి చాలామంది చాలానే రాసారు. ఇంకా చాలా రాయబోతారు కూడా. కాని, మన మాటల్లో ప్రస్తావనకు రాని అంశాల చుట్టూతానే నా మనసు పరిభ్రమిస్తూన్నది. పారశీకంలో పిల్లలకి సౌదాతోనూ, సంస్కృతంలో బాలరామాయణంతోనూ విద్యాభ్యాసం మొదలుపెడతారు. తెలుగులో పిల్లలకి గురజాడతో మొదలుపెట్టలేమా? విద్యాశాఖ 1 వ తరగతినుండి 6 వ తరగతిదాకా తెలుగు పాఠ్యపుస్తకాలు తిరిగిరాసే ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు, ఆ పాఠ్యపుస్తక సంపాదకులతో ఈ మాటే చెప్పాను. వాళ్ళకి నేనేమి చెప్తున్నానో అర్థమయింది. ఇప్పుడు రెండవతరగతిలో మన పిల్లలకి గురజాడ ఈ పాటతో పరిచయమవుతున్నాడు:

చింతా చెట్టూ చిలకలతోటీ ఏమని పలికిందీ

చిలకల్లారా చిలకల్లారా వద్దూ వద్దందీ

కొబ్బరి చెట్టూ చిలకలతోటీ ఏమని పలికిందీ

చిలకల్లారా చిలకల్లారా వద్దూ వద్దందీ

జామీ చెట్టూ చిలకలతోటీ ఏమని పలికిందీ

చిలకల్లారా చిలకల్లారా రండీ రండందీ.

మామిడి చెట్టూ చిలకలతోటీ ఏమని పలికిందీ

చిలకల్లారా చిలకల్లారా రండీ రండందీ.

26-8-2020

Leave a Reply

%d bloggers like this: