సర్వశ్రేష్ఠ మీనియేచర్ చిత్రకారుడు

Reading Time: 4 minutes

చిత్రలేఖనాలు అమ్మే సంస్థల్లో ఓసియన్స్ కూడా ఒకటి. వారు ప్రతిసారీ ఆక్షను చేపట్టినప్పుడల్లా తమ దగ్గర ఉన్న చిత్రలేఖనాల కాటలాగులు విడుదల చేస్తూ ఉంటారు. ఆ కాటలాగులు వాటికవే గొప్ప కళాప్రశంసలు. వాటిలో వివిధ చిత్రకారుల చిత్రలేఖనాలతో పాటు, వాటికి సంబంధించిన కొంత కళాప్రశంస, చరిత్ర, రసచర్చ కూడా ఉంటుంది. ఓసియన్స్ వెలువరించే కాటలాగులు ప్రధానంగా భారతీయ చిత్రకళకి, హస్తకళలకీ, వస్త్రాల డిజైన్లకీ, శిల్పాలకీ సంబంధించిన వివరాలతో ఉంటాయికాబట్టి వాటిని చూస్తూంటే భారతదేశమంతా సంచరిస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టే, గత పది పదిహేనేళ్ళుగా, నా తీరిక సమయపు వ్యాపకాల్లో ఓసియన్సు కాటలాగులు చూడటం కూడా ఒకటి. ఆ కాటలాగులు చూడటం వివిధ భారతీయ భాషల్లో వచ్చిన కవితల్ని చిత్రాల్లో చదువుతున్నట్టు ఉంటుంది. ఆ పుస్తకాల పుటలు తిరగేస్తూ ఒక్కొక్క చిత్రం దగ్గరా కొద్ది సేపు ఆగి నన్ను నేను మర్చిపోతుంటాను. ఆ గీతాలు, ఆ రంగులు, ఆ చిత్రకారులు మనోభావనలు నాలో చెప్పలేని మార్మిక సంవేదనలను రేకెత్తిస్తుంటాయి. గొప్ప హిందూస్తానీ సంగీతం వింటున్నట్టుగా ఆ కాటలాగులు చూస్తూన్నంతసేపూ, నా జాగ్రదవస్థని దాటి నేనొక రమణీయ చైతన్య భూమికలోకి అడుగుపెడుతుంటాను.

సాధారణంగా ఆ కాటలాగులు సెకండ్ హాండ్ పుస్తకాల షాపుల్లో దొరుకుతాయి. హైదరాబాదులో బేగంపేటలో ఉన్న ఎం ఆర్ పుస్తకాల దుకాణం నా దర్శనీయ స్థలాల్లో ఒకటి. ఈ మధ్య ఆ షాపుకి వెళ్ళినప్పుడు 2008 నవంబరు వేలానికి సంబంధించిన ఓసియన్స్ కాటలాగు ఒకటి దొరికింది. ఆ పుస్తకం తెరవగానే బీరేశ్వర సేన్ చిత్రించిన నీటిరంగుల చిత్రం ఒకటి కనిపించి నా మనసును తక్షణమే అనిర్వచనీయంగా సమ్మోహపరిచింది. Buddha on Hilltop అనే ఆ నీటిరంగుల చిత్రం సేన్ 1950 లో చిత్రించాడట. 4.8 x 7.5 అంగుళాల ఆ మీనియేచర్ మనోహరమైన ఒక గీతికలానూ, సుస్వరరంజితమైన ఒక టుమ్రీలానూ నాకు వినిపించింది.

చూడండి. అక్కడ ఒక కొండ మీద ఒక బాటమలుపులో ఒక చెట్టు కింద తథాగతుడు నలుగురైదుగురు శ్రోతలకు ఏదో వినిపిస్తున్నాడు. కొద్దిగా తలవంచి ఆయన వాళ్ళనే చూస్తున్నాడు. ఆ చూడటంలో అపారమైన శ్రద్ధ, సానుభూతి కనిపిస్తున్నది. ఆ భంగిమలో ఆయన్ని అవలోకితేశ్వర బోధిసత్త్వుడని కూడా అనుకోవచ్చు. కొద్దిగా పైకెత్తిన ఆ చేయి అభయం కావచ్చు, లేదా విధినిషేధాల్ని వివరిస్తున్న ఒక శాస్త హస్తచాలనం అని కూడా అనుకోవచ్చు. ఆ శ్రోతల్లో ముందు ఇద్దరు ముందుకు ప్రణమిల్లుతున్నట్టుగానూ, వెనక ముగ్గురు తాము కూడా ప్రణమిల్లడానికి తమ వంతుకోసం నిరీక్షిస్తున్నట్టుగానూ ఉన్నారు. వారిలో ఒక పిల్లవాడు కూడా కనిపిస్తున్నాడు. ఆ నలుగురైదుగురు శ్రోతలే అక్కడ ఉండటంలో, ఆ ప్రవక్తకీ, ఆ శ్రోతలకీ మధ్య గొప్ప సాన్నిహిత్యం, సామీప్యం ద్యోతకమవుతున్నాయి.

కానీ నన్ను ఆకట్టుకున్నది ఆ సమావేశ నేపథ్యం. అది ఎక్కడ సంభవించి ఉండవచ్చు? వెనక ఉన్న కొండల్ని బట్టి అది హిమాలయాల అంచుల్లో జరిగిన సంఘటనలాగాా ఉంది. ఆ చెట్టు ఏమి చెట్టు అయి ఉండవచ్చు? మర్రి కాదు, రావి కాదు, వేప కాదు. బహుశా అది శిరీషకుసుమ వృక్షం కావచ్చు. ఆ చెట్టు నీడ చాలా చిక్కగా ఉంది. అక్కడ ఆ చెట్టు ఒకటే ఉందనుకోలేం. ఎందుకంటే చిత్రంలోని ముందుభాగంలో కూడా దట్టమైన నీడ పరుచుకుని ఉంది. అంటే, మనం, వీక్షకులం కూడా అంత చల్లని చెట్టునీడ నిలబడి ఉన్నామన్నమాట. బహుశా, ఆ సందర్శకులు ఆయన్ని కలిసివెళ్ళిన తరువాత మనం కూడా ఆయన్ని కలిసి ఆయన మాటలు వినాలని ఎదురుచూస్తున్నామన్నమాట.

ఆ సమావేశం ఎప్పుడు సంభవించి ఉండవచ్చు? అంటే ఏ ఋతువులో, ఏ వేళలో? చూడండి, ఆ నీడల్లోనూ, ఆ చెట్టు శాఖోపశాఖల్లోనూ దట్టంగా పరుచుకున్న ఆ తడి. ఆ నేల లో ప్రస్ఫుటంగా కనవచ్చే ఆ తేమ చూడండి. ఆ రోజో, ఆ ముందురోజో అక్కడ వాన పడిందని చెప్పవచ్చు. అది నడివర్షాకాలమై ఉంటే ఆ నేలలో వట్టి తేమ కాదు, బురద కూడా ఉండి ఉండాలి. కాబట్టి అది వానపడ్డ రోజే కాని, వానాకాలపు రోజు కాదు. అంటే బహుశా జూలై మాసంలో ఒక రోజై ఉండాలి. ఏ వేళప్పుడు ఆ సమావేశం జరిగి ఉండవచ్చు? ప్రభాతమా? ప్రదోషమా? నాకెందుకో అది వాన జల్లు కురిసి వెలిసిన ఒక అపరాహ్ణవేళ సాయంకాలం నాలుగు, అయిదు గంటల మధ్య జరిగిన సమావేశంలాగా అనిపిస్తున్నది. ఎందుకంటే, వానలేని, మబ్బుపట్టని జూలై సాయంసంధ్యల సౌందర్యమే వేరు. ఏడాది మొత్తం మీద అంత అందమైన సాంధ్యభాష మనకి మరెప్పుడూ వినిపించదు. అది ప్రభాతమో లేదా పూర్తి సాయంసంధ్యనో అని ఎందుకు అనుకోలేకపోతున్నానంటే, విభాతసంధ్యల్లో వెనక ఉన్న కొండల్లో ఆ నీలిమకు బదులు ఊదారంగు కనిపిస్తుంది. ఆ శుభ్రనీలిమ అపరాహ్ణాల నీడల నీలిమ. అసలు ఆ నీలిమకి వెనగ్గా దూరంగా కపిల, ధూసర వర్ణాల పలచని పూత కనిపిస్తున్నది కాని, ఆ రంగు మనకి కనిపించే కొండల మీద పరుచుకోడానికి మనం కనీసం మరొక గంట సేపు ఆగవలసి ఉంటుంది.

నేననుకుంటాను, బహుశా, ఆ శ్రోతలది ఆ కొండ మీద ఆ మలుపు తిరిగిన తరువాత బహుదూరంలో ఉండే ఒక ఊరు అయి ఉండవచ్చు. వాళ్ళు ఆ కొండ మలుపు తిరిగి ఇటువైపు ఏదో సంతకి వచ్చి ఉండవచ్చు. వాళ్ళ సంతపని చూసుకుని తిరిగివెళ్ళేటప్పుడు, ఆ బాట మలుపులో తథాగతుడు వారికి దర్శనమిచ్చి ఉండవచ్చు. జీవనసంధ్యలో వాళ్ళు ఆయన మాటల్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలకిస్తూ ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన తన జీవనశిఖరాన్ని చేరి అక్కడ స్థిరప్రజ్ఞుడిగా ఉన్నాడు కాబట్టి. చిత్రకారుడు మనకి చూపించాలనుకుంటున్నది ఆ కొండల్ని కాదు, ఆ శ్రోతల్ని కాదు, జీవనశిఖరప్రతిష్ఠితుడైన బుద్ధుణ్ణే. Buddha an Hilltop. అది కదా చిత్రలేఖన సారాంశం. ఇంతకీ బుద్ధుడు గంగా మైదానంలో ఏ శ్రావస్తిలోనో, వైశాలిలోనో సంచరించకుండా ఆ కొండకొమ్ము మీద ఎందుకు కూచున్నట్టు? బుద్ధుడు తన చివరి దినాల్లో మగధ సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి తన వజ్జి గణతంత్రాన్ని వెతుక్కుంటూ అక్కడే తనువు చాలించాలని కోరుకున్నట్టుగా ‘మహాపరినిబ్బాణ సుత్త’ చెప్తుంది. వజ్జి, కపిలవస్తు, లుంబిని, కుసీనార మొదలైనవన్నీ హిమాలయ ప్రాంత గ్రామాలు. ఆయన తన చివరిదినాల్లో ఎక్కడో ఒక కొండమీద తన ప్రాచీన గణతంత్ర ప్రజలకు వినిపిస్తున్న చివరిసందేశాల్లో అది ఒకటి అయి ఉండవచ్చు. అంటే ఆ చిత్రంలో బుద్ధుడు కోండశిఖరం మీద మాత్రమే కాదు, తన జీవనసాఫల్య శిఖరం మీద కూడా నిల్చున్నాడు. కాని అది వసంతకాలమో, హేమంతకాలమో కాకుండా వర్షాకాల దృశ్యంగా ఎందుకు చిత్రించాడు చిత్రకారుడు? ఎందుకంటే ఆయన తన చివరిదినాల్లో ఒక వర్షాకాల చాతుర్మాస్యాన్ని ఆ ప్రాంతాల్లో గడిపినట్టుగా ఆ సంభాషణ చెప్తున్నది.

కాని ఆ చిత్రలేఖనంలో ఆ సంభాషణ కూడా ముఖ్యం కాదు. అక్కడ మనకి కనిపిస్తున్నదల్లా వానకి తడిసి మరింత శుభ్రపడ్డ పర్వత శిఖరాలు, ఆకాశమంతా పరుచుకున్న ఒక తేటవెలుగు. ఒక సహృదయ సాంగత్యం దొరికినట్టుగా నీ మనసుని నిర్మలపరిచే గొప్ప ప్రశాంతి. ఇంతా చేసి ఆ చిత్రం సైజు ఎంతనుకుంటున్నారు? ఒక అరఠావులో సగం కన్నా కూడా తక్కువ. ఆ చిన్న కాగితం మీద అంత విస్తారమైన భగవత్సాన్నిధ్యాన్ని చిత్రించగలగడమే బీరేశ్వర్ సేన్ చిత్రలేఖన మహిమ.

ఈ చిత్రం చాలా అరుదైనది. బీరేశ్వర సేన్ పేరు మీద మనకి నెట్ లో లభ్యమవుతున్న చిత్రాల్లో ఎక్కడా ఇది కనిపించదు. ఓషియన్స్ ఈ చిత్రానికి అయిదు లక్షల వెల కట్టిందిగాని, అయిదు కోట్లు వెచ్చించినా దొరకని చిత్రమిది.

బీరేశ్వర సేన్ గురించి తెలుగువాళ్ళకి పరిచయం చేసింది సంజీవ్ దేవ్ నే. ఆయన సంజీవ దేవ్ కి మంచి మిత్రుడు కూడా. హిమాలయ సౌందర్యాన్ని చిత్రించడమే జీవితకాల తపస్సుగా జీవించిన నికొలాయ్ రోరిక్ దగ్గర సేన్ కొన్నాళ్ళు ఉన్నాడు. ఆయన ప్రభావమే సేన్ ని హిమాలయ చిత్రకారుడిగా తీర్చిదిద్దింది. సంజీవ్ దేవ్ వారిద్దరికీ మిత్రుడు మాత్రమే కాదు, వారు తమ చిత్రాలు ఆయనకి చూపించి ఎలా ఉన్నాయో చెప్పమని అడిగేతంటటి రసజ్ఞుడు కూడా. బీరేశ్వర్ సేన్ మీద సంజీవ దేవ్ తెలుగులో ఒక వ్యాసం రాసారు. ఆ పుస్తకం ఇప్పుడు నా దగ్గర లేదు. కాని ఆయన ఇంగ్లీషులో రాసిన కొన్ని వ్యాసాలు, ఇంకా పుస్తక రూపంగా రావలసి ఉన్నవాటిని, తెనాలి మిత్రుడు సురేష్ నన్ను చదవమని ఇచ్చారు. ఈ చిత్రలేఖనం చూడగానే చప్పున నేనా వ్యాసాలు వెతికాను, అందులో బీరేశ్వర్ సేన్ గురించి కూడా ఒక వ్యాసం ఉండకపోదనే నమ్మకంతో.

నా నమ్మకం వట్టిపోలేదు. శిల్పి అనే పత్రిక కోసం Bireswara Sen the Landscapist అనే ఒక అపురూపమైన వ్యాసం దొరికింది ఆ కాగితాల్లో. ఆ మొత్తం వ్యాసాన్నే అనువదించి మీతో పంచుకోవాలని ఉందిగాని, రెండు మూడు పేరాలు చూడండి:

~

‘ప్రకృతి దృశ్యాల్ని చిత్రించే చిత్రకారుడు బీభత్సమైన ప్రకృతిని సమ్మోహనీయ విశ్వంగా మనకి అందించే ఒక వార్తాహరుడు. సమున్నత పర్వత శిఖరాలు, చిక్కటి ఆకుపచ్చని లోయలు, కిందకి దూకే జలపాతాలు, మబ్బుపట్టిన దినాలు, వానాకాలపు రాత్రులు, హేమంత ప్రభాతాలు, వేసవి సాయంకాలాలు, రేఖల లయతో, రంగుల శ్రుతితో మేళవించి మనకి అందిస్తాడతడు. బీరేశ్వర సేన్ అటువటి చిత్రకారుడు.’

‘బీరేశ్వర్ సేన్ సర్వశ్రేష్ఠ మీనియేచర్ చిత్రకారుడు. అతడి మీనియేచర్ చిత్రాలు రంగుల్లో రాసిన కవితలు, కళ్ళకు కట్టే సంగీత శకలాలు. ఒక్కొక్క మీనియేచర్ మూడున్నర అంగుళాల పొడవూ, రెండున్నర అంగుళాల వెడల్పూ మించి ఉండదు గాని, ఆ పరిమిత స్థలంలోనే ఆయన విస్తారమైన భూమినీ, సూర్యోదయస్తమయాల కాంతిలో భాసమానంగా గోచరించే సమున్నత హిమాలయ శిఖరాల సౌందర్యాన్నీ చూపించగలడు.’

‘ఒక మనిషిగా బీరేశ్వర సేన్ మనల్ని మరింతగా ఆకట్టుకుంటాడు. ప్రపంచ సంస్కృతిని నిశితంగా అధ్యయనం చేసే విద్యార్థి అతడు. ఇంగ్లీషు సాహిత్యాన్ని సాధికారికంగా పరిశీలించగల సాహిత్యస్వాదకుడు. తన ప్రవర్తనలో ఎంతో సంస్కారి. మామూలుగా కళాకారుల మూడ్స్ తరుచు మారిపోతూ ఉండటం మనకి అనుభవమే. కాని సేన్ అట్లా కాదు. అతడి ఆలోచనలు తేటతెల్లంగా స్వచ్ఛంగా ఉంటాయి. సుకోమల సృజనకారుడు. అత్యంత వినయసంపన్నుడు. ఒకసారి నేనాయనతో ‘మీరు హిమాలయాల్ని అజరామరం చేసారు’ అని అంటే, ఆయన చిరునవ్వి ‘లేదు, నువ్వు పొరబడుతున్నావు దేవ్, హిమాలయాలే నన్ను అజరామరం చేసాయి’ అన్నాడు.’

~

అటువంటి అజరామర భావోద్వేగానికి ఒక ఆనవాలు ఈ చిత్రం.

8-7-2020

One Reply to “సర్వశ్రేష్ఠ మీనియేచర్ చిత్రకారుడు”

Leave a Reply

%d bloggers like this: