ఆ నిర్మల చంద్రకాంతి

జార్జి ట్రాకల్ ఆస్ట్రియాలోని సాల్జ్ బర్గ్ లో పుట్టాడు. ఏడుగురు సంతానంలో అయిదవవాడు. తండ్రి హార్డ్ వేర్ వ్యాపారి. తల్లి గృహిణి. కానీ ట్రాకల్ బాల్యంలో తల్లి దగ్గర ఎక్కువ సాన్నిహిత్యానికి నోచుకోలేదు. ఆ పిల్లలందరూ ఒక దాది పర్యవేక్షణలోనే పెరిగారు. ఆమె కాథలిక్. ఆమె పిల్లలకి ఫ్రెంచి భాషనీ, యూరపియన్ కులీన అభిరుచినీ పరిచయం చేసింది. ట్రాకల్ బాల్యం సాల్జ్ బర్గ్ లో సంగీతం, సాహిత్యం, వేసవి సంతోషాలతోనూ పల్లెపట్టు ప్రశాంతతలో భద్రంగా గడిచింది. సాల్జ్ బర్గ్ లో ఆ ఇంట్లోంచి బాల్కనీలోంచి అతడు చిన్నప్పుడు చూసిన వీథులు, పొలాలు, పట్టణసంచారం, ఆకాశం, దిగంతం అతడి కవిత్వంలో చివరిదాకా అతణ్ణి అంటిపెట్టుకునే ఉన్నాయి.

చిన్నప్పుడు అతడి ఆలనా పాలనా చూసిన ఆ ఉపాధ్యాయురాలే అతడికి ఫ్రెంచి కవిత్వాన్ని పరిచయం చేసింది. బాదిలేరు, వెర్లేన్, రేంబో ల్ని పరిచయం చేసింది. ఆ సింబలిస్టు కవుల అతిలోక ప్రపంచం అంత చిన్నప్పుడే అతడికి పరిచయం కావడమే అతడు చేసుకున్న అదృష్టం. ఒక విధంగా అదే అతణ్ణి మామూలు జీవితంలోకి కుదురుకోనివ్వని శాపం అని కూడా చెప్పాలి.

సింబలిజం ఒక ఫ్రెంచి సౌందర్య దృక్పథం. స్టీఫెన్ మల్లార్మే అనే ఒక కవి, లాక్షణికుడు ప్రతిపాదించిన దర్శనం అది. చిత్రలేఖనంలో ఇంప్రెషనిజం దానికి సమానలక్షణాలు కలిగిన ఉద్యమం. సింబలిస్టుల దృష్టిలో దృశ్య ప్రపంచం ద్వారా మనమొక అదృశ్య, ఇంద్రియాతీత సన్నిధిని పట్టుకోగలం. మన ఇంద్రియ సంవేదనల ద్వారా మనం మనలోని మానసిక ప్రపంచాల జాడపోల్చుకోవాలి. ఇంప్రెషనిస్టు చిత్రకారులు ఎలా అయితే వస్తువుల్ని కాక, వస్తువుల మీద పడుతున్న కాంతిని పట్టుకోవాలని ప్రయత్నించారో, సింబలిస్టులు కూడా అలాగే బాహ్య ప్రపంచాన్నో, ఆంతరంగిక ప్రపంచాన్నో కాక, ఆ రెండు ప్రపంచాలూ ఏకమయ్యే ఒక దిగ్వలయరేఖ మీది మెరుపుల్నీ, తళుకుల్నీ పట్టుకోవాలని ప్రయత్నించారు. వాళ్ళకి భాషలోని వాచ్యార్థ శక్తిమీద కన్నా సూచ్యార్థ శక్తిమీద ఎక్కువ నమ్మకం. నువ్వు దర్శించిన సత్యాన్ని వినిపించీ వినిపించకుండా, బిగ్గరగా, బోలుగా మాట్లాడకుంట్డా సున్నితంగా, సూచన ప్రాయంగా, ఒక జాడగా, ఒక పొగగా, ఒక ఆవిరిగా మాత్రమే చూపించాలని వాళ్ళు భావించారు. వాళ్ళకన్నా ముందు రొమాంటిసిజం, రియలిజం కళా ఉద్యమాలుగా వికసించాయి. కానీ సింబలిస్టుల నాటికి రొమాంటిసిజం డార్క్ రొమాంటిసిజంగానూ, రియలిజం నాచురలిజంగానూ మారిపోయేయి. సాహిత్యంలో సింబలిజం ప్రభావం క్షీణించేనాటికి మాడర్నిజమూ, అనేక రూపాల సర్రియలిజమూ సాహిత్యాన్ని ఆక్రమించాయి. యూరపియన్ సాహిత్య చరిత్రలో సింబలిజానికీ, మాడర్నిజానికీ మధ్య సంధి దశలో ట్రాకల్ పుట్టిపెరిగాడు. కొందరు ఆయన కవిత్వాన్ని జర్మన్ ఎక్స్ప్రెషనిస్టు ధోరణికి చెందిందిగా భావిస్తారు కానీ, ట్రాకల్ సింబలిస్టూ కాడు, ఎక్స్ప్రెషనిస్టూ కాడు.

ట్రాకల్ కి ఫ్రెంచి కవిత్వాన్ని పరిచయం చేసిన ఉపాధ్యాయురాలు ఫ్రెంచి సింబలిస్టులతో పాటు బెల్జియం సాహిత్యవేత్తా, నోబెల్ పురస్కార స్వీకర్తా, అత్యంత ప్రభావశీలి భావుకుడైన మారిస్ మాటర్లింక్ కవిత్వాన్ని కూడా పరిచయం చేసింది. ఆ సింబలిస్టు కవులు అతనిలోని ఒక మార్మిక, అత్యంత వైయక్తిక ప్రపంచానికి తలుపులు తెరిచారు. అందుకనే అతడి మొదటి కవితాసంపుటి వెలువడినప్పుడు అదంతా ‘వెర్లేన్, రెంబో, మాటర్లింక్ మాత్రమే, అందులో నాదంటూ ఏదీ లేదు’ అన్నాడట ట్రాకల్.

ఆ రోజుల్లొనే అతడు నీషేనీ, షోపెన్ హోవర్ నీ కూడా చదవడం మొదలుపెట్టాడు. మనిషి ఆంతరంగిక శక్తుల్ని మేల్కొల్పే ఆ ఇద్దరు రచయితలతో పాటు, ఆ బాల్య కౌమారాల్లోనే అతడు మరొక రెండు ప్రభావాలకు లోనయ్యాడు. ఒకటి, నల్లమందుకి దాదాపుగా బానిసగా మారిన తన తల్లినుండి ఏ దురదృష్టకర సమయంలోనో అతడు కూడా నల్లమందు రుచి చూసాడు. ఆ మత్తుమందు అనతికాలంలోనే అతడి జీవితాన్ని తినెయ్యడం మొదలుపెట్టింది. రెండవది, అతడి చెల్లెలు గ్రెటె పట్ల అతడికి ఏర్పడ్డ అనుబంధం. అది అన్నాచెల్లెళ్ళ అనురాగాన్ని దాటి ఎక్కడో ఒక నిషిద్ధ అనురాగపు అంచులదాకా పయనించింది. బాల్యం నుంచి కౌమారంలోకి మలుపు తిరిగే వయసులో తన చెల్లెలి పట్ల ఏర్పడ్డ అనుబంధంతో అతడు బతికినంతకాలం యుద్ధం చేస్తూనే వున్నాడు.

ఆ పరిస్థితుల మధ్య అతడు ఫార్మసీ చదవడం కోసం వియన్నాలో అడుగుపెట్టాడు. కవుల, కళాకారుల, సంగీతకారుల స్వర్గం లాంటి వియన్నా అతడి సుకోమల ప్రపంచాన్ని తీవ్రంగా గాయపరిచింది. తన చిన్నప్పటి ఊరు, ఇల్లు, పొలాలు, సూర్యకాంతి, నక్షత్రాలు ఒకపక్కా, ఆధునికతలోకి అడుగుపెడుతున్న ఆ నగరం మరొక పక్కా అతడి హృదయంతో పెనగులాడేయి. ఆ చిన్ని గుండె తట్టుకోలేకపోయింది. తాను చదివేది ఫార్మసీ కావడంతో అతడికి మాదకద్రవ్యాలు మరింతగా అందుబాటులోకి వచ్చాయి. 1908 లో అతడు వియన్నాలో అడుగుపెట్టినప్పుడు అసలు మొత్తం ఐరోపానే ఒక సంధికాలపు సంఘర్షణలో అతలాకుతలమవుతూ ఉంది. పందొమ్మిదో శతాబ్దపు సామ్రాజ్య యుగం నుంచి ఇరవయ్యవ శతాబ్దపు ఇనప యుగంలోకి యూరప్ అడుగుపెట్టినప్పుడు అది మొదటి ప్రపంచ యుద్ధంగా పరిణమించక తప్పలేదు. అందుకనే 1900 నుంచి 1914 దాకా యూరప్ లో ఒక్కో దేశం ఒక్కో ఏడాది ఇరవయవ శతాబ్దంలో అడుగుపెడుతూ వచ్చింది. రష్యాకి సంబంధించినంతవరకూ ఇరవయ్యవ శతాబ్ది 1910 లో అడుగుపెట్టిందని రాసింది అన్నా అక్మతోవా. ట్రాకల్ కి సంబంధించినంతవరకూ ఇరవయ్యవశతాబ్ది 1908 లో అతడు వియన్నాలో అడుగుపెట్టడంతో మొదలయ్యింది. నీషే, రిల్క, వైల్డ్, డాస్టొవొస్కీలు తన ఆంతరంగిక ప్రపంచపు తలుపులు ఒక్కొక్కటే తెరుస్తూ ఉండగా, ఏకాకితనం, పరాయితనం, ఆందోళన, వ్యగ్రతలు తన బాహ్యజీవితాన్ని ఒక అరాచక ధోరణిలోకి నెట్టేస్తూ ఉండగా, నెమ్మదిగా తన చుట్టూ దారిద్య్రం కమ్ముకుంటూ ఉండగా అతడు ఒకవైపు మనిషిగా తూలిపోతూ, మరొకవైపు కవిగా మాత్రం నిటారుగా నిలబడుతూ వచ్చాడు.

1908 నుంచి 1912 మధ్యకాలంలో రాసిన కవితల్ని Gedichte (కవితలు) అనే పేరిట సంపుటంగా వెలువరించాడు. ఇప్పుడు వాటిని ట్రాకల్ తొలిదశ కవితలుగా పేర్కొంటున్నారు. ఆ రోజుల్లోనే అతడి చెల్లెలికి పెళ్ళయ్యింది. ఆమె అద్భుతమైన పియానో కళాకారిణి కూడా. కాని ఆమె వివాహ జీవితం ఏమంత సంతోషప్రదం కాలేదు. దానికి తోడు ఆమె ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. 1914 లో ఒకసారి అతడు తన చెల్లెల్ని చివరిసారిగా చూసాడు. ఆ తర్వాత అతడి బయటి జీవితమూ, లోపలి జీవితమూ కూడా సమతూకం తప్పడం మొదలయ్యింది. దుర్భరదారిద్య్రంలో కూరుకుపోయిన ఆ కవికి, లుడ్విగ్ విట్ గెన్ స్టెయిన్ ఆర్థిక సహాయం అందించడానికి ముందుకొచ్చాడు. కాని ఆ సహాయం స్వీకరించడానికి ట్రాకల్ కి ధైర్యం చాల్లేదు.

1914 లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలుకాగానే, అతడు ఆస్ట్రియన్ సైన్యం తరఫున ఒక వైద్యసహాయకుడిగా పనిచేయడానికి యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. అక్కడ గ్రోడెక్ అనే చోట జరిగిన యుద్ధంలో ఆస్ట్రియా సైన్యాలు ఘోరపరాజయాన్ని చవిచూసాయి. ఆ యుద్ధంలో గాయపడ్డ క్షతగాత్రులు దాదాపు తొంభై మందిని చూసుకోవలసిన బాధ్యత ట్రాకల్ మీద పడింది. ఆ సైనికులకి సరైన వైద్య సదుపాయం లేదు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళే లేకపోయారు. వాళ్ళు ఆ బాధ భరించలేక తమని కాల్చి చంపెయ్యమని ట్రాకల్ ని వేడుకున్నారు. ఇరవై ఆరేళ్ళ ఆ యువకుడికి అది తట్టుకోలేని అనుభవంగా పరిణమించింది. అప్పటికే నీరసించి బలహీనపడ్డ అతడి మనో ప్రపంచం ఆ అనుభవంతో పూర్తిగా విరిగిపోయింది. ఒకరోజు రాత్రి తక్కిన సహోద్యోగులతో భోజనానికి కూచున్నవాడు ఉన్నట్టుండి తనముందు పెట్టిన అన్నం పళ్ళేన్ని పక్కకి నెట్టేసాడు. హటాత్తుగా లేచి నిల్చుని తనని తాను కాల్చుకోబోయాడు. తోటి ఉద్యోగులు అతణ్ణించి రివాల్వరు లాక్కున్నారు. అతణ్ణి మానసిక చికిత్స కోసం వైద్యశాలకు పంపించేసారు.

అతణ్ణి ఉత్తర జర్మనీలోని, ఇప్పటి పోలెండ్ లోని క్రాకోవ్ దగ్గర ఒక మిలిటరీ హాస్పటలో చేర్చారు. అక్కడ ఆ ఆసుపత్రిలో ఆ ఉన్మాదావస్థలోనే అతడు రెండు కవితలు రాసి తన ప్రచురణకర్తకి పంపించాడు. అందులో ‘విలాపం’ అనే ఒక కవితని ఇక్కడ అందిస్తున్నాను. ఆ కవిత రాసేటప్పటికే అతడు తన చుట్టూ గిరికీలు కొడుతున్న మృత్యువుని పసిగట్టేసాడు. అక్కడ ఆ ఆసుపత్రిలో ఇంకా చికిత్స మొదలుపెట్టకముందే, కొకైన్ పెద్దమొత్తంలో మింగేసి తన దుర్భర జీవితానికి తానే ముగింపు పలికాడు. ఆ విధంగా ఇరవై ఏడేళ్ళు కూడా తిరక్కుండానే ఒక కోమల మనస్కుడు, ఒక భావుకుడు, ఒక ప్రేమికుడు ఈ నిష్ఠుర ప్రపంచం నుంచి తనను తాను బలవంతంగా బయటకు నెట్టేసుకున్నాడు.

ఆ ఆసుపత్రిలో అతడు రాసిన రెండవ కవిత, అతడి చివరి కవిత ‘గ్రోడెక్’ కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆ కవిత జర్మన్ సాహిత్యంలో ఒక మైలు రాయి. ఆ కవిత రాసే క్షణానికి పూర్వజర్మనీ పూర్తిగా వథ్యశిలపైన తన తలపెట్టేసింది. ఆ మరుక్షణం నుంచీ యూరోప్ ఒక దైవరహిత, ప్రేమ రహిత, కరుణరహిత యుగంలోకి అడుగుపెట్టక తప్పలేదు.

తాను అందిద్దామనుకున్న ఆర్థిక సహాయం అందించడానికి విట్ గెన్ స్టెయిన్ ఆసుపత్రికి చేరుకునేటప్పటికే ట్రాకల్ ఈ లోకాన్ని వదిలిపెట్టేసాడు. ఆ మరణవార్త తెలియగానే మరొక జర్మన్ మహాకవి రిల్క పరుగుపరుగున అతడి ప్రచురణ కర్త దగ్గరకి వెళ్ళి ట్రాకల్ కవిత్వమేదైనా వదిలిపెట్టి వెళ్ళాడా అని అడిగాడు. ఆతృతగా ఆ కవిత్వాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆవురావురమంటూ చదివేసి, అక్కడితో ఆగలేక, ఆ ప్రచురణ కర్తతో ఇలా అన్నాడు:

‘నేనా కవితల్లో చాలానే దర్శించాను. ఆశ్చర్యపోయాను, చలించిపోయాను. ఇంకా చెప్పాలంటే తల్లకిందులైపోయాను. చెప్పలేని ఒక అలౌకికానుభవానికి లోనయ్యాను. ఆ కవితల్లోని ఉదాత్త అనుదాత్త స్వరాలు అత్యంత అద్వితీయాలు, అవి ఒక మనిషి కనే కలలాగా ఆ మనిషికి మాత్రమే స్వంతంగా చెప్పదగ్గ స్ఫురణలు. ఆ అనుభవాలకి నువ్వు ఎంత దగ్గరా జరిగినా, ఎంత గ్రహిద్దామని చూసినా, ఎంతచేసీ ఒక బహిష్కృతుడు బయట అద్దం మీద తన ముక్కు ఆన్చి లోపలకి చూడటానికి ప్రయత్నించినట్టే అవుతుంది. ఎందుకంటే ట్రాకల్ జీవితం ఒక అద్దంలో కనిపించే ప్రతిబింబాల మధ్యలో గడిచిపోయిన జీవితం లాంటిది. ఆ అద్దం నిండా అతడి ప్రతిబింబాలే. నువ్వెంత ప్రయత్నించు, ఆ అద్దంలో అడుగుపెట్టలేవు.’

1913 నుంచి 1915 మధ్యకాలంలో రాసిన ఆ కవితల్ని, ముఖ్యంగా ఇన్స్ బ్రక్ పట్టణంలో ఫార్మసిస్టుగా పనిచేసిన రోజుల్లో, Der Brenner అనే పత్రికలో రాస్తూ వచ్చిన కవితల్ని కలిపి అతడి మరణానంతరం Sebastian in Dream (1915) అనే సంపుటంగా అతడి ప్రచురణకర్త వెలువరించాడు. ఆ కవితల్ని ఇప్పుడు ట్రాకల్ మలిదశ కవితలుగా పేర్కొంటున్నారు. ఆ సంపుటి జర్మన్ కవిత్వంలోనే కాదు, ఆధునిక ప్రపంచ కవిత్వంలోనే ఒక విశిష్టమైన కవితాగుచ్ఛం. దేహం నుంచీ, జీవితం నుంచీ, ప్రపంచం నుంచీ దూరంగా జరుగుతూ తన అంతరాంతర జ్యోతిస్సీమలకు చేరువగా జరిగిన ఒక పార్థివ తీర్థయాత్రా కథనం ఆ కవిత్వం.

ట్రాకల్ ని చదివితే మనకేం తెలుస్తుంది? నాకైతే ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమయింది. పిల్లలు తమ బాల్యకాలపు దివ్యప్రపంచంలోంచి కౌమారపు ఓటి వంతెన మీదుగా నిష్టురమైన యవ్వనంలోకి, దుస్సహమైన వాస్తవంలోకి ప్రవేశించే కాలం అత్యంత కఠినాతికఠినమైన కాలం. వాళ్ళ పసి హృదయాలు చెప్పలేని ఆఘాతానికి గురయ్యే కాలం అది. అందులోనూ ఆ పిల్లలు పల్లెలనుంచి పట్టణాలకీ, నగరాలకీ పై చదువులకోసమో, బతుకు తెరువు కోసమో అడుగు పెడుతున్నట్లయితే, వాళ్ళ సున్నితమైన మనసులు ఆ సమయాల్లో ఎటువంటి దారుణవేదనకి గురవుతాయో చెప్పడానికి మాటలు చాలవు. నావరకూ నాకు నా రాజమండ్రి జీవితం అటువంటి జీవితం. ఆ జీవితంలో బైరాగి కవిత్వమే నాకు తోడుగా లేకపోయి ఉంటే నేను కూడా ఒక ఉన్మాదినై ఉండేవాణ్ణి. కాని ఎంతమంది యువతీయువకులకి అటువంటి ఆసరా, అటువంటి అభయహస్తం లభిస్తుంది? మన సినిమాలూ, మన రాజకీయాలూ, మన గాసిప్, మన పొర్నోనెట్ ల వైతరణిని దాటగలిగే సామర్థ్యం ఎందరికుంటుంది? వాళ్ళు తమ పసితనంలో చూసిన ఆ నిర్మల చంద్రకాంతినీ, ఆ చుక్కలవెలుగునీ, ఆ వసంతాన్నీ, ఆ వేసవినీ, ఆ పాటల్నీ, ఆ ప్రేమల్నీ తాము యవ్వనంలో అడుగుపెట్టిన తర్వాత కూడా అంతే నిశ్చింతతో అనుభవంలోకి తెచ్చుకోగలరని వాళ్ళకి ధైర్యంగా చెప్పగలమా? వాళ్ళ చేయి పట్టుకుని వాళ్ళ కూడా నడవగలమా? వాళ్ళు జీవించవలసి వస్తున్న ఈ ప్రపంచం అమానుషం కాదని నమ్మించగలమా?

~

1

బాల్యం

ఫలభారంతో వంగివాలిన పొదలు, నీలి గుహలో ప్రశాంతంగా

నివసిస్తున్నది బాల్యం. సుదూరకాలంగా నలిగిన బాటమీద

ఒకప్పటి మట్టిదారిన ఇప్పుడు నిట్టూరుస్తున్న పచ్చిగడ్డి

కొమ్మల నిశ్శబ్ద సంభాషణ, రాళ్ళ మధ్య నీలితరగలు

కదలాడినప్పటిలాంటి ఆకుల రెపరెప

ధీరోదాత్తంగా వినిపిస్తున్న కాటుకపిట్ట విలాపం. హేమంతం

ఆవరించిన పర్వత శిఖరం మీంచి పాకుతున్న

సూర్యబింబాన్ని అనుసరిస్తూ నిశ్శబ్దంగా ఒక పసుల కాపరి.

ఒక నీలి క్షణమంటే ఆత్మ మరింత ప్రస్ఫుటం కావడం

అడవి అంచుల్లో ఒక భీతహరిణం కనిపిస్తున్నది, కింద లోయల్లో

పాత గంటలు, నల్లటి పల్లెలు ప్రశాంతంగా నిదురిస్తున్నవి.

నల్లబడ్డ కాలం ఎలా ఉంటుందో నీకు తెలుసు, ఒంటరి గదుల్లో

మరింత పవిత్రత, మరింత చల్లదనం,హేమంతం

పవిత్ర నీలిమలో తళుకులీనుతున్న అడుగుల చప్పుడు బిగ్గరగా.

తెరచి ఉన్న కిటికీ ఒకటి మెత్తగా కొట్టుకుంటున్నది, కొండమీద

శిథిలదేవాలయాన్ని చూసినప్పుడల్లా కన్నీళ్ళు పొంగుతున్నవి

మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్న పాతగాథలు,

సంతోషంగా గడిపే మనుషులు గుర్తొచ్చినపుడు,

చిక్కటి వసంతకాలపు బంగారు దినాల్ని

తలుచుకున్నప్పుడు, ఆత్మ ఉన్నట్టుండి మరింత ప్రకాశిస్తూంటుంది

2

భేరీలు

కత్తిరించబడ్డ తీగలకిందన

మట్టి రంగు పిల్లలు ఆడుకుంటున్నారు

కొట్టుకుపోతున్న ఆకులు, మోగుతున్న బాకాలు

ఉలికిపడుతున్న స్మశానాలు

వృక్షాల శోకంలో మునిగిపోతున్న పలాశ పతాకాలు

పండినపొలాల్లో పయనిస్తున్న ఆశ్వికులు,

నిర్జన ధాన్యాగారాలు.

లేదా, రాత్రుళ్ళు పసుల కాపర్లు పాటలు పాడుకుంటారు

వాళ్ళ నెగళ్ళమధ్యకి జింకలు అడుగుపెడుతుంటాయి

ఆ తోటల్లోని దుఃఖం ఇప్పటిదని చెప్పలేం

నర్తిస్తూ, నల్లని గోడమీంచి నెమ్మదిగా తలెత్తుతూ,

సిందూర కేతనాలు, నవ్వులు, ఉన్మాదాలు, భేరీలు.

3

ఆధ్యాత్మిక సంధ్య

అడవి అంచుల్లో నిశ్శబ్దంగా

తారసపడ్డ ఒక నీలహరిణం.

కొండమీద మెత్తగా కుంకుతున్న సాయంకాలపు గాలి.

ఆ కాటుకపిట్ట విలాపానికి శాంతిదొరికింది.

హేమంత సమయపు ఉదాత్త వేణుగానం

రెల్లుదుబ్బుల్లో అడగిపోయింది.

ఒక కారుమబ్బుమీద

ఒక పువ్వుతో మత్తెక్కి

నువ్వొక నక్తసరోవరానికి పయనమవుతావు.

నక్షత్రఖచిత సురలోకాలు

ఆ ఆధ్యాత్మిక నిశ సాంతం

ప్రతిధ్వనిస్తూ చెల్లెలి

చంద్రికాస్వరం.

4

విలాపం

నిద్ర, మృత్యువు- రెండు గద్దల్లాగా

రాత్రంతా నా తలచుట్టూ ఎగురుతూనే ఉన్నాయి:

అనంతకాలపు హిమానీతరంగం

మానవుడి స్వర్ణప్రతిరూపాన్ని ముంచెయ్యగలదు

దురంతప్రవాళభిత్తికలమీద

అతడి సిందూరదేహం తునాతునకలై

నల్లటి విలాపం సముద్రమంతా పరుచుకుంటున్నది.

తుపానులాంటి విషాదసోదరీ

చూడు, నక్షత్రాల కింద మునిగిపోతున్న

ఒక భీతిల్లిన నావ,

స్వరం బలహీనపడుతున్న రాత్రి ముఖచిత్రం.

5

గ్రోడెక్

మారణాయుధాలతో మోతపెడుతున్న

ఒక హేమంత సాంధ్యకాననం, బంగారు

పొలాలు, నీలి సరసులు, వాటిమీంచి

కిందకి దొర్లిపోతూ నలుపెక్కుతున్న సూర్యుడు.

మరణిస్తున్న సైనికుల్ని పోగుచేసుకుంటున్నది రాత్రి

చిట్లిన వాళ్ళ గొంతుల్తో పాశవిక హాహాకారాలు.

కాని పరుచుకున్న పచ్చికబయలు పైన నిశ్శబ్దంగా

ఒక కోపోద్రిక్త దేవతకి నివాసంలాంటి రక్తమేఘం ఒకటి

చిందిన నెత్తుర్నీ, చంద్రుడి చల్లదనాన్నీ పోగుచేస్తున్నది.

రహదారులన్నీ ఒకే నల్లటిమూసలోకి పరుచుకుంటున్నవి

తారకల యామినుల బంగారు చివురులకింద

వీరుల ప్రేతాలకి, నెత్తురు కక్కుతున్న శిరస్సులకి

స్వాగతం పలకడానికి సోదరి నీడ తొట్రుపడుతున్నది.

రెల్లుదుబ్బుల్లోంచి ఆకులు రాలేకాలపు నల్లపిల్లంగోవుల

సంగీతం మెత్తగా వినిపిస్తున్నది.

ఓ దుర్విదగ్ధ దుఃఖమా! కాంస్య అర్చావేదికలారా!

ఈ రోజు ఒక దుస్సహవేదన ఆత్మజ్వాలకి ఆహారమవుతున్నది

ఇంకా జనించని ఔరసశ్రేణి.

22-5-2020

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%