
ఇవాళ మా అమ్మాయి అమృత పుట్టిన రోజు. నేనిక్కడ విజయవాడలో ఉండిపోయాను. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి హైదరాబాదు వెళ్ళాలనిపించలేదు. ఇక్కణ్ణుంచే ఏదైనా కానుక పంపిద్దామని చూస్తే, ఈ కవిత కనిపించింది. అన్నా కమియెన్స్కా అనే ఒక పోలిష్ కవయిత్రి (1920-86) రాసిన కవిత. మనం కొన్ని వారాలుగా మాత్రమే గృహనిర్బంధాన్ని అనుభవిస్తున్నాం. కాని పోలెండ్ ఒక శతాబ్ద కాలం పాటు నిర్బంధాన్ని అనుభవించింది, అనుభవిస్తూనే ఉంది. మనుషులు కష్టానికీ, చెప్పలేనంత వేదనకీ లోనవడం కళ్ళముందు కనిపిస్తున్నా కూడా ప్రేమానురాగాల మాధుర్యం పలచబడకపోవడం ఆశ్చర్యాల్లోకెల్లా గొప్ప ఆశ్చర్యం. బహుశా ఇట్లాంటి వేళల్లోనే మానవ జీవితం మరింత విలువైందిగానూ, మన అనుభూతి మరింత పదిలపరుచుకోదగ్గదిగానూ మారుతుందనుకుంటాను.
~
అన్నా కమియెన్స్కా
స్వర్గం అంచు దగ్గర
ఇంకా ఇక్కడ పచ్చనిలోయలు
సంతోషంగా నిదురిస్తున్నాయంటే
ఆశ్చర్యమే.
నీడలు పరుచుకున్న సెలయేళ్ళ
తావులు కూడా మాకింకా నమ్మకమే.
ఇంకా ఇక్కడ ఇళ్ళ కప్పులు మిగిలిఉన్నాయంటే
వాటికింద నిదురిస్తూ
ఇంకా పసిపిల్లలు
ఆ ఇళ్ళల్లో వింతనిశ్శబ్దాన్ని నింపుతున్నారంటే
ఆశ్చర్యమే.
ఇంకా ఇక్కడ సూర్యుడి వెనువెంట
పక్షుల్లాగా మేఘాలు తేలియాడుతున్నాయంటే
ఆశ్చర్యమే.
పైపైకి పయనించాలన్న తపన పక్కనే
ఇంకా ఇక్కడ ఒక నిష్కల్మష మానవ సంతోషం
కనిపిస్తున్నదంటే ఆశ్చర్యం.
ఒక దివ్యభవనపు ముంగిలిలాగా
గడపదగ్గర ఒక నిర్మల సంగీతం
వినిపిస్తున్నదంటే విచిత్రమే.
ఇంకా మనం ప్రేమించుకోవాలనీ
సంతోషంతో విలపించాలనీ
కోరుకుంటున్నామంటే
నిజంగా ఆశ్చర్యమే.
12-5-2020