
మహాయాన బౌద్ధానికి చెందిన ఏదేనా ఒక పుస్తకం, ఉదాహరణకి, ‘ప్రజ్ఞాపారమిత సూత్రం’ చదవాలని అనిపించిందనుకోండి. మన మొబైల్లో గూగుల్లోకి వెళ్ళి ప్రజ్ఞాపారమిత అని టైప్ చేస్తే చాలు, నాలుగు లక్షల పుటల సమాచారం లభ్యమవుతుంది. కాని పదిహేను వందల ఏళ్ళ కిందట, ఒక బౌద్ధ విద్యార్థినో, సాధువో, అది కూడా ఎక్కడో చీనాకి చెందిన యువకుడు ఆ సూత్రాన్ని మూల భాషలో ఒక బౌద్ధ గురువు దగ్గర అధ్యయనం చేయాలని అనుకున్నాడనుకోండి, అప్పుడు? ఒకవేళ, ఆ సూత్రాన్ని గురువు దగ్గర అధ్యయనం చేయడంతో ఆగకుండా, ఆ తాళపత్రాల్ని తన దేశానికి తీసుకువెళ్ళాలని అనుకున్నాడనుకోండి, అప్పుడు?
అటువంటి తక్కిన యువకులు ఏమి చేసి ఉండేవారో మనం ఊహించలేం గాని, హ్యూయెన్ త్సాన్ అనే ఒక చీనా యువకుడు మాత్రం అందుకోసం 25,000 కిలోమీటర్ల యాత్ర చేసాడు. 119 రాజ్యాల గుండా, అడవుల కొండా, కొండల కనుమల గుండా, ఎడారుల గుండా, తుపాన్లు, కరువులు, యుద్ధాల మధ్య చీనా నుంచి పశ్చిమదిశగా ప్రయాణం చేసి పశ్చిమ, వాయవ్య చైనా మీదుగా ఇప్పటి కిర్జిజ్ స్థాన్, సమర్ ఖండ్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ ల మీదుగా సింధు నది దాటి గంగా యమునా మైదానానికి చేరుకుని నలందాలో ఒక గురువు దగ్గర మహాయాన ధర్మాన్ని అధ్యయనం చేసాడు.
అతడి శ్రద్ధ, సహనం, ఏకాగ్రత ఆ గురువుని ఎంత మెప్పించాయంటే, కన్యాకుబ్జంలో హర్ష చక్రవర్తి ఏర్పాటు చేసిన మహాయాన సంవాదంలో తన ప్రతినిధిగా అతణ్ణే పంపేటంతగా. చీనానుంచి వచ్చిన ఆ విద్యార్థి మహాయానపారంగతుడై ఎటువంటి వాదవివాదాలతో పనిలేకుండానే ఆ పండితపరిషత్తులో విజేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
కాని, తాను ఎంతో ప్రయాసకి ఓర్చి తథాగతుడి ఈ జన్మభూమికి చేరుకున్నా కూడా అతడు ఇక్కడ ఉండిపోవాలనుకోలేదు. ఎందుకంటే, తాను అనుష్టిస్తున్న ధర్మానికి చెందిన మూల గ్రంథాల్ని తిరిగి తన దేశానికి తీసుకువెళ్ళాలి, వాటినీ చీనాభాషలోకి అనువదించాలి, ఇంకా చీకటిలో మగ్గుతున్న తన స్వజనానికి భగవానుడి సందేశాన్ని వారి మాతృభాషలో అందించాలి. అదీ అతడి జీవనధ్యేయం. అందుకు గాను ఆ గ్రంథాలన్నీ తీసుకుని మళ్ళా చీనా బయల్దేరాడు. తన దేశానికి తిరిగివెళ్ళిన తరువాత సుమారు ఏడువందల గ్రంథాల దాకా సంస్కృతం నుంచి, పాళీనుంచి చీనీభాషలోకి అనువదించాడు. పందొమ్మిదేళ్ళ పాటు తాను చేసిన ఈ బృహద్యాత్రని ‘పశ్చిమ ప్రాంతాల్లో బౌద్ధ గ్రంథాలకోసం చేసిన యాత్రావివరాలు ‘ పేరిట ఒక సుదీర్ఘ యాత్రాకథనంగా కూడా రాసిపెట్టాడు.
ఈ వివరాలు చదువుంటేనే వళ్ళు గగుర్పాటు చెందుతూ ఉంది కదా! మరి చూస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఈ ఆలోచనతోటే, చైనా-భారతదేశాలకు చెందిన ఉమ్మడి బృందం ఒకటి హ్యూయెన్ సాన్ యాత్రని తెరకెక్కించింది. Xuanzang (2016) పేరిట రూపొందించిన ఆ చిత్రం అనుకోకుండా నా కంటపడింది. చరిత్ర అన్నా, యాత్రా చరిత్రలన్నా చెవి కోసుకుంటాను కాబట్టి ఆ లింక్ పట్టుకుని ఆ సినిమా తెరిచినవాణ్ణి రెండు గంటల పాటు కన్నార్పకుండా ఆ సినిమా చూస్తుండిపోయాను. ముఖ్యంగా ఆ ఫొటోగ్రఫీ. అసలే చైనా లాండ్ స్కేప్ అంటే నా కళ్ళకి చెప్పలేనంత దాహం. అవేమి దృశ్యాలు! ఆ మట్టి, ఆ ఊళ్ళు, ఆ అడవులు, ఆ ఎడారులు, ఆ మృగతృష్ణలు, ఆ ఒయాసిస్సులు, ఆ హిమాలయాలు! ఆ సినిమాలో ప్రతి ఒక్క ఫ్రేము ఒక పద్యం.
హ్యూయెన్ త్సాన్ జీవితంలో నాటకీయత ఏముంటుంది? కాబట్టి ఒక సినిమాకన్నా కూడా అది మనకి ఒక డాక్యుమెంటరీగా తోచే ప్రమాదముంది. కాని, ఆ యాత్రని వట్టి యాత్రగా మాత్రమే కాక ఒక అత్యున్నత రూపకాలంకారంగా గ్రహించినట్లయితే, ఆ సినిమా ఆద్యంతం ఒక కావ్యం, ఒక డివైన్ కామెడీ అని అర్థమవుతుంది.
ఒక మనిషి తన కోసం కాక, తన తోటిమనుషుల కోసం ఏదైనా సంకల్పించినట్టయితే, ఆ సాధన క్రమంలో ఉండే ధీరోదాత్తత అంతా ఆ యాత్రలో ఉంది. మరీ ముఖ్యంగా గోబీ ఎడారుల్లో దారి తప్పినప్పుడు, దాహంతో పిడచకట్టుకుపోయినప్పుడు హ్యూయెన్ త్సాన్ అనుభవించిన వేదనని మన కళ్ళకు కట్టిన తీరు అనితరసాధ్యం. మన జీవితాల్లో అటువంటి ఒక గోబీదశ ఒకటి ఉండేవుంటుంది. మన సంకల్పం నిజంగా ధీర సంకల్పమే అయితే మనం తప్పకుండా ఆ ఎడారిని దాటిపోగలం.
ఇంకా చాలా చెప్పాలని ఉంది కాని, మీకు ఆ సినిమా లింక్ ఇచ్చేస్తే మీరు నా కన్నా మరింత ఎక్కువ ఆనందిస్తారు. ఇదిగో, చూడండి:
23-5-2020