
ఇవాళ కవితాప్రసాద్ పుట్టిన రోజు. తన పేరుమీద నాకొక బహుమతి ప్రకటించాడు. నేను కూడా ఆయనకొక కానుక ఇవ్వవలసి ఉంటుంది కదా. ఏమిద్దామా అని ఆలోచించాను. నాకు జార్జి ట్రాకల్ గుర్తొచ్చాడు.
కవితా ప్రసాద్ అనగానే ప్రాచీన తెలుగు కవిత్వం, అవధానాలు, చాటువులు, ఛందోరహస్యాలతో పాటు కొందరు పాశ్చాత్య కవులు కూడా గుర్తొస్తారు. చదవవలసిన తెలుగు కవిత్వమంతా చదివేసాక ఆయనకి పాశ్చాత్య కవిత్వం చదవాలన్న దాహం కూడా పట్టుకుంది. రోజూ ఆఫీసులో నన్ను చూడటానికి వచ్చినప్పుడు నా టేబిల్ మీద ఏదో ఒక కవిత్వసంపుటి కనిపించగానే ఆప్యాయంగానూ, ఆసక్తిగానూ దాన్ని తడిమి చూసేవాడు. ఒక్కొక్కప్పుడు అప్పుడే కొత్త పుస్తకం కొరియర్లో వస్తే నేను దానికి అట్టవేసేదాకా కూడా ఆగకుండానే తాను పట్టుకుపోయేవాడు. అటువంటి ఒక మనిషి నీ దైనందిన జీవితంలో లేకపోవడం మామూలు లోటు కాదు.
కవితా ప్రసాద్ సెన్సిబులిటీ ఆధునిక, పాశ్చాత్య కవిత్వానికి దూరమైందీ, భిన్నమైందీ అనుకునేవాణ్ణి నేను. కానీ ఆశ్చర్యమేమిటంటే, తోమాస్ ట్రాన్స్ ట్రోమర్ కవిత్వాన్ని నాకన్నా ముందు ఆయన అర్థంచేసుకోగలిగాడు, అవగతం చేసుకోగలిగాడు. అట్లానే జార్జి ట్రాకల్ ని కూడా. ‘ఈ రోజు నాకేదైనా అనువాద కవిత్వముంటే ఇవ్వండి’ అనడిగాడొకరోజు. ఆ రోజు నా దగ్గర ఏ పుస్తకమూ లేదు. ‘మీకు అంతగా కొరుకుడు పడని కవిత్వముంటే ఇవ్వండి, చదవాలని ఉంది ‘ అన్నాడు. నాకు ట్రాకల్ గుర్తొచ్చాడు. అప్పటికి కొన్నేళ్ళుగా ఆ కవిత్వం అంచుల చుట్టూతానే తిరుగుతూ ఉన్నాను గాని, అందులో ప్రవేశించలేకపోతున్నాను. poemhunter.com నుంచి ట్రాకల్ కవిత్వం అప్పటికప్పుడే ప్రింటు తీసి ఇచ్చాను.
రెండు మూడు రోజుల తర్వాత ‘ఎటువంటి కవిత్వం ఇచ్చారు మీరు, నేను వేరే ప్రపంచంలో తిరుగాడుతున్నట్టుంది’ అన్నాడు. ఆ మాటలు ఆయన అనగా విని పదేళ్ళు దాటింది. ఈ పదేళ్ళుగానూ ట్రాకల్ కవిత్వం చుట్టూ పరిభ్రమిస్తోనే ఉన్నాను. కాని ఆ లోకం నాకు అందీఅందకుండానే దూరంగా జరిగిపోతూ వచ్చింది. ఇదిగో, ఇప్పుడు Surrender to Night: Collected Poems of George Trakl (పుష్కిన్ ప్రెస్, 2019) చేతికి అందినదాకా.
జార్జి ట్రాకల్ (1887-1914) ఆస్ట్రియాకి చెందిన ఒక జర్మన్ కవి. పందొమ్మిదో శతాబ్దం ముగిసి, ఇరవయ్యవ శతాబ్దం తలెత్తే యుగసంధ్యలో పుట్టి, పెరిగి, 27 ఏళ్ళకే అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినవాడు. అతడు తన జీవితకాలంలో రాసిన కవిత్వం, ఇంతదాకా ప్రచురితమైందీ, అముద్రితం అంతా కలిపి మొత్తం 160 కవితలు మాత్రమే. అందులో కూడా కొన్ని కవితలు ఒకే కవిత తాలూకు రెండు మూడు రకాల వెర్షన్లు. కానీ ఆ కొద్దిపాటి కవిత్వంతోటే అతడు ఆధునిక జర్మన్ కవిత్వానీ, సంగీతాన్నీ, ప్రపంచ సాహిత్యాన్నీ కూడా అపారంగా ప్రభావితం చేస్తో ఉన్నాడు. ప్రతి అఏడాదీ అతడి కవిత్వానికొక కొత్త అనువాదం వెలువడుతూనే ఉంది. ఆ కవిత్వం రహస్యాన్ని తాము కనుగొన్నామని చెప్తో ఎవరో ఒకరు సరికొత్త వ్యాఖ్యానాన్ని ప్రపచం ముందు పెడుతూనే ఉన్నారు. కనీసం ఇద్దరు గొప్ప తత్త్వవేత్తలు-హిడెగ్గరు, విట్ గెన్ స్టెయిన్ అతడి కవిత్వాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించి విఫలమైపోయారు. అందులో విట్ గెన్ స్టెయిన్ అయితే, తనకి ఆ కవిత్వం అర్థం కానేలేదనీ, కాని ఆ టోన్ కి మాత్రం తాను తాను జీవితకాల ఆరాధకుణ్ణని చెప్పుకున్నాడు.
తాము జీవించినంతకాలం ఏదో ఒక అంతర్వాణి, ఒక దివ్యదర్శనం తమని తల్లకిందులు చేస్తో ఉండగా, దాన్నెట్లానైనా మాటల్లో పెట్టాలని ప్రయత్నించి, తమ ప్రయత్నం తమనే సంతృప్తి పరచక మరింత వివశులై, ఆ విహ్వలత్వం వల్ల ఉన్మాదులై అర్థాంతరంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన కొందరు కవుల్ని ఈ ప్రపంచం చూసింది. బహుశా ఆ లక్షణంలో ట్రాకల్ కీ, కవితాప్రసాద్ కీ మధ్య ఒక సామ్యం ఉంది, అస్తిత్వవేదనలోనూ, అర్థాంతరంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడంలోనూ .
ట్రాకల్ కవిత్వంలోకి ఎందుకని నేను సులభంగా ప్రవేశించలేకపోయాను? ఎందుకంటే, ఆయన మామూలు కవి కాడు. యూరపియన్ పరిభాషలో అటువంటి కవిని visionary అంటారు. భారతీయ లాక్షణికులు ‘ద్రష్ట’ అంటారు. అంటే ఆ కవి ఏదో దర్శిస్తాడు. చూసింది చూసినట్టుగా మనతో పంచుకోవాలనుకుంటాడు. ఉదాహరణకి మహాప్రస్థాన గీతాలు రాసినప్పటి శ్రీ శ్రీ అటువంటి ఒక ద్రష్ట. ఆ గీతాల్లో శుభకామనలు, సామ్యవాదస్ఫూర్తీ, సమాజశ్రేయస్సుకోసం తపన ఎంత బలంగా వినిపిస్తాయో, అంతకన్నా కూడా ‘ఒక లక్ష నక్షత్రాల పాటలు, ఒక కోటి జలపాతాల మోతలు’ మరింత బలంగా వినిపిస్తాయి. ‘రగులుకునే రాక్షసి బొగ్గూ, ‘బుగులుకునే బుక్కా గుండా’, ‘ఘూకం కేకా, ‘భేకం బాకా’, ‘సమ్మెకట్టిన కూలీల, సమ్మెకట్టిన కూలీల భార్యల, బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల హాహాకారం, ఆర్తరావం’, ‘ఊరవతల నీరింకిన చెరువు పక్క చెట్టు నీడ గోనెలతో, కుండలతో ఎటు చూస్తే అటు చీకటి ‘ లాంటి దృశ్యాలూ, దృశ్యచిత్రాలూ మరింత బలంగా మనల్ని వెంటాడతాయి. ద్రష్ట కాని కవి స్రష్ట. అంటే conscious గా ఒక కవితనో, కావ్యాన్నో నిర్మించేవాడు. విశ్వనాథ అటువంటి స్రష్ట. కాని మౌలికమైన కవిత్వం, మనుషుల్ని చలింపచేసే కవిత్వం, మంచికో, చెడ్డకో ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపే కవిత్వం ద్రష్టలనుంచి వస్తుంది. ట్రాకల్ అటువంటి ఒక ద్రష్ట.
అతడు తానేది చూసాడో దాన్ని చూసింది చూసినట్టుగా చెప్పడానికి ప్రయత్నించాడు. ఆ ఆనవాళ్ళు, ఆ పదచిత్రాలు ఆధారంగా అతడేమి దర్శించాడో ఊహించుకోవడం మనవంతు. కాని అది మనకి ఒక్క పఠనం ద్వారానే సాధ్యమైపోదు. అట్లా చదువుతూనే ఉండాలి. చదువుకుంటూనే ఉండాలి. ఎన్నో సార్లు, ఎన్నో అవస్థల్లో, ఎన్నో సార్లు ముందుకీ, వెనక్కీ చదువుకుంటూ ఉండగా, ఎప్పుడో, ఒక కిటికీ రెక్క సగం తెరుచుకుంటుంది.
ట్రాకల్ కవిత్వ అనువాదకుల్లో ఒకడైన జేమ్స్ రైట్ దాన్ని ‘ఓపిక పట్టడం’ అన్నాడు. ట్రాకల్ అర్థం కావాలంటే మనం ఓపిగ్గా ప్రతీక్షించవలసి ఉంటుందన్నాడు. మా మాష్టారు దాన్నే కవిత ప్రసన్నం కావడం అన్నారు. నీకు ఒకపట్టాన ప్రవేశం దొరకని కవిత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటే ఒక దగ్గరి దారి నువ్వు ఆ కవిత్వాన్ని నీ మాతృభాషలోకి అనువదించుకోవడం. నేనూ ఆ ప్రయత్నమే చేసాను. ట్రాకల్ ఇన్నాళ్ళకు నా పట్ల ప్రసన్నుడయ్యాడు.
అతడి కవితలు కొన్ని నా తెలుగులో. ఇవి కవితాప్రసాద్ కి కానుక చేస్తున్నాను.
~
ఆర్తరావం
కోతకోసిన పంటపొలం మీద కురుస్తున్న నల్లని వాన
ఇక్కడొక ముదురు ఇటుక రంగు చెట్టు, ఒంటరిగా
నిర్జనకుటీరాల్నిచుట్టుకుని బుసకొడుతున్న గాలి
ఈ సాయంకాలం ఎంత దుఃఖభరితం!
ఆ పల్లెపట్టు పొలిమేరల్లో
దిక్కులేని ఒక పిల్ల పరిగ ఏరుకుంటున్నది
గుండ్రం, పసిడిసమానం, ఆ కళ్ళు సాయంసంధ్యని మేస్తున్నవి
ఆమె గర్భం ఒక స్వర్గలోక వరుడికోసం వేచి ఉన్నది.
ఇళ్ళకు మరలి వస్తున్న పసులకాపరులకి
ఆ ముళ్ళపొదలో కనిపించినవి
నశిస్తున్న కొన్ని తీపిగుర్తులు.
నల్లబడ్డ గ్రామాలకు దూరంగా నేనొక నీడగా
చెట్ల మధ్య పారుతున్న ఊటలోంచి
భగవంతుడి నిశ్శబ్దం కడుపారా తాగాను.
నా నుదుటిమీద చల్లటి ఇనపటడుగులు
సాలీళ్ళు నా హృదయంకోసం వెతుక్కుంటున్నవి.
నా నోట్లో మరణిస్తున్నదొక కాంతి.
రాత్రి నేనొక గుట్టమీద పడి ఉన్నాను
అక్కడంతా పోగుపడ్డ చెత్త, నక్షత్రధూళి.
అడవిదుబ్బుల్లో స్ఫటికసమానులైన దేవదూతలు
ఆ రాత్రంతా మళ్ళా తాళం వాయించారు.
వసంతఋతువులో
నల్లటి మెట్ల పక్కనుంచి మంచు నెమ్మదిగా జారుకుంది
చెట్ల నీడల కింద
ప్రేమికులు గులాబీరంగు మూతలు తెరుస్తున్నారు.
నావికుడి చిక్కటి చీకటి అరుపుల్నే వెన్నంటి
తారలూ, రాత్రీ.
ఇక నెమ్మదిగా కాలాన్ని లెక్కిస్తూ తెడ్లు.
శిథిలమవుతున్న గోడపక్క తొందరలోనే
కాశీరత్నం పూస్తుంది.
ఆ ఒంటరిమనిషి దేవళంలో ప్రశాంతంగా
పచ్చిక పరుచుకుంటుంది.
నేనొక పాత ఆల్బమ్ ని
ఒంటరి ప్రాణి దౌర్బల్యానివి, అవ్యక్త విషాదమా,
మళ్ళా మళ్ళా నీ పునరాగమనం.
దినాంతానికి ఒక బంగారు కాంతి.
వినయంతోనూ, సహనంతోనూ
ప్రతిధ్వనిస్తున్న రాగాల్తోనూ, మెత్తని ఉన్మాదంతోనూ
అతడు బాధముందు మోకరిల్లుతాడు
చూడు! అప్పుడే పొద్దుకుంకిపోయింది.
మళ్ళా చీకటి పడుతుంది
ఒక మానవుడు విలపిస్తాడు
ఆ దుఃఖంతో మరొకడు వేదనచెందుతాడు.
శారదరాత్రుల అమలిన తారకలకింద
ఏటా ఆ శిరసు మరింత అవనతమవుతూంటుంది.
హోహెన్ బర్గ్
ఇంట్లో ఎవరూ లేరు. గదుల్లో హేమంతం.
చంద్రకాంతి రాగం.
అడవి అంచున సాయంసంధ్యవేళ
ఒక మెలకువ.
కాలఘోషకి దూరంగా
నువ్వొక మానవవదనపు ధావళ్యాన్ని
ధ్యానిస్తుంటావు.
ఒక స్వాప్నిక సాక్షాత్కారం ముందు
ఆకుపచ్చని కొమ్మలు అంగీకారంగా తలవంచుతాయి.
శిలువ, సంధ్యవేళ,
రక్తమోడుతున్న బాహువుల్తో ప్రతిధ్వనిస్తున్న మానవుడి చుట్టూ
అతడి నక్షత్రకాంతి
నిర్జన గవాక్షాలదాకా పయనిస్తూ.
ఆ ఆగంతకుడట్లా చీకటిలో వణికిపోతున్నాడు
నెమ్మదిగా అతడొక మానవాకృతిమీద
మూత తొలగించగానే
దూరంగా, మందిరాభ్యంతరంలో
గీపెడుతున్న వెండిగాలి.
చెల్లెలికి
నువ్వు వెళ్ళేచోటు హేమంతంగా, సాయంకాలంగా మారిపోతుంది.
నీలి హరిణం, చెట్ల కింద దాని అరుపులు
సంధ్యవేళ ఒంటరి సరస్సు.
ఎగురుతున్న పక్షుల గుంపుల నిశ్శబ్దపు చప్పుడు
నీ కనుబొమలమీద ప్రాచీన విషాదం,
సన్నని నీ చిరునవ్వు చేసే సవ్వడి.
భగవంతుడు మలిచిన నీ కనురెప్పలు
రాత్రిపూట వాటికోసం నక్షత్రాలు వెతుక్కుంటాయి.
నీ కనుబొమ్మల వంపు
శుభశుక్రవార శిశువు.
వేసవి
సాయంకాలానికి కోకిల రోదన
అడవిలో మూగపోతుంది.
సస్యం మరింత కిందకి వాలుతుంది
ఆ ఎర్రటి పువ్వుతో సహా.
కొండలమీంచి నల్లటి ఉరుములు
బెదిరిస్తుంటాయి.
యుగాలుగా చిమ్మెట పాడే పాట
మైదానంలో తేలిపోతూంది.
చెట్ల ఆకులింక
కదలాడవు.
మేడమెట్లమలుపులో
నీ దుస్తుల రెపరెప.
చీకటిగదిలో
నిశ్చలంగా కొవ్వొత్తి మినుకు
దాన్ని ఆర్పేస్తుందొక
వెండి చెయ్యి.
గడ్డకట్టిన గాలి, చుక్కల్లేని రాత్రి.
హెల్ బ్రన్ లో
సాయంకాలపు నీలిరోదన మరింత చిక్కనవుతూ
కొండపక్కనే వసంతకాలసరోవరం.
చాన్నాళ్ళకిందటనే మరణించిన
మఠాధిపతుల, కులీన స్త్రీల నీడలు వాటిమీద
తేలియాడుతున్నట్టు
ఆ పూలిప్పటికే వికసించాయి, నీలిపూలు.
సాయంకాల మైదానం మీద
ఊళపెడుతూ నీలి ఊటనుంచి స్ఫటికంలాంటి తరగ.
మరణించినవాళ్ళ మరిచిపోయిన బాటలవెంబడి మర్రిచెట్లు.
సరసుమీద ఒక స్వర్ణమేఘం.
రాత్రికి తలొగ్గుతూ
ఒక యువసన్యాసినీ, నన్ను నీ చీకట్లతో చుట్టెయ్యి
నీ నీల శీతల పర్వతపంక్తి.
అక్కడ నక్తహిమానీ రక్తస్రావం
తారల వెలుగులో నిటారుగా తలెత్తిన శిలువ.
శిథిల మందిరంలో నోరుపగిలి
చల్లగా పరుచుకున్న సిందూరం
ఇంకా మెరుస్తున్న నవ్వులు, స్వర్ణక్రీడ
ఒక ఘంట పడుతున్న చివరినొప్పులు.
చంద్రమేఘమా! రాత్రి చెట్టుమీంచి
రాలుతున్న నల్లటి అడవిపండ్లు.
ఆ మందిరమొక సమాధిగా మారుతున్నది
ఈ పార్థివతీర్థయాత్ర మొత్తం ఒక కల.
తూర్పు వైపు
శీతాకాలపు తుపాను బాకాలూదుతున్నట్టు
మనుషుల క్రోధం కారునలుపు.
యుద్ధ సిందూర తరంగం
ఊడ్చేసిన నక్షత్రపత్రాలు.
ముడిపడ్డ కనుబొమల్తో, వెండి చేతుల్తో
రాత్రి రారమ్మని పిలుస్తున్నది మరణిస్తున్న సైనికుల్ని.
నిహతులైన ఆత్మలు నిట్టూరిస్తున్నవి
హేమంత వటవృక్ష ఛాయన.
ముళ్ళకంపల అడవి నగరం గొంతు నులుముతున్నది
రక్తమోడుతున్న మెట్లమీంచి అడుగుపెట్టిన చంద్రుడు
భీతావహులైన స్త్రీలని తరుముతున్నాడు
నగరద్వారాన్ని బద్దలు కొడుతూ అడవితోడేళ్ళు.
వెనిస్ లో
అద్దెగదిలో అలముకున్న నిశ్శబ్దం
వెండి వెలుగులీనుతున్న కొవ్వొత్తి తళుకు
ఆ ఒంటరి మనిషి
లయాత్మకంగా తీస్తున్న ఊపిరి ఎదట
మంత్రముగ్ధగా ఒక రోజామేఘం.
రాతిదారిన ముసురుకున్నవి
ఈగల నల్లని గుంపులు.
ఒక స్వర్ణదివస క్లాంతితో
ఒక నిరాశ్రయ మానవవదనం
అవనతమవుతున్నది.
నిస్తరంగ సముద్రం చిక్కనవుతున్నది.
నక్షత్రాలూ, నక్తసాగరయాత్రలూ
కాలవదారుల్లో కనుమరుగవుతున్నవి.
బిడ్డా, నీ రుజాగ్రస్తమందహాసం
నా నిద్రలో కూడా నన్ను
మృదువుగా అనుసరిస్తున్నది.
21-5-2020