
క్రీస్తు పూర్వపు గ్రీసులో అయిదో శతాబ్దం ముగిసే నాటికి సోఫిస్టులు ప్రవేశించారు. వాళ్ళు ప్రధానంగా బోధకులు. ప్రజల్ని మరింత వివేకవంతుల్ని చేసే నేర్పు, కళా తమ దగ్గర వున్నాయని చెప్పుకుంటూ ప్రాచీన గ్రీసు అంతటా సంచరించేవారు. ముఖ్యంగా నగర రాజకీయాల్ని శాసించగల నేతల్ని రూపొందిచగలిగే కౌశల్యం వారి దగ్గర ఉందని సంపన్న కుటుంబాలకు చెందిన యువకులు వారి చుట్టూ గుమికూడేవారు. వక్తృత్వం, భాషా పటిమ, సంభాషణా చాతుర్యం, ప్రజాసమూహాల్ని సమ్మోహితుల్ని చేయగల నైపుణ్యం సోఫిస్టుల దగ్గర నేర్చుకోవాలనే తపన గ్రీసులోనూ, ఏథెన్సులోనూ కార్చిచ్చులాగా చెలరేగింది.. అంటే అప్పటిదాకా, ఒక మనిషి ఏళ్ళ తరబడి తన తల్లిదండ్రుల పెంపకంలోనూ, సాహిత్య అధ్యయనంలోనూ, నగరంలో ఒక పౌరుడిగా జీవించడం ద్వారానూ మాత్రమే విద్యావంతుడు కాగలడని నమ్మిన గ్రీకు సమాజం ఇప్పుడు ఒక సోఫిస్టుదగ్గర పాఠాలు చెప్పించుకుంటే చాలనే స్థితికి చేరుకుందన్నమాట.
సోఫిస్టుల వల్ల ఇప్పుడు విద్య మూడు విధాలుగా విడిపోయింది. ఒకటి, పాఠశాలలో చిన్నప్పుడు అభ్యసించే కనీస సామర్థ్యాలు, రెండవది, జీవితకాలం పాటు అలవర్చుకునే పౌరసంస్కారం, మూడవది, ఎంతో కొంత ఫీజు చెల్లించి సోఫిస్టు దగ్గర కోచింగు పొందితే సాధ్యమయ్యే ‘వ్యక్తిత్వవికాసం.’ సరిగ్గా ఈ అంశం మీదనే సోక్రటీసు ఏథెన్సు సమాజాన్ని నిలదీసాడు. వ్యక్తిత్వం, శీలం, వివేకం- ఇవి ఒకరు నేర్పితే వస్తాయా? కొన్నాళ్ళు తర్ఫీదు చేస్తే మనుషులు సంస్కారవంతులుగా మారిపోతారా? చక్కగా మాట్లాడటం (రెటారిక్) ని అలవర్చుకున్నంతమాత్రాన ఒక మనిషి ఉత్తమ పౌరుడిగా మారిపోతాడా?
సరిగ్గా ఇదే ప్రశ్న కీలకంగా ప్రొటాగొరస్ అనే ఒక సోఫిస్టుకీ, సోక్రటీస్ కీ మధ్య జరిగిన సంభాషణని ప్లేటో Protagoras అని సంభాషణగా నమోదు చేసాడు. ప్లేటో సంభాషణల్లోని అత్యంత కళాత్మకమైన సంభాషణల్లో అదొకటి. కొందరి దృష్టిలో అది ప్లేటో సంభాషణల్లో సర్వోన్నతమైంది కూడా. ప్రొటాగొరస్ ని సోక్రటీసు కలుసుకున్ననాటికి ప్రొటాగొరస్ కీర్తి ఆకాశాన్నంటుతూ ఉంది. అప్పటికి అతడు పూర్తిగా పండు వయసులో ఉన్నాడు. అప్పటికి సోక్రటీస్ కి ముప్పై ఆరేళ్ళు. కాని ఏథెన్సు సమాజం దృష్టిలో అప్పటికే అత్యున్నత స్థానాన్ని పొందిన ప్రొటాగొరస్ ని సోక్రటీస్ తన సంభాషణతో నిరుత్తరుణ్ణి చెయ్యడం ప్రాచీన గ్రీసు చరిత్రలోనే కాదు, మానవ చరిత్రలోనే మరవలేని ఒక ఘట్టం.
‘శీలాన్ని మీరెట్లా నేర్పగలుగుతారు? ‘అనడిగాడు సోక్రటీసు ప్రొటాగొరొస్ ని. ఇప్పటి వ్యక్తిత్వ వికాస వాదుల్ని అడిగినట్టే. ప్రొటాగొరస్ తన వాదన మొదలుపెడుతూ జ్ఞానానికీ, శీలానికీ మధ్య భేదం లేదనీ, ఒక వ్యక్తికి మరింత శిక్షణ ద్వారా మరింత జ్ఞానాన్ని ఇవ్వగలిగినట్టే మరింత శీలాన్ని కూడా సంతరించవచ్చంటాడు. ఆ వాదన అనేక మలుపులు తిరిగి చివరికి సోక్రటీసు, ప్రొటాగొరస్ ఇద్దరూ తమ వాదనని మరొక సారికి వాయిదా వేస్తారు. మరొక రోజు మరింత వివరంగా తమ ప్రశ్నల్ని సంశోధించాలని తీర్మానించుకుంటారు.
అలవరచవలసిన ఒక సంస్కారంగా కాకుండా, విద్య ని , అమ్మదగ్గ వస్తువుగా మార్చేసారాన్నదే సోఫిస్టుల మీద సోక్రటీసు అభియోగం. సమాజాన్ని, ముఖ్యంగా యువకుల్ని సంస్కరించవలసింది బదులు వాళ్ళని తప్పుదారిలో నడిపిస్తున్నారని సోక్రటీస్ వాళ్ళని నిలదీసాడు. వాళ్ళ వెనక వేలంవెర్రిగా పడుతున్న ఏథెన్సు సమాజాన్ని నిశితంగా ఖండిస్తూ వచ్చాడు. తాను ఎత్తిచూపుతున్న ఈ విషయాల వల్ల అతడు ఏథెన్సు చెవిలో ఒక జోరీగగా మారాడు. అతణ్ణి ఏథెన్సు ప్రజాస్వామ్యం భరించలేకపోయింది. నగరంలోని యువకుల్ని తప్పుదోవపట్టిస్తున్నాడనే అభియోగం మీద అతణ్ణి విచారించి మరణశిక్ష విధించింది.
ఇరవై ఏళ్ళ వయసులో ప్లేటో తన గురువు, వివేకవంతుల్లోకెల్లా వివేకవంతుడు అట్లా అన్యాయంగా మరణశిక్షకి గురవడం చూసాడు. తప్పుదోవ పట్టిస్తున్నవాళ్ళని ఎత్తి చూపినందుకు సోక్రటీస్ ను అభినందించవలసింది, అనుసరించవలసింది పోయి, చివరికీ అతణ్ణే తప్పుడు అభియోగాలతో మరణశిక్షకు గురిచేయడం ప్లేటోను నిలువెల్లా కలచివేసింది. అతడు తన తదనంతర జీవితమంత పదే పదే ఆ ఘట్టాన్నే తలుచుకుంటూ ఉన్నాడు. తలుచుకున్న ప్రతి సారీ తనని తాను మౌలికమైన ప్రశ్నలతో నిలదీసుకుంటూనే ఉన్నాడు.
విద్యకి సంబంధించినంతవరకూ ఆ ప్రశ్నలిలా ఉన్నాయి:
అసలు ఇంతకీ విద్య మంచిదేనా? ఒక పిల్లవాణ్ణి మనం విద్యావంతుణ్ణి చేయడం అతడికి శ్రేయస్సును సమకూరుస్తుందా?
విద్యని మనం నేర్పగలమా?
శీలం లేదా సంస్కారం లేదా నైతికత మనిషిలోపల ఉంటుందా లేక అది సమాజంతో అతడి సంబంధాల వల్ల ఏర్పడుతుందా? అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శీలమూ, జ్ఞానమూ ఒకటేనా?
అయితే జ్ఞానం ఎలా సిద్ధిస్తుంది?
గురువు అంటే ఎవరు? గురువు పిల్లవాడికి విద్యని బోధించగలడా? పిల్లవాడిలో లోపల లేని జ్ఞానాన్ని గురువు పిల్లవాడికి అందించగలడా?
గురువు తాలూకు నిజమైన పాత్ర ఏమిటి? అతడు బోధకుడా? సహాయకుడా?
ఇటువంటి ప్రశ్నలతోనే పాశ్చాత్య విద్యాన్వేషణ మొదలయ్యింది. వీటికి ప్లేటో ఇచ్చిన సమాధానాలు రెండు విధాలుగా ఉన్నాయి. మొదటిది, ఆయన గురువు ఎలా ఉండాలో, ఆ గురువు బోధన ఎలా చేపట్టాలో, ఒక జ్ఞాని అత్యున్నత శీలానికి ఉదాహరణగా ఎలా జీవించాలో సోక్రటీసు నే ఒక ఉదాహరణగా చూపించి చెప్పిన మాటలు. ఇవన్నీ ఆయన తొలిదశలో రాసిన సంభాషణల్లో ఉన్నాయి. రెండవది, తాను తన తొలిదశలో అడిగిన ప్రశ్నలకి తానే జవాబులు వెతుక్కుని తన అకాడెమీ ద్వారా చేపట్టిన ప్రయోగాలు. రెండవ దశలోని ప్లేటో ఒక సిద్ధాంతకారుడిగా కనిపిస్తాడు. ఆ దశలో ఆయన చేసిన ప్రతిపాదనల్ని మనం అంగీకరించవచ్చు, అంగీకరించక పోవచ్చు. కాని, సోక్రటీసుని ఒక ఉదాహరణగా చూపిన మొదటి రచనల్లో ప్లేటో మాత్రం ఇప్పటికీ మనకి ప్రాసంగికంగా వినిపిస్తాడు. సోక్రటీసు జీవితం ఒక ఉదాహరణగా ప్లేటో మనముందుంచుతున్న భావాలు చాలావరకూ మనకి ఇప్పటికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగానూ, ఉత్తేజాన్ని కలిగించేవిగానూ కనిపిస్తాయి.
సోక్రటీసు దృష్టిలో విద్య సామర్థ్యాల కల్పన కన్న మించింది. తన కాలం నాటి ఏథెన్సు దృష్టిలో విద్య అంటే రెండు రకాల సామర్థ్యాలు. మొదటివి, కనీస సామర్థ్యాలు. పఠన,లేఖన, గణన సామర్థ్యాలు. వాటిని పాఠశాల అందిస్తుంది. రెండవది సామాజిక జీవితంలో విజయాన్ని సాధించి పెట్టేవి. వాటిని ఎంతో కొంత రుసుము చెల్లించి సోఫిస్టుల దగ్గరనుంచి నేర్చుకోగలమని ఏథెన్సు భావిస్తున్నది. కాని, సోక్రటీసు దృష్టిలో నిజమైన విద్య వీటిని మించింది. అది వివేకం. దాన్ని అమ్మలేం. కొనుక్కోలేం. ఒక మనిషి వివేకవంతుడు కావాలంటే సదా వివేకాన్ని ప్రేమిస్తూ ఉండవలసిందే. ఆ వివేకాన్ని ప్రాచీన గ్రీకులు ‘సోఫియా’ అన్నారు. అటువంటి సోఫియా పట్ల ప్రేమ కలిగిఉండటమే philosophy. సోక్రటీస్ దృష్టిలో సోఫిస్టు కన్నా ఫిలాసఫర్ భిన్నమైనవాడు. ఫిలాసఫర్ కి సత్యం తెలుసని గాని, అతడికి తెలిసిందే అంతిమ సత్యమని కాని సోక్రటీస్ చెప్పలేదు. అందుకు బదులు, ఫిలాసఫర్ సదా వివేకరక్తుడుగా ఉంటాడు. సత్యాన్ని, శీలాన్ని, వివేకాన్ని ప్రేమిస్తూ ఉండటమే ఫిలాసఫర్ లక్షణం. సత్యం పట్ల అతడి ప్రేమ వల్ల అతడెప్పుడూ కొత్తగా ఆలోచిస్తుంటాడు. పాతభావాల్నీ, బూజుపట్టిన నమ్మకాల్నీ ఎప్పటికప్పుడు విదిల్చేసుకుంటాడు.
సత్యం పట్ల ప్రేమ కలిగిఉన్నందువల్ల ఫిలాసఫర్ ప్రసంగాలకి పూనుకోడు. కాని సోఫిస్టులు అలాకాదు. వాళ్ళు వాదవివాదాల్లో కాలం గడుపుతారు. వాదవివాదాల్లో నెగ్గడమెలా అన్నదాని మీద దృష్టి పెడుతుంటారు. అందుకు కావలసిన వాక్చాతుర్యాన్ని ప్రజలకి నేర్పుతామంటారు. అటువంటి వాదవివాదకళని వాళ్ళు eristics అన్నారు. అది సాంప్రదాయిక వాదకళ. దానివల్ల మనుషుల తెలివితేటలు మరింత పదునెక్కుతాయని భావించేవారు. తమ వాక్పటిమతో ఎదుటిమనిషిని ఒప్పించడం దాని లక్ష్యం. అక్కడ సత్యంతో పనిలేదు. తాను చెప్పేది సత్యమని ఒప్పించగలిగితే చాలు. కాని సోక్రటీస్ సంభాషణా పద్ధతి అందుకు భిన్నం. దాన్ని ప్లేటో dialectic అన్నాడు. (తెలుగులో దాన్ని గతితర్కం అంటున్నారు. అది సరైన పదబంధం కాకపోయినప్పటికీ, ప్రాచుర్యం పొందిన పదబంధం కాబట్టి నేను కూడా ఆ పదమే వాడుతున్నాను.) గతి తర్కంలో ముందొక ప్రతిపాదన ఉంటుంది. దాన్ని ఎదుటివాళ్ళు పూర్వపక్షం చేస్తారు. అప్పుడు ఆ రెండు పక్షాల్నీ సమన్వయిస్తూ ఒక ప్రతిపాదన ముందుకొస్తుంది.
సోక్రటీస్ తన సంభాషణా పద్ధతిని మంత్రసానితనంతో పోల్చుకున్నాడు. మంత్రసాని ఏ విధంగా ఒక గర్భవతి ప్రసవానికి సహకరిస్తుందో అలానే కూడా సత్యప్రసవానికి సహకరించడమే తన పని చెప్పుకున్నాడు. సోక్రటీసు దృష్టిలో సత్యం విద్యార్థి లోపల ఉంది. బయట లేదు. ‘కొందరు చెప్తున్నట్లుగా విద్య అంటే గుడ్డివాళ్ళ కళ్ళల్లో నేరుగా చూపుని ప్రవేశపెట్టడం కాదు’ అంటాడు ప్లేటో. సత్యం లేదా శీలం లేదా విద్య అప్పటికే పిల్లవాడిలో గూఢంగా, అంతర్లీనంగా ఉంటుంది. దాన్ని బయటకు తియ్యడమే గురువు చెయ్యవలసిన పని. విద్యార్థి అనే గర్భవతి సత్యమనే శిశువుని ప్రసవించడానికి గురువు మంత్రసానిగా వ్యవహరించడమే నిజమైన విద్యాబోధన.
సత్యం అప్పటికే విద్యార్థి మనసులోపల నిబిడీకృతంగా ఉంటే అది అక్కడ ఎలా చేరింది? దాన్ని అతడిలో ఎవరు ప్రవేశపెట్టారు? ప్లేటో రాసిన మరొక సంభాషణ Meno లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఉంటుంది. మెనో అనే ఒక సంపన్న గ్రీకు పౌరుడికీ, సోక్రటీసు కీ మధ్య ఇదే విషయం మీద చర్చ జరిగినప్పుడు, మెనో సేవకుడూ, నిరక్షరాస్యుడూ అయిన ఒక బానిసతో సోక్రటీస్ పైథాగొరస్ సిద్ధాంతాన్ని చెప్పిస్తాడు. ఆ బానిసకి చదువు రాదు. కనీస గణిత సామర్థ్యం కూడా లేదు. కాని సోక్రటీస్ అతణ్ణి చేయిపట్టుకుని ఒక్కొక్క అడుగే వేయిస్తూ, జామెట్రీ పాఠం చెప్పి, పైథాగొరస్ ప్రతిపాదించిన గణిత సిద్ధాంతాన్ని చెప్పిస్తాడు. అందుకు సోక్రటీస్ ఇచ్చిన వివరణ ఏమిటంటే, మనిషి పుట్టుకతోటే విద్యావంతుడు. కాని ఆ విద్య అతడి మనసులో మరుగునపడిపోయి ఉంటుంది. గురువు చెయ్యవలసిన పని ఆ స్మృతిని మేల్కొల్పడం. గురువూ, శిష్యుడూ నిరంతరం వివేకరక్తులుగా సంభాషిస్తూ, సంభాషిస్తూ ఉండగా, ఒకనాటికి, ఒక హఠాత్ క్షణాన, ఆ స్మృతి నిప్పురవ్వలాగా విద్యార్థిలో మేల్కొంటుంది.
అది సోఫిస్టులు చెప్పేటట్టు బాగా మాట్లాడటం చాతనయితే వచ్చేది కాదు. లేదా పుస్తకాలు చదివితే వచ్చేదీ కాదు. సోక్రటీసు దృష్టిలో పుస్తకవిద్య ఏమంత ప్రశస్తం కాదు. నిరంతర గురుశిష్య సంభాషణ మాత్రమే విద్యార్థిని ఏదో ఒకనాటికి జాగృతపరచగలిగే సాధనం. తనని తాను ఒక తోటమాలిగా కూడా అభివర్ణించుకున్నాడాయన. ‘గురువు ఒక చక్కని శిష్యుణ్ణి ఎంచుకుని జ్ఞానంతో అతడిలో జ్ఞానబీజాలు నాటి నిరంతరచర్చ ద్వారా వాటిని పెంచిపోషిస్తాడు ‘ అన్నాడు.
సొక్రటీసు దృష్టిలో అభిప్రాయానికీ, జ్ఞానానికీ తేడా ఉంది. అభిప్రాయాలు (doxai) నిలకడలేనివి. జ్ఞానం (logos) సంస్థిరం. ఆ రెండింటి మధ్యా తేడా వివరించడానికి ఆయనొక కథ చెప్పాడు. ఒకప్పుడు దేవలోక శిల్పి శిల్పాలు చెక్కుతూ ఉంటే, ఆయన కౌశల్యం వల్ల అవి సజీవప్రతిమల్లానే ఉండేవిట. అక్కడితో ఆగకుండా ఆ ప్రతిమలు లేచి నిల్చుని చకచకా నడిచిపోయేవిట. అవట్లా కదిలిపోకుండా ఉండటంకోసం అతడు వాటికాళ్ళకి తాడుకట్టిపెట్టేవాడట. సోక్రటీస్ దృష్టిలో తాడుకట్టి నిలబెట్టిన అభిప్రాయాలే జ్ఞానం. ఆయన చెప్పిన మరొక ఉదాహరణ ప్రకారం విద్యార్థికి విద్య బోధించడమంటే ఉన్నికి రంగు వెయ్యడం లాంటిది. ఒకసారి రంగు వేసాక ఆ రంగు ఎప్పటికీ వెలిసిపోకుండా నిలబడాలి.
విద్యార్థిలో నిద్రాణంగా ఉన్న జ్ఞానాన్ని తట్టిలేపడమే కాకుండా గురువు ఆ జ్ఞానానికొక దిశానిర్దేశం కూడా కలిగిస్తాడు. పూర్వకాలం సాంప్రదాయికంగా గ్రీకు నగరం విద్యార్థికి పౌరసంస్కారం నేర్పేది, నిజమే, కాని తనకాలం నాటికి నగర జీవితం కలుషితమైపోయింది. అది విద్యార్థిని తప్పుదోవపట్టించేదిగా మారిపోయింది. సోఫిస్టులు అటువంటి సాంప్రదాయిక జీవితాన్ని బద్దలుగొట్టారు, నిజమే, కాని, వాళ్ళు సత్యాన్ని ఆవిష్కరించడం మీదకన్నా, సత్యం మాట్లాడుతున్నట్టుగా ఒప్పించడం ఎలా అన్నదానిమీదనే తమ వాక్చాతుర్యాన్ని వ్యయపరుస్తున్నారు. కాని నిజమైన గురువు విద్యార్థిని తన ఆత్మవైపు మేల్కొల్పుతాడు. విద్యార్థి బయటికి కాకుండా లోనికి చూసేలాగా చేస్తాడు.
నిజమైన విద్య ఆత్మవిద్య అని చెప్తున్న ఈ మాటలు ఉపనిషత్తుల్ని గుర్తుకు తేవడం లేదూ! ఈ రోజు సైన్సు, సామాజిక శాస్త్రాలు ఇంతగా అభివృద్ధి చెందిన ఈ ప్రపంచంలో, ఇక్కడ నిలబడి, విద్య అంటే లోపల నిద్రాణంగా ఉన్నదాన్ని తట్టిలేపడమూ, విద్యార్థిని ఆత్మవైపు జాగరూకుణ్ణి చెయ్యడమూ అనే మాటలు మనకి ఒక పట్టాన కొరుకుడు పడకపోవచ్చు. కాని, పాశ్చాత్య విద్యాన్వేషణలో ఇదొక ప్రధాన తాత్త్విక ధోరణి. దీన్ని వాళ్ళు Idealism అన్నారు. (ఈ మాటని తెలుగులో భావవాదం అని అనువదించారు. అది సరైన అనువాదం కాదు. భావవాదం అంటే Idea-ism అవుతుంది తప్ప, Idealism కాదు.) Idealism అంటే ఆదర్శవాదం. దీన్ని పూర్వపక్షం చేసే తాత్త్వికధోరణి Realism. అంటే వాస్తవవాదం. దాని ప్రవక్త అరిస్టాటిల్.
27-4-2020