కృపావర్షధార

నిన్న ఎవరో నా చేతుల్లో పెట్టారు పరిశుద్ధ గ్రంథాన్ని. మరోసారి తెరిచి చూసాను సువార్తల్ని. ‘హృదయం కఠినమై గడ్డకట్టి ఎండిపోయినప్పుడు నువ్వు వొచ్చి కరుణావర్షంతో నన్ను తడిపెయ్యి’ అంటాడు టాగోర్. సువార్తల్లో ఎక్కడ ఏ అధ్యాయం తెరిచినా కృపావర్షమే, జల్లుగా కాదు, జడివానగా. ఆ కృపావర్షధారలు మిమ్మల్ని కూడా తడపాలని, ఇదిగో, నాలుగు వాక్యాలు:

~

మత్తయి, 4:3-4

ప్రలోభపెట్టేవాడొకడు ఆయన దగ్గరకొచ్చి ‘నువ్వు నిజంగా దేవుడి కుమారుడివే అయితే, ఇదిగో, ఈ రాళ్ళు రొట్టెలుగా మారాలని ఆదేశించి చూపించు ‘ అనడిగాడు.

‘మనిషి బతికేది వట్టి రొట్టె వల్ల మాత్రమే కాదు, ఈశ్వరుణ్ణుంచి వినవచ్చే ప్రతి ఒక్క మాట వల్ల కూడా అని పెద్దలు చెప్పలేదా’

5:43-47

మీరీ మాట కూడా విని ఉంటారు: మీ పొరుగువాళ్ళని ప్రేమించండి, మీ శత్రువుల్ని ద్వేషించండి అని.

కానీ మీ శత్రువుల్ని కూడా ప్రేమించండి అంటాన్నేను, మిమ్మల్ని దూషిస్తున్నవాళ్ళ పట్ల కూడా దయచూపండి. మిమ్మల్ని ద్వేషించేవాళ్ళకి కూడా మంచిచెయ్యండి. మిమ్మల్ని అవమానించేవాళ్ళకోసమూ, వేధించేవాళ్ళ కోసం కూడా మీ ప్రార్థనల్లో చోటివ్వండి.

మిమ్మల్ని ప్రేమించేవాళ్ళనే మీరు ప్రేమిస్తుంటే మీరిచ్చే బహుమానం ఏమిటట? పన్ను వసూలు చేసే సుంకరులు కూడా ఆ పని చేస్తుండరా?

మీరు మీ అన్నదమ్ములతో మటుకే సఖ్యంగా ఉంటే, తక్కినవాళ్ళకీ మీకూ తేడా ఏమిటట? పన్ను వసూలు చేసే సుంకరులు చేసేది కూడా అదే కదా.

6: 28-31

మీ దుస్తులగురించి మీకెందుకింత చింత? పొలంలో గడ్డిపూలు చూడండి. అవెట్లా విప్పారుతున్నాయో చూడండి. అవి వడకవు, వళ్ళు అలిసేలాగా పనిచేయవు.

కాని తన సమస్తవైభవంతో కూడిన సొలోమోను చక్రవర్తి కూడా వాటిలో ఒక్క గడ్డిపువ్వుకి కూడా సాటిరాడని చెప్పగలను.

ఈ రోజు పొలంలో వికసించి రేపు పొయ్యిలోకి ఎండుకట్టెగా పోయే గడ్డిపూలనే దేవుడిట్లా అలంకరించాడంటే, అల్పవిశ్వాసులారా, మిమ్మల్ని మరింత శోభాయమానంగా అలంకరించడా?

కాబట్టి, ఇప్పుడు మనమేం తినాలి? ఎప్పుడు మనమేం తాగాలి? మనమే గుడ్డలు తొడుక్కోవాలి? వదిలిపెట్టెయ్యండి, ఆ చింతలన్నీ.

9:14-15

యోహాను శిష్యులూ, పరిసయ్యుల శిష్యులూ ఆయనదగ్గరికొచ్చి అడిగారు కదా ‘అదేమిటి? మేము చాలా సార్లు ఉపవాసాలు చేస్తుంటాం, కాని మీ శిష్యులేమిటి ఎప్పుడూ ఉపవాసాల మాటే ఎత్తరు?’

‘పెళ్ళికొడుకు తమతో ఉండగా పెళ్ళికొడుకు స్నేహితులు ఉపవాసాలు చేస్తుంటారా?’

10:7-14

వెళ్ళండి, స్వర్గం మీ చెంతకు దిగి వచ్చిందని చెప్పండి, బోధించండి.

అస్వస్థుల్ని స్వస్థ పరచండి. రోగగ్రస్తుల్ని శుద్ధపరచండి. మరణించినవాళ్ళకి ఊపిరి పొయ్యండి. దెయ్యాల్ని వెళ్ళగొట్టండి. మీకు లభించిందేదో ఉచితంగా మీకు లభించింది. దాన్ని అంతే ఉచితంగా నలుగురికీ వెదజల్లండి.

బంగారంగాని, వెండిగాని, రాగిడబ్బులుగాని మీ కొంగున మూట కట్టుకోకండి.

మీ ప్రయాణానికి మూటలు సిద్ధం చేసుకోకండి, కనీసం రెండు జతల దుస్తులు, చెప్పులు, చేతికర్ర కూడా వెంటతీసుకుపోకండి. మీరు చేసే పనికి ఆ రోజుకి కడుపునిండా ఇంత అన్నం దొరికితే అదే మీకు మజూరీ.

మీరే పట్టణంలో, నగరంలో అడుగుపెట్టినా, అక్కడ ప్రశస్తమైన మనుషులెవరున్నారో తెలుసుకోండి, ఆ ఊరు వదిలిపెట్టేదాకా వాళ్ళ పంచనే నివసించండి.

మీరు ఏ ఇంట్లో అడుగుపెడుతున్నా ఆ ఇంటివాళ్ళని ప్రేమపూర్వకంగా పలకరించండి.

వాళ్ళు ప్రశస్తమైన మనుషులా, మీ నిర్మలచిత్తం వాళ్ళకి కూడా అందుతుంది. కాదా, మీ మనశ్శాంతి మీతోనే ఉండిపోతుంది.

ఎక్కడ మనుషులు మిమ్మల్ని స్వాగతించరో, ఎవరు మీ మాటలు వినడానికి ఇష్టపడరో ఆ ఇల్లు, ఆ ఊరు, ఆ నగరం వదిలిపెట్టేటప్పుడు మీ పాదాలకి అంటిన దుమ్ము అక్కడే దులిపేసుకోండి.

10:27

నేను మీకు చీకట్లో చెప్పినదాన్ని మీరు నలుగురికీ పట్టపగలే వివరించండి. చెవిలో విన్నదాన్ని ఇళ్ళకప్పుల మీద నిలబడి మరీ బిగ్గరగా ప్రకటించండి.

12: 38-39

అప్పుడు కొంతమంది శాస్త్రకారులు, పురోహితులు ఆయనదగ్గరకొచ్చి ‘బోధకుడా, నువ్వు చెప్పేది నిజమే అయితే మాకు నిదర్శనాలు చూపించు’ అనడిగారు.

‘నిదర్శనాలా? దుర్మార్గమైన జాతి, వ్యభిచారి సమాజం మాత్రమే ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతుంది, నిదర్శనాలు కోరుకుంటుంది.’

13: 31-32

ఆయన వాళ్ళకి మరొక ఉదాహరణ చెప్పాడు. ఈశ్వరుడి సామ్రాజ్యం ఆవగింజలాంటిది. ఒకాయన దాన్ని తీసుకుపోయి తన పొలంలో నాటాడు.

అది గింజలన్నింటిలోకీ లవలేశంలాంటిది. కాని పెరిగిపెద్దయ్యాక అది పొదలన్నిటికన్నా ఎత్తుగా చెట్టంత వికసిస్తుంది. అప్పుడు గాల్లో పిట్టలు ఎగురుకుంటూ వచ్చి దాని కొమ్మల్లో గూడుకట్టుకుంటాయి.

13: 44-45

ఈశ్వరుడి ప్రేమ పొలంలో దాచిపెట్టిన నిధినిక్షేపం లాంటిది. అది ఎవరి కంటపడిందో, దాన్నతడు మరింత భద్రంగా దాచుకుంటాడు. తనకున్న గొడ్డూగోదా సమస్తం అమ్మేసుకుని మరీ ఆ మడిచెక్క తన సొంతం చేసుకుంటాడు.

ఈశ్వరుడి రాజ్యం ముత్యాల కోసం వెతుక్కుంటున్న వ్యాపారిలాంటిది.

ఆ వర్తకుడికి విలువైన ముత్యాలు కనిపించడమే ఆలస్యం, తక్షణమే, తనకున్నదంతా అమ్మేసుకుని మరీ దాన్ని కొనితెచ్చుకుంటాడు.

15: 11,19-20

మనిషి లోపలకి పోయేదేదీ అతణ్ణి మలినపర్చదు. గుర్తుపెట్టుకోండి, అతడి నోటిలోంచి ఏది బయటికొస్తుందో, అదే అతణ్ణి మలినపరుస్తుంది..

నోటిలోంచి బయటికొచ్చేవి అతడి హృదయంలోంచి బయటికొస్తాయి కాబట్టి వాటివల్ల అతడు మలినపడతాడు. ఏమిటవి? బయటకొచ్చేవి? దురాలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, అక్రమసంబంధాలు, దొంగతనాలు, తప్పుడు సాక్ష్యాలు, చివరికి దేవుణ్ణి నిందించడాలు.

ఇదిగో వీటివల్ల మనిషి అపరిశుద్ధుడవుతున్నాడు, అంతే తప్ప, చేతులు కడుక్కోకుండా అన్నం తిన్నందుకు కాదు.

17: 19-20

ఆయన శిష్యులు ఆయనదగ్గరికొచ్చి అడిగారు: మరి మేమెందుకని ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నాం?

‘ఎందుకంటే, మీకు నమ్మకం లేదు కాబట్టి. నేను నిశ్చయంగా చెప్తున్నాను. వినండి, మీ హృదయంలో ఆవగింజంత నమ్మకం ఉన్నా కూడా అదిగో ఆ కొండ దగ్గరికి పోయి ‘పక్కకి జరుగు’ అనండి, అది పక్కకి జరిగి తీరుతుంది.’

25-12-2019

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading