
ఫిన్నిష్ కవయిత్రి ఈవా కిల్పి (Eeva Kilpi) (జ.1928) కవితాసంపుటి A Landscape Blossoms Within Me (2014) తెప్పించుకుని చాలా కాలమే అయినప్పటికీ, ఇప్పుడే పూర్తిగా చదవగలిగాను. మంచి కవితాసంపుటి చదవడంలో ఉండే సంతోషమేమిటంటే, ఒక ధీరవ్యక్తిని స్వయంగా కలుసుకుని కొంతసేపు మాట్లాడినట్టుంటుంది. ఆ వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పటి సున్నితమైన హావభావాలూ , ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ మాటల్లో తొంగిచూసే ఇష్టాఇష్టాలూ కూడా మనల్ని ఆకట్టుకుంటాయి. అటువంటి ఒక వ్యక్తితో కొద్దిసేపు సంభాషించినా కూడా నడివేసవిలో ఒక చెట్టుకింద చిక్కటినీడన కొంతసేపు నిల్చుని సేదదీరినట్టుంటుంది.
ప్రపంచ కవిత్వంలో చీనా, జపాన్, కొరియా వంటి దూరప్రాచ్య కవిత్వాల తరువాత నాకు చాలా మధురంగా అనిపించేది స్కాండినేవియన్ దేశాల కవిత్వం. అందులోనూ ముఖ్యంగా స్వీడిష్, ఫిన్నిష్ కవిత్వాలు. ఆర్థికంగానూ, విద్యాపరంగానూ ఆ దేశాలు సాధించిన అత్యున్నత జీవనప్రమాణాలకీ, ఆ కవిత్వానికీ మధ్య ఏదైనా సంబంధం ఉందేమో నాకు తెలియదు. కాని ఆ కవిత్వాల్లో మాత్రం సాంకేతికంగానూ, పాలనాపరంగానూ సాధించిన అభివృద్ధికి బదులు ఇంకా వంటచెరకు నరికి తెచ్చుకుని వెలిగించుకునే నెగళ్ళూ, కోయిలలూ, స్ట్రాబెర్రీలూ, ఎల్మ్ వృక్షాలూ, చిమ్మెటలూ, బలంగా వికసించి, అంత బలంగానూ భగ్నమైపోయినా పశ్చాత్తాపాలు కలిగించని ప్రేమలూ కనిపిస్తాయి. చదువుతుంటే ఆ కవితలు మా అడవుల్లో డిసెంబరు నెలాఖరులో కనిపించే పరిమిపళ్ళల్లాగా పుల్లపుల్లగా తియ్యతియ్యగా అనిపిస్తాయి
ఇప్పుడు ఈవా కిల్పి కవితలు చదువుంటే కూడా వేసవి రోజుల్లో ఏ యెర్రగొండపాలెం లేదా వెంకటాద్రిపాలెమో దాటాక నల్లమల అడవి అంచుల్లో విరగపండి కనిపించే చిట్టీతపళ్ళ చెట్లు గుర్తొస్తూన్నాయి. నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ లు నూరేళ్ళ కింద ఉన్నట్టుగా ఇప్పుడు లేవు. ఆ దేశాలు మానవాభివృద్ధి సూచికల్లో అగ్రస్థానాల్లో నిలబడే దేశాలు. కాని ఆ రచయితల, కవుల భావనాప్రపంచం మాత్రం ఇంకా హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ దగ్గరే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఏదో ఒక నష్టశైశవాన్ని తలుచుకుంటూ ఆ కవులింకా ఏదో ఒక అతీత మాధుర్య స్మృతిసంతోషంలోనో, తీయని విషాదంలోనో కూరుకుపోయినట్టే అనిపిస్తారు. సరిగ్గా ఈ కారణం వల్లనే ఆ కవులు నాకెంతో సన్నిహితులుగా అనిపిస్తారు.
ఈవా కిల్పినే తీసుకోండి. ఫిన్లాండ్ లో ఆమె పుట్టిన ఊరు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియెట్ రష్యాలో కలిసిపోయింది. ఆ తర్వాత నుంచీ ఆమె తన స్వదేశానికి ప్రవాసిగా మారిపోయింది. ఎప్పుడేనా తాను పుట్టిన ఊరు చూడాలనుకుంటే అక్కడ ఆమె ఒక టూరిస్టుగా మాత్రమే అడుగుపెట్టగలదు. తాను పుట్టిన ఊరుకి దూరమైన కవులందరిలానే ఆమె కూడా తన ఊరిగురించి ఇలా రాసుకుంటున్నది:
మా పాత ఇల్లు మొండిగోడల దగ్గర కూచుని
రాస్ప్ బెర్రీలు చప్పరించుకుంటూ ఉండగా
మా చెల్లెలు అందికదా:
ఈ వసంతకాలమూ, ఈ పక్షి కూజితమూ
మనమొక్కప్పుడు ఆటలాడుకున్న ఈ ఇంటిముంగిలీ
నన్నొకటే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని.
మేమొక చిన్న గుట్టమీద కూచున్నాం, ఎండవేళ.
చుట్టూ అడవి.
ఒకప్పుడు మేము నివసించిన గదుల్లో
ఇప్పుడు పరుగులుపెడుతూ ఒక కుందేలు.
ఆ పడగ్గది పక్కనే
గోరాడుతో ఒక అడవి దుప్పి .
వెచ్చని సాయంసంధ్య.
అర్థశతాబ్దం గడిచిపోయింది.
అచ్చం మనలానే ఉండేవాటిని చూస్తే
మనకెంత మక్కువో కదా.
చిన్నప్పటి ప్రపంచం నుంచి దూరంగా జరిగినవాళ్ళని ఎంతలేసీ అందాలూ, ఎన్నేసి ప్రేమలూ, ఎన్నేసి బాంధవ్యాలూ కూడా మురిపించలేవు, మరిపించలేవు. సంతలో అమ్మచేతినుంచి తప్పిపోయిన పిల్లకి ఎన్ని బొమ్మలు చూపించి నువ్వూరడించగలవు? కిల్పి జీవితంలో ఎందరు ప్రేమికులు ప్రవేశించారో మనకి తెలియదుగాని, ఆ కవిత్వం మాత్రం అసంఖ్యాకులైన పురుషుల్తోనూ, పురుష దేహాలతోనూ, ఆమె ప్రేమ ఎదట నిలబడజాలని పురుష హృదయాలతోనూ నిండిపోయి కనిపిస్తుంది. కాని దూరమైన ఏ ప్రేమికుడి పట్లా ఆమెకి ఫిర్యాదులేదు. ప్రతి ఒక్కస్నేహమూ జీవితాన్ని కొన్ని రోజుల పాటు అనుభవయోగ్యంగా మారుస్తుందని ఆమెకి తెలుసు. ఆనాటికి ఆ స్నేహం నిజంగా విలువైనదే. అడవిమీద పరుచుకున్న ఋతుసౌందర్యంలాగా, ప్రేమ కూడా చెరిగిపోయేదేకాని, ఆ పరిష్వంగం నిలిచినంతకాలం అదొక వైభవమే. ఎందరో తన జీవితాన్ని వెలిగించి వెళ్ళిన తరువాత కూడా మరొక నూతనస్నేహాన్ని ఆమె అంతే జవసత్త్వాలతో ఆహ్వానించగలదు. ఈ కవిత చూడండి:
నేనింతదాకా ప్రేమించినవాళ్ళందర్నీ
ఈ క్షణాన
నా స్వంతంగానే భావించుకుంటున్నాను.
మరీ ముఖ్యంగా ఈ రోజు
నేను మరీ ముసిలిదాన్నయిపోయాను
వాళ్ళూ వృద్ధులైపోయారు-
ఒక్క నువ్వు తప్ప,
అందరికన్నా చివర అడుగుపెట్టిన నువ్వు తప్ప.
నీలో వాళ్ళంతా నా కోసం ఎదురుచూస్తున్నారు
ఏమైతేనేం, చివరికి, నీ ద్వారా
నేను వాళ్ళందరి బాహువుల్లోనూ ఒదిగిపోతున్నాను,
బేషరతుగా.
ఎట్టకేలకు నేను క్షమించగలుగుతున్నాను
క్షమాపణ యాచించగలుగుతున్నాను.
ప్రేమ బలం ఇట్లానే ఉంటుంది.
వాళ్ళని నేనెప్పుడూ బాధపెట్టలేదన్నట్టే
ఒక్కసారేనా కష్టపెట్టలేదన్నట్టే
వాళ్ళందర్నీ వాళ్ళ నయయవ్వనకాలానికి
తిరిగిపంపిస్తున్నాను.
కాని, నిన్ను మాత్రం
శమించని జ్ఞానతృష్ణలాగా
నన్ను కమ్మెయ్యమని కోరుకుంటున్నాను.
ఇదొకటి కనిపిస్తూంటుంది నాకు, నష్టబాల్యాన్నో, నష్టయవ్వనాన్నో తప్పించుకోలేని వాళ్ళ ఇంద్రియాల దాహం ఎంతకీ శమించేది కాదని. ఏమి చేసీ ఆ కార్చిచ్చుని చల్లార్చలేం. అందుకనే ఇట్లాంటి కవుల కవిత్వంలో ఇంద్రియసంవేదనలు తక్కిన మనుషుల కన్నా రెండింతలు తీవ్రంగా ఉంటాయి. ఇంగ్లీషులో కొన్నాళ్ళ కిందటిదాకా, ఇటువంటి ప్రవృత్తిని sensuous అనేవారు. ఇప్పుడు మొహమాటం వదిలిపెట్టి erotic అంటున్నారు. కిల్పి ని ఫెమినిస్టు కవి అని అంటూనే ఆ కవిత్వం erotic గా ఉంటుందని కూడా అనకుండా ఉండలేకపోవడానికి కారణం ఇదే. కాని అది eroticism కాదు. ఒక నిర్మల ప్రేమానుభవం కోసం తపించే ఒక పసిహృదయం. ఈ కవిత చూడండి:
అమ్మవే, చెల్లివే, బిడ్డవే, నా బంగారు తల్లివే
ఇట్లా
పిలిచేది మా అమ్మ నన్నెప్పుడు
పిలిచినా.
ఎంత
గొప్ప ప్రేమ ప్రకటన!
అంత
ఔదార్యాన్ని మరెప్పుడూ ఏ గొంతులోనూ వినలేదు
నేను.
ఆ
తలపు గుర్తొస్తే చాలు
రాత్రి
పిట్ట కూడా గొంతు విప్పుతుంది.
అమ్మా,
అమ్మా, అమ్మా అని అంటుంది
చెల్లీ,
చెల్లీ, చెల్లీ, నేస్తమా, నేస్తమా
నా
బిడ్డ, నా బిడ్డా, నా
బిడ్డా, నా కన్నా, నా
కన్నా.
అర్థమయ్యింది
నాకు.
వీటిల్లో
నన్ను ఏ ఒక్కపేరుతో ఎవరు
పిలిచినా కూడా
ఆ
ఒక్క పిలుపులోనే అన్ని పిలుపులూ వినిపిస్తాయని.
ప్రేమికులతో కిక్కిరిసిపోయినట్టు కనిపించే కిల్పి ప్రపంచం నిజానికి చాలా చిన్నది. తల్లి, తండ్రి, సోదరి, చిన్నప్పటి ఇల్లు. ఆమె ఒక కవితా సంపుటి మొత్తం మరణించిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ రాసిన కవితలే. ఈ కవిత చూడండి:
మా
నాన్న బతికుండగా
ఒకరోజు
ఒక అసాధారణ సంఘటన జరిగింది:
ఆయన
చనిపోయాడు.
అది
కూడా ఒక్కసారే జరిగింది, అది కూడా ఏదో
అనుకోకుండా.
అదొక్కటీ
తప్ప అతడి జీవితం బాగానే
ఉండింది.
ఆయన
వెళ్ళిపోవడమైతే వెళ్ళిపోయాడు కానీ
ఆయన్ని
మేము ఒక్కరోజు కూడా పక్కనపెట్టలేకపోతున్నాం.
కూరగాయల మడిదగ్గరో
చెట్టుకొమ్మకి వేలాడదీసిన ఊయెలదగ్గరో
చేతుల్లో స్ట్రాబెర్రీల బుట్ట పట్టుకుని ఇంటివైపు
నడుచుకుంటూ వస్తున్నప్పుడో
ఏదోమేం మాట్లాడే ప్రతిమాటకీ జవాబిస్తున్నట్టే
'కొద్దిగా ఈ వార్తలు వినేసాక నీళ్ళు తెచ్చుకుంటాను '
'ఒక్క క్షణంలో వచ్చేస్తాను, ఎక్కువసేపు పట్టదు, సరేనా '
ఇట్లానే అడుగడుగునా ఏదో మాట్లాడుతూనే ఉంటాడు
ఒక్క
క్షణం కూడా మమ్మల్ని వదిలిపెట్టడు.
నాన్నా,
నువ్వు బతక్కూడదూ
కనీసం
అప్పుడేనా నిన్ను మర్చిపోగలుగుతాం.
ఆమె తన తండ్రిని తలుచుకుంటూ రాసిన ప్రతి ఒక్క కవితా ఇలానే ఉంది. ఈ కవిత చూడండి:
నాన్నా,
నిన్నంతా వాన కురిసింది
ఈ
రోజు కూడా ఇందాకటిదాకా కురుస్తూనే
ఉంది.
కాని
వెచ్చగానే ఉంది
ఈ
సారి బహుశా పుట్టగొడుగులు బాగా పుట్టుకొచ్చేట్టే ఉంది.
నాన్నా,
కొంతసేపట్లో సాయంకాలం వార్తలు వస్తాయి
నెగడి
వేడెక్కింది.
నాన్నా,
మళ్ళా నా కలల్లోకి రా
నీకు
వెన్నరాసి రొట్టెలందిస్తాను
పండ్లముక్కలు
కోసిపెడతాను
ఊటగెడ్డ
నుంచి నీళ్ళు తోడిపెడతాను.
నాన్నా
ఇదిగో ఇలా ఈ కొత్త
విద్య ప్రాక్టీసు చేస్తున్నాను
ఇలా
శూన్యంగా అనిపిస్తూండటం,
ఇదేదో
చాలా కొత్తగా ఉంది నాకు.
సాధారణంగా తమ ప్రపంచం చాలా పెద్దదనీ, ప్రపంచమానవుల కష్టాలన్నీ తమ కష్టాలేననీ చెప్పుకునే కవులంటే నాకాట్టే నమ్మకం కలగదు. ఆ కవితలు చదివినప్పుడు నాకు ఎట్లాంటి స్పందనా కలగదు. కాని, తమ తమ చిన్న చిన్న జీవితాల గురించీ, చిన్న చిన్న కష్టాల గురించీ, చిన్న చిన్న ఆనందాల గురించీ రాసే కవులు నాకెంతో దగ్గరగా అనిపిస్తారు. వాళ్ళ వల్ల నా జీవితం
నాకు మరికొంత ప్రేమించదగ్గదిగా కనిపిస్తుంది. కిల్పి కవిత్వంలో అటువంటి తావులు కించిదధికంగానే కనిపించాయి. ఈ కవిత చూడండి:
ఈ
ఉదయం నాకేమీ రాయాలనిపించలేదు
దానికి
బదులు ఒక గులాబీమొక్క నాటాలనిపించింది.
ఒక
మనిషి సంతోషంగా ఉండాలనుకుంటే, బహుశా
తాను
పక్కనపెట్టేయగలిగే పని ఉండాలి.
బద్ధకంగా
గడపడానికేదో ఒక సాకు దొరకాలి.
తన
వార్థక్యపు గోడదగ్గర నాటుకోడానికి
ఒక
గులాబీమొక్క పెళ్ళగించితెచ్చుకునే
ఒక
బాల్యముండాలి.
ఆమె తన యవ్వనప్రేమోద్ధృతిని ఎంత బలంగా కవిత్వంగా మలిచిందో, తానొక అమ్మమ్మగానో, నాయనమ్మగానో మారినప్పటి అనుభవాన్ని కూడా అంతే ఇంద్రియచేతనతో వ్యక్తపరిచింది. ఈ కవిత చూడండి, ఇటువంటి కవితలు తెలుగులో ఊహించడం కష్టం.
నాయనమ్మలు
చనిపోయినప్పుడు
పూలుపూసే
పచ్చికబయళ్ళుగానో,
కోతకొయ్యని
ఎండుగడ్డిమైదానాలుగానో
మారిపోతారు.
కొందరు
నాయనమ్మలు చెట్లుగా మారిపోతారు
వాళ్ళ
మనవల మీదా ఎండా వానా
పడకుండా
కాచి
పాటలు పాడుతుంటారు
శీతాకాలం
మంచు కురవడం మొదలుపెట్టకముందే
తమ
మనవల చుట్టూ
శాఖోపశాఖలతో
గొడుగుపడతారు.
కానీ
దానికిముందు వాళ్ళెంత
కాంక్షాభరితంగా
ఉండేవారని!
‘నీ వల్ల ఒక పరి జననం, ఒక పరిమరణం ఆయెను’ అన్నాడొక సినిమా కవి. గొప్ప కవిత్వం ఎప్పుడూ ఒక కోల్పోయిన స్వర్గం గురించీ, మరలా చేజిక్కిన స్వర్గం గురించీ, మళ్ళీ ఇంతలోనే స్వర్గం చేజారడం గురించీ పాడుకుంటూ ఉంటుంది. కిల్పి కవిత్వం కూడా అటువంటి ఒక వినష్ట అపరాహ్ణం గురించింది కావడం వల్లనే నాకు దగ్గరగా అనిపించింది. ఈ కవిత చూడండి:
ప్రియతమా,
నువ్వు దగ్గరున్నప్పుడు
ఏళ్ళు
కూడా ఇట్టే గడిచిపోతాయి.
నీలో
నాకు కనిపించిన దోషమిదొక్కటే-
వేల
ఏళ్ళుగా మనం కలిసిగడిపిందంతా
ఎవరో
దొంగిలించిన మధ్యాహ్నంలాగా అదృశ్యమైపోయింది.
అట్లా
దొంగిలించిన ఒక మధ్యాహ్నం
వందల
వేల యుగాలకు సమానం.
ఎన్ని
సార్లు మధ్యలో ఉలిక్కిపడి లేచానని!
లేచి
చూసుకుంటే
హటాత్తుగా
ముసిలిదాన్నై
కనబడ్డాను.
‘నిజమైన సంతోషం నామవాచకం కాదు, క్రియాపదం’ అన్నాడు ఎపిక్టెటస్. కిల్పికి కూడా ఆ సంగతి తెలుసు. ఆమె కొన్నిసార్లు నామవాచకం, కొన్ని సార్లు క్రియాపదం. ఈ కవిత చూడండి:
కొన్ని
సార్లు క్రియాపదం, కొన్ని సార్లు నామవాచకం
నేను
ఏ నామవాచకమో తెలుసుకుందామనుకునేలోపట్నే
నేనొక
క్రియాపదంగా మారివాళ్ళ
భాషాకోశం పట్టుతప్పించుకుంటాననివాళ్ళ
ఫిర్యాదు.
సరే,
కానివ్వు, నువ్వొక క్రియాపదం అనుకుందాం
అయితే
భూతభవిష్యత్ వర్తమానకాలాల్లోనువ్వు
ఏ రూపం ధరిస్తావో చెప్పు
అంటో
నా
వెంట పడుతుంటారు వాళ్ళు,
నేనేమో
మళ్ళా ఒక నామవాచకంగా మారి
పొలాల్లో
పిట్టల్ని తరుముకుంటో ముందుకుపోతాను
వాళ్ళు
నా వెంటపడుతుంటారు
నేనేమో
పక్షిలాగా ఎగిరిపోతుంటాను
వాళ్ళట్లా
అక్కడ ఆ కింద నిలబడి
అనుకుంటూ
ఉంటారు కదా:
-లేదు,
ఆమె రెండూ కూడా, ఇప్పుడు
మనమో
మీటింగుపెట్టుకుని
ఈ
సంగతేదోతేల్చుకుందాం,
చూడబోతే
ఈమె
మన ఊహలన్నీ తల్లకిందులు చేసేట్టే
ఉందనుకుంటారు.
కాబట్టి నేను కూడా ఈమె కవిత్వమిదీ అని తీర్మానించే ప్రయత్నానికి పూనుకోను. మనమేదో పరాగ్గా ఉన్నప్పుడు ఎవరో మనల్ని వెనకనుంచి ఒక గరికపోచతో చక్కిలిగిలిపెట్టినట్టు ఈ కవిత్వం నా రోజువారీ జీవితం నుంచి నన్నొక్కసారి ఉలిక్కిపడేట్టు చేసిందని మాత్రం చెప్పగలను.
14-5-2020