పాదాలకు మువ్వలు బిగించి

రోజులు మామూలుగా గడుస్తుంటాయి. ఉన్నట్టుండి మన జీవితంలోకి ఎవరో ప్రవేశిస్తారు. మనం వాళ్ళతో ప్రేమలో పడతాం. వాళ్ళు మన జీవితాన్ని ఒక్క వెలుగు వెలిగిస్తారు. వాళ్ళని రోజులో ఒక్కసారే కలుసుకున్నా తక్కిన రోజంతా కూడా వాళ్ళతో మాట్లాడుకున్న మాటలే గుర్తొస్తుంటాయి. ఏదో ఒక మాట, ఒక హావభావం, ఒక మందహాసం- పదే పదే రోజంతా అవే గుర్తొస్తూంటాయి. వాళ్ళు మన ఎదట లేకపోయినా, వాళ్ళు రోజంతా మన పక్కనే ఉన్నట్టుంటుంది.

ఇప్పుడు నేనట్లా మీరాకవితతో ప్రేమలో పడ్డాను. ఇంకా చెప్పాలంటే ఈ ప్రణయం ఇప్పుడిప్పుడే మొదలయ్యింది. రాబోయే రోజుల్లో మరికొంతకాలం పాటు మా ప్రణయసంభాషణలు పంచుకోడానికి మీరు తప్ప నాకు మరెవరున్నారు?

మీరాబాయి నా చిన్నప్పటి స్నేహితురాలు. మా అన్నయ్య హైస్కూల్లో చదువుతున్నప్పుడు వాడి తెలుగు ఉపవాచకంలో ఆమె కథ మొదటిసారి చదివాను. ఒక రాచకుటుంబ బాలిక. ఒకనాడు మేడ మీద నిలబడి ఉండగా కింద వీథిలో ఒక పెళ్ళి ఊరేగింపు నడుస్తున్నది. అదేమిటమ్మా అనడిగింది తల్లిని. అది పెళ్ళి పండగ అంది తల్లి. మరి నాపెళ్ళెప్పుడమ్మా అనడిగింది ఆ బాలిక, పెళ్ళంటే ఏమిటో తెలియకుండానే. నా వరుడెవరమ్మా అని అడుగుతూనే ఉంది తల్లిని. విసిగిస్తూనే ఉంది. చివరికి ఏదో ఒకటి చెప్పి సముదాయించాలని, తల్లి , ఇంట్లో దేవుడి మందిరంలో ఉన్న గిరిధరగోపాలుణ్ణి చూపించి ఇతడే నీ వరుడని చెప్పింది.

ఈ కథ తెలియనివాళ్ళెవ్వరు? మీరా కవిత వినని వాళ్ళెవ్వరు? ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, లతా మంగేష్కర్, వాణీ జయరాం, జూతికా రాయి వంటి కోకిలలు ఆ గీతికలు ఆలపిస్తూండగా ఆ కృష్ణభక్తి గీతాలు విననివారెవ్వరు? నేనూ అట్లానే విన్నాను. వింటూనే ఉన్నాను. నా ఇరవయ్యేళ్ళప్పణ్ణుంచీ. కానీ, ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది, ఆ గీతాలు వింటూనే ఉన్నానుగాని, ఆ గీతార్థాన్ని నిజంగా ఇప్పటిదాకా విననేలేదని.

మీరా కవిత చాలా సులభంగానూ, సరళంగానూ, వినగానే ఇట్టే అర్థమైపోయేదిగానూ ఉంటుందనుకోవడం ఒక భ్రమ. అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని నింపుకున్న కవిత్వమది. ఆ గీతాల్లో ప్రతి ఒక్క పంక్తి దగ్గరా మనం ఆగి వినాలి. మననం చేయాలి, ఆ పలుకులు పలికినప్పుడు ఆమె మనఃస్థితి ఏమిటో సంభావించుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం, అవి వట్టి పదాలు కాదు, శబ్దాలు. అవి వట్టి శబ్దాలు కావు, సంగీతపదాలు. ప్రతి పదం ప్రకంపించే ఒక సజీవచైతన్యం. ఆ పదం చుట్టూ ఒక సూక్ష్మ సంగీత ఛాయ. పువ్వు చుట్టూ పరిమళం వ్యాపించినట్టు, రాగితీగ చుట్టూ విద్యుత్ తరంగం గిరికీలు కొడుతున్నట్టు, ఆమె ప్రతి పదప్రయోగం వెనకా ఒక రసఝురీ ప్రవాహం వినబడుతుంది. మనం ఆ కవితలో ప్రతి పదాన్నీ ఏరుకుని చెవి దగ్గరగా పెట్టుకు వినాలి. ఒక శంఖంలాగ తనలోకి తాను చుట్లు చుట్టుకున్న ఆ ప్రతి పదాన్ని దగ్గరగా పెట్టుకుని ఇంచుక ఆలిస్తే ఒక సముద్రఘోష వినిపిస్తుంది.

ఉదాహరణకి ‘పగ్ ఘుంఘురూ బాంధ్ మీర నాచీరే ‘ అనే వాక్యమే తీసుకోండి. ఆ వాక్యం ఆ గీతానికి పల్లవి. మొదటి వాక్యం. ‘పాదాలకు మువ్వలు చుట్టి మీరా నాట్యమాడింది’ అని దాని అర్థం. మీరా పాదాలకు ఎందుకు మువ్వలు తొడిగింది? తెలియదు మనకి. అంతకు ముందేదో చాలానే కథ జరిగింది. ఆమె ఏ మర్యాదనో, ఏ గౌరవాన్నో పంటిబిగువన సహిస్తో వచ్చింది. ఇక ఒకనాటికి ఉండబట్టలేకపోయింది. ఆ అంతఃపురం నుంచి బయటకు వచ్చేసింది. అది కూడా ఎలా వచ్చింది?

ఆ దృశ్యం నా కళ్ళముందు కనిపిస్తోంది. ఆమె నడుం చుట్టూ కొంగు బిగించింది. వీథిలోకి వచ్చి నిలబడింది. వీథి వీథంతా ఉలిక్కిపడింది. జనమంతా ఆమె చుట్టూ మూగారు. ఆమె దృష్టి వాళ్ళ మీద లేదు. ఇంట్లోంచి బయటికొస్తూ ఆమె వెంట తెచ్చుకున్నది కాలి మువ్వలు మాత్రమే. ఆ వీథిలో ముందుకు వంగి పాదం పైకెత్తి మువ్వలు బిగించింది. అప్పుడు నిటారుగా తల పైకెత్తింది. నిండైన ఆ కబరీభరం ఒక్కసారిగా జలపాతంలాగా వెనక్కి జారింది. ఆమె రెండు చేతులూ పైకి చాపింది. అడుగులు లయబద్ధంగా కదిపింది. మరుక్షణంలో నాట్యమాడటం మొదలుపెట్టింది. ఆ రాకుమారి, అట్లా నడివీథిలో, సమస్తం మరిచి, నాట్యం చేయడం మొదలుపెట్టింది.

‘పగ్ గుంగురు బాంధ్ మీర నాచీరే..’ అన్న ఒక్క వాక్యం వెనక ఇంత దృశ్యం ఉంది. అట్లా ఎలుగెత్తి తన నాట్యరంగ పూజ మొదలుపెట్టాక ఆమె ఇంకా ఇట్లా అంటున్నది:

పాదాలకు మువ్వలు బిగించి

నాట్యమాడింది మీరా.

ఎంతో ఇష్టంగా నా అంతటనేనే

నారాయణదాసిగా మారాను.

మీరాకి పిచ్చిపట్టిందన్నారు లోకులు

వంశాచారం మంటకలిపిందన్నారు.

విషపాత్రిక పంపించాడు రాణా

ఆరగిస్తూ నవ్వుకుంది మీరా.

తనని తాను హరికి అర్పించుకోడంలో

తనువూ, మనసూ త్యజించింది మీరా.

సోగ్గాడు గిరిధరుడు కనిపించాడు,

ఆ దర్శనం దప్పికతీర్చే అమృతం.

పన్నెండు పంక్తుల ఈ కవిత ఒక ఉత్కృష్ట మహాకావ్యం. ఇందులో ధ్వని ఉంది, ప్రతి ధ్వని ఉంది. పొరలుపొరలుగా ఈ కవితని విప్పుకుంటూ పోతే ఆద్యంతం మధువులూరే ఒక రసఝురి ఉంది. కాని, ఈ కవిత నీ దప్పి తీర్చాలంటే నువ్వు దీన్నొక పాటలాగా వినేసి వెళ్ళిపోకూడదు. ఒక నడివేసవి మధ్యాహ్నం ఒక మామిడి చెట్టు నీడన ఆగినట్టు వీలైనంతసేపు విశ్రమించాలి. ఆ తర్వాత కూడా ఆ నీడ వదిలిపెట్టి వెళ్ళడానికి నీకు కాళ్ళాడకూడదు.

చూడండి. ఈ గీతంలో, మొదటి రెండు పంక్తుల్లో మీరా తనని తాను ప్రథమపురుష ఏక వచనంలో పరిచయం చేసుకుంటున్నది. తర్వాత రెండు పంక్తుల్లో ఉత్తమ పురుషలో తన గురించి చెప్తున్నది. మళ్ళా ఆరు పంక్తుల్లో ప్రథమపురుషకి మారింది. చివరి రెండు పంక్తులు ప్రథమ, ఉత్తమ పురుషలకి అతీతమైన కర్తృత్వంతో చెప్పింది. అంటే ఏమిటి? మీరు నాట్యం మొదలుపెట్టారు. కొద్ది సేపటికి మీ కళ్ళు తిరగడం మొదలవుతుంది. మీరు తిరుగుతున్నారుగాని, లోకం తిరుగుతున్నట్టుంటుంది. మీరూ, లోకమూ మార్చి మార్చి తిరుగుతుంటారు. ఈ కవిత కూడా అంతే. ఇది నాట్యం చేసే కవిత. ఇక్కడ కవి కి ఒకసారి తన స్ఫృహ ఉంది, మరొక సారి తన స్పృహ లేదు. అందుకే కర్త కొన్నిసార్లు తను, కొన్ని సార్లు ఆమె.

ఇంకా లోతుగా చూడండి. ఎప్పుడు తాను? ఎప్పుడు ఆమె? పాదాలకు మువ్వలు బిగించింది ‘ఆమె’. ఎందుకని ‘ఆమె?’. ఎందుకు అక్కడ ‘నేను’ అనలేదు? ఎందుకంటే అప్పటికింకా ఆమె ఆ రాచమహల్లోనే ఉంది. ఆమె జీవితం పూర్తిగా ఆమెది కాకుండా ఉంది. ఆమె జీవితం మీద ఆమెకి సాధికారికత సంపూర్తిగా చిక్కలేదు. అప్పుడే ఆమె వీథిలో అడుగుపెట్టింది. అప్పుడే నాట్యం మొదలుపెట్టింది. కాబట్టి ఆమె అప్పటికింకా ‘ఆమె’మాత్రమే. ‘నేను’ కాదు. కాని అట్లా నాట్యమాడటంతో ఆమె జీవితం పూర్తిగా ఆమెదయ్యింది. అందుకని అప్పుడామె సంతోషంగా, సగర్వంగా ‘నేను నారాయణ దాసిగా మారాను’ అని చెప్పుకుంటున్నది. అది కూడా ఎట్లా జరిగిందట? ‘నా అంతటనేనే ‘ (మై తో అపనే నారాయన్ కీ ఆపహీ హో గయీ దాసీరే ). ఈ కవిత మొత్తానికి ఈ వాక్యం ఆయువుపట్టు. తనంతట తాను దాసిగా మారిందట. ఏమాశ్చర్యం! అట్లా దాసిగా మారడంతో ఆమె స్వాతంత్య్రం సాధించిందట.

ఆ తర్వాత రెండు నాలుగు వాక్యాలూ మళ్ళా మీరా ప్రథమపురుషకి మారింది. ఎందుకని? ఆ మీరా తాను కాదు. ఆ మీరా గురించిన సంగతి ‘తన’ కి సంబంధించిన సంగతి కాదు. ఆ మీరా లోకానికి సంబంధించిన ఒక రాచపడుచు. ఆమె గురించిన విషయంగానీ, వార్తగానీ మూడో మనిషికి సంబంధించిన వార్త లాంటిదే ఆమెకి. చివరకి రాణా విషపాత్రిక పంపినప్పుడు ఒక్క గుక్కలో ఆ విషాన్ని ‘తాను’ తాగానని చెప్పడం లేదు. ‘ఆమె’ తాగిందని చెప్తున్నది. అంటే ఆ నరకం, ఆ విషపానం, ఆ అవమానం అవేవీ కూడా తనవి కావు. తనకి వాటితో సంబంధంలేదు. అందుకనే ఆ తర్వాత రెండు వాక్యాల్లోనూ స్పష్టంగా చెప్పేసింది: ‘హరికి తనని తాను అర్పించుకోవడంలో తనువూ, మనసూ రెండూ త్యజించింది మీరా’ అని. ఇక చివరి వాక్యాలకు వచ్చేటప్పటికి, ‘ఆమే’ లేదు, ‘తనూ ‘ లేదు, దప్పిక తీర్చే ప్రభుదర్శనమొక్కటే ఉంది. ఆ దర్శనమొక్కటే మిగిలింది.

పన్నెండు వాక్యాల ఒక సరళ గీతికలో ఒక ఆత్మకథ మొత్తం ఉంది. దీన్ని వెయ్యి పేజీలకు విస్తరించి రాస్తే అరవిందుల Life Divine అవుతుంది. కానీ ఈ ఆత్మకథ వచనం కాదు, నాట్యం.

కానీ, ఇదే ఈ కవితకు సంపూర్ణ వ్యాఖ్యానం కాదు. ఇది ఒక పొర మాత్రమే. ఇందులో మరొక పొర చూద్దాం. ఇందులో ద్వంద్వాలు ఉన్నాయి. రాణా పంపించింది విషం. ప్రభు దర్శనం అమృతం. విషాన్ని తాను కోరలేదు. కాని విషపాత్రిక తనకి అందించారు. ఆమె ఆ విషాన్ని పక్కకు నెట్టలేదు. హసిస్తూ తాగేసింది. కాని ప్రభు దర్శనం తాను కోరుకున్నది. తనంతట తానే తన ఇష్టంతో నారాయణదాసిగా మారగానే అమృతం దొరికింది. ఆ అమృతం ఆమె దప్పికని చల్లార్చింది. ఇక్కడ విషం తనది కాని జీవితం (‘నీ నుంచి నీది కానిది ప్రతీదీ సైతాను పలుకు’-బైరాగి). స్వాతంత్య్రం అమృతం. ఏ స్వాతంత్య్రం ? తనంతట తాను దాసిగా మారిన స్వాతంత్య్రం . తనకు నచ్చని వాడి అంతఃపురాన్ని వదిలి తనకు నచ్చిన వాడికి దాసి కాగలిగే స్వాతంత్య్రం.(నరుడు జీవిస్తున్నాడిచట త్యాగం వల్ల, జీవితానురాగం వల్ల, స్వేచ్ఛిత కష్టభోగం వల్ల ‘-బైరాగి)

లోకులు మీరా పిచ్చిందయిందన్నారు. అంటే మతిస్తిమితం తప్పిందని. బంధువులు ఆమెని కులనాశిని అన్నారు. కులాన్ని కాపాడేది స్త్రీ శరీరం అనుకుంటారు కాబట్టి. అందుకని మీరా మనసునీ, తనువునీ రెండింటినీ త్యజించింది. తెలిసి త్యజించడం కాదు, కోరి త్యజించడం కాదు. తనని తాను ఇష్టంగా హరికి సమర్పించుకోగానే తనువూ మనసూ కూడా వదిలిపోయాయి. విదిలిపోయాయి. రాకుమారి అవధూతగా మారిపోయింది.

ఇప్పుడు మళ్ళా మనం కవిత మొదటి పంక్తికి చేరుకుంటాం. ఇప్పుడు అర్థమవుతున్నది మనకి, పాదాలకు మువ్వలు బిగించి మీరా ఎందుకు నాట్యమాడిందో? ఎందుకంటే హరికి తనని అర్పించుకోవడంతో ఆమె తనువూ, మనసూ కూడా రాలిపడిపోయాయి. రెండూ లోకం పట్టు తప్పిపోయాయి. ఆమె తనువు ఇప్పుడు సంఘం, కులం, వంశాచారాల పరిథిలో లేదు. అదిప్పుడు నాట్యమాడుతున్నది. నడివీథిలో నర్తిస్తున్నది. ఇంతదాకా ‘ఆమె’ గా బతికిన తనది కాని జీవితం నుంచి ఆ మనసూ, తనువూ తప్పించుకుని ఇప్పుడు ‘నేను’ గా మారుతున్నవి. కాబట్టి-

పగ్ ఘుంఘురు బాంధ్ మీర నాచీరే.

11-6-2020

Leave a Reply

%d bloggers like this: