
సోక్రటీసు గురించి, ప్లేటో గురించి నేనింతదాకా చెప్పింది మన పాఠ్యపుస్తకాల్లో రాసి ఉన్నదే. ఈ విషయాలన్నీ మనం ఇంతదాకా ఎంతో కొంత విని ఉన్నవే. మనం వీటిని చదువుకున్నప్పుడు ఒక చారిత్రిక విషయాన్ని తెలుసుకోవడంతోటే ఆగిపోతాం. కాని, సోక్రటీసు జీవితం, ఆయన సంభాషణలు స్ఫూర్తిగా మనం ఇప్పటి మన తరగతి గదుల్లో ఏవైనా ప్రయోగాలు చేపట్టగలమా? అటువంటి పని ఎవరైనా చేసారా? చేస్తున్నారా? ఈ అంశాల గురించి మన ఉపాధ్యాయ శిక్షణలో ఎక్కడా ఏమీ చెప్తున్నట్టు నా దృష్టికి రాలేదు.
కాని పందొమ్మిదో శతాబ్దం చివరి నుంచీ కూడా అమెరికన్ విద్యాసంస్థల్లో సోక్రటిక్ విద్య ఒక ప్రధాన స్రవంతి ప్రయోగంగా అమలవుతూ ఉంది. మరీ ముఖ్యంగా గత పదేళ్ళల్లో, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో సోక్రటిక్ విద్యాపద్ధతుల్ని అనుసరిస్తూ చెప్పుకోదగ్గ ప్రయత్నాలు, చర్చ, చింతన పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.
A Companion to Socrates (బ్లాక్ వెల్, 2006) అనే సంకలనంలో ఈ అంశం మీద, అవి మింజ్ రాసిన, ఒక వ్యాసం నా కంట పడింది. గ్రేడ్ స్కూళ్ళ నుంచి లా స్కూళ్ళదాకా సోక్రటిక్ విద్య ఏ విధంగా అమలు జరుగుతూ వస్తోందో ఆ వ్యాసంలో ఆయన సమగ్రంగా సమీక్షించాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం సోక్రటిక్ విద్య లో రెండు భాగాలున్నాయి. మొదటిది, సోక్రటిక్ పద్ధతి (Socratic Method). రెండవది సోక్రటిక్ బోధన (Socratic Teaching). సోక్రటిక్ పద్ధతి అనేది అమెరికాలో న్యాయశాస్త్ర కళాశాలల్లో గత వందేళ్ళకు పైగా చేపడుతూ వస్తున్న పద్ధతి. పందొమ్మిదో శతాబ్ది చివరలో హార్వర్డ్ లా స్కూల్లో కొలంబస్ లాంగ్డెల్ అనే ఆయన ఈ పద్ధతికి శ్రీకారం చుట్టాడు. ఆయన తన విద్యార్థుల్ని తరగతిగదుల్లో సమావేశపరిచి, ఏదైనా ఒక కేసు తీసుకుని, దానిమీద వాళ్ళతో ప్రశ్నోత్తరాల పద్ధతిలో చర్చకు పూనుకునేవాడు. అందులో మళ్ళా రెండు దశలుండేవి. మొదటి దశలో విద్యార్థులు వరసగా ప్రశ్నలకు సమాధానాలు చెప్తూపోతారు. అలా ప్రశ్నల ద్వారా రాబట్టిన సమాచారం ఆధారంగా రెండవ దశలో ఉపాధ్యాయులూ, విద్యార్థులూ కలిసి కూచుని ఒక బృందంగా తాము పరిశీలిస్తున్న కేసు ఆధారంగా న్యాయశాస్త్ర సూత్రాల్ని రాబట్టడానికి ప్రయత్నిస్తారు.
అయితే కొన్నాళ్ళు గడిచేటప్పటికి, అంటే, గత శతాబ్దం మధ్యకాలానికి వచ్చేటప్పటికి ఈ పద్ధతి మీద తీవ్రమైన విమర్శ వెల్లువెత్తింది. సోక్రటిక్ తరహా ప్రశ్న పద్ధతి ఒక క్రూరమైన విద్యావిధానమనీ, అది మొదటి సంవత్సరంలోనే పిల్లల్ని భయభ్రాంతులకి గురిచేస్తున్నదనీ విద్యార్థులు ఆరోపించడం మొదలుపెట్టారు. దాంతో సోక్రటిక్ తరహా ప్రశ్నోత్తరాల పద్ధతిమీద మళ్ళా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ పద్ధతిని సమర్థించేవారు సోక్రటీసు పాటించిన పద్ధతినుంచి పక్కకు జరిగినందువల్లనే లా స్కూలు ప్రయోగం విమర్శకి గురయ్యింది తప్ప, లోపం సోక్రటీసు తరహాలో ఆలోచనావిధానంలో లేదన్నారు. విద్యార్థుల విమర్శ తర్వాత లా స్కూళ్ళలో సోక్రటిక్ విద్య మరింత మార్పుకి లోనయి, దాదాపుగా మొదటి సంవత్సరం తరగతిగదులకే పరిమితమవుతూ వచ్చింది. కాని, ఇరవై శతాబ్ది చివరికి వచ్చేటప్పటికి చేసిన అధ్యయనం ప్రకారం, అమెరికన్ లా స్కూళ్ళల్లో సోక్రటిక్ విద్య మూలస్తంభంగా మారిపోయిందనీ, మొదటి సంవత్సరం పాఠ్యప్రణాళిక దాదాపు సోక్రటిక్ తరహాలోనే అమలవుతూ ఉందని వెల్లడయింది.
లా స్కూళ్ళల్లో సోక్రటిక్ పద్ధతి మీద విమర్శ, చర్చ,అధ్యయనాలు కొనసాగుతూండగానే, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో కూడా సోక్రటిక్ తరహా బోధన ప్రయోగాలు మొదలయ్యాయి. గత ఇరవయ్యేళ్ళుగా ఈ ప్రయోగాలకి ఉపాధ్యాయులనుంచీ, విద్యార్థుల నుంచీ కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉంది. లా స్కూళ్ళ ప్రయోగాలనుంచి వేరు చేసి చూపడానికి దీన్ని సోక్రటిక్ బోధన అని వ్యవహరిస్తున్నారు. 1982 లో మార్టిమర్ ఆడ్లర్ అనే ఆయన రాసిన The Paideia Proposal: An Education Manifesto అనే పుస్తకం ఈ కొత్త ప్రయోగానికి నాంది పలికింది. ఆ దారిలో మైఖెల్ స్ట్రాంగ్ అనే ఆయన రాసిన The habit of Thought: From Socratic Seminars to Socratic Practice (1997), వాందా బాల్, పామ్ బ్రూయర్ అనే వారు రాసిన Socratic Seminars in the Block(2000) అనే రచనలతో పాటు How to Teach Through Socratic Questioning(2001) అనే వీడియో సిరీస్ కూడా సోక్రటిక్ బోధన పట్ల ఆసక్తి రేకెత్తించాయి.
సోక్రటిక్ బోధన ప్రధానంగా ప్రశ్నోత్తరాల ద్వారా చేపట్టే బోధన, అభ్యసనం. ప్లేటో సంభాషణల్లో Alcibiades, Protagoras, Gorgias, Meno, Theaetetus, Phaedrus లలో సోక్రటీస్ తన ప్రతివాదులతో చేపట్టిన సంభాషణలు ఈ ప్రయోగాలకి నమూనా. ఆ సంభాషణల్లో సోక్రటీస్ ప్రధానంగా తన కాలం నాటి సోఫిస్టులతో తలపడ్డాడు. సోఫిస్టు తరహా బోధన దీర్ఘ ప్రసంగాల మీద ఆధారపడ్డ ప్రణాళిక. అక్కడ వాది, ప్రతివాదులిద్దరూ ఒకరివెనక ఒకరు దీర్ఘ ప్రసంగాలు చేసుకుంటూ ఉంటారు. సోక్రటీస్ పద్ధతి అందుకు భిన్నం. సోక్రటీస్ సూటిగా, క్లుప్తంగా ప్రశ్నలు అడుగుతాడు. ఎదటిమనిషిని ఎక్కువ మాట్లాడిస్తాడు. అతడి ద్వారానే తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పిస్తాడు.అక్కడ గురువూ, శిష్యుడూ ఇద్దరూ కలిసి ఉమ్మడిగా నేర్చుకుంటారు. తాము పరిశీలించాలనుకున్న అంశాన్ని ఉమ్మడిగా సంశోధిస్తారు. సోక్రటిక్ బోధన అమలు జరిగే పాఠశాలల్లో 97 శాతం పిల్లలు మాట్లాడుతుంటారనీ, సోక్రటిక్ తరహా బోధన లేని చోట, 97 శాతం ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉంటారనీ అధ్యయనాలు చెప్తున్నాయి.
సోక్రటిక్ బోధనలో నాలుగు అంశాలున్నాయి. అవి సోక్రటిక్ తరహా తరగతి గదులు, సోక్రటిక్ తరహా ఉపాధాయుడు, సోక్రటిక్ కమ్యూనిటి, సోక్రటిక్ విషయ వస్తువు.
సోక్రటిక్ తరహా తరగతి గది సాంప్రదాయిక తరగతి గదిలాగా, విద్యార్థులంతా వరసల్లో కూచుని నల్లబల్ల కేసి చూసే విధానంలో ఉండదు. అది దాదాపు పది పదిహేను మంది విద్యార్థులు వలయాకారంగా కూచునే తరహా తరగతి గది. నిజానికి సోక్రటీస్ ఎప్పుడూ ఏ తరగదిగదిలోనూ బోధన చేపట్టలేదు. ఆయన వీథిలో, అంగడిలో, రోడ్డుమీద, ఎక్కడ పడితే అక్కడ సంభాషణకి పూనుకునేవాడు. ఆ ఉదాహరణలో మనం గమనించవలసింది, ఒక informal setting. సోక్రటిక్ తరహా తరగతి గదుల్లో ఆ సారళ్యాన్ని, ఆ అనియతధోరణనీ తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ తరగతి గదిలో ఉపాధ్యాయుడూ, విద్యార్థులూ కూడా స్వేచ్ఛగా తమ అభిప్రాయాల్ని ఒక మిత్రబృందంలాగా చర్చించే అవకాశం ఉంటుంది.
సోక్రటిక్ తరహా ఉపాధ్యాయుడు పిల్లలకన్నా ఎక్కువ తెలిసినవాడూ, వాళ్ళకి విద్య పేరిట సమాచారాన్ని కుక్కిపెట్టేవాడూ కాడు. ఒక విద్యావేత్త చెప్పినట్టుగా అతడు సమానుల్లో ప్రథముడు. అతడు పిల్లలతో మాట్లాడించేటప్పుడు తాను కూడా ఆ విషయాన్ని వాళ్ళతో కలిసి కొత్తగా నేర్చుకోడానికి సంసిద్ధత కనపరుస్తాడు. ఆ సంభాషణల్లో అతడు ఎక్కడా తన ప్రాబల్యాన్ని ప్రదర్శించడు. తాను వీలైనంత ఒద్దిగ్గా ఉంటూ తన పిల్లలు మాట్లాడింది వినడానికీ, వారి అభిప్రాయాల్ని అర్థం చేసుకోడానికీ ఉత్సుకత చూపిస్తాడు. కాని నిజానికి సోక్రటీస్ సంభాషణల్లో సోక్రటీస్ చాలాసార్లు తానొక్కడే మాట్లాడుతుంటాడు. ఒకేసారి నలుగురైదుగురితో కూడా మాట్లాడుతుంటాడు. ఆ దృష్టిలో చూసినట్లయితే, సోక్రటిక్ బోధనలో సోక్రటీస్ ని ఉదాహరణగా చూపిస్తున్నది ఉపాధ్యాయుడికి కాదు, విద్యార్థులకి. సోక్రటిక్ తరగతి గదిలో, సోక్రటిక్ తరహా ఉపాధ్యాయుడి అంతిమ లక్ష్యం, తన పిల్లల్లో ప్రతి ఒక్కణ్ణీ ఒక సోక్రటీస్ తరహా చింతనాశీలిగా మార్చడమే.
మూడవది, సోక్రటిక్ తరహా తరగతి గదిలో సోక్రటిక్ తరహా ఉపాధ్యాయుడు తన విద్యార్థుల్ని ఒక సోక్రటిక్ కమ్యూనిటీ గా మారుస్తాడు. ఒకప్పుడు ఏథెన్సులో ఎలాగైతే ఉన్నతవిద్యావంతులైన యువకులు సోక్రటీస్ బోధనలకి ఆకర్షితులై ఆయన వెంట ఒక బృందంగా తిరిగేవారో అటువంటి సత్యాన్వేషుల బృందంగా సోక్రటిక్ తరగతి గది మారుతుంది. వారంతా కలిసికట్టుగా వివిధ జీవితసమస్యల పట్ల తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తో, ఒకర్నినుంచి మరొకరు నేర్చుకోడానికి ప్రయత్నిస్తారు. ఒకరి అభిప్రాయాలు మరొకరిమీద రుద్దడానికి ప్రయత్నించరు. ఒకరితో మరొకరు విభేదించేచోట, ఆ అభిప్రాయ భేదాలని గౌరవంగా అంగీకరించడం నేర్చుకుంటారు. వారంతా ఒక సత్యశోధనా సంఘంగా మారాలని పరితపిస్తూంటారు.
ఇక నాలుగవది, సోక్రటిక్ విషయవస్తువు. సోక్రటిక్ తరహా తరగతి గదులు ఏ విషయాన్ని నేర్చుకోడానికి ఎక్కువ ఉపకరిస్తాయి? నిజానికి సోక్రటిక్ సంభాషణల్లో చాలాసార్లు సోక్రటిస్ గాని, అతడి పృచ్ఛకులు గాని, స్పష్టంగా, ఇతమిత్థంగా ఏ సమాధానానికి చేరుకోరు. అంతేకాక, తన ప్రశ్నల ద్వారా సోక్రటిస్ కొంతసేపటికి తన ప్రతివాదుల్ని ఒక రకమైన అలసటకి, అయోమయానికి, అగమ్యానికి గురిచేస్తాడు. దాన్ని aporia అంటారు. అది చెడ్డపదమేమీ కాదు. ఒకరకంగా ఆ అవస్థ మంచిదనే అనాలి. సోక్రటీస్ సంభాషణల ముఖ్య ఉద్దేశ్యం మనుషులు గతానుగతికంగా ఏర్పరుచుకునే నమ్మకాల్ని ఒక కుదుపు కుదపడం. పరీక్షకు గురిచెయ్యడం. అసలు పరీక్షకు గురికాని జీవితం జీవితమే కాదన్నాడు సోక్రటీస్. సోక్రటీస్ సంభాషణల్లో స్పష్టమైన సమాధానాలు రాబట్టిన ఒకే ఒక్క సంఘటన ఆయన బానిస పిల్లవాడితో పైథాగొరస్ సిద్ధాంతం చెప్పించడం మాత్రమే. కాని గణితం లాంటి నిర్ధిష్ట అంశం మీద సోక్రటీస్ చేపట్టిన ఏకైక సంభాషణ కూడా అదే. కాబట్టి సోక్రటిక్ తరహా తరగతి గదుల్లో ఉపాధ్యాయుడూ, విద్యార్థులూ కలిసి ఉమ్మడిగా ఏ అంశాల్ని చర్చిస్తే బాగుంటుంది? అమెరికన్ పాఠశాలలు ఈ అంశంలో చాలా ప్రయోగాలు చేసి చివరకు రెండు రకాల విషయాలు సోక్రటిక్ బోధనలో సత్ఫలితాల్నిస్తాయని తేల్చారు. ఒకటి, చరిత్ర, సైన్సుకి సంబంధించిన మౌలిక సూత్రాలు, తత్త్వశాస్త్రం, సాహిత్యం మొదలైన అంశాల్లో ఉమ్మడి విచారణ విద్యార్థుల్ని మరింత నిశితంగా ఆలోచించేవాళ్ళుగా, కేవలం అభిప్రాయాలతో ఆగిపోకుండా, ఆ అభిప్రాయాల్ని జ్ఞానంగా తీర్చిదిద్దుకునే విధంగా ఉపకరిస్తుందని భావించారు. రెండవ తరహా విషయ వస్తువు, కళలు, నాటకాలు, సంగీతం, సినిమాలు, టెలివిజన్ ప్రసారాలు మొదలైనవాటిమీద సమీక్షలు. అటువంటి అంశాల మీద విద్యార్థులూ, ఉపాధ్యాయుడూ కలిసి ఉమ్మడిగా విచారణకు పూనుకోవడం తరగతిగదుల్లో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని కూడా ప్రోది చేస్తుంది.
అన్నిటికన్నా ముఖ్యం సోక్రటిక్ తరహా బోధన, అభ్యసనం పుస్తక విద్య కాదు. పుస్తకాల్లో ఉన్నవాటిని పునశ్చరణ చేయడం అక్కడ ప్రధానం కాదు. అది ఎవరికి వారు తమ స్వీయ జీవితానుభవాల ఆధారంగా పరస్పరం మాట్లాడుకుని, తమ అభిప్రాయాలు పంచుకోడం ద్వారా ఒకరినొకరు విద్యావంతుల్ని చేసుకునే నిరంతర ప్రక్రియ.
28-4-2020