పుష్పప్రీతి

Reading Time: 4 minutes

లలిత రాగం ప్రాతఃకాలీన రాగం. ప్రధానంగా శుద్ధస్వరాలతో కూడుకున్న రాగం. అటువంటి రాగం గుర్తొచ్చింది కవికి, పారిజాతాల్ని చూడగానే. ‘లలిత్ రాగేర్ సుర్ ఝరే తాయి శివూలి తలే’. పారిజాతం చెట్టు కిందన లలిత రాగస్వరాల్లాగా పూలు రాలుతున్నాయట.

ఇటువంటి వాక్యాలు,ఇటువంటి చూపు, ఇటువంటి తలపు ఒక్కటికలిగినా చాలనిపిస్తుంది. ‘ఏ మంచి పూవులన్ ప్రేమించినావొ నిను మోచె నీ తల్లి కనకగర్భమున’ అన్నాడు మహాకవి. ప్రతి మనిషీ ఈ జన్మ ఎత్తేముందు పూర్వజన్మలో ఏ తేనెటీగగానో, తుమ్మెదగానో, సీతాకోకచిలుకగానో పుట్టిఉండాలి, పువ్వుల్ని బలంగా ప్రేమించి ఉండాలి అని కవి భావం కాబోలు. మరి మనిషిగా జన్మించాక కూడా ఇంకా ఒక భ్రమరంలాగా పువ్వులచుట్టూ పరిభ్రమిస్తూనే ఉండాలని కోరుకుంటేనో? అటువంటి మనిషిని టాగోర్ అని పిలుస్తాం.

రెండు రోజుల కిందట అశోక్ బుక్ సెంటర్ లో Plants and Flowers in Tagore’s Songs (2010) అనే పుస్తకం చూడగానే నాకు తుళ్ళింత కలిగింది. ఆ పుస్తకం రాసిన దేవీ ప్రసాద్ ముఖోపాధ్యాయ అనే ఆయన ఫ్లోరికల్చరిస్టు అట. బహుశా అందుకనే కాబోలు రవీంద్రసంగీతమన్నా, రవీంద్ర కవిత్వమన్నా పట్టలేనంత ప్రేమ అట. జీవితకాలం పాటు ఆయన ఉద్యానాల్లోనూ, టాగోర్ కవితోద్యానాల్లోనూ కూడా విహరిస్తూ ఉన్నాడు. తోటలో పూలని చూసినప్పుడు, టాగోర్ ‘గీతావితానం’ గుర్తొస్తూ, టాగోర్ గీతాలు విన్నప్పుడు శాంతినికేతనతో సహా వంగదేశమంతటా తాను చూసిన పూలు గుర్తొస్తూ, పరవశిస్తూ ఆయన ఈ పుస్తకం రూపొందించాడు.

భారతదేశంలో సుమారు 15000 రకాల పుష్పజాతులున్నాయట. వాటిలో టాగోర్ 67 రకాల మొక్కల్నీ, పూలనీ ప్రస్తావించాడట. తన జీవితం పొడుగునా రాసిన 2500 పాటల్లోనూ 108 రకాల మొక్కల్నీ, పూలనీ 700 సార్లు ప్రస్తావించేడట. ముఖోపాధ్యాయ ఈ పుస్తకంలో చేసిందేమంటే, ఆ 67 రకాల వృక్ష, పుష్ప జాతుల్ని ఒక్కొక్కదాన్నీ పరిచయం చేస్తూ, టాగోర్ గీతావితానంలో ఆ మొక్క గురించీ, ఆ పువ్వు గురించీ ఎక్కడెక్కడ ప్రస్తావించాడో, ఆ పాటలన్నింటిని జాబితాగా ఇచ్చాడు. ప్రతి ఒక్క పువ్వు గురించీ రాసిన పరిచయవ్యాసంలో ముందు ఆ పువ్వు గురించి టాగోర్ రాసిన ఒక కవితా వాక్యాన్ని ఉదహారిస్తూ, దాని ఇంగ్లీషు అనువాదాన్ని పొందుపరిచాడు. తనకి మొక్కల గురించి రాయడంలో కష్టం లేదుగాని, ఆ బెంగాలీ కవితా వాక్యాన్ని ఇంగ్లీషులోకి సరిగా తర్జుమా చేసానో లేదో అన్న భయం మాత్రం తననింకా వదల్లేదని రాసుకున్నాడు. అదెట్లా ఉందంటే, టాగోర్ కవిత్వం దగ్గర పెట్టుకుని, తోటలోనో, అడవిలోనో ఆ మొక్కల్నీ, ఆ పూలనీ వెతుక్కుంటో నాబోటి వాడు, కవిత్వం చదవడంలో కష్టం లేదుగానీ, ఆ మొక్కల్ని సరిగానే పోల్చుకున్నానో లేదో అన్న భయమింకా నన్ను వదలట్లేదని అనడం లాంటిది.

భారతదేశాన్ని రత్నగర్భ అంటారుగాని, నిజానికి ఆమె పుష్పగర్భ. వేలాది పూలు అనునిత్యం వికసించే అటువంటి సీమలో, ఒక కవి, అష్టోత్తరశతదళాలతోనే కవితార్చన చేయడం ఏమంత విశేషం? కాని నాకు తెలిసిన తెలుగు కవులందర్నీ తలుచుకుని చూసాను, ఒక్కొక్క కవీ తన కవిత్వమంతటా ఎన్ని పూలని తలుచుకుని ఉండవచ్చునని. నా స్మృతిని ఎంత తరచి చూసుకున్నా ఒక్క కవి కూడా కనిపించలేదు. బహుశా ఒక్క పాల్కురికి సోమనాథుడు ఉండి ఉండవచ్చును, కానీ అది కూడా పండితారాధ్య చరిత్రలో, తనకి తెలిసిన పూలన్నిటినీ వరసగా ఒక దండలాగా గుచ్చి ఉంటాడు. ఆధునిక తెలుగు కవులు? ఉహూ. కనీసం ఇరవై పూలకు మించి తెలిసిన వాళ్ళు, తమ కవితల్లో తలచిన వాళ్ళు, ఏ ఒక్కరూ స్ఫురించడం లేదు.

ఫ్రెంచి ఇంప్రెషనిస్టు చిత్రకారుడు మోనె రకరకాల వస్తువుల్నీ, ముఖాల్నీ, దృశ్యాల్నీ చిత్రించవలసినవన్నీ చిత్రించాక, వాటినుంచి దూరంగా జరిగి, కేవలం తామరపూలని చిత్రించడం మాత్రమే తపసుగా జీవించాడు. అది కూడా వట్టి పూలు కాదు, తామరపూల కొలనులో విరిసినవీ, అరవిరిసినవీ, ఇంకా మొగ్గలుగా ఉన్నవీ, నిన్న పూసి నేడు వాడినవీ ఆ పూలమీద ఉదయాస్తమయ సూర్యకాంతి ఎట్లా వర్షిస్తోందో ఆ దృశ్యాల్ని, ఆ ఇంప్రెషన్ ని చిత్రలేఖనాలుగా చిత్రిస్తో పోయేడు. పొద్దున్న, సాయంకాలం, రాత్రి వెన్నెట్లో, చుక్కల వెలుతుర్లో తనకి ఎప్పుడు మనసైతే అప్పుడు ఆ పూలని చిత్రించడం కోసం ఏకంగా తన ఇంటినే ఒక తామరపూల కొలనుగా మార్చేసుకున్నాడు. ఆ సాధన ఎంత పరిపక్వం చెదిందంటే, ఇప్పుడు మనకి మోనె అంటే ముందు ఆ పూలూ, ఆ పూలకొలనూ, ఆ కొలనుగట్టుమీద వంగిన విల్లోల నీలి, నీలాకుపచ్చ, పసిమి నీడలు మాత్రమే గుర్తొచ్చేంతగా.

అటువంటి చిత్రకారుడు, అటువంటి కవి, పూల చుట్టూ జీవితమంతా పరిభ్రమించిన వాడంటూ ఉంటే, బహుశా, భారతదేశంలో టాగోర్ ఒక్కడే. ఆయన పూలని ప్రేమించడమే కాదు, వాటిని కూడా తన పాటల్లో కలిపి మాలలుగా గుచ్చడమే కాదు, శాంతినికేతనంలో ఏ పూలమొక్క ఎక్కడ ఉండాలో, ఆ కుటీరానికి ఏ పుష్పమంజరి శోభనిస్తుందో స్వయంగా దగ్గరుండి మరీ ఎంపిక చేసి నాటించాడట. బహుశా, పూలనీ, పిల్లల్నీ సమానంగా ప్రేమించినవాడికి మాత్రమే అటువంటి పుష్పప్రీతి ఉంటుంది కాబోలు. ఆ విషయంలో టాగోర్ తర్వాత మా అమ్మ మంగాదేవిగారే గుర్తొస్తున్నారు నాకు.

తాను పాటలు కట్టిన పూలన్నిటిలో టాగోర్ కి ఏ పూలంటే ఎక్కువ ఇష్టం? ఆ ప్రశ్నకి జవాబు చెప్పడం కష్టమంటాడు ముఖోపాధ్యాయ. అందుకు బదులు, టాగోర్ ఏ పూలని ఎన్ని సార్లు తలిచాడో చెప్పడం సులభమంటాడు. ప్రస్తావనల్ని బట్టి లెక్కపెడితే, అన్నిటికన్నా మొదటి స్థానం పద్మానిది. ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, పద్మం వికసించిన రోజున తనకి తెలియలేదనీ, తాను నిద్రపోతో ఉన్నాననీ ఒకటే వాపోతాడు గీతాంజలిలో. ఆయన సమస్త గీతసంచయంలోనూ పద్మం ప్రస్తావన 101 సార్లు వచ్చిందట.

తర్వాతి స్థానం? అనుకుంటూనే ఉన్నాను. బొగడపువ్వు. వకుళ వృక్షాలంటే టాగోర్ కి చెప్పలేనంత ప్రీతి. తానిట్లా గీతాలల్లుకుంటూ ఉంటే లోకానికి ఏం మేలు జరుగుతుందని ఒకసారి ఎవరో టాగోర్ అని అడిగారట. అందుకాయన ఈ పొగడచెట్టు వల్ల ఈ ప్రపంచానికి ఎంత ప్రయోజనమో తన కవిత్వం వల్లా అంతే అని సమాధానమిచ్చాడట. ఏం? ఈ ప్రపంచంలో అన్నీ పండ్లిచ్చే చెట్లూ, ఫర్నిచరుగా మారే చెట్లూ మాత్రమే ఉండాలా, ఒక్కచెట్టేనా, పొగడచెట్టులాగా తన దారిన తాను పూలు పూస్తూ, నిశ్శబ్దంగా పూలు రాలుస్తూ ఉండిపోకూడదా అని అడిగాడు. కాని వకుళ వృక్షం తానున్నంతమేరనీ ఎంత సురభిళం చేస్తుందో, ఆ చెట్టుకింద ఒక క్షణం నిల్చున్నా తెలుస్తుంది.

ఆ తర్వాత వరసలో లక్కపూలు, మాలతి, వెదురుపూలు, పారిజాతాలు, మాధవి, మల్లె, కడిమిపూలు, సంపెంగలు మొదలైనవన్నీ ఉన్నాయి. ఊరికినే పూల గురించి తలుచుకోడం కాదు, ఏ పువ్వుని తలుచుకున్నా, దాని జీవలక్షణమంతా ఆయన తలపులో మెదులుతుందంటాడు ముఖోపాధ్యాయ. ఉదాహరణకి తొలిమబ్బు ఆకాశాన కదలాగానే కడిమిచెట్టు పుష్పించి ఇంతలోనే ఆ పూలు రాలిపోతాయని కవికి తెలుసు. ‘తొలికారు దినాల ఆ కడిమిపూలు నేడు కనరావు, నీ కొమ్మల్లో నేడొంకిత అలసట, విసుగు, నిరాశ ‘ అని అంటాడొక కవితలో. క్షణభంగురాలైన చెర్రీపూల మహాసౌందర్యాన్ని కీర్తించడంలో జపాన్ కి అలసట లేదని మనకి తెలుసు. కాని వాళ్ళకి చెర్రీలున్నట్టే, మనకి కడిమిపూలున్నాయని టాగోర్ కి తప్ప మరెవరికీ తెలియదు.

టాగోర్ కి ఇష్టంలేని పూలున్నాయా? సప్తపర్ణి అంటే తనకంత ప్రేమలేదని ఆయన ఎవరితోనో అన్నాడట. అలా అన్నమాట నిజమే కానీ, ఆ మాట నిజం కాదు. ఎందుకంటే శాంతినికేతనం నడిబొడ్డున నాటింది సప్తపర్ణినే. పుర్వకాలంలో గ్రీకువీరుల్ని ఆలివ్ ఆకుల కిరీటంతో సత్కరించినట్టు, శాంతినికేతనంలో ప్రతిభావంతులైన విద్యార్థుల్ని సప్తపర్ణి పత్రమకుటంతో సత్కరించే సంప్రదాయం కూడా ఆయనే ప్రవేశపెట్టాడు.

ప్రసిద్ధ కథకుడు చాసో కథల్లో రకరకాల పూల గురించిన ప్రస్తావనలన్నీ ఏరి మిత్రులు యు.ఏ.నరసింహమూర్తిగారు గొప్ప వ్యాసమొకటి రాసారు. మామూలుగా అందరూ ఇష్టపడే గులాబి, మల్లె లాంటి పువ్వులు చాసో కథల్లో తిరస్కరణకు గురయ్యాయనీ, పూలల్లో మామూలు పువ్వుల్లాంటి నువ్వు పూలు, గడ్డి పూలు చాసో కథల్లో గొప్ప గౌరవానికి నోచుకున్నాయన్నది మూర్తి గారి పరిశీలన. అయితే టాగోర్ గులాబీల్నీ, మల్లెల్నీ ప్రస్తుతిస్తూనే, గరికనీ, గడ్డిపూలనీ కూడా అంతే ఇష్టంతో పరామర్శిస్తాడు. అన్నిటికన్నా చెప్పదగ్గది, ఆయన ఇష్టపడ్డ పూలల్లో అడవిపూల వాటా చిన్నదేమీకాదన్నది. ఇప్పపువ్వంటే ఆయనకెంత ఇష్టమంటే, తన ప్రేయసి తనకు తొలిసారి తారసపడ్డప్పుడు, ఆమె చెవిలో ‘మొహువా’ అని పిలవాలని కోరికగా ఉందంటాడు. లక్కపూలు, బూరుగపూలు, మంకెనపూలు, అడవి మల్లెపూలు, అడవి సన్నజాజులు ఆయన కవిత్వంలో అడుగడుగునా పరిమళిస్తూనే ఉంటాయి.

కొన్ని పూలకి ఆయన తానే సొంతంగా పేర్లు పెట్టాడట. మనం రాధామనోహరాలుగా పిలిచే పూల గుత్తుల్ని చూసినప్పుడు అవి ఆయనకి తేనెలొలికే దండల్లాగా తోచాయట. అందుకని ఆ పూలకి మధుమంజరి అని పేరుపెట్టాడట. నా చిన్నతనాన, ఆ పూలగుత్తుల్లోంచి ఒక్కొక్క పువ్వునే తెంపి వాటి కాడలు నోట్లో పెట్టుకుని నేను పీల్చిన తేనె మొత్తం ఆ మాటలో మరొకసారి నాకు రుచిచూసినట్లయింది.

ఒకప్పుడు ప్రాచీన చీనా కవీంద్రుడు, ఋషి శ్రేష్టుడు తావోచిన్ తన ఊరికి దూరంగా తానొక కుటీరాన్ని కట్టుకుంటాననీ, ఆ కుటీరం చుట్టూ కంచె మీద కాశీరత్నం తీగె పెంచుకుంటాననీ, ఆ కుటీరప్రాంగణంలో చామంతిపూల తోట నాటుకుంటాననీ చెప్పుకున్నాడు. నాకూ అట్లాంటి ఒక కల, నా పునర్యానంలో రాసుకున్నానిట్లా:

~

నాకొక చిన్న తాటాకుల ఇల్లు కావాలని ఉంటుంది.

ఆ ఇంటివెనుక కొండలూ, లోయలూ పరుచుకునుంటాయి.

వెదురుకంచెతో ఇంటిచుట్టూ ఒక ఆవరణ నిర్మించుకుంటాను

కొంత పచ్చిక, కొన్ని చామంతులు, కంచెమీంచి ఇంటిమీదికొక కాశీరత్నం పూలతీగె.

ఉదయసూర్యకాంతి పసుపుపూలతో నా ఇంటికప్పునల్లుకుంటుంది.

మధ్యాహ్నం పూట ఉష్ణమండల దేశాల తీరికనిద్ర,

సాయంకాలం కాగానే సుదూరం నుంచీ పూర్వీకల్యాణి

గోధూళి వెంబటే తేలుకుంటూ వస్తుంది.

రాత్రి ఆకాశం గూడులో చంద్రుడు వెచ్చగా కలలు కంటాడు,

తెల్లవారగానే, కిటికీ తలుపులు తెరవగానే

మంచుకు తడిసిన పచ్చిక కిలకిలమంటుంది,

నీకు తోడంటూ నికుంజం నుంచొక కూజితం వినవస్తుంది.

6-6-2020

Leave a Reply

%d bloggers like this: