చర్చ ఒక సాధన

సోక్రటిక్ తరహా విద్యలో భాగంగా అమెరికన్ తరగతిగదుల్లో చేపట్టిన ప్రయోగాలు ఎలా జరుగుతాయో తెలుసుకుందామని కొంత ప్రయత్నించాను. ఆ ప్రయోగాల మీద చాలా పుస్తకాలు వెలువడ్డాయి. వాటిలో Teach Like Socrates: Guiding Socratic Dialogues and Discussions in the Classroom (2014) చాలా వివరంగానూ, ఆ పద్ధతిని మన తరగతి గదుల్లో ప్రవేశపెట్టడానికి కొంత దారిచూపించేదిగానూ కనిపించింది. Eric Wilberding ఇటలిలో ఒక ఇంటర్నేషనలో స్కూల్లో ఉపాధ్యాయుడు. ఈ పుస్తకం అతను 7-12 తరగతుల పిల్లలకోసం రాసాడు. 8-12 తరగతుల పిల్లలకోసం Socratic Methods in the Classroom అనే మరో పుస్తకం కూడా రాసాడు.

ముందుగా అతడు మనం పిల్లలకి నేర్పాలనుకునే మూడు R లతో పాటు నాలుగవ R కూడా ఉందనీ, అది reasoning అనీ, 21 వ శతాబ్దపు కరికులంలో critical thinking, problem solving అనే రెండు సామర్థ్యాలు పిల్లలకి అలవడాలంటే, నాలుగవ R తప్పనిసరి అని చెప్తూ, ఎక్కడెక్కడైతే, ఒక పద్ధతి ప్రకారం ప్రశ్నోత్తరాల రూపంలో వివేచన జరుగుతుందో అక్కడక్కడల్లా సోక్రటీస్ అడుగుజాడలున్నట్టే అంటాడు.

ఆ దారిలో జి.పోల్యా అనే ఒక హంగేరియన్ గణితశాస్త్రజ్ఞుడు రాసిన How to Solve It (1945) అనే పుస్తకంలో దాన్నొక నూతన బోధనాపద్ధతిగా ప్రతిపాదించాడని చెప్తాడు. పోల్యా చెప్పిన దాని ప్రకారం ఒక గణితసిద్ధాంతాన్ని విద్యార్థికి పరిచయం చెయ్యడంలో నాలుగు దశలుంటాయి. మొదటి దశలో మనం ఆ సమస్యని లేదా ఆ ప్రతిపాదనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి (understand). రెండవ దశలో దాన్ని కలిసికట్టుగా విశ్లేషించుకోవాలి (analyse) మూడవ దశలో ఆ విశ్లేషణాఫలితాల్ని కూడగట్టుకోవాలి (synthecize). నాలుగవ దశలో మనం ఏ పరిష్కారానికి చేరుకుంటున్నామో పరిశీలించుకోవాలి (solve) . ‘చక్కగా చదువు చెప్పడమంటే ఏమిటి? విద్యార్థి తనంతట తనే విషయాల్ని గుర్తుపట్టేలా వీలైనన్ని అవకాశాల్ని పద్ధతి ప్రకారం అందిస్తూ పోవడమే ‘అన్నాడట పోల్యా.

దీన్ని discovery learning అని కూడా అనవచ్చు. ఈ అభ్యసనం నాలుగంచెల్లో నడుస్తుంది. మొదటి దశలో అందేది factual knowledge, ఒట్టి సమాచారం. తరువాతి దశలో దాన్ని బట్టి ఊహలూ, అభిప్రాయాలూ సంతరించుకోవడం, conceptual knowledge. ఆ తర్వాత దశలో తాము ఏర్పరచుకుంటున్న అభిప్రాయాల్ని ఒక పద్ధతి ప్రకారం నిశితపరీక్షకు గురిచేసుకుంటూపోవడం, procedural knowledge. ఇక చివరగా తాము గ్రహించిన దాన్ని గుర్తించడం, Meta-cognitive knowledge.

సోక్రటిక్ పద్ధతిని బెంజమిన్ బ్లూమ్స్ టాక్సానమీ వెలుగులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ విల్బర్డింగ్ రెండు విస్పష్ట పార్శ్వాల్ని గుర్తుపట్టాడు. మొదటి పార్శ్వంలో అది మన అభిప్రాయాల్నీ, భావాల్నీ, అనుభూతుల్నీ చెప్పుకోవడం, రెండవ పార్శ్వంలో ఆ వ్యక్తీకరణల్ని ఒక పద్ధతి ప్రకారం ఒక గురువు పర్యవేక్షణలో విశ్లేషణకీ, నిశిత పరీక్షకీ గురిచెయ్యడం.

మన తరగతి గదులు ప్రధానంగా మొదటి దశ బోధన దగ్గరే అంటే factual knowledge ని ఇవ్వడం దగ్గరే ఆగిపోతున్నాయి. కొన్ని పాఠశాలలు ఆ దశని దాటి conceptual knowledge దశకి సంబంధించిన కొన్ని అభ్యాసాల్ని పిల్లలకి ఇవ్వకపోవటంలేదు. ఉదాహరణకి ఎన్ సి ఇ ఆర్ టి రూపొందించే పాఠ్యపుస్తకాలు. కాని అవి ప్రధానంగా పిల్లవాడికి ఒక ప్రాజెక్టు వర్కు గా ఆ పనుల్ని అప్పగిస్తున్నాయిగాని, ఒక తరగతి మొత్తం లేదా కొన్ని బృందాలు కలిసి తమకి లభిస్తున్న సమాచారం ఆధారంగా తాము ఏర్పరుచుకుంటున్న భావాల్ని చర్చించడం మీదా పరీక్షకు గురిచెయ్యడం మీదా దృష్టి పెట్టడం లేదు.

దీనికి కారణం మన పాఠ్యపుస్తకాలు విషయపరిజ్ఞానాన్ని కుక్కిపెట్టిన గోనెసంచులుగా మారిపోవడమే. చర్చని క్లాస్ రూమ్ వర్క్ గా మార్చి, పాఠ్యపుస్తకాన్ని హోం వర్క్ గా ఎవరు మార్చగలడో అతణ్ణి మాత్రమే నేను ఉత్తమ ఉపాధ్యాయుడు అనగలను.

మన పాఠశాలల్లో ప్రస్తుతం నడుస్తున్న ప్రస్తుత విద్యాప్రణాళిక ప్రకారం తరగతి గదుల్ని చర్చామందిరాలుగా మార్చగలగడం ఊహకి కూడా అందే విషయం కాదు. కాని, కనీసం అటువంటి ఒక అభ్యసన ధోరణిని పిల్లలకు పరిచయం చెయ్యడానికి సోక్రటిక్ తరహా చర్చలు ఉపయోగపడతాయి.

అటువంటి చర్చలు ఏ విధంగా చేపట్టవచ్చో విల్బర్డింగ్ ఒక నమూనా పాఠ్యప్రణాళికని మనకి అందిస్తున్నాడు. స్థూలంగా ఆ ప్రణాళిక ఈ విధంగా ఉంటుంది.

విషయాన్ని ఎంచుకోవడం

సోక్రటిక్ తరహా చర్చ చేపట్టాలకున్నప్పుడు ఉపాధ్యాయుడు ముందుగా ఒక విషయాన్ని ఎంపికచేసుకోవాలి. అవి విద్య, అనుభూతి, సౌందర్యం, స్వేచ్ఛ, ప్రకృతి, ప్రజాస్వామ్యం లాంటి ఏదైనా ఒక భావం కావచ్చు లేదా ఒక ప్రత్యేకమైన సమస్య కూడా కావచ్చు. విషయాన్ని ఎంచుకున్నాక ఉపాధ్యాయుడు ఒక చిన్న నోట్ తయారు చేయాలి. దాన్లో లేవనెత్తుతున్న అంశాల్ని బుల్లెట్ పాయింట్ల రూపంలో పోందుపరచాలి. ఆ నోటు పిల్లలకి కనీసం వారం రోజులు ముందేనా అందచేయాలి.వారిని కూడా ఆ అంశం మీద ఆలోచించి చర్చకి సంసిద్ధులుగా రమ్మని చెప్పాలి.

ఆ విషయం మీద పిల్లల్ని సంసిద్ధులు కమ్మని చెప్పడం

పిల్లలు ఆ సమస్య మీద లేదా ఆ చర్చనీయాంశం మీద తాము ఏమనుకుటంఉన్నారో తమ సొంతమాటల్తో ముందు తమకై తాము కొంత రాసి చూసుకోవాలి. ఆ సమస్య లేదా ఆ అంశంలో తమకి స్పష్టంగా లేని అంశాలేమిటో కూడా రాసుకోవాలి. తాము చర్చకి వచ్చేటప్పటికి వాళ్ళు ఆ అంశం మీద కొంత ఆలోచించి ఉండగలగాలి.

సమావేశం కావడం

నిర్దేశించిన రోజు, నిర్దేశించిన సమయంలో పిల్లలంతా తరగతిగదిలో కాని, పాఠశాల ఆవరణలో ఒక చెట్టు కిందగాని లేదా పచ్చికబయల్లో గాని వలయాకారంగా కూచుని ఒకరినొకరు పలకరించుకోవాలి.

చర్చ మొదలుపెట్టడం

చర్చ మొదలుపెట్టినతరువాత పిల్లలూ, ఉపాధ్యాయుడూ కూడా శ్రద్ధగా వినాలి. ఎక్కడేనా తమకి స్పష్టంగా వినిపించినచోట, లేదా ఎవరి అభిప్రాయాలేనా స్పష్టంగా అర్థం కాకపోతే మళ్ళా చెప్పమని అడగాలి. ఉపాధ్యాయుడు చర్చలో చాలా చురుగ్గా పాల్గోవాలి గాని ఎక్కడా తన అభిప్రాయాలు ప్రకటించకూడదు, వీలైనంతగా పిల్లల్ని మాట్లాడించాలి. వాళ్ళు అడిగే ప్రశ్నలకి తాను సమాధానాలు చెప్పకూడదు. సోక్రటీసు ప్రతి సంభాషణలోనూ తనకేమీ తెలియదని చెప్పేవాడని మరీ మరీ గుర్తుపెట్టుకోవాలి.

Terms of argument

విద్యార్థులు తమ అభిప్రాయాలు ప్రకటించడం మొదలుపెట్టాక చర్చ మొదలవుతుంది. ఒక చర్చ ఆరోగ్యకరంగా జరగాలంటే, కొన్ని నియమనిబంధనలు తప్పనిసరి. వాటిని మనం terms of argument అంటాం. అవి ఆరు విధాలుగా ఉంటాయి.

1. ప్రతిపాదన: ఒక విషయం సరైనది కావచూ, తప్పు కావచ్చు, కాని దాని గురించి చేసే ఒక ప్రకటన ప్రతిపాదన.

2. ఆధారం: అటువంటి ప్రకటన చెయ్యడానికి తన దగ్గరుండే సమాచారం దానికి భూమిక లేదా ప్రమేయం అవుతుంది.

3. నిర్ధారణ: సవ్యమైన ఒక ఆధారాన్ని చూపిస్తూ చేసే ప్రతిపాదన నిర్ధారణ అనిపించుకుంటుంది.

4. వాదన: ఒకరు అటువంటి నిర్ధారణ కు రాగానే, దాన్నొక ప్రతిపాదనగా స్వీకరిస్తూ దాన్ని అంగీకరిస్తూగాని, ఖండిస్తూ గాని మరొకరు మరొక ప్రతిపాదన చెయ్యగానే అది వాదనగా మారుతుంది.

5. మూల్యాంకన ప్రకటన: ఎవరేనా ఒక ప్రతిపాదన చేసినప్పుడు ఆ ప్రతిపాదన మంచి అని గాని, చెడ్డ అనిగాని చెప్పడం ఆ ప్రతిపాదనని వాల్యూ జడ్జిమెంటు అంటారు.

6. వివరణ: ఒక ప్రతిపాదనకు మద్దతుగా చెప్పే వాక్యాలు. అది ఆధారం కన్నా భిన్నమైంది. ఒక ప్రతిపాదన సవ్యమైందో కాదో చెప్పడానికి మద్దతుగా చూపించేది ఆధారం. ఆ ప్రతిపాదనని మరింత విస్పష్టంగా చెప్పేది వివరణ.

Follow up questions

చర్చ జరిగేటప్పుడు, విద్యార్థులు తమ అభిప్రాయాలు ప్రకటించడం మొదలుపెట్టాక, అవసరమనిపించినచోటల్లా ఆ అభిప్రాయాల్ని మరింత వివరంగా చెప్పమని అడుగుతుండాలి.. ఆ follow up questions నాలుగు రకాలుగా ఉంటాయి.

1. మరింత స్పష్టంగా చెప్పమని అడగటం: ‘నువ్విలా అనడంలో నీ ఉద్దేశ్యమేమిటి..?’, ‘నువ్వు ఫలానా మాట వాడుతున్నావు కదా, దాన్ని మరింత వివరించగలవా..?’, ‘ఈ మాటే మరోలా చెప్పగలవా..?’

2. సవాలు చెయ్యడం: ‘నీకిలా చెప్పడానికి ఆధారమేమిటి..?’ ‘దీనికేదైనా ఉదాహరణ చెప్పగలవా..?’

3. పర్యవసానాల్ని ఊహించమనడం: ‘ఒకవేళ ఇలా జరిగితే…?’

4. కలిపి చూడటం:నువ్వు చెప్తున్న ఈ మాటలు ఫలానా అతను చెప్తున్న మాటల్తో కలిపి చూడగలవా..?’, ‘నువ్వు చెప్తున్న మాటలు ఫలానా పుస్తకంలో ఉన్న విషయంతో కలిపి చూడగలవా…?’

తగినంత సమయమివ్వడం

పిల్లలు చర్చ చేసేటప్పుడు ఒక్కొక్కరికీ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికీ, వారి అభిప్రయాలమీద వచ్చే ప్రశ్నలకి ప్రతిస్పందించడానికీ తగిన సమయం ఇవ్వాలి. తొందరపెట్టకూడదు.

మొత్తం తరగతిని భాగస్వామిని చెయ్యండి

వాక్చాతుర్యం కలిగిన ఒకరిద్దరు పిల్లలే చర్చ మొత్తం సాగించే ప్రమాదం ఉంటుంది కాబట్టి చర్చలో మొత్తం తరగతిని భాగస్వామిని చెయ్యాలి. అందుకు గాను చర్చకు సంబంధించిన వివిధ బాధ్యతల్ని వివిధ విద్యార్థులకి అప్పగించవచ్చు. ఒకరు చర్చ ప్రమేయాన్ని వివరిస్తారు. ఒకరు మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తారు,ఒకరు ఉదాహరణ చెప్తారు. మరొకరు మరొక ఉదాహరణ. ఒకరు చర్చ ముగిస్తారు. ఒకరు చర్చ ముగిసిన తరువాత ఆ సారాంశాన్ని వివరిస్తారు. ఆ విధంగా అన్నమాట.

బోర్డు ఉపయోగించండి

చర్చలో బోర్డు, గ్రాఫులు, పటాలు కూడ వాడుకోవచ్చు.

దారి గుర్తులు

చర్చ కొంత ముందుకు సాగాక సహజంగానే పక్కదోవ పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాంటప్పుడు, ‘మన చర్చనీయాంశం ఏమిటి?’, ‘మనం ఇక్కడ ఎందుకున్నాం’ లాంటి sign boards ప్రదర్శించుకోవాలి. దాని వల్ల చర్చ మళ్ళా గాటన పడుతుంది. చర్చలో ప్రధాన భాగం ముగిసినప్పుడల్లా అంతదాకా సాగిన చర్చని సంగ్రహంగా చెప్పుకోవడం ద్వారా అక్కడికి చర్చలో ఆ భాగం ముగించి తరువాతి భాగాన్ని మొదలుపెట్టడానికి వీలవుతుంది.

చర్చ సరదాగా, ఉల్లాసపూరితంగా నడవాలి

సోక్రటీస్ సంభాషణల్లో గొప్ప ఉల్లాసం కనిపిస్తుంది. అతడు తన సంభాషణల్లో తన ప్రతిద్వంద్వుల్ని ఎప్పుడూ నిందించడు, వాళ్ళమీద అభియోగాలు మోపడు. వాళ్ళని ఎద్దేవా చెయ్యడు. కించపరచడు. పైగా వీలైనప్పుడల్లా వాళ్ళ వాదనాపటిమని ప్రశంసిస్తూనే ఉంటాడు. చర్చకీ, వాదోపవాదాలకీ తేడా ఇక్కడే ఉంది. పిల్లలు ఉల్లాసపూరిత వాతావరణంలో ఎంత ఉత్సాహంగా చర్చలో పాల్గొంటే అంత బాగా నేర్చుకోగలుగుతారు.

ప్రతి చర్చా ఒక అనుభవంగా మారుతుంది

ఒకసారి చర్చ చేపట్టిన తరువాత ఆ అనుభవం మరొక చర్చకు మరింత బాగా ఉపకరిస్తుంది. ప్రతి చర్చతోనూ మన అభిప్రాయాలు మరింత నిగ్గుదేరి మనం మరింతగా బలపడతాం.

చర్చ ఒక సాధనగా మారాలి

తరగతి స్థాయిలో ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో ఒక సారి పిల్లలు చర్చలో పాల్గొన్నాక, వాళ్ళు మళ్ళా తరగతి స్థాయి మొత్తం మరొకసారి చర్చకి కూచునే దాకా ఆగలేరు. వాళ్ళంతట వాళ్ళే చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి చర్చా సాధన కొనసాగించడం మొదలుపెడతారు. కొన్నాళ్ళకు అది ఒక సంస్కృతిగా మారిపోతుంది.

విల్బర్డింగ్ రాసిన పాఠ్యప్రణాళికని నేను చాలా క్లుప్తంగా పరిచయం చేసాను. అతడు తన పుస్తకం ముగిస్తూ ఒక చైనా సామెత ను ఉదాహరించాడు. దాని ప్రకారం ‘ఉపాధ్యాయుడు చేసేది తలుపు తెరవడమే. లోపలకి ప్రవేశించవలసింది మాత్రం నువ్వే.’

4-5-2020

Leave a Reply

%d bloggers like this: