రసగుళికలు

చాలా ఏళ్ళ కిందట, ఒక మిషనరీ స్కూలు లైబ్రరీలో, నాకో పుస్తకం దొరికింది. దానిపేరు One Minute Wisdom (1985). ఆ రచయిత ఆంథోనీ డి మెల్లో భారతదేశానికి చెందిన ఒక జెసూట్ మతాచార్యుడు. సెయింట్ ఇగ్నేషియస్ లయోలా బోధల వల్ల గాఢంగా ప్రభావితుడైనవాడు. క్రీస్తు బోధనల్ని, ప్రాచ్య దేశాల ఆధ్యాత్మిక అనుభవాల వెలుగులో అర్థం చేసుకోవడానికీ, ఆచరించడానికీ ప్రయత్నించినవాడు. తన జీవితకాల అనుష్టానం మీంచి అతడు ఎన్నో జటిలమైన ఆధ్యాత్మిక రహస్యాల్ని ఎంతో సులభంగానూ, సరళంగానూ చెప్పగలిగాడు. One Minute Wisdom అటువంటి ఒక రచన. అందులో ఒకటి రెండు ఉదాహరణలు, నేనెన్నటికీ మరవలేనివి, చూడండి:

~

‘వన్ మినిట్ విస్ డమ్ అంటూ ఒకటుంటుందా? ‘.
‘తప్పకుండా. ‘
‘కాని అది మరీ తక్కువ సమయమేమో కదా?’ .
‘కాని అది యాభై తొమ్మిది సెకండ్ల సుదీర్ఘ వ్యవధి కాదా ‘గురువు జవాబు.

ఆ సమాధానాన్ని ఎలా స్వీకరించాలో అర్థం చేసుకోలేకపోతున్న తన శిష్యుల్ని చూసి గురువు అడిగాడు కదా ‘చంద్రుణ్ణి చూడటానికి ఎంతసేపు పడుతుంది?’

‘మరి అలాంటప్పుడు ఈ ఆధ్యాత్మిక సాధనలన్నీ దేనికి?’

‘కళ్ళు తెరవడానికి జీవితకాలం పట్టొచ్చు, దర్శనానికి క్షణకాలం చాలు.’

*

‘ఒక గురువుని స్వయంగా దర్శించుకోవాలని ఒక సత్యాన్వేషి చాలా దూరం నుంచీ ప్రయాణమై వచ్చాడు.

ఆ ఆశ్రమంలో ఒక శిష్యుడు ఎదురైతే, ఉండబట్టలేక అతణ్ణి అడిగాడు: ‘మీ గురువు ఎటువంటి మహిమలు చేసి చూపిస్తాడు?’

‘మహిమలకేం, చాలా ఉన్నాయి. మహిమలే మహిమలు. కాని, మీ దృష్టిలో మహిమ అంటే మీరు కోరుకున్నది భగవంతుడు నెరవేర్చడం. కాని మా గురువు దృష్టిలో మహిమ అంటే దేవుడు కోరుకున్నదాన్ని మనం నెరవేర్చడం.’

*

ఒక శిష్యుడు తన పట్ల మరీ ఎక్కువగా భయభక్తులు చూపిస్తుంటే, గురువు అతడితో అన్నాడు: గోడ మీద పడుతున్న వెలుగు. ఆ వెలుగు చూడు, గోడకెందుకు దణ్ణాలు పెడతావు?’

~

సూటిగానూ, క్లుప్తంగానూ, కాని, ఆ రెండు మూడు వాక్యాల్లోనే అపారమైన ఒక సాక్షాత్కార సంతోషాన్ని అందించేవిగానూ ఉన్న ఈ ఖండికల్ని సాహిత్యంలో epigrams అంటారు. ఇదొక ప్రత్యేకమైన ప్రక్రియ. అలాగని ఇవి సూత్ర వాజ్మయం కాదు. మనం ఇంగ్లీషులో aphorisms గా పిలిచే సూత్రాలు పదే పదే మననం చేస్తూ ఉంటే తప్ప వాటి సారం ఓ పట్టాన మనలో ఇంకదు. కాని epigrams అట్లా కాదు. అవి నోట్లో వేసుకోగానే పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఇట్టే కరిగిపోయే రసగుళికల్లాంటివి. ఒక శ్రోతనో, పాఠకుణ్ణో ఉద్దేశించి ఏదో ఒకటి చెప్పడానికి ముందు, రచయిత, తాను లోనైన ఒక సాక్షాత్కార సంతోషాన్ని ముందు తనకు తానే స్పష్టం చేసుకోడానికి చెప్పుకునే సంగ్రహసారాంశాలు.

ప్రాచీన గ్రీకు, రోమన్ సాహిత్యాల్లో కనిపించే ఈ ప్రక్రియ, ఆధునిక కాలంలో మహారచయితలు, తాత్త్వికులు, మహాకవులు కూడా సాధన చేయడం ఆశ్చర్యం కల్గిస్తుంది. దాదాపు 150 సంపుటాల రచనలూ, మరొక యాభై సంపుటాల ఉత్తరాలూ రాసిన గొథే, ఇటువంటి సూక్తులు కూడా రాసుకోకుండా ఉండలేకపోయాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆయన రాసుకున్న వాక్యాలు ఒకటి రెండు మచ్చుకి:

~

‘నిన్ను నువ్వు తెలుసుకోఅంటారా! నన్ను నేను తెలుసుకుని ఉండిఉంటే, పారిపోయి ఉండేవాణ్ణి.
*
ఎవరు తన ప్రతి రోజునీ ఎప్పటికప్పుడు కొత్తగా సంపాదించుకుంటాడో అతడు మటుకే స్వతంత్రంగా జీవించడానికి అర్హుడు.

*
చెర్రీలూ, స్ట్రాబెర్రీలూ రుచి తెలియాలంటే, పిల్లల్నీ, పిట్టల్నీ అడగాలి.’

~

ఇటువంటి ప్రభావశీలమైన వాక్యాలు రాసినవాళ్ళల్లో ఖలీల్ జిబ్రాన్ కూడా ఒకడు. ఆయన మాటలు చూడండి:

~

మనం జీవించేది సౌందర్యాన్ని కనుగొనడం కోసమే. తక్కిందంతా కేవలం నిరీక్షణ మటుకే.

*
అతిథుల కోసమే కాకపోయుంటే, మన గృహాలకీ, సమాధులకీ మధ్య తేడా లేదు.

~

దాదాపు మూడువేల కీర్తనలూ, గీతాలూ, ఎన్నో కథలూ, నవలలూ, నాటకాలూ, వ్యాసాలూ రాసిన టాగోర్ కూడా Fireflies పేరిట ఇటువంటి వాక్యాలు కొన్ని రాయకపోలేదు. (ఆ రచనని ఇప్పటికే కల్లూరి శ్యామలగారూ, బొల్లోజు బాబా గారూ తెలుగులోకి తెచ్చారు కూడా). టాగోర్ ఏమంటాడో చూడండి:

~

మన మధ్య సాన్నిహిత్యపు అడ్డుగోడని దాటి మరీ నీ ప్రేమ నాలో ప్రవహించనీ.

*
నా ప్రేమ, సూర్యకాంతిలాగా, నిన్ను చుట్టుముడుతూనే, కాంతివంతమైన స్వాతంత్య్రాన్ని కూడా నీకు అందించనీ.

~

వెయ్యి వాక్యాలు రాస్తే తప్ప మనకేమి స్ఫురిస్తోందో చెప్పలేం అనుకునేదాన్ని రెండు వాక్యాల్లో చెప్పడం మామూలు విషయం కాదు. అది ప్రయత్నిస్తే వచ్చేదీ కాదు. కేవలం రాస్తూండటం ద్వారా చెయ్యగలిగే సాధనా కాదు. అది అంతరంగంలో నిరంతరం జరుగుతుంటే ఒక సంభాషణం వల్ల మాత్రమే సాధపడుతుంది. అన్నిటికన్నా ముందు, అది ఆత్మప్రేమానుభవం, కాబట్టి ఆధ్యాత్మికానుభవం.

అందుకనే వసుధారాణి ‘కేవలం నువ్వే’ కవితా సంపుటి చూసినప్పుడు నేను నిశ్చేష్టుణ్ణైపోయాను. ఎవరీమే? ఈమె నేపథ్యం ఏమిటి? ప్రపంచ మహాకవుల సరసన నిలబెట్టగలిగే రసాత్మక వాక్యాలు ఈమె అంగుళులనుండి ఎలా అలవోకగా ప్రవహించేయి?

చూడండి ఆమె ‘మాటలనియెడు మంత్రమహిమ ‘ఎలా ఉందో:

~

నీతో గడిపిన కాలం మాత్రమే
లెక్కిస్తే అదే నా వయసు.

*
పగ తెచ్చిపెట్టుకునేది
అందుకు బోలెడు కారణాలు
మరి ప్రేమో?
కారణం లేకుండానే కలిగేది.

*
పూలు వికసించి ఆనక
స్వామిని వెతుక్కుంటాయి.

*
ప్రేమికుడొక
స్వేచ్ఛాయుత బందీ.

*
మొత్తం అక్షరమాల, గుణింతాలు
అన్నీ మీరే ఉంచుకోండి
ఒక్క ప్రేమ అన్న పదం
నాకు ఉంచండి చాలు.

*
ఒక్కోసారి ఇరుకుదారుల గుండా
ప్రయాణించి చూడాలి
వైశాల్యం విలువ
తెలియాలి అంటే.

*
జీవితమెలాగూ
వ్యథాభరితం
వేదన నీ కోసమే ఐతే
కొంత సాంత్వన.

*
గాయమూ
లేపనమూ
రెండూ నువ్వే.

~

ఈ కవిత్వాన్ని ఏదో ఒక గాటన కట్టి ఉపయోగం లేదు. ఆ ‘నువ్వు’ ఎవరు అని శోధించీ ప్రయోజనం లేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇది ప్రేమ కవిత్వం కాదు, ధ్యాన కవిత్వం. ఇది వసుధారాణికి ‘తెలిసి’, ప్రయత్నపూర్వకంగా రాసిన కవిత్వం కాదు. ఎన్నో జన్మలనుండీ ఆమెని అంటిపెట్టుకుని వస్తున్న ఏ జననాంతర సౌహృదాల కస్తూరిపరిమళమో ఇట్లా ఒక్కసారిగా గుప్పుమంది.

నిద్రలోనో, కలలోనో లేదా నా ఉద్యోగ జీవితంలో ఏ సమావేశం మధ్యలోనో హటాత్తుగా ఒక నెమలీకతో నా చెవుల్ని స్పృశించినట్టుగా కొన్ని వాక్యాలు, రూమీవో, కబీరువో, టాగోరువో స్మరణీయ వాక్యాలు నన్ను తాకిపోతుంటాయి. ఇప్పుడు ఆ వాక్యాల కోవలో వసుధారాణి వాక్యాలు కూడా చేరిపోయేయని మాత్రమే చెప్పగలను. ఇదిగో, ఇలాంటి వాక్యాలు:
*
ఒక్కోసారి నేను
మౌనంగా
మరోసారి
నీవు అలా-
ఐతే
ప్రతిసారీ
ఛేదనా భారమేదో
అది నాదే!

10-9-2019

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading