సంగీత రూపకం

కాజ విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే దారిలో హైవే మీద ఉన్న గ్రామం. చాలాసార్లు ఆ దారిమీద, అక్కడున్న టోల్ గేటు మీంచి, వెళ్ళి వచ్చినా కూడా ఆ పక్కనే ఉన్న నారాయణతీర్థుల మందిరాన్ని ఇన్నాళ్ళకు గాని చూడలేకపోయాను.

మొన్న ఫాల్గుణ పూర్ణిమ సాయంసంధ్యావేళ ఆ మందిరం చూడటంకోసమే అక్కడ అడుగుపెట్టాను. అక్కడ ఒక శ్రీకృష్ణమందిరం, పక్కనే ఒక ధ్యాన మందిరం ఉన్నాయి. నారాయణతీర్థులు (1675-1745) జన్మించిన చోటులోనే ఆయన్ని స్మరించుకుంటూ అక్కడ ధ్యానమందిరం నిర్మించారు. ఆ మందిరంలో నారాయణతీర్థుల చిన్న విగ్రహం ఒకటి ఉంది. వారానికి మూడు సార్లు అక్కడ యోగాభ్యాసపాఠాలు నడుస్తూ ఉంటాయని అర్చకుడు చెప్పాడు. శ్రీకృష్ణమందిరంలో త్రిభంగిలో ఉన్న శ్రీకృష్ణ ప్రతిమతో పాటు నారాయణతీర్థుల విగ్రహం కూడా ఉంది. ఆ మందిరం విశాలంగానూ, ప్రశాంతంగానూ ఉంది. ప్రతి ఆదివారం అక్కడ సంగీతసాధన నడుస్తూంటుందని కూడా అర్చకుడు చెప్పాడు. అందుకు సాక్ష్యంగా అక్కడొక బోర్డు మీద సరళీ స్వరాలు, జంట స్వరాలు పాఠం రాసి ఉంది.

అర్చకుడు నా కోసం కృష్ణాష్టకంతో అర్చన చేసాడు. నారాయణతీర్థుల ముందు దీపాలు వెలిగించాడు. నేను కొంతసేపు ఆ మందిరంలో కూచుని, బయటకు వచ్చాను. అక్కడ నిండుగా పూసిన పెద్ద వేపచెట్టు నీడన గోపాలకుడు, చుట్టూ నాలుగు గోవులూ ఉన్నాయి. ఆ విగ్రహాల మీద నునులేత వేపపువ్వు రాలుతూ ఉంది. ఆ కొద్ది చోటూ ఒక గోలోకంగా మారిపోయినట్టుగా ఉంది. నేనట్లానే చాలాసేపు ఆ గోసన్నిధిలో కూర్చుండిపోయాను. ఎదటగా నిమిషం విరామం లేకుండా నేషనల్ హైవేమీద వాహనాలు వస్తూ పోతూనే ఉన్నాయి. కాని ఆ సమ్మర్దానికి ఒక అడుగు దూరంలో ప్రశాంత సరోవరంలాగా, పారిజాత నికుంజంలాగా, ఒక వాగ్గేయకారుడి ధ్యానమందిరం.

కృష్ణభక్తి సాహిత్యంలో దేశభాషల్లో వచ్చిన సంకీర్తనలు ఎంత అపురూపమో, సంస్కృతంలో వచ్చిన సాహిత్యం అంతకన్నా అపురూపం. అసలు ఆ మాధుర్యానికి పుట్టిల్లు భాగవతమే. భాగవతాన్ని కూడా వ్యాసుడే రాసాడని చెప్తున్నప్పటికీ రసజ్ఞులు చెప్పేదేమంటే భాగవత సంస్కృతం లోని సునాదమాధురి భారతంలోనూ, తక్కిన పురాణాల్లోనూ కనవచ్చేది కాదని. అటువంటి రసరమ్యగీతం ఒకటి పన్నెండు స్కంధాల మేరకు సంస్కృతంలో వెలువడినా కూడా భావుకుల దాహానికి అంతంలేదు. ఆ తర్వాత కూడా గీతగోవిందం, శ్రీకృష్ణకర్ణామృతం, ముకుందమాల, నారాయణీయం లాంటి కావ్యాలు వెలువడుతూనే ఉన్నాయి. అంతేకాదు, అద్వితీయమైన సంస్కృత భాగవతం ఉండగా కూడా ఆ కావ్యాలు రసజ్ఞుల దృష్టిని ఆకర్షించగలిగాయి, వారిని మురిపించగలిగాయి, భాగవతసమానాలుగా మనగలిగాయి.

నారాయణ తీర్థులు రాసిన సంగీత రూపకం ‘శ్రీకృష్ణ లీలాతరంగిణి’ కూడా గీతగోవిందం, కర్ణామృతాల స్థాయి రచన. వాటి స్ఫూర్తి ఆ రచన వెనక ఉన్నప్పటికీ, వాటిని మరిపించగల సంస్కృతాన్ని నారాయణ తీర్థులు సాధించుకోగలిగారు.

జయదేవ గీతగోవిందం కర్ణపేయ కావ్యం. అక్కడ భాష సంగీతంగా మారిపోయింది. గీతగోవిందంలోని ఏ గీతాన్ని మనం మళ్ళా ప్రతి పదార్థతాత్పర్యాలతో అర్థం చేసుకోవాలనిపించదు. అక్కడ ఆ గీతం వింటూనే ఆ గీతార్థం నేరుగా మనకి సంగీతానుభవంగా మారిపోతుంది. చూడండి:

~
నామసమేతం కృతసంకేతం వాదయతే మృదువేణుం
బహుమనుతేన నుతేతనుసంగత పవన చలిత మపిరేణుం
ధీరసమీరే యమునాతీరే వసతి వనే వనమాలీ
గోపీ పీన పయోధర మర్దన చంచల కరయుగశాలీ.
పతతి పతత్త్రే విచలతి పత్త్రే శంకిత భవదుపయానం
రచయతి శయనం, సచకిత నయనం, పశ్యతి తవ పంథానం.

~

ఆ అపురూపమైన సంస్కృతం ఎటువంటిదంటే, కేవలం ఆ గీతాలవల్లనే మధ్యయుగాల్లో మరొకసారి వైష్ణవం నవ్య వైష్ణవంగా ప్రాణం పోసుకుంది.

శ్రీకృష్ణకర్ణామృతంలో సంస్కృతం నాదాత్మకం మాత్రమే కాదు, అందులో అద్భుతమైన ఊహాశాలీనత ఉంది, భావుకత ఉంది. ఒక విధంగా కర్ణామృతాన్ని మనం శ్రీకృష్ణ లీలల చిత్రలేఖనంగా గా అభివర్ణించవచ్చు. కవి తాను చూసినదాన్ని ఒక అందమైన పటచిత్రంగా మన కళ్ళముందు నిలబెడతాడు. ఆ శ్లోకాలు ఏవి చూసినా కూడా చక్కటి నీటిరంగుల చిత్రలేఖనాల్ని చూసినట్టే ఉంటుంది. ఈ శ్లోకం, మా మాస్టారికి ఎంతో ఇష్టమైన ఈ శ్లోకం, చూడండి:

~

గోధూళి ధూసరిత కోమల గోపవేషం
గోపాల బాలకశతైః అనుగమ్యమానం
సాయన్తనే ప్రతి గృహం పశుబంధనార్థం
గచ్ఛన్తమచ్యుత శిశుం ప్రణతోస్మినిత్యం

(ఆలమందల వెనక వస్తున్నప్పుడు ఆ గోధూళి రేగి ముఖంమీదా, వంటిమీదా చిమ్మి ఉండగా, వందలాదిగా గొల్లపిల్లవాళ్ళు వెంటవస్తుండగా, ప్రతి ఇంటికీ వెళ్ళి ఆ ఇంటికొట్టాల్లో ఆవుల్ని కట్టి వస్తున్న కోమలగోపవేషధారి అయిన ఆ అచ్యుతశిశువుకి ప్రతి రోజూ నమస్కరిస్తుంటాను.)

~

కొన్నిసారు ఆ చిత్రలేఖనాల్లో గొప్ప నాటకీయత కూడా ఉంటుంది. చక్కటి చిత్రదర్శకుడు తాను చిత్రించబోయే సన్నివేశాన్ని ముందు స్టోరీ బోర్డుమీద గీసి చూసుకున్నట్టుగా లీలాశుకుడు నాటకీయ సంభాషణల్ని చిత్రిస్తాడు. చూడండి:

~

మాతః, కిం యదునాథ, దేహి చషకం, కింతేన, పాతుం పయ
స్తన్నాస్త్యద్య, కదాస్తివా, నిశి, నిశాకావాన్ధకారోదయః
ఆమీల్యాక్షియుగం నిశాప్యుపగతా దేహీతి మాతుర్ముహు
ర్వక్షోజాంశుకకర్షనోద్యత కరః, కృష్ణ స్స పుష్ణాతు నః

(అమ్మా! ఏమి తండ్రీ! పాలగిన్నె ఇవ్వవా! ఎందుకు? పాలు తాగడానికి! ఇప్పుడు లేవు నాన్నా! మరెప్పుడుంటాయి? రాత్రయ్యాక! రాత్రంటే ఏమిటి? చీకటి పడితే రాత్రవుతుంది అని యశోద అనగానే, తన రెండు కళ్ళూ మూసుకుని, ఇదిగో, చీకటి పడింది, పాలగిన్నె అందివ్వంటూ మాటిమాటికీ తల్లి కొంగుపట్టుకులాగుతుండే ఆ చిన్నారి కృష్ణుడు మనల్ని కాపాడుగాక!)

~

గీతగోవిందం, కృష్ణకర్ణామృతాలు వెలువడిన తర్వాత కూడా మరొక భావుకుడు శ్రీకృష్ణ సంస్తుతి సంస్కృతంలో చెయ్యడానికి సాహసిస్తాడని అనుకోం. అటువంటిది, నారాయణ తీర్థులు కృష్ణలీలని రూపకంగా మార్చడమే కాక, తత్పూర్వ కృష్ణగుణగాన కావ్యాలన్నిటినీ మరిపించగలిగాడు. ఎందుకంటే, గీతగోవిందం సంగీతం, కర్ణామృతం రూపకం మాత్రమే కాగా, శ్రీకృష్ణలీలా తరంగిణి సంగీత రూపకం కూడా. అంతేనా! జయదేవుడు సంస్కృతాన్ని సంగీతంగా మారిస్తే, నారాయణ తీర్థులు సంస్కృతాన్ని నృత్యంగా మార్చేసాడు. ఆయన వాక్కులో భాష ఆనందతాండవం చేసింది. తరంగిణి లోని ఏ ఒక్క తరంగాన్ని చూసినా మనకిది స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి:

~

కృష్ణం కలయసఖి సుందరం బాల
కృష్ణం గతవిషయ తృష్ణం జగత్ప్రభ
విష్ణుం, సురారిగణ జిష్ణుం సదా- బాల
కృష్ణం కలయసఖి సుందరం

నృత్యంత మిహ ముహురత్యంత మపరిమిత
భృత్యానుకూల మఖిల సత్యం సదా-బాల
కృష్ణం కలయసఖి సుందరం

ధరం భవజలధి పారం సకలవేద
సారం సమస్తయోగి తారం సదా-బాల
కృష్ణం కలయసఖి సుందరం

శృంగార రసభర సంగీత సాహిత్య
గంగాలహరీ ఖేల సంగం సదా-బాల
కృష్ణం కలయసఖి సుందరం

రామేణ జగదభిరామేణ బలభద్ర
రామేణ సహావాప్త కామేన సదా-బాల
కృష్ణం కలయసఖి సుందరం

రాధారుణాధర సుధాపం సచ్చిదా
నంద రూపం, జగత్త్రయ భూపం సదా-బాల
కృష్ణం కలయసఖి సుందరం

దామోదర మఖిల కామాకరం ఘన
శ్యామాకృతి మసురభీమం సదా-బాల
కృష్ణం కలయసఖి సుందరం

అర్థం శిథిలీకృతానర్థం శ్రీనారాయణ
తీర్థపరమపురుషార్థం సదా-బాల
కృష్ణం కలయసఖి సుందరం.

~

ఈ గీతం వింటున్నంతసేపూ అనర్థాలు శిథీలీకృతమవుతున్నట్టే ఉండటానికి కారణం ఆ గతి, ఆ లయ, ఆ సంగీత సంగతి.

కృష్ణలీలా తరంగిణిలో సుప్రసిద్ధాలైన ఏ గీతాన్ని తీసుకున్నా ఆ నాట్యం మన కళ్ళముందు స్పష్టంగా గోచరిస్తుంది.

‘కలయ యశోదే తవ బాలం, ఖలబాలక ఖేలనలోలం..’

‘ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం..’

‘జయజయ గోకుల బాల జయసకలాగమ మూల..’

‘బాల గోపాల కృష్ణ పాహి పాహి, నీలమేఘ శరీర నిత్యానందం దేహి..’

‘పరమపురుష మనుయామవయం సఖి పరమపురుష మనుయామ..’

‘కథయ కథయ మాధవం, హే రాధే కథయ కథయ మాధవం..

‘విజయగోపాల తే మంగళం, జయ విశ్వంభర తే మంగళం..’

‘రే రే మానస గోపాలం భజదూరే పరిహర భూపాలం..’

గీతగోవిందంలో సంగీతం అంతర్వాహిని, కాని, తరంగిణి ప్రధానంగా నాట్యప్రధానం. నాట్యశాస్త్రం ఎంత తెలిస్తే నారాయణతీర్థుల్ని అంతగా ప్రశంసించగలుగుతాం. అందుకనే పోయిన ఏడాది కృష్ణాష్టమికి కృష్ణలీలా తరంగిణి మీద మాట్లాడమని ఉయ్యూరునుంచి నన్నొక మిత్రమండలి ఆహ్వానించినా కూడా మాట్లాడే సాహసం చెయ్యలేకపోయాను.

అలాగని, శ్రీకృష్ణలీలాతరంగిణికి కూచిపూడి భాగవతులు ఒక్కరే వారసులని అనుకోలేను. ఆ కావ్యం సంగీతమూ, సాహిత్యమూ కూడా. గీతగోవిందం వంగదేశంలో ప్రభవించినప్పటికీ రాజస్థాన్ నుంచి కేరళదాకా లభించిన పరివ్యాప్తి తరంగిణి కూడా రావలసి ఉంది. ఈ తరంగాలకి తెలుగువాళ్ళు కాక బయటి గాయకులెవరున్నారా అని వెతికితే యేసుదాసు ఒకడు కనిపిస్తున్నాడు. కాని ఆసేతు శీతాచలం పాడుకోవలసిన పాటలు కావా ఇవి!

అక్కడ ఆ వేపపూత నీడన యేసుదాసు పాడిన తరంగమొకటి తెరిచి చూసాను.

‘ఏహి ముదం మమ దేహి జగన్మోహన కృష్ణ మాం పాహి
ఏహి సమాహిత దీనజనావన మోహరహిత ముని ముక్తి వితరణ…’

అంటో ఆర్తిగా వెన్నలాగా యేసుదాసు స్వరం వినవచ్చింది. భక్తితో, శ్రద్ధతో, మరీ గళం పెంచితే, ఆ సంస్కృతం ఎక్కడ కసుగందిపోతుందోనన్నంత జాగ్రత్తగా ఆయనిట్లా పాడుతున్నాడు:

‘కంకణకేయూరకనకకింకిణీ కృత బహుఘోష
కుంకుమపంకిలవేష కుటిల కుంతల గోకుల భూష
కింకరహిత కర కీర్తి సుధాకర మంగళ నారాయణ తీర్థతోష..’

అక్కణ్ణుంచి లేచి ఇంటిదారి పట్టానే గాని, అప్పుడే ఎవరో నాట్యం చేసి ఖాళీ చేసిన నాట్యవేదికలాగా నా హృదయమింకా సంచలితంగానే ఉంది. ఎక్కడన్నా నది ఒడ్డుకి పోయి, చంద్రోదయాన్ని చూస్తూ మరికొంతసేపు గడిపితే గాని, మనసు స్తిమిత పడదనిపించింది. ఏళ్ళ కిందట, ఎవరో ఒక నర్తకీమణి అభినయిస్తూండగా, విన్న బాలగోపాల తరంగమొకటి గుండెలోపల అగరుపొగలాగా సుళ్ళు తిరుగుతూ ఉంది:

~

పూరయ మమ కామం, గోపాల, పూరయ మమ కామం
వారం వారం వందన మస్తుతే వారిజదళనయన, గోపాల..

బృందావన చర బర్హావతంస బద్ధకుంజవన బహులవిలాస
సాంద్రానంద సముద్గీర్ణహాస, సంగతకేయూర సముదిత దాస..

~

‘పూరయ మమ కామం..'( నా కోర్కెని మన్నించు ప్రభూ) అని పాడుకునే హృదయాలున్నంతకాలం శ్రీకృష్ణలీలాతరంగిణి చలిస్తూనే ఉంటుంది.

11-3-2020

One Reply to “”

  1. మీరు ఏదైనా ఒక విషయం చెప్పాక మేము ఇక మాట్లాడడానికి ఇంకేమీ మిగలదు సార్

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading