
కరికులం అంటే ఏమిటి? చాలా మంది దృష్టిలో కరికులం అంటే సిలబస్, పాఠశాల పనిగంటలు, పాఠ్యపుస్తకాలూ మాత్రమే. లేదా మరికొంత విస్తృతంగా మాట్లాడితే, పాఠశాల నిర్వహణ మొత్తాన్ని కరికులంగా కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఒక్క మాటలో జవాబివ్వాలంటే కరికులం అంటే ఒక విద్యార్థి లోను కాగల మొత్తం విద్యానుభవం. అందులో పాఠశాల, ఉపాధ్యాయుడూ, తల్లిదండ్రులూ, ప్రభుత్వమూ కూడా భాగస్వాములుగా ఉంటారు గాని కానీ అన్నిటికన్నా ముందు అది ఒక పిల్లవాడికి మనమివ్వగల విద్యానుభవం, జ్ఞానానుభవం అన్నది గుర్తుపెట్టుకోవాలి. పిల్లవాడికి సార్థకమైన ఒక జ్ఞానానుభవాన్ని ఇవ్వడమే విద్యాలక్ష్యంగా మనం భావిస్తున్నట్లయితే, అటువంటి అనుభవాన్ని ఎలా ఇవ్వాలి అన్నదానిమీద ఎంత చర్చ జరగాలి? ఎంత సాహిత్యం వికసించి ఉండాలి? మన పత్రికల్లోనూ, ప్రసారమాధ్యమాల్లోనూ, మన చట్టసభల్లోనూ ఎన్ని వాదోపవాదాలు నడిచి ఉండాలి? అసలు అన్నిటికన్నా ముందు జ్ఞానమంటే ఏమిటి? జ్ఞానం ఎలా సిద్ధిస్తుంది? పిల్లవాడికి మనం నేరుగా జ్ఞానాన్ని ఇవ్వగలమా లేక పిల్లవాడు తనంతటతానే తన జ్ఞాన పరికల్పన చేసుకుంటాడా అన్నదాని మీద ఎంత విస్తృతమైన చర్చ జరిగి ఉండాలి ఈ పాటికి!
కాని నాకు తెలిసి తెలుగులో అటువంటి చర్చ ఏదీ చెప్పుకోదగ్గ స్థాయిలో జరిగినట్టు నాకు ఎక్కడా కనిపించలేదు.తమ జీవితంలో ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునేవారికి మనం అందిస్తున్న ఉపాధ్యాయ శిక్షణలో ఈ అంశాల మీద ఏ మేరకు చర్చ జరుగుతున్నదో చూద్దామని కొన్ని పుస్తకాలు తెప్పించి చూసాను. విద్య గురించిన తాత్త్విక, మనోవైజ్ఞానిక సిద్ధాంతాల గురించిన పుస్తకాలు. అవన్నీ ఉపాధ్యాయ శిక్షణలో పాఠ్యపుస్తకాలుగా వాడుతున్నవే. ఆ పుస్తకాల్ని చూడగానే నాకు గొప్ప నిరాశ కలిగింది. ఎందుకంటే ఆ పుస్తకాలు టీచర్ ట్రయినీల్లో ఎటువంటి ఆలోచననీ రేకెత్తించేలాగా కనిపించలేదు. పైగా ఆ పుస్తకాలు బోధననీ, అభ్యసనాన్నీ ఒక సాంకేతిక వ్యవహారంగా చూస్తున్నట్టుగా అనిపించింది. విద్య అంటే విద్యార్థికి కొన్ని సామర్థ్యాల్ని అందించడం అన్నట్టుగానే ఆ పుస్తకాలు భావిస్తున్నట్టుగా నాకు కనిపించింది.
ఇందులో ఆశ్చర్యం లేదు. సమాజం దృష్టిలో కూడా ఇప్పుడు విద్య అంటే కొన్ని సామర్థ్యాలు. ఆ సామర్థ్యాలు త్వరగానూ, చక్కగానూ అలవడ్డ విద్యార్థికి చక్కటి కెరీర్ దొరుకుతుందని తల్లిదండ్రులు భావిస్తుంటారు కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఆ సామర్థ్యాల కల్పననే విద్య తాలూకు పరమావధిగా భావిస్తున్నారు. అసలు కరికులం అనే పదమే currere అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. దాని అర్థం ‘పరుగు’ అని. కానీ ఆ పరుగు మనం భావిస్తున్నట్లుగా పోటీ పందెం తాలూకు పరుగు కాదు. అది ఒక నదీ ప్రవాహం తాలూకు ఉరవడి, ఒరవడి. ఒక course. ఎక్కుపెట్టి విడిచిన బాణంలాగా పక్కకు తప్పిపోని ఋజుగతి. కరికులం అంటే అసలైన అర్థం ఒక ఋజుత్వసాధన. విద్యార్థి తన అభ్యసనక్రమంలో పక్కకి జారిపోకుండా ఉండటమెలానో ఆలోచించడమే నిజమైన కరికులం ప్రణాళిక.
కాని పదవ తరగతి పూర్తి చేసిన తర్వాత ఆ పిల్లల్లో నూటికి డెబ్బై అయిదు మంది పిల్లలు ఉన్నత విద్యలోకి చేరకుండా తప్పిపోతున్నారంటే మన కరికులం గురించి మనం మరింత నిశితంగా ఆలోచించాలి కదా. పదవతరగతి దాకా చదువుకున్న పిల్లల్లో కూడా ఎంతమందికి ఆ అభ్యసన ఫలితాలు వాళ్ళ వాళ్ళ దైనందిన జీవితాల్లో ఉపకరిస్తున్నాయి? అసంఖ్యాకులైన గ్రామీణ విద్యార్థులు పదవ తరగతి పూర్తయ్యాక పై చదువులకు పోకుండా తిరిగి తమ గ్రామాల్లోనే ఏదో ఒక చిన్నపాటిఉపాధిని వెతుక్కుంటూ జీవితంలో స్థిరపడుతున్నప్పుడు, వాళ్ళప్పటిదాకా చదువుకున్న చదువులు వాళ్ళ తదనంతర జీవితానికి ఏ మేరకు ఉపకరిస్తున్నాయి? అవి వాళ్ళ ఆరోగ్యం, కుటుంబ భద్రతలతో పాటు వాళ్ళ సామాజిక సంబంధాలకి ఏ మేరకైనా పనికొస్తున్నాయా? ఆ చదువులు వాళ్ళకి వార్తాపత్రికలు చదివేపాటి అక్షరాస్యతనీ, సెల్ పోను ఉపయోగించేపాటి సామార్థ్యాన్నీ ఇవ్వడంతో ఆగిపోకుండా తమ సమాజం గురించీ, భవిష్యత్తుగురించీ ఒక జీవనదృక్పథాన్ని ఏర్పరచుకోడానికి ఉపకరిస్తున్నాయా? వాళ్ళ వాళ్ళ రోజువారీ జీవితాల్లో మనుషుల్తో కలిసి మెలసి గడపడానికీ, కొత్త అందాల్ని గుర్తుపట్టి ఆస్వాదించడానికీ, కొత్త భావాల్ని స్వాగంతిచడానికీ ఆ చదువులు ఏమైనా తోడ్పడుతున్నాయా? అన్నిటికన్నా ముఖ్యం, తమలాగా లేనివారినీ, తమకన్నా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నవారినీ సహించగలిగే సంస్కారాన్ని ఆ చదువులు నేర్పుతున్నాయా?
కరికులం అంటే ఇవన్నీ ఆలోచించడం. వీటిని దృష్టిలో పెట్టుకుని పిల్లవాడి జ్ఞానానుభవాన్ని తీర్చిదిద్దటం. ఆ పని ఎలా చేపట్టాలో మనమెప్పుడన్నా ఆలోచించామా? లేకపోతే అదంతా ఉపాధ్యాయులకీ, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకీ మాత్రమే సంబంధించిన విషయం అనుకుంటున్నామా? ఇదిగో, నా ముందు, Philosophical Foundations of Education ఉంది. 1970 లో వెలువడ్డ ఈ గ్రంథం ఇప్పటిదాకా తొమ్మిది సార్లు పునర్ముద్రణ పొందింది. ఈ రచనని మన ఉపాధ్యాయ శిక్షణా గ్రంథాలతో పోల్చి చూస్తే నాకు తేడా స్పష్టంగా కనబడింది. అదేమంటే, ఈ రచయితలు తాము మాట్లాడుతున్న విద్యావేత్తల మూల గ్రంథాలు చదివినవాళ్ళు. విద్య గురించిన ఒక తాత్త్వీక ధోరణి ఎలా వికసించిందీ, ఎలా పరిణమించిందీ, ఇప్పుడు ఏ రూపం తీసుకుంటున్నదీ వాళ్ళకి తెలుసు. ఆ ప్రయాణాన్ని వాళ్ళు చాలా దగ్గరగనూ, నిశితంగానూ చూసారు, అర్థం చేసుకోడానికి ప్రయత్నించారు. కాని, ఉపాధ్యాయ శిక్షణ కోసం తెలుగులో వచ్చిన పుస్తకాల్లో లేనిదిదే. ఆ పుస్తకరచయితలెవ్వరూ మూలగ్రంథాలు చదివినవాళ్ళు కారనిపించింది. మూల గ్రంథాలతోనో, మూల సిద్ధాంతాలతోనో ప్రత్యక్ష పరిచయం లేకుండా రాసే పుస్తకాలు పాఠకులమీద ప్రభావం చూపించలేవు. పియాగీ, వ్యొగోట్స్కీ ల గురించిన సమాచారం పొందుపరిస్తే చాలదు. లేదా వారి ఆలోచనల సారాంశాన్ని మనం ఇంగ్లీషులో చదివి దాన్ని మళ్ళా తెలుగులో సంగ్రహంగా పొందుపరిస్తేనూ సరిపోదు. అసలు ఆ తత్త్వవేత్తల ఆలోచనలు ఏమిటి? వారు కొత్తగా చెప్తున్నదేమిటి? ఆ ఆలోచనల ద్వారా మనం కొత్తగా నేర్చుకోగలిగేదేమిటి అనే ఆలోచన ఆ పుస్తకాల్లో నాకు కనిపించలేదు.
పోనీ పాశ్చాత్య తాత్త్వికుల గురించి పక్కనపెడదాం. భారతీయ విద్యావేత్తల గురించి కూడా ఆ పుస్తకాల్లో చెప్పుకోగదగ్గ విషయమేమీ కనిపించలేదు. ఆధునిక భారతీయ విద్య గురించి మాట్లాడేవారు గాంధీ, టాగోర్, రాధాకృష్ణన్, జ్యోతిబా ఫూలే ల గురించి ప్రస్తావిస్తుంటారుగాని, ఆ భావాలు ఇప్పటి విద్యకి ఏ విధంగా ప్రాసంగికాలు, వారి స్ఫూర్తితో మనమొక నవీన విద్యావ్యవస్థను నిర్మించగలమా అనే చర్చ ఎక్కడా కొనసాగించరు. పాఠ్యపుస్తకాలు రాసినవాళ్ళు మాత్రమే కాదు, ఒక్క అమర్త్యసేన్ నూ, అబ్దుల్ కలాం నూ మినహాయిస్తే, ఇటీవలికాలంలో, భారతీయ సామాజికశాస్త్రాల్లోనూ,ఆర్థిక-రాజకీయ చర్చల్లోనూ ప్రముఖంగా కనిపించే వక్తలూ, రచయితలూ కూడా విద్య గురించి కొత్త వెలుగు ప్రసరింపచేసినవాళ్ళెవరూ నా కంటపడలేదు. ఇక బౌద్ధం, జుడాయిజం, ఇస్లాం వంటి మతధర్మాల దృష్టిలోనూ, ఆఫ్రికా, చైనా వంటి మహాసంస్కృతుల దృష్టిలోనూ కూడా విద్య గురించి ఎంతో చర్చ జరిగింది, జరుగుతూనే ఉంది. ఆ చర్చ గురించి తెలుగులో వచ్చింది చాలా చాలా స్వల్పం. ఉపాధ్యాయ శిక్షణ కోసం రాసిన పుస్తకాల్లో అటువంటి దేశాల, తాత్త్వికతల విద్యాచింతన గురించిన ప్రస్తావన కూడా లేదు.
ప్రధానంగా యూరోపు అమెరికాల్ని కలిపి మనం ‘పాశ్చాత్య ‘ (వెస్ట్) అని వ్యవహరిస్తుంటాం. అక్కడ విద్య గురించిన ఆలోచన దాదాపు రెండున్నరవేల ఏళ్ళుగా నడుస్తున్న ఒక సంవాదం. ప్లేటో నుంచి మొదలుపెట్టి నేటి డెరిడా దాకా తాత్త్విక చింతన చేసిన ప్రతి భావుకుడూ విద్యా చింతనని కూడా గాఢంగా ప్రభావితం చేస్తూ వచ్చాడు. అక్కడ ఏ విద్యావేత్త ఎటువంటి ప్రయోగాలు చేపట్టినా వాటి వెనక మొత్తం ఐరోపీయ తత్త్వశాస్త్రమంతా ఉంటుంది. భారతదేశంలోనూ, తెలుగులోనూ విద్య గురించి మన చర్చల వెనక మన చరిత్రకీ, మన సంస్కృతికీ సంబంధించిన అటువంటి నేపథ్యాన్ని మనం గుర్తుపట్టనూలేదు, మాట్లాడుకోనూ లేదు. అటువంటి చర్చ లేకపోతే ఏమవుతుంది? అప్పుడు విద్య అంటే ఒక పరుగుపందెం మాత్రమే అవుతుంది. మార్కులూ, రాంకులూ మాత్రమే విద్యగా చలామణి అయిపోతుంది. స్వతంత్రుడిగా పెరగవలసిన పిల్లవాడు తనకి తెలియకుండానే బానిసగా మారిపోతుంటే మనం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వస్తుంది. పాశ్చాత్య దేశాల్లో ఇటువంటి పరిస్థితి లేదా? అక్కడ విద్య అంటే కెరీర్ గా భావించడం లేదా? ఎందుకు లేదు! అక్కడ కూడా స్పర్థ, అమానవీయమైన పరుగులాట లేకపోలేదు. కాని దాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ కొత్త ఆలోచనలు ఉప్పెనలాగా ఉవ్వెత్తున ఎగిసిపడుతూనే ఉంటాయి. కొత్త ప్రయోగాలు తలెత్తుతూనే ఉంటాయి. ముఖ్యంగా నిరంతరం ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది.
అటువంటి ఒక చర్చ తెలుగులో కూడా తలెత్తాలని నా కోరిక. ఇక్కడ గొప్ప ప్రయోగాలు చేస్తున్న ఉపాధ్యాయులు, అన్వేషకులు ఎందరో ఉన్నారు. కాని వాళ్ళంతా మౌనంగా తమ పని తాము చేసుకుంటూ పోడానికే మొగ్గుచూపిస్తున్నారు. వాళ్ళ ప్రయోగాలు కూడా ఒక వైగోట్స్కీ కి ఏమీ తీసిపోవనే నా నమ్మకం. కానీ, వాటిని వాళ్ళు అక్షరబద్ధం చేయాలి. తమ పరిశీలనల్ని ప్రతిపాదనలుగా మార్చాలి. తమ సాఫల్యవైఫల్యాల్ని ఒక దృక్పథంగా ప్రపంచం ముందు పెట్టి మాట్లాడాలి.అటువంటి వారిని కొందరినైనా ఉత్సాహపరచడం కోసం కొందరు విద్యాన్వేషకుల రచనల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పాశ్చాత్య, ప్రాచ్య, ఉత్తర దక్షిణ ప్రపంచాల్లో విద్య గురించి మాట్లాడిన కొందరు తత్త్వవేత్తల గురించి వరసగా పరిచయాలు చేపట్టాలనుకుంటున్నాను.
25-4-2020
అత్యంత అవసరమైన విషయం. మీ కుటీరం మరల కళకళలాడటం మా లాంటి వారికి పండుగ. మాష్టారు🙏.