ఏది విద్య?

ప్లేటో (క్రీ.పూ 428-348) తో పాశ్చాత్య తత్త్వ శాస్త్రం మొదలయ్యింది. వైట్ హెడ్ అనే ఒక అమెరికన్ తత్త్వవేత్త ఈ మాటనే మరింత వివరంగా చెప్పాడు. గత రెండున్నర వేల ఏళ్ళుగా నడుస్తున్న పాశ్చాత్య తాత్త్వికచింతన మొత్తం ప్లేటో రచనలకి ఒక ఫుట్ నోట్ వంటిది మాత్రమే అని. సహజంగానే పాశ్చాత్య విద్యాచింతన కి కూడా ఇది వర్తిస్తుంది. విద్య గురించి పాశ్చాత్య ప్రపంచం ఏర్పరచుకున్న అభిప్రాయాలు, ఇప్పటికీ చేస్తున్న చర్చలు, కొనసాగిస్తున్న అన్వేషణ మొత్తం ప్లేటో ఆలోచనల్ని ఒప్పుకోవడమో, ఒప్పుకోకపోవడమో లేదా ఇప్పటికి తగ్గట్టుగా సవరించి చూసుకోవడమో.

ప్లేటో ఒక సిద్ధాంత గ్రంథమంటూ ఏదీ రాయలేదు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు నాటకరచయిత కావాలనుకున్నాడు. కొన్ని ట్రాజెడీలు రాసాడు. ఒక రోజు ఒక నాటకవేదికమీద తన రచన చదివి వినిపించాలని వెడుతుంటే అక్కడ బయట వీథిలో సోక్రటీస్ ప్రసంగం ఒకటి విన్నాడు, అంతే, తాను అప్పటిదాకా రాసిన నాటకాలన్నీ తగలబెట్టేసి సోక్రటీస్ కి శిష్యుడిగా మారిపోయేడు. సోక్రటీస్ ఏథెన్స్ లో రరకాల వ్యక్తులతో చేసిన సంభాషణలు, తమ వంటి శిషులతో చేసిన సంభాషణలు ప్లేటో ‘సంభాషణలు’ పేరిట నమోదు చేసాడు. అవి ముప్పై అయిదు ఉన్నాయి. వాటిలో ఇరవై ఎనిమిది దాకా ఆయన రాసినవే అని రూఢిగా తేల్చారు. వాటిల్లో మళ్ళా కొన్ని ఆయన యువకుడిగా ఉన్నప్పుడూ, కొన్ని నడివయస్సులోనూ, కొన్ని జీవితపు మలిదశలో రాసినవీను. వాటన్నింటిలోనూ ప్రధాన పాత్రధారి సోక్రటీసే కాని, తొలిదశలో రాసిన సంభాషణల్లో సోక్రటీస్ మాటలు యథాతథంగా ఉన్నాయనీ, రాను రాను ప్లేటో తన సంభాషణల్లో తన సొంత భావాలు ప్రకటించడానికి సోక్రటీస్ ను ఒక పాత్ర గా వాడుకున్నాడనీ అంటారు. అవి కాక, ప్లేటో పేరు మీద పదమూడు ఉత్తరాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం సాహిత్యమంతటిలోనూ ప్లేటో మానవజీవితానికి సంబంధించిన శీలం, సత్యం, సౌందర్యం, ప్రేమ, ఆచరణ, ఆశయం లాంటి భావనలని చర్చించాడు. ఆయన ఆలోచనలు ఇచ్చిన స్ఫూర్తితో అప్పటినుంచీ పాశ్చాత్య ప్రపంచం కూడా ఆ భావాల గురించి మరింత విస్తృతంగా ఆలోచన కొనసాగిస్తూ వచ్చింది. అటువంటి ఆలోచననే మనం తత్త్వశాస్త్రం అని వ్యవహరిస్తున్నాం.

సోక్రటీస్ చేసిన సంభాషణల పేరిట ప్లేటో రాసిన రచనల్లో విద్య గురించి కూడా విస్తారంగా కనిపిస్తుంది. అసలు ప్లేటో జీవితమంతా విద్య గురించే ఆలోచించాడని చెప్పవచ్చునని కూడా ఒక రచయిత అన్నాడు. తాను దర్శిస్తున్న ఒక పరిపూర్ణ సమాజం ఎలా ఉండాలో ఆయన ‘Republic ‘ అనే సంభాషణలో రాసాడు. (రిపబ్లిక్ ని తెలుగులో అనువదించిన జి.వి.కృష్ణారావుగారు దాన్ని ‘ఆదర్శ రాజ్యం ‘ అన్నారు. అది సరైన పదబంధం.) తాను ఊహిస్తున్న ఆదర్శరాజ్యంలో విద్యకి ప్లేటో చాలా పెద్ద పీట వేసాడు. ‘ఇంతవరకూ నేను చదివిన పుస్తకాల్లో విద్య గురించిన అత్యుత్తమ గ్రంథం రిపబ్లిక్ ‘ నే అని రూసో అన్నాడంటేనే ఒక విద్యావిషయక గ్రంథంగా ‘రిపబ్లిక్’ ఎటువంటిదో మనం అంచనా వేసుకోవచ్చు. దానితో పాటు ప్లేటో తన చివరిదశలో రాసిన Laws అనే సంభాషణలో కూడా విద్య గురించి చాలా మౌలికమైన చర్చ చేసాడు.

ఈ రెండు పుస్తకాల్లోనూ ప్లేటో ప్రతిపాదించిన వ్యవస్థని నిర్మించే ప్రధాన శక్తిగా విద్య కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్లేటో ప్రతిపాదించిన ఆదర్శ రాజ్యం విద్యావంతుల సమాజం. అది విద్యావంతులు మాత్రమే పాలకులుగా నడిపించే రాజ్యం. ఒక పరిపూర్ణతను దర్శించి, ఆ పరిపూర్ణతను తమ చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో సాధించడానికి అహర్నిశలూ తపిస్తూ, తమకంటూ సొంత ఆస్తి అంటూ ఏమీ లేకుండా, స్వార్థ త్యాగంతో కృషిచేసే విద్యావంతులు అక్కడ పాలన కొనసాగిస్తారు. ఆ రాజ్యాన్ని ఒక తాత్త్విక-చక్రవర్తి లేదా యోగిరాజు (Philosopher-King) నడిపిస్తుంటాడు.

కాని ఇప్పుడు నేను విద్య గురించి పై రెండు గ్రంథాల్లోనూ ప్లేటో రాసిన దాని గురించి చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే, ప్లేటో ఊహించిన ఆ ఆదర్శ రాజ్యం ఒక అందమైన యుటోపియా మాత్రమే కాదు. అది మార్పుకీ, కొత్తదనానికీ తావులేని శీతల స్వర్గం కూడా. మన చాతుర్వర్ణ వ్యవస్థలానే అక్కడ కూడా నాలుగు మెట్లు ఉంటాయి. అందరికన్నా దిగువన కార్మికులు ఉంటారు. వారికి కనీస విద్య ఉంటుంది. వారికి పైన రక్షకులు ఉంటారు. నగర రాజ్యాన్ని రక్షించడం వారి విధి. వారి పైన యోగిరాజులుంటారు. ఇక వర్తకులు మరొక శ్రేణిగాని, వారికి పౌరసత్వం ఉండదు. వీరందరికీ బయట ఎటువంటి హక్కులూ లేకుండా బానిసలు ఉంటారు. ప్లేటో ఊహించిన ఆదర్శ రాజ్యం ప్రజాస్వమ్యానికి వ్యతిరేకమైంది. దాన్ని దాన్ని oligarchy అంటారు. అంటే కొద్దిమంది విశిష్ట వ్యక్తులు సాగించే పరిపాలన అన్నమాట. ప్లేటో దర్శించి ప్రతిపాదించిన ఆ ఆదర్శ రాజ్యం మంచిదా చెడ్డదా అన్న చర్చలోకి ఇప్పుడు పోవడం అనవసరం. అది ఒక కల్పన. ఇప్పటికి రెండున్నర వేల ఏళ్ళ కింద ఒక ఆలోచనాపరుడు తాను కలగన్న ఆదర్శ సమాజం ఎలా ఉంటుందో ఎంతో నిర్దుష్టంగా, సవివరంగా చిత్రించిన రచనగా దానికొక చారిత్రిక ప్రాధాన్యత ఎప్పటికీ ఉంటుంది.

కాని విద్య గురించి ప్లేటో మన ముందు పెట్టిన ఆలోచనల్ని అర్థం చేసుకోవడానికి మనకి ‘ Republic’, ‘Laws ‘మాత్రమే సరిపోవు. ఆయన రాసిన మొత్తం సంభాషణలతో పాటు, అసలు ప్రాచీన గ్రీసు రాజకీయ, సామాజిక వ్యవస్థ గురించీ, ప్లేటో కాలం నాటి విద్యావ్యవస్థ గురించీ, తన కాలం నాటి విద్యావ్యవస్థతో ప్లేటో ఎందుకు సంతృప్తి చెందలేకపోయాడో అదంతా కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది.

సరిగ్గా ఈ అంశాల మీదనే వెలుగు ప్రసరిస్తూ ఇటీవల ఒక రచన వెలువడింది. Plato: Images, Aims, and Practices of Education (స్ప్రింగర్, 2018) అనే ఆ రచన ఒక విద్యావేత్తగా ప్లేటో గురించి నాకు గొప్ప మెలకువ కలిగించింది. ప్లేటో విద్య గురించి చేపట్టిన అన్వేషణని ఇంత స్పష్టతతో వివరించిన పుస్తకం నాకిప్పటిదాకా తారసపడలేదు.

అవి ఐ మింజ్ (Avi I.Minz) అనే ఆ రచయిత తన పుస్తకం మొదలుపెడుతూనే అసలు ప్లేటో కాలం నాటి విద్యావ్యవస్థ ఎలా ఉండేది అని ప్రశ్నిస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నట్టే, అప్పుడు కూడా విద్యకీ, పాఠశాలకీ మధ్య స్పష్టమైన తేడా ఉండేదని చెప్తూ, ప్లేటో కాలం నాటి ఏథెన్సు పాఠశాలని అంగీకరించినంత సులభంగా ‘విద్య’ని అంగీకరించలేకపోయేదని చెప్తాడు. అసలు అప్పటి గ్రీకు సమాజం ‘విద్య ‘ని కొంత అనుమానాస్పదంగా చూసేదని కూడా అంటాడు. అందుకు కారణం అప్పట్లో గ్రీకు సమాజంలో సంచరిస్తున్న సోపిస్టులు.

ప్లేటో కాలం నాటి పాఠశాల లో కేవలం సంపన్న కుంటుంబాల బాలురకి మాత్రమే ప్రవేశం ఉండేది. ప్రతి సంపన్నుడూ తన పిల్లవాడికి కనీస సామర్థ్యాలు రావడం కోసం పాఠశాలకు పంపేవాడు. ఆ పాఠశాలలో రెండు భాగాలుండేవి. ఒకటి జిమ్నాషియం. అంటే వ్యాయామ విద్య. రెండవది, సంగీత శాల. సంగీతం పేరిట పూర్వకవుల కవిత్వం కూడా పిల్లలు కంఠతా పట్టవలసి ఉండేది. ఆ రెండూ కలిపి ఇప్పటి భాషలో చెప్పాలంటే, ఆట, పాట అన్నమాట. వాటికి తర్వాత రోజుల్లో సోక్రటీస్ వ్యాకరణాన్ని కూడా జతపరిచాడు. అంటే, ఆట, పాట, మాట అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పుడు మన ప్రాథమిక పాఠశాలల కరికులం కూడా ఇంతే కదా.

కాని, పాఠశాల ద్వారా అందేవి కనీస సామర్థ్యాలే తప్ప, విద్య కాదనే ఎరుక ఏథెన్సు కి ఉండేది. ఆ విద్య గ్రీకు పౌరుడికి పాఠశాలకన్నా బయట, మరి నాలుగు మార్గాల ద్వారా అందేది. వాటిల్లో మొదటిది, నగరం. ఒక పిల్లవాణ్ణి పౌరుడిగా తీర్చిదిద్దే బాధ్యత నగరానిది. ‘ఒక మనిషికి చదువు చెప్పేది నగరమే’ అన్నాడట ఒక గ్రీకు కవి. నగరజీవితం, అక్కడి మర్యాద, మన్నన, ఆ నగరం నమ్మే విలువలు, అనుష్టించే ఆచరణలు అవే ఒక మనిషిని విద్యావంతుడిగా తీర్చిదిద్దేవి.

నగరం ఒక మనిషికి చదువుచెప్పడమంటే ఏమిటో నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే నన్ను మనిషిగా తీర్చిదిద్దిన విశ్వవిద్యాలయం రాజమండ్రినే కాబట్టి. నేను బి ఏ చదువు మధ్యలో ఆపేసి, రాజమండ్రిలో ఒక చిన్న ఉద్యోగంలో కుదురుకున్నప్పుడు, ఆ నగరమే నాకు సాహిత్యం, తత్త్వశాస్త్రం, పౌరసంస్కారం అన్నీ నేర్పింది. మనం విద్యావ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు పాఠశాలల్ని సంస్కరించడమెలా అన్నదే మాట్లాడుతుంటాం గాని, మన నగరాల్ని, మన గ్రామాల్ని, మన సమాజాన్ని సంస్కరించడమెట్లా అన్నదాని గురించి మాట్లాడం.

ఒక సమాజాన్ని పాఠశాలలు మారుస్తాయా, పాఠశాలల్ని ఒక సమాజం మారుస్తుందా అన్నది అనాది కాలం నుంచీ పాశ్చాత్య తత్త్వశాస్త్రం చర్చిస్తున్న సమస్య. కానీ, సమాజాన్ని మార్చకుండా పాఠశాలని మాత్రమే మనం మార్చలేమన్నది మాత్రం నిస్సందేహం. ఈ మాట రాస్తూ ఉంటే నాకో విషయం గుర్తొస్తూ ఉంది. చాలా కాలం కిందట, హైదరాబాదులో ఒక పబ్లిక్ స్కూలు యాజమాన్యం ముందొక సమస్య వచ్చింది. తమ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న పిల్లవాడు తన క్లాస్ మేట్ కి ఒక ప్రేమలేఖ రాసాడు. ఆ బాలిక ఆ లేఖ ని తన టీచర్ కి చూపించింది. దాని మీద యాజమాన్యం చాలా తర్జనభర్జనలు పడింది. ‘మన పాఠశాలలో ఇటువంటివి జరిగే ఆస్కారమే లేదు కదా, మనం ఎంతో క్రమశిక్షణతో పాఠశాల నడుపుతున్నాం కదా, ఇదెలా జరిగింది ‘ అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. కాని వాళ్ళు మర్చిపోయిందేమంటే, తమ పాఠశాలలో అడుగుపెట్టే ముందు పిల్లలు స్కూలు బస్సులో గంట సేపు కలిసి ప్రయాణించి వస్తారనీ, ఆ ప్రయాణసమయం తమ పర్యవేక్షణలో లేనిదనీ.

ప్రాచీన గ్రీకులకి ఈ సంగతి తెలుసు. వాళ్ళు చదువునీ, విద్యనీ రెండు అంతస్థుల్లో చూసారు. చదువు అంటే- పఠన, లేఖన, గణన సామర్థ్యాలు పాఠశాలలో అందుతాయనీ. కాని విలువలు, సంబంధాలు, నడవడిక నగరంలో నేర్చుకోవలసి ఉంటుందనీ.

నగరంతో పాటు పిల్లల్ని విద్యావంతుల్ని చేసే తక్కిన మూడు శక్తులూ నగర నియమాలూ, తండ్రులూ, కవులూను. నగరంతో పాటు నగరనియమావళి, ఆచారవ్యవహారాలూ (nomoi) కూడా పిల్లవాణ్ణి విద్యావంతుణ్ణి చేసే సాధనాలే. పిల్లవాడు పాఠశాలలో చదవడం రాయడం నేర్చుకున్నాక, వాణ్ణి తనకి తగ్గట్టుగా మార్చుకోవలసిన బాధ్యత నగరానిదే అంటాడు ప్లేటో ఒక సంభాషణలో. అలాగే తండ్రులు కూడా. తమ పిల్లలకి ఎటువంటి పాఠశాలని ఎంపిక చేయాలో దగ్గర్నుంచి, ఆ పాఠశాల నుంచి బయటికి వచ్చాక పిల్లవాడు ఎటువంటి ప్రభావశీల వ్యక్తుల మధ్య పెరగాలో దాకా తండ్రులే నిర్ణయించుకునేవారు. ఒక పిల్లవాడు ఒక పౌరుడిగా ఎదగడానికి తండ్రిదే పూర్తి బాధ్యత అని ఏథీనియన్ సమాజం నమ్మింది.

ఇక నాలుగ శక్తి కవులు. ప్రాచీన గ్రీకు సమాజంలో కవిది అత్యున్నత స్థానం. అందులోనూ హోమర్ ది మరీ ప్రత్యేకం. కవి ఒక మందని ఒక జాతిగా మారుస్తాడు. గుంపుని ఒక నగరంగా తీర్చిదిద్దుతాడు. తన మనుషుల ముందు ఉన్నతాశయాలు నిలిపి వాటిని సాధించడం కోసం వాళ్ళని సదా ప్రేరేపిస్తూ ఉంటాడు. వారికి నిరంతర స్ఫూర్తిగా నిలుస్తాడు.

ఇంకా చిత్రమైన విషయమేమిటంటే ఒక కవి సామర్థ్యాన్ని అతడి కవిత్వాన్ని బట్టి కాక, అతడు చూపగల మార్గనిర్దేశకత్వాన్ని బట్టి లెక్కించడం. గ్రీకు నాటకర్తల్లో అగ్రగణ్యులని చెప్పదగ్గ ఎస్కిలస్, యురిపిడిస్ ల మధ్య ఒక సారి పోటీ ఏర్పడిందిట. అప్పుడు వారిలో ఎవరు గొప్ప నాటకకర్తనో తేల్చడానికి ప్రజలు చూసిన ప్రమాణం-ఎవరి నాటకానికి ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తారనో లేదా ఎవరు ఎక్కువ బహుమతులు సంపాదించుకున్నారనో కాదట. వాళ్ళిద్దరిలో ఎవరు బాగా బోధించగలరు, ఎవరు ఉత్తమ ఉపాధ్యాయుడు అన్నదాన్ని బట్టి పోటీ నడిచిందట. ‘పిల్లవాడికి చిన్నప్పుడు ఉపాధ్యాయుడు బోధిస్తాడు, పెద్దయ్యాక కవి బోధిస్తాడు’ అని ఎస్కిలస్ అననే అన్నాడట కూడా.

అటువంటి విద్యావ్యవస్థలోకి ఒక దుమారంలాగా సోఫిస్టులు ప్రవేశించారు.

26-4-2020

Leave a Reply

%d