యాభై ఏళ్ళ ప్రయాణం

1969. గాంధీజీ శతజయంతి సంవత్సరం.

అప్పటికి నేను మరీ పసివాణ్ణి. మా అన్నయ్య సుందర్రావు రాజవొమ్మంగి జిల్లా పరిషత్తు హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆ ఏడాది తూర్పుగోదావరి జిల్లాలో, ఎవరికి తోచిందో గాని, గొప్ప ఆలోచన ఒకటి కలిగింది. గాంధీజీ మీద వక్తృత్వం, వ్యాస రచన పోటీలు పెట్టి అందులో నలుగురు బాలుర్నీ, నలుగురు బాలికల్నీ ఎంపికచేసి వాళ్ళని గాంధీజీ జీవితంతో సంబంధం ఉన్న ప్రాంతాలన్నిటికీ విజ్ఞాన యాత్రకు తీసుకువెళ్ళాలని సంకల్పించారు. అట్లా ఎంపిక అయిన ఎనిమిది మందిలో మా అన్నయ్య ఒకడు.

అప్పటికి మా ఊళ్ళో కరెంటు లేదు. వార్తాపత్రిక కూడా వచ్చేది కాదు. ఆ గిరిజన గ్రామానికి బయటి ప్రపంచంతో ఉన్న సంబధాలంటే, రోజుకు రెండు సార్లు వచ్చే బస్సులూ, రాజవొమ్మంగిలో ఉండే బ్రాంచి లైబ్రరీ, మా ఊళ్ళో రామకోవెలలో వినిపించే పంచాయతీ రేడియో మాత్రమే. అటువంటి రోజుల్లో వాడు గాంధీమీద మాట్లాడటం, ఆ పోటీల్లో నెగ్గడం, దాదాపుగా ఉత్తరభారతదేశమంతా పర్యటించి రావడం, మాకు ఇప్పటికీ కలలాగా అనిపిస్తుంది.

వాడట్లా పోర్ బందరునుంచి కలకత్తాదాకా, డిల్లీనుంచి వార్ధా దాకా ఎక్కడికి వెళ్ళినా అక్కణ్ణుంచి మా నాన్నగారికొక ఉత్తరం రాసేవాడు. అప్పటికి యాభై ఏళ్ళ కింద, మా తాతగారు, ఆయన పేరు సుందర్రావు, కాలినడకన కాశీనుంచి రామేశ్వరందాకా యాత్ర చేస్తూ, మా బామ్మగారికి అట్లా ఉత్తరాలు రాసేరు. మా చిన్నప్పుడు ఆ ఉత్తరాలు మా ఇంట్లో ఉండేవి. వాటి ముద్ర వాడిమీద ఉందనుకుంటాను, వాడు కూడా తాతగారి అడుగుజాడల్లోనే తన పర్యటనలో భాగంగా ఎన్నో ఉత్తరాలు రాసేడు.

వాడు తిరిగి వచ్చిన తరువాత, కూడా తెచ్చుకున్న కొన్ని అపురూపమైన జ్ఞాపకాల్లో ఒకటి, ఆ పిల్లలందరూ కలిసి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో తీయుంచుకున్న ఒక ఫొటో. అందులో మా వాడు ప్రధానమంత్రి పక్కనే నిలబడ్డాడు. చిన్నపిల్లవాడు. చొక్కాకి తగిలించుకున్న ఒక బాడ్జి. మా నాన్నగారు ఆ ఫొటోని పటం కట్టించి, మా ఇంట్లో గోడకి తగిలించారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళ పాటు మా ఇంటికి ఎవరు వచ్చినా, వాళ్ళు ఆ ఫొటో చూడక తప్పేది కాదు, ఆ వివరాలన్నీ అంతకు ముందు విన్నాసరే, మరోసారి మా నాన్నగారు చెప్తుంటే తలూపుతూ వినక తప్పేది కాదు. జిల్లా కలెక్టరును కూడా ఎన్నడూ చూసి ఉండని, ఆ గిరిజన గ్రామంలో, తమ ఊరి పిల్లవాడు, ప్రధానమంత్రిని కలిసి పోటో తీయించుకున్నాడనేది ఎప్పటికీ ఒక ఆశ్చర్యంగానూ, అద్భుతంగానూ ఉండేది.

ఆ తర్వాత వాడి జీవితం చాలా మలుపులు తిరిగింది. ఎం.కాం చేసి చాలాకాలం ఆడిటరుగా, జూనియర్ లెక్చరర్ గా, డిగ్రీ కాలేజి లెక్చెరరుగా పనిచేసి పదవీ విరమణ కూడా చేసాడు. కాని, సులువుగా ప్రభావితం కాగలిగే వయస్సులో, అట్లా మహాత్మాగాంధీ అడుగుజాడల్లో చేసిన ఆ పర్యటన వాడి రక్తంలోకీ ఇంకిపోయింది. చదివిందీ, పాఠాలు చెప్పిందీ కామర్సే గాని, దేశచరిత్ర, దేశభక్తుల జీవితాల అధ్యయనం, దేశం కోసం జీవించినవాళ్ళ గురించీ, మరణించిన వాళ్ళ గురించీ తనకు తెలిసిన విషయాలు నలుగురితోనూ పంచుకోకుండా ఉండలేకపోవడం గత ఇరవయ్యేళ్ళుగా వాడి జీవితసారాంశంగా మారిపోయింది. ఆ క్రమంలో, కందుకూరి వీరేశలింగం మీద, పొట్టి శ్రీరాములు మీద రెండు డాక్యుమెంటరీ నాటకాలు రాసేడు. ఆ రెండింటికీ బంగారు నంది లభించింది. ఆ రెండూ ప్రదర్శనలూ కూడా నేను చూసాను. చూస్తున్నంతసేపూ కంటతడి పెట్టకుండా ఉండలేకపోయాను.

కానీ, వాడు తృప్తి చెందలేదు. పదమూడేళ్ళ వయసులో తనకి పరిచయమైన గాంధీ వాణ్ణి ఈ యాభై ఏళ్ళుగానూ వెంటాడుతూనే ఉన్నాడు.

2019.

మహాత్మా గాంధీ 150 వ జయంతి సంవత్సరం.

పాఠశాలల్లో పిల్లలకి ఏ గాంధీ ఎవరో తెలియని కాలం. అందుకని, గాంధీజీ జీవిత విశేషాలను చూపించే ఒక చిత్రపట ప్రదర్శనని తానే స్వయంగా రూపొందించుకున్నాడు. గాంధీజీ వంశ వృక్షం నుంచి ఆయన అంతిమయాత్రదాకా, ఎన్నో అరుదైన ఫొటోలూ, వార్తాపత్రికలూ, స్టాంపులూ, చారిత్రిక పత్రాలూ సేకరించి గాంధీ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించే ఒక ఫొటో ఎగ్జిబిషన్ నీ, అది చూపిస్తూ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసే ఒక కథనాన్నీ తయారు చేసుకున్నాడు. గత సంవత్సరంనుంచీ ఇప్పటిదాకా ముప్పై మూడు ప్రదర్శనల దాకా ఇచ్చాడు. ప్రదర్శన రూపొందించడానికీ, పోయి రావడానికీ, ఏర్పాట్లకీ ఎవరినుంచీ ఏమీ తీసుకోడు. తన పెన్షనులోంచే ఆ కర్చులన్నీ పెట్టుకుంటూ, తానొక్కడే బస్సుల్లో తిరుగుతూ, పాఠశాలనుంచి పాఠశాలకి గాంధీమహాత్ముడి సందేశాన్ని పంచుకుంటూ తిరుగుతున్నాడు.

ఈ శుక్రవారం మా సంస్థ తరపున గాంధీ ‘నయీ-తాలీం’ మీద బాపట్లలో మేము ఏర్పాటు చేసిన జాతీయగోష్టిలో కూడా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసాడు. ఈ ఎగ్జిబిషన్ నేను చూడటం ఇదే మొదటిసారి. ఆ ఫొటోలు ఎంత విలువైనవో, వాటి చుట్టూ వాడు అల్లే కథనం కూడా అంతే విలువైనది. వట్టి పరిజ్ఞానం కాదు, లోపల ఒక దీపం వెలుగుతూంటే తప్ప, అంత కాంతి పుట్టదు. అందుకనే, ఆ ప్రదర్శన చూసిన మా విద్యాశాఖ మంత్రిగారితో సహా ప్రతి ఒక్కