రాముడు నడిచిన దారి

వసంతకాలమంతటా కొండలమీంచి నగరాలదాకా కనిపించే రేలపూల చెట్లని చూసినప్పుడల్లా ఎవరో బంధువుల్ని చూసినట్టు, ఏదో పండగ చూసినట్టు ఏదో పెళ్ళిపందిరి ఎదట నిలుచున్నట్టు అనిపిస్తుంది. ఎన్నిసార్లు అనుకున్నా ఆ పూలపండగ మీద ఒక్క కవిత కూడా రాయలేకపోయాను. ఆ సౌందర్యం ఎదట విభ్రాంతితో నిలబడిపోవడమే తప్ప నోటమాటరాదు. కాని, ఎన్నో వేల ఏళ్ళ కిందట మహాకవి తన కావ్యమంతటా రేలపూలు ఎక్కడ కనబడ్డా వాటికొక బంగారు హారాన్ని వేస్తూనే ఉన్నాడని తెలిసినప్పుడు ఆ విభ్రాంతి మరింత ద్విగుణీకృతమవుతున్నది.

ఈ శ్లోకం చూడండి:

పుష్పితాగ్రాంసు పశ్యేమాన్ కర్ణికారాన్ సమంతతః

హాటక ప్రతి సంఛన్నాన్ నరాన్ పీతాంబరానివ (కిష్కింధ:1:21)

(ఎక్కడ చూసినా విరబూసి కనిపిస్తున్న ఈ రేలచెట్లు చూడు. పీతాంబరాలూ, బంగారు హారాలూ ధరించిన వాళ్ళల్లా కనిపిస్తున్నాయి)

ఒక్క రేలపూలేమిటి! రామాయణమంతా ఒక పూలపందిరి. రాముడు నడిచిన దారి వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ ముళ్ళదారి అయి ఉండవచ్చుగాని, భావుకులకీ, సౌందర్యారాధకులకీ అది పూలు పరిచిన దారి. పూలు వెదజల్లిన దారి.

పూలబాసలు రామాయణానికి తెలిసినంతగా మరే కావ్యానికీ తెలియవని తెలుసుగానీ, మొత్తం రామాయణమంతటా 182 రకాల ఫలపుష్పవృక్షజాతుల ప్రస్తావన ఉందని తెలిసినప్పుడు మాత్రం నా ఆశ్చర్యానికి హద్దు లేకుండా పోయింది. ఆ మధ్య టాగోర్ కవిత్వంలో పూల గురించీ, మొక్కల గురించీ ఒక ఉద్యానకారుడు రాసిన పుస్తకం గురించి రాసాను. అందులో ఆయన టాగోర్ తన గీతాలన్నిటిలోనూ 108 పూలగురించీ, మొక్కలగురించీ ప్రస్తావించాడని ఎంతో ఆశ్చర్యపోతూ పరిచయం చేసాను. అన్ని పూల గురించి అంతలా పాటలు పాడిన కవి మరొకరు కనిపించడం లేదని కూడా రాసాను.

కానీ పూల గురించీ, మొక్కల గురించీ, చెట్ల గురించీ, అడవుల గురించీ విస్తారంగా తెలిసినవాడూ, విశేషంగా చిత్రించినవాడూ వాల్మీకి అని నాకు తెలియచెప్పడానికా అన్నట్టు Plant and Animal Diversity in Valmiki’s Ramayana (2013) అనే పుస్తకం నా కంటపడింది. ఎం.అమృతలింగం అనే ఆయన రాసిన ఈ పుస్తకాన్ని సి.పి.ఎన్విరాన్ మెంటల్ ఎడుకేషన్ సెంటర్ వారు ప్రచురించారు. 2013లో సి.పి.రామస్వామి అయ్యర్ ఫౌండేషన్ వారు ఒక రామాయణ ఉత్సవం జరిపారట. అందులో భాగంగా రామాయణంలో చిత్రించబడ్డ వన్య, వన జాతుల గురించిన ప్రదర్శన కూడా ఒకటి ఏర్పాటు చేసారట. ఆ సందర్భంగా వెలువరించిన పరిశోధన ఈ పుస్తకం.

ఆసక్తి ఉన్నవాళ్ళ కోసం ఆ పరిశోధన లింక్ ఇక్కడ పొందుపరుస్తున్నాను.

https://www.researchgate.net/…/333001729_PLANT_ANIMAL…

నా వరకూ నాకు, ఈ పుస్తకం ఒక కనువిప్పు. ఎందుకంటే నేనిప్పటిదాకా, రామాయణంలో రాముడు అయోధ్యనుంచి చిత్రకూటందాకా నడిచిన దారి మాత్రమే వాస్తవికమైన దారి అనీ, తక్కిందంతా కవి ఊహాగానమనీ అనుకుంటూ ఉండేవాణ్ణి. రాముడు చిత్రకూటం వదిలిపెట్టాక ఏ దారిన నడిచాడు, దండకారణ్యంలో ఎటువైపు పయనించాడు, లంక ఎక్కడ అనేదాని మీద ఎందరో ఎన్నో పరిశోధనలు చేసారు. సంకాలియా లాంటి పురాతత్త్వవేత్త యాంత్రొపలాజికల్ కోణం నుంచి పరిశీలించి లంక ఎక్కడో ఏదో ఒక గిరిజనప్రాంతంలో ఉండి ఉండవచ్చునని ఊహించాడు. కాని, రాముడు నడిచిన దారిని వాల్మీకి చిత్రించిన చెట్టుచేమల ఆధారంగా ఊహించవచ్చునని అమృతలింగం ప్రతిపాదిస్తున్నాడు.

ఆయన చెప్పిన దాని ప్రకారం రామాయణంలో ఆరురకాల అడవులు వర్ణించబడ్డాయి. భూగోళశాస్త్ర పాఠ్యపుస్తకాల ప్రకారం భారతదేశంలో ఉన్న అడవుల్లో మధ్య, దక్షిణ భారతదేశాల్లో ఉన్న అడవులు వరసగా ఉష్ణమండల ప్రాంతపు పొడి వాతావరణానికి చెందిన ఆకురాలు అడవులు, తేమవాతావరణానికి చెందిన ఆకురాలు అడవులు, పొడి, తడి వాతావరణానికి చెందిన ఆకురాలు అడవులు, భూమధ్యరేఖా సమీప ప్రాంతానికి చెందిన సతతహరితారణ్యాలు ఉన్నాయి.

రామాయణంలో రాముడు వనవాసానికి బయలు దేరినప్పుడు మొదటగా చిత్రకూటంలో అడుగుపెట్టాడు. అది పొడి వాతావరణానికి చెందిన ఆకురాలే అడవి. అక్కణ్ణుంచి దండకారణ్యంలో సంచరించాడు. అది తేమవాతావరణానికి చెందిన ఆకురాలే అడవి. అక్కణ్ణుంచి గోదావరి ఒడ్డున పంచవటిలో పర్ణశాల కట్టుకున్నాడు. అది మళ్ళా పొడి వాతావరణానికి చెందిన ఆకురాలే అడవి. అక్కణ్ణుంచి సీతని వెతుక్కుంటూ కిష్కింధలో అడుగుపెట్టాడు. అది పొడి, తేమ వాతావరణాలు సమంగా ఉండే ఆకురాలే అడవి. అక్కణ్ణుంచి లంక మీద దండెత్తాడు. అది భూమధ్యరేఖా ప్రాంతంలో ఎల్లప్పుడూ ఆకుపచ్చగా ఉండే అటవీప్రాంతం. వీటితో పాటు హనుమంతుడు సంజీవనికోసం హిమాలయాలకు వెళ్ళి ఓషధీవనాన్ని గాలించినప్పుడు హిమాలయ ప్రాంతపు అడవుల్ని కూడా వాల్మీకి వర్ణించినట్టయింది. ఆ విధంగా మొత్తం ఆరురకాల అడవులు రామాయణంలో కనిపిస్తాయని చెప్పడమే కాకుండా, ఆయా సందర్భాల్లో వాల్మీకి ప్రస్తావించిన పూలూ, చెట్లూ ఆ అడవులకి సంబంధించినవే కావడం మరింత విశేషమని అమృతలింగం సోదాహరణంగా వివరించాడు.

మధ్యయుగాల్లో ప్రబంధ కవులు చెట్లనీ, పూలనీ చిత్రించకపోలేదుగానీ, ఆ కావ్యాల్లో ఎక్కడ పూల చిత్రణ ఉన్నా ఆ పూలు ఆ ఋతువుకీ, ఆ కాలానికీ సంబంధించినవి అవునా కాదా అనే ఔచిత్యాన్ని ఆ కవులు పట్టించుకోలేదు. కాని రామాయణంలో ఉండే విశిష్టత ఏమిటంటే, వాల్మీకికి పూల గురించి మాత్రమే కాదు, ఏ పూలు ఎప్పుడు పూస్తాయో, ఏ పూలు ఎక్కడ పూస్తాయో కూడా తెలుసు. వసంత శోభని వర్ణించినప్పుడు మాత్రమే కర్ణికార పుష్పాల గురించి వర్ణిస్తాడు. శరత్కాలం వస్తోందనగానే ఆయనకి కర్ణికారవృక్షానికి బదులు కోవిదార వృక్షం (కిష్కింధ: 30:60)కనిపిస్తుంది.

రాముడు అడవిలో అడుగుపెట్టగానే ఆయన్ని వాల్మీకి గిరివన ప్రియుడు (అయోధ్య:94:1) అని మనకి పరిచయం చేస్తాడు. కాని పూలప్రేమికుడు అని ఎక్కడా తనంత తానుగా చెప్పడు. కాని చిత్రంగా ఆ మాట భరతుడితో చెప్పిస్తాడు. చిత్రకూటంలో నివసిస్తున్న రాముణ్ణి చూడటానికి వచ్చినప్పుడు భరతుడు ఇలా అనుకుంటున్నాడు:

అధారయద్యో వివిధాః చిత్రాః సుమనస్సదా

సోయమ్ జటాభారమిమమ్ వహతే రాఘవః కథమ్ (అయోధ్య: 99:33)

( ఈ రాఘవుడు అయోధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడూ తన శిరసుమీద చక్కటి పూలు ధరించి కనబడే వాడు. అటువంటి శిరస్సు ఇప్పుడు ఈ జటాభారాన్ని ఎట్లామోస్తున్నదో కదా)

ఎంత రమణీయమైన సమాచారాన్ని ఇస్తున్నదీ శ్లోకం!నగరంలో ఉన్నప్పుడే పూలతో శిరసుని అలకరించుకునే ఆ సౌందర్యారాధకుడు పూల వానలు కురిసే అడవుల్ని చూస్తున్నపుడు ఎట్లాంటి పారవశ్యానికి లోనయి ఉంటాడో ఊహించుకోవడం మనవంతు. అందుకనే కిష్కింధా కాండ మొదలుపెడుతూనే పంపానదీ తీరంలో రాముడు ఆ వన, పుష్ప, సుగంధ సౌభాగ్యానికి మైమరచి తమ్ముడితో ఇలా అంటున్నాడు:

శోకార్తస్యాపి మే పంపా శోభతే చిత్రకాననా

వ్యవకీర్ణా బహువిధైః పుష్పైః శీతోదకా శివా (కిష్కింధ: 1:6)

(అందమైన అడవులతోటీ, రకరకాల పూలతోటీ శుభప్రదాలైన చల్లటిజలాలతోటీ ఈ పంపాతీరం శోకార్తుణ్ణైనప్పటికీ నన్ను ఆకర్షిస్తోంది)

రామాయణం మొత్తం మీద రాముడు సంతోషంగా గడిపిన చోటంటూ ఉంటే అది చిత్రకూటం దగ్గర మాత్రమే. ఎందుకంటే అక్కడ అడవితో పాటు ఆయన పక్కన సీత కూడా ఉంది. కానీ చిత్రకూటం కన్నా కూడా పంపాతీరం ఆయన్ని మరింత సంతోషపరిచింది. సీత పక్కన లేదన్న చింత ఒక్కటే అక్కడ లోటు. కాబట్టి సీతే కనక పక్కన ఉంటే పంపాసరోవర ప్రాంతాన్ని మించి తనకి కోరదగ్గ మరోచోటు లేదనిపించింది ఆయనకి. అందుకే ఇలా అంటున్నాడు:

యది దృశ్యేత సా సాధ్వీ యది చేహ వఏమహి

స్పృహయేయం న శక్రాయ నాయోధ్యాయై రఘూత్తమ (కి:1:95)

(ఓ రఘువరా, ఇక్కడ మనకి సీతాదేవి గాని కనిపిస్తే మనమిక్కడే ఉండిపోదాం. అప్పుడు నాకింక ఇంద్రపదవిగాని, అయోధ్యగాని తలపులోకే రావు)

అసలు కిష్కింధా కాండ మొత్తం మహాసుందర కాండ. అత్యంత విరహకాండ. ఆరు ఋతు వర్ణనల్లోనూ మూడు ఋతు వర్ణనలు, వసంతం, వర్షం, శరత్తు కిష్కింధలోనే కనిపిస్తాయి మనకి. మూడు వర్ణనలూ రాముడితోటే చేయిస్తాడు కవి. రామాయణంలోని మూడు వసంత వర్ణనల్లోనూ కిష్కింధాకాండలోని వసంత ఋతు వర్ణన అత్యంత మనోహరమైనదే కాకుండా అంత సుగంధభరితమైన వసంత ఋతువు మరే కావ్యాల్లోనూ నాకిప్పటిదాకా కనిపించలేదు. అసలు పూలనీ, పక్షుల్నీ అంతగా ప్రేమించిన ఒక కథానాయకుడు కూడా, నాకింతదాకా మరే రచనలోనూ, గెంజిగాథతో సహా, కనిపించలేదు. అందుకనే ఒక భావుకురాలు రామాయణాన్ని Green Epic అన్నది.

