నాకొక బెతనీ కావాలనిపిస్తున్నది

సుమనస్పతి కవి, భావుకుడు, అనువాదకుడు, అన్నిటికన్న మించి ప్రకృతి స్నేహితుడు, ఆదివాసి ప్రేమికుడు. ఆయన మొన్న రాత్రి ఫోన్ చేసి చలం గారి నవల ‘మార్తా’ కి అప్పట్లోనే ఆకాశవాణి నాటకీకరణ చేసిందని చెప్తూ ఆ ఆర్కైవ్ పంపించారు. శ్రీ గోపాల్ అనే ఆయన రూపొందించిన శ్రవ్యరూపకం. చలం గారి ‘పురూరవ’ని కూడా నాటకీకరణ చేసింది కూడా ఆయనేనట. ఆ నాటకాన్ని ఆకాశవాణి ఆదిలాబాదునుంచి కూడా ప్రసారం చేయబోతున్నామని చెప్తూ, ఉపోద్ఘాతంగా నన్నేవన్నా నాలుగు మాటలు చెప్పమంటే తోచిన వేవో మాటలు చెప్పాను గానీ నాటకాన్ని ఆ తర్వాతే విన్నాను.

ఇదిగో, మీకోసం ఇక్కడ ఆ నాటకం ‘పూర్ణమానవుడు’ లింకు.

ఒక్కసారిగా వినడానికి కుదరక నాలుగైదు అంచెలుగా విన్నాను. ముగింపు నిన్న రాత్రికి వినగలిగాను. నా మనసు చెప్పలేని గాఢానుభూతిలో మగ్నమైపోయింది. మార్తా నవల గురించి నేనింతకుముందు రెండు మూడు సార్లు రాసాను. కాని ఏదైనా ఒక రచనని చదివినప్పుడు స్ఫురించని కొత్త కోణాలు విన్నప్పుడో, రంగస్థలమ్మీద చూసినప్పుడో మళ్ళా కొత్తగా గోచరించడం ఎవరికైనా అనుభవమే కద!

ఇప్పటిదాకా మార్తా నవల బాధ్యతల్తో కూడిన ప్రేమకీ, బాధ్యతల్ని దాటిన ప్రేమకీ మధ్య సంఘర్షణగానే అర్థమవుతూ వచ్చింది నాకు. కాని, నిన్న రాత్రి మొదటిసారి మగ్దలీను మరియ దృష్టికోణం నుంచి చూడగలిగాను. చలంగారు తనని మగ్దలీను మరియలో కూడా చూసుకున్నారా అనిపించింది. నాటకీకరణ చేసిన ప్రయోక్త నాటక పతాక సన్నివేశంగా మగ్దలీను అంతరంగ మథనాన్ని ఆవిష్కరించడంతో నవల నాకు మరోసారి కొత్తగా బోధపడింది. ఒకసారి నీ జీవితంలో ఒక క్రీస్తునో, ఒక రమణులో ప్రవేశించాక నువ్వు ఎంతచేసీ పూర్వంలాగా జీవించలేవు, చివరికి అత్యున్నత త్యాగం చేయాలనుకున్నా కూడా నీ పూర్వజీవితంలోకి నువ్వు ప్రవేశించలేవు. ఒక రక్షకుడు, ఒక బోధకుడు నీ జీవితంలో అడుగుపెట్టాక నువ్వు అంతదాకా భావించే విలువైన నీ జీవితమంతా ఒక అలబస్టరు సుగంధ తైలకలశంలాగా భళ్ళున పగిలిపోవలసిందే. దేహం ఒక కలశం. అది నీదైనా, యేసుదైనా పగిలిపోక తప్పదు. కాని ఆ సమర్పణాసుగంధం మాత్రం శాశ్వతం.

ఏమోనబ్బా, నాకొక బెతనీ కావాలనిపిస్తున్నది. ఒక తుపాను రాత్రి, ఆ పల్లెలో, ఆ నిరుపేద అక్కాచెల్లెళ్ళ ఇంటికి ప్రభువు విచ్చేసినప్పుడు, మార్తా వేడివేడిగా రొట్టెలు కాల్చి పెడుతున్నప్పుడు, ఆ పరివారంలో నేను కూడా ఒకడిగా ఉండాలనిపిస్తున్నది. ఎంత జీవితం ఎంత సుదీర్ఘకాలం పాటు జీవించి ఏం ప్రయోజనం? బెతనీలో అట్లాంటి ఒక రాత్రి ఒక్కటి లభించినా చాలు, ఈ జీవితానికి! ఒక బుల్లేషాలాగా, ఒక రూమీలాగా, ఒక కబీరులాగా, ఒక నానక్ లాగా, ఒక టాగోర్ లాగా, ఒక చలంలాగా ప్రభుకృపాతిశయాన్ని అనుభవంలోకి తెచ్చుకుని నోరారా గానం చెయ్యాలని ఉంది.

6-5-2020

Leave a Reply

%d bloggers like this: