
సోక్రటీస్ తన సంభాషణల్లో సమాచారాన్నీ, వాస్తవాల్నీ ఎప్పుడూ చర్చకు పెట్టలేదు. మనుషులు త్వరత్వరగానూ, అవగాహనలేకుండానూ ఏర్పరచుకునే ఊహల్నీ, నమ్మకాల్నీ ఖండించడం మీదనే ఆయన ప్రధానంగా దృష్టి పెట్టాడు. ఇప్పుడు సమాచార విప్లవం సంభవించిన కాలంలో మనకి ఏ అంశం మీదైనైనా విస్తారంగా సమాచారం లభించే కాలంలో సోక్రటీస్ తరహా సంభాషణాశీలి మరింత అవసరమనిపిస్తున్నాడు.
ఎందుకంటే మనకి లభిస్తున్న సమాచారం ముందు జ్ఞానంగా మారవలసి ఉంటుంది. ఆ జ్ఞానం వివేకంగా పరిణతి చెందవలసి ఉంటుంది. సమాచారం నేరుగా జ్ఞానంగా మారకపోగా ముందు అది అరకొర సమాచారంగానూ, అపోహల్నీ, దురభిప్రాయాలు కలిగించేదిగానూ మారే ప్రమాదమే ఎక్కువ. సరిగ్గా అటువంటి సమయంలోనే మనకొక సోక్రటీస్ అవసరమవుతాడు. అతడు మనతో మాట్లాడిస్తాడు. మనకి లభిస్తున్న సమాచారాన్ని మనం సరిగ్గా పరీక్షించుకోకుండా త్వరత్వరగానూ, దుందుడుకుగానూ ఏర్పర్చుకునే మన అభిప్రాయాల్ని నిగ్గు తేల్చడానికి పూనుకోకుంటాడు. ఆ క్రమంలో అతడు మన అభిప్రాయాల్లో ఉండే అసామంజస్యాన్ని, అనౌచిత్యాన్నీ, అసంగతత్వాన్నీ ఎత్తిచూపినప్పుడు ముందు మనం నిశ్చేష్టులమవుతాం. అతడు నిర్దాక్షిణ్యంగా మనల్ని ఖండిస్తుంటే మొదట మనకేం చెయ్యాలో తెలీదు. కాని నెమ్మదిగా అతడు ఒక కుశలురాలైన మంత్రసానిలా మన ప్రసవవేదనలోంచి మనం సత్య శిశువును ప్రసవించేలా చేస్తాడు.
సరిగ్గా ఇందువల్లనే ఇప్పుడు మనకి ప్రతి పాఠశాలలోనూ ఒక సోక్రటిక్ సర్కిల్ తప్పనిసరిగా అవసరమనిపిస్తున్నది. ముఖ్యంగా కౌమారదశలో ఉన్న మన బాలబాలికలు సమాజం గురించి, వివిధ రకాల అసమానత్వాల గురించి, అన్యాయాల గురించి, సమాజంలో ఉన్న వివిధ ప్రజాసమూహాల గురించి ఏర్పరచుకునే అపోహల్ని వాళ్ళంతట వాళ్ళే తెలుసుకునేలా చేసి వాళ్ళ ఆలోచనకు పరిణతి తేగల సోక్రటీస్ ఒకరు ప్రతి హైస్కూలుకు తప్పనిసరి.
ఉదాహరణకి మన సామాజిక మాధ్యమాల్లో తమకు నచ్చని పనులు చేసేవాళ్ళమీదా, తమ సామాజిక వర్గానికి చెందని వాళ్ళమీద మీదా ఒక్కొక్కప్పుడు రోజుల తరబడి సాగే ట్రోలింగ్ చూడండి. అట్లా ట్రొలింగ్ కి గురయ్యేవాళ్ళు స్త్రీలయితే ఆ ట్రోలింగ్ మరింత జుగుప్సాకరంగానూ, మరింత విద్వేషభరితంగానూ, అత్యంత అసహ్యకరమైన పదజాలంతోనూ సాగుతుంది. ఒకరు సామాజిక మాధ్యమంలో ఒక వ్యక్తి మీద ట్రోలింగ్ చేస్తున్నారంటే ముందు ఆ వ్యక్తి కి కొంత చదవడం, రాయడం, మొబైలు ఫోను ఉపయోగించడం, ఒక అకౌంటు తెరవడం, పాస్ వర్డ్ సెట్ చేసుకోవడం, టైపు చెయ్యడం లాంటివన్నీ వచ్చనే కదా అర్థం. అంటే ఏమిటి? వాళ్ళు చదువుకున్న చదువు, వాళ్ళకి కనీస పఠన, లేఖన సామర్థ్యాలు ఇచ్చిందిగానీ, ఒక నైతికతని ఇవ్వలేకపోయిందనే కదా. ఎదటి వాళ్ళ అభిప్రాయాల్ని సహించగలిగే వ్యక్తిత్వాన్ని సంతరింపలేకపోయిందనే కదా అర్థం. ఇటువంటి పరిస్థితికి మూలాలు మన హైస్కూళ్ళలోనూ, కళాశాలల్లోనూ ఉన్నాయి.
ఒకప్పుడు మన పాఠశాలల్లో డిబేట్లు జరిపేవారు. ఒక సమస్యని రెండు వైపులా ఆలోచించడం, వాదించడం నేర్పేవారు. నీకు సుతరామూ ఇష్టంలేని అంశాన్ని కూడా నువ్వు ప్రశాంత చిత్తంతో ఆలోచించగలిగే మానసిక స్థైర్యాన్ని నీకు అలవరచేవారు.
ఈ సందర్భంగా నాకో సంఘటన గుర్తొస్తోంది. నా చిన్నప్పుడు తాడికొండ లో చదువుకున్నప్పుడు నన్ను జిల్లాస్థాయి వక్తృత్వపోటీలకు పంపేవారు. నిజానికి నన్ను తాడికొండ ఒక వక్తగా తీర్చిదిద్దిందని చెప్పాలి. అప్పట్లో గుంటూరులో ఏ పోటీ జరిగినా నన్ను తప్పకుండా పంపేవారు. ప్రతి పోటీలోనూ వందలాది మంది విద్యార్థులు జిల్లా అంతటినుంచీ పాల్గొనేవారు. ఒక్కొక్కప్పుడు రెండు రోజుల పాటు కూడా పోటీలు జరిగేవి. ఆ పోటీల్లో కొన్నిసార్లు మనం మాట్లాడవలసిన అంశం అయిదు నిమిషాల ముందుదాకా చెప్పేవారు కారు. పోటీ జరిగే గదికి ఆనుకుని మరొక గది ఉండేది. నీ ముందు వక్త పోటీగదిలోకి వెళ్ళగానే నిన్నా పక్కగదిలోకి పంపేవారు. అప్పుడొకరు వచ్చి చిన్న చీటీ ఒకటి నీ చేతుల్లో పెట్టేవారు. నువ్వు మాట్లాడవలసిన అంశం ఆ చీటీలో రాసి ఉండేది. ఇక నీకు ఆలోచించుకోడానికీ, సంసిద్ధుడివికావడానికీ అయిదు నిమిషాలు మాత్రమే ఉండేది. అయిదు నిమిషాలు కూడా కాదు. నీ పక్క గదిలో వక్త ఎంతసేపు మాట్లాడతాడో అంత సేపు మాత్రమే అన్నమాట. అటువంటి ఒక పోటీలో అయిదు నిమిషాల ముందు నా చేతిలో పెట్టిన చీటీ తెరిచి చూసుకుంటే అందులో ఏముంది?
‘మద్యపాన నిషేధం మంచిది కాదు.’
నిజానికి నన్ను ఆ పోటీకి తీసుకువెళ్ళిన వెంకటరత్నం మాష్టారు మద్యపాన నిషేధం ఎందుకు మంచిదో చెప్పారేగాని, ఎందుకు మంచిది కాదో చెప్పలేదు. నా ముందున్నది అయిదు నిమిషాలు మాత్రమే. నాలుగు నిమిషాలు నన్ను నేను కూడదీసుకోడానికే సరిపోయింది. మిగిలిన ఆ ఒక్క నిమిషంలో ఏమి ఆలోచించుకున్నానో గాని, ఆ పోటీలో ప్రథమ బహుమతి నాకే అన్నది మాత్రం గుర్తుంది.
ఇప్పుడు ఉపాధ్యాయులు పిల్లలకి అందించవలసింది సమాచారం కాదు. పాఠ్యపుస్తకాల్లో ఉన్న QR code లు ఆ పని సమర్థవంతంగా చెయ్యగలవు. సమాచారం ఎక్కడ దొరుకుతుందో, ఎలా నావిగేట్ చేసుకోవాలో చెప్తే చాలు. కాని అంతకన్నా కూడా ఉపాధ్యాయుడి ప్రధాన కర్తవ్యం పిల్లవాడు పోగుచేసుకుంటున్న సమాచారాన్ని బట్టి ఎటువంటి అభిప్రాయాలు ఏర్పర్చుకుంటున్నాడో వాటిని నిశితంగా పరిశీలించడం,నిశిత పరీక్షకు గురిచెయ్యడం. చాలా పాఠశాలల్లో knowledge is power అని ఫ్రాన్సిస్ బేకన్ చెప్పిన మాటలు రాసి ఉంటాయి. కాని నిజానికి మన పాఠశాలల మీద ఇప్పుడు రాసిపెట్టవలసిన వాక్యం an unexamined life is not worth living (పరీక్షకు గురికాని జీవితం జీవించినట్టే కాదు) అని సోక్రటీస్ చెప్పిన మాటలు.
విద్య అంటే సామర్థ్యమా లేక శీలనిర్మాణమా అనేది సనాతనకాలం నుండీ నడుస్తున్న చర్చ. విద్యార్థికి జీవనోపాధి సామర్థ్యాలు సమకూర్చడమే పాఠశాల పని, పిల్లవాడి వ్యక్తిత్వ నిర్మాణ బాధ్యత తల్లిదండ్రులదీ, సమాజానిదీ, స్నేహితులదీ మాత్రమే అని చెప్పడం సులభం. కాని, పిల్లవాడు బయట ఏర్పరచుకుంటున్న అరకొర అభిప్రాయాల్నీ, అపోహల్నీ సరిదిద్దవలసిన బాధ్యత అన్నిటికన్నా ముందు పాఠశాలదే. నైతికత ఒక విడి వస్తువు కాదు. అది నీకన్నా భిన్నంగా ఉండే మనుషులతో కలిసి మెలిసి జీవించవలసి వచ్చినప్పుడు నువ్వు చేసుకునే సర్దుబాటు, నేర్చుకునే సహనం, అన్నిటికన్నా ముందు నీకన్నా భిన్నంగా జీవిస్తున్నవాళ్ళ జీవితసౌందర్యమెటువంటిదో తెలుసుకోవాలన్న జాగృతి. పిల్లవాడిలో అటువంటి జాగృతిని కలిగించడంలోనే ఒక పాఠశాల నిజమైన పాఠశాలగా మారుతుంది.
మన పాఠశాలలు, కళాశాలలు అటువంటి శీలాన్ని పిల్లవాడికి అలవర్చకుండా జీవనోపాధి సామర్థ్యాలు మాత్రమే అలవరచి సమాజంలోకి పంపుతున్నప్పుడు పిల్లలు పెద్ద ఎత్తున సాఫ్ట్ వేర్, మానేజిమెంటు రంగాల్లో ఉద్యోగాల్లో చేరినప్పుడు వాళ్ళు ఎంత అపరిణత మనస్కులుగా ఉద్యోగనిర్వహణలో చేరుతున్నారో ఆ సంస్థలు గుర్తుపడుతున్నాయి. అప్పుడు వారికి తమని తాము చక్కదిద్దుకోడం మీద శిక్షణ ఇవ్వడానికి తాపత్రాయ పడుతున్నాయి. ‘చక్కగా మాట్లాడటమెలా?’, ‘సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమెట్లా?’, ‘నీ హావభావాలు అంటే నీ బాడీ లాంగ్వేజి కూడా ఒద్దిగ్గా ఉండటమెట్లా?’లాంటి కోర్సులు నడుస్తున్నాయంటే అర్థమేమిటి? ఆ గుణగణాల్ని పాఠశాలలు అలవర్చలేదనే కదా అర్థం. ఆధునిక విద్యాపరిభాషలో వీటిని performance virtues అంటున్నారు. అంటే నైతికత అంటూ విడిగా ఏమీ ఉండదనీ, నువ్వు నీ పని మరింత ఉత్పాదక శీలంగా పనిచేయడానికి కొన్ని కౌశల్యాలు నేర్చుకుంటే చాలనీ వాదిస్తున్నారు.
కాని సోక్రటీస్ ఈ మాటలు వింటే సరిగ్గా తన కాలంలో సోఫిస్టులు మాట్లాడిన మాటలివే అని చెప్పి ఉండేవాడు. నైతికత ఒక ప్రదర్శన కాదు. అసలు నిజానికి ఏ virtue కూడా విజయం కోసం కానే కాదు. ఈ మధ్య నాకొకరు ఒక పుస్తకం బహూకరించారు. దాని పేరు Non-Violent Communication. అసలు భావప్రసారం జరగవలసిందే non violent గా. మళ్ళా అందులో non-violent communication అంటూ ఒకటి విడిగా ఉంటుందని ఎత్తిచూపి దాని ఎలా అలవర్చుకోవాలో చెప్పడమేమిటి? అంటే మన ఇళ్ళల్లో, మన పాఠశాలల్లో, మన సమాజంలో మనం మన పిల్లలకి నేర్పుతున్నది violent communication అనేగా!
మొన్న ఐ ఏ ఎస్ కి ఇంటర్వ్యూకి హాజరయినప్పుడు ప్రశ్నోత్తరాలన్నీ ముగిసిపోయి ఇంటర్వ్యూ అయిపోబోతూండగా, ఆ బోర్డుకి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబరు నన్నో ప్రశ్న అడిగారు. ‘ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతున్న మాటలు విన్నాక నాకీ ప్రశ్న అడగాలనిపిస్తోంది. ఈ ప్రశ్న నేను వ్యక్తిగతంగా అడుగుతున్నాను అనుకోండి. ఇది చాలా రోజులుగా నన్ను పీడిస్తున్న సందేహం. మీరేమంటారో వినాలని ఉంది’ అన్నారామె. అప్పుడు నన్నిలా ప్రశ్నించారు.
‘ఇప్పుడు మనం ఏది మాట్లాడినా, ఏ పదజాలం వాడినా ఎవరివో ఒకరివి మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు కదా. అంటే దానర్థం మనం ఎవరో ఒకరిని నొప్పించకుండా ఏదీ మాట్లాడలేమనే కదా. అటువంటప్పుడు మనమేం చెయ్యాలి? మాట్లాడితే కష్టం కాబట్టి మాట్లాడకుండా ఉండిపోక తప్పదా? మీరేమంటారు?’
నేనన్నాను కదా. ‘ఒకరు మాట్లాడితే మన మనోభావాలు భంగపడుతున్నాయనేవారు ముందు తామెట్లా మాట్లాడుతున్నారో కూడా ఆలోచించుకోవాలి. ఒకరి మనోభావాల్ని బాధించకుండానే మనం మన దృఢమైన అభిప్రాయాల్ని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉండవచ్చు, పంచుకుంటూ ఉండవచ్చు. నిజానికి అలా పంచుకోగలగడమే నిజమైన విద్య, క్రమశిక్షణ.’
ఇంకా ఇలా చెప్పాను: ‘నా సంగతే తీసుకోండి. నేను ఫేస్ బుక్ లో చాల యాక్టివ్ గా ఉంటాను. వందలాది మిత్రుల్తో నా భావాలు పంచుకుంటూ ఉంటాను. పదేళ్ళకు పైగా రెగ్యులర్ గా నా భావాలూ, అభిప్రాయాలూ పంచుకుంటూనే వస్తున్నాను. కాని ఇంతదాకా ఎవరూ కూడా నేను నా మాటల్తో వారి మనోభావాల్ని గాయపరిచానని అనలేదు. ఒకటి రెండు సార్లు నేను చేసిన చిన్న చిన్న పదప్రయోగాల మీద నా మిత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని నిస్సంకోచంగా, తక్షణమే తొలగించేసాను కూడా. మన ప్రవర్తనని బట్టి, మన నైతికతను బట్టి సమాజం మన పట్ల చూపే ప్రవర్తనా, ప్రతిస్పందనా ఆధారపడి ఉంటాయి.’
ఆమె ఆ ప్రశ్న ఇంటర్వ్యూలో భాగంగా అడగట్లేదని చెప్పినప్పటికీ, ఆ ఇంటర్వ్యూలో నేను ఎంపిక కావడానికి, ఆ ప్రశ్నా, ఆ సమాధానమే కారణమని నేను నమ్ముతున్నాను. కాని ఆ సమాధానం నేనొక performance virtue గా చెప్పింది కాదు. నేను దేన్ని అనుష్టిస్తున్నానో దాన్నే అక్కడ సుదృఢంగా చెప్పుకోగలిగాను.
2-5-2020