అటువంటి పూలప్రేమికుణ్ణి అంతగా అంత పారవశ్యంతో చిత్రించిన కవి కూడా మరొకరెవరూ నాకు కనిపించలేదు. రాముడనే కాదు, అసలు ఏ పాత్ర సంతోషాన్ని వర్ణించాలనుకున్నా వాల్మీకికి పూలు తప్ప మరో ఉపాదేయం కనిపించదు. సుందరకాండలో అశోకవనంలో వసంతశోభని చూస్తున్న హనుమంతుణ్ణి వర్ణించి వర్ణించి కవి చివరకి ఏమంటున్నాడో చూడండి:

పుష్పావకీర్ణ శ్శుశుభే హనుమాన్ మారుతాత్మజః

అశోక వనికా మధ్యే యథా పుష్పమయో గిరిః (సుందర: 14:11)

(మారుతాత్మజుడైన ఆ హనుమానుడిమీద పూలన్నీ జలజలరాలాయి. అప్పుడతడు అశోకవనమధ్యంలో పూలతో నిండిఉన్న కొండలాగా కనబడ్డాడు)

సంతోషమనే కాదు, కళ్ళ ఎదట కనిపిస్తున్న ఒక విషాదావస్థని వర్ణించాలన్నా కూడా ఆదికవికి పూలే గుర్తొస్తాయి. అశోకవాటికలో మొదటిసారి సీతాదేవిని చూసినప్పుడు ఆమె హనుమకి ఇలా కనిపించిందట:

పీతేనైకేన సంవీతామ్ క్లిష్టేనోత్తమవాససా

సపంకామనలంకారమ్ విపద్మావివ పద్మినీమ్ (సుందర: 15-21)

(ఆమె ఒకే ఒక్క పచ్చని ఉడుపు ధరించి ఉంది. ఆ వస్త్రం మాసిపోయినా కూడా మంచి వస్త్రమే. మరే అలంకారాలూ లేని ఆమెని చూస్తుంటే బురదపట్టి, తామరపూలు లేని, పూలకొలనులాగా కనిపిస్తున్నది).

పద్మాలు లేకపోయినా కూడా ఆయన సరోవరాన్ని పద్మినీ అనే అన్నాడు. పద్మసంబంధం లేని సరోవరాన్ని ఆయన ఊహించలేడు. కనబడ్డా చూడలేడు. ఇంకా చెప్పాలంటే కవి దృష్టిలో విషాదానికి పరాకాష్ట పూలు లేని దృశ్యం. పూలు లేని ప్రపంచం కన్నా మించిన నరకం మరొకటుండదు. ‘విపద్మానివ పద్మినీమ్’-నేను చదివిన అత్యంత శోకభరితవాక్యాల్లో ఇది కూడా ఒకటని గుర్తుపెట్టుకుంటాను.

అసలు అన్నిటికన్నా రామాయణంలో ఎక్కువసార్లు వర్ణించబడ్డ పువ్వు ఏమిటంటే పద్మమేనని చెప్తున్నాడు అమృతలింగం. (టాగోర్ పాటల్లో కూడా పద్మానిదే మొదటి స్థానమని చెప్పుకున్నాం). కాని వాల్మీకికి తెలిసినన్ని అడవిపువ్వులు మరే కవికన్నా తెలుసునా అని అనుమానం కలుగుతోంది. లంకానగరం దగ్ధమవుతున్నప్పుడు ఆ మంటలు బూరుగుపూలలాగా, మంకెనపూలలాగా, మోదుగుపూలలాగా కనిపిస్తున్నాయంటాడు. నగరం అడవిగా మారిపోయిందనే ధ్వని కూడా ఉన్నదందులో.

చిత్రకూటం నుంచి లంకదాకా సాగిన రామప్రయాణం చారిత్రికంగా ఎంత నిర్దుష్టమో నాకు తెలియదుగాని, ఆ దారిలో కవి వర్ణించిన కొండలూ, అడవులూ, మృగాలూ, వనాల్నిబట్టి భౌగోళికంగా మాత్రం నిర్దుష్టమేనన్నది ఈ పుస్తకం అందిస్తున్న సాక్ష్యం. ఇక ఈ పుస్తకం ఆసరాగా రాముడు నడిచిన దారివెంట ఆ పూలజాడల్ని పోల్చుకుంటూ నడవడమే నన్నూరిస్తున్న సంతోషం.

26-6-2020

One Reply to “రాముడు నడిచిన దారి”

Leave a Reply

%d bloggers like this: