
మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా గడచిన రెండువందల ఏళ్ళుగా మనం ఆధునీకరణ చెందుతూ ఉన్నాం. ఆధునీకరణ అనే మాటలో, ఆ ప్రక్రియలో ఒక ఉన్నతి, ఉద్ధరణ కూడా ఉన్నాయని నమ్ముతూ వస్తున్నాం. కాని, ఆధునీకరణ అంటే పాశ్చాత్యీకరణ అనీ, దానిలో అంతర్గతంగా ఒక వైరుధ్యం ఉందనీ అందరి కన్నా ముందు ఆధునిక యూరప్ నే తనని తాను అనుమానిస్తూ, ప్రశ్నిస్తూ, ధిక్కరిస్తూ వచ్చింది.
మనం ఇక్కడ ఆధునీకరణ చెందుతున్నప్పుడు మన ఆధునికానుభవంలో ఇంతదాకా ఎదుర్కోని కొత్త సమస్యల్నీ, కొత్త ప్రశ్నల్నీ ఎదుర్కుంటున్నప్పుడు, వాటికి సమాధానాలు అన్వేషించడానికి మన సాహిత్యం, మన సామూహిక సాంప్రదాయిక వివేకం సరిపోవడం లేదు. ఎందుకంటే మనం ఎదుర్కుంటున్న ప్రశ్నలు మనది కాని ఒక జీవనశైలిని మన జీవనవిధానంగా ఎంచుకోవడం వల్ల తలెత్తినవి కావడం. అంతేకాదు, అలా మనమొక నూతన జీవనశైలిని ఎంచుకుంటున్నప్పుడు, ఆ జీవనవిధానాన్ని మనం విముక్తిదాయకంగా భావిస్తూ ఉండటం అంతకన్నా ముఖ్యమైన కారణం. అలాగని ఆ నవీన జీవనవిధానాన్ని ఎంచుకోకుండా ఉండే అవకాశం కూడా లేదు మనకి. మనం ఆధునీకరణ చెందకతప్పదు. అందుకని మనం చెయ్యగలిగిందల్లా ఒకింత మెలకువతో ఆధునీకరణకు లోనుకావడమే.
ఆ మెలకువ ఎట్లా వస్తుంది?
పందొమ్మితో శతాబ్ది భారతదేశం ఆధునీకరణ ప్రక్రియకు లోనయినప్పుడు రెండు శిబిరాలుగా చీలిపోయింది. ఒకరు మన ప్రాచీన విద్యలే నిజమైన విద్యలని వాదించారు. వాళ్ళని ఓరియెంటలిస్టులన్నారు. మరొక వర్గం మనం పాశ్చాత్య విద్య, గణితం, సైన్సు, ఇంగ్లీషు చదువుకుని తీరాలన్నారు, వాళ్ళని ఆంగ్లిసిస్టులన్నారు. తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకూ గురజాడ ఈ రెండు మార్గాల్నీ సమన్వయించుకునే ఒక మధ్యే మార్గాన్ని అన్వేషించుకున్నాడు. కాని, తిరిగి మళ్ళా గురజాడ తర్వాత విశ్వనాథ వంటి ‘ఓరియెంటలిస్టూ’, శ్రీ శ్రీ వంటి ‘ఆంగ్లిసిస్టూ’ తెలుగు సాహిత్యాన్ని రెండు శిబిరాలుగా మార్చేసారు. ఆ రెండు శిబిరాల్లోనూ తచ్చాడి, తచ్చాడి, ఏ ఒక్కరూ పరిపూర్ణంగా నన్ను కన్వీన్స్ చెయ్యలేకపోతున్నారని గ్రహించిన నాకు, మళ్ళా గురజాడ లాగా రెండు ప్రపంచాల్నీ తనలో పొదువుకుని బైరాగి కనిపించాడు. మానవుడి అస్తిత్వ వేదనను, అర్జునుడు, హామ్లెట్, రాస్కల్నికావ్ ల వేదనగా వివరిస్తున్నప్పుడు, బైరాగి మరొక అడుగు ముందుకేసాడు. అర్జునుడు భారతీయ సాహిత్య ప్రతీక, హామ్లెట్ పాశ్చాత్య సాహిత్య ప్రతీక. కాని రష్యా రెండు ఖండాలకూ చెందిన సంస్కృతి. రాస్కల్నికావ్ అటు యూరోప్ కీ, ఇటు ఆసియాకీ కూడా సమానంగా చెందిన ప్రతీక.
బైరాగిని చదివాకనే నాకు ఆధునికతకీ, ఆధునికతావాదానికీ మధ్య తేడా బోధపడింది. మనం ఆధునీకరణ చెందుతున్న క్రమంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని, మన ముందు తలెత్తుతున్న ప్రశ్నల్ని అర్థం చేసుకోవాలంటే, కేవలం భారతీయ సాహిత్యం చదివితే చాలదనీ, పాశ్చాత్య చింతనకి చెందిన మౌలిక సాహిత్యాన్ని కూడా చదవక తప్పదనీ గ్రహించాను. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, Western Canon ని అధ్యయనం చెయ్యక తప్పదని అర్థం చేసుకున్నాను.
Western Canon చాలా పెద్దది. ఒక జీవితకాలం సరిపోదు. కానీ, కనీసం పూర్తిచేయవలసిన ప్రస్థాన త్రయాలు కొన్నింటిని లెక్కపెట్టవచ్చు. ప్రాచీన గ్రీకు సాహిత్యంలో హోమర్, సొఫోక్లిస్, ప్లేటో; లాటిన్ సాహిత్యంలో వర్జిల్, హొరేస్,లుక్రీషియస్; మధ్యయుగాల్లో అగస్టైన్, ఆక్వినాస్,ఎక్కార్ట్; రినైజాన్సులో డాంటే, షేక్ స్పియర్, సెర్వాంటిస్; ఎన్ లైటెన్ మెంట్ కాలంలో రూసొ, వోల్టేర్, గొథే; పందొమ్మిదో శతాబ్దిలో కిర్క్ గార్డ్, డాస్టవిస్కీ, బోదిలేర్; పందొమ్మిది-ఇరవయ్యవ శతాబ్ది మధ్యకాలంలో టాల్ స్టాయి, నీషే, హిడెగ్గర్; ఇరవయ్యవశతాబ్దిలో ఇలియట్, కాఫ్కా, బొరేస్ లు.
వీళ్ళని చదివితే, యూరోప్ జీవనాడి దొరుకుతుంది మనకి. ఎట్లానో కష్టపడి, ఇంగ్లీషు కూడబలుక్కుంటూ, ఈ రచయితల్లో ప్రతి ఒక్కరివీ కనీసం ఒక్క పుస్తకమేనా చదివాను. కాని, పూర్తి అధ్యయనం చేసానని చెప్పలేను. చదవడం ఎలా ఉండాలి అంటే బైరాగి షేక్ స్పియర్ ని చదివినట్టుండాలి. అలా చదవగలిగిన మనిషి, తాను చదువుకుని, చదివినదాన్ని మనకి విడమరిచి చెప్పే గురువు ఎక్కడ దొరుకుతారు?
అట్లాంటి అట్లా వెతుక్కుంటూ ఉండగా సూరపరాజు రాధాకృష్ణ మూర్తిగారు కనబడ్డారు నాకు. అరుదైన వ్యక్తి, అపురూపమైన పాఠకుడు, చదువుల్లో ‘మర్మమెల్ల’ చదివినవాడు. ఉపనిషత్తులు, గీత చదివినవాడు. కానీ ‘ఓరియెంటలిస్టు’ కాడు. ఇంగ్లీషు ఉపన్యాసకుడే కానీ ‘ఆంగ్లిసిస్టు’ కాడు. ఆశ్చర్యం! బైరాగిలాగా ఈయన కూడా భగవద్గీతనీ, షేక్ స్పియర్ నీ, డాస్టవిస్కీనీ క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు. ఆ అధ్యయన సారాంశాన్ని బైరాగి కవిత్వంగా అందిస్తే,ఈయన వ్యాఖ్యానాలుగా అందిస్తున్నారంతే.
గురజాడలాగా, బైరాగిలాగా, సూరపరాజు రాధాకృష్ణమూర్తి కూడా మధ్యేవాది, సమన్వయ శీలి.
ఆ సమన్వయ ఫలితంగా నేడు ఆయన మనకి అందిస్తున్న రెండు పుస్తకాలు,’షేక్ స్పియర్ సాహిత్యలోకం’, ‘ద వేస్ట్ లాండ్: మరో నాలుగు కవితలు’ నా వరకూ నాకు చాలా విలువైనవి. మీకు కూడా విలువైనవనిపిస్తే, ఈ సాయంకాలం, పుస్తక ఆవిష్కరణ సభకు తప్పకుండా రండి.
14-9-2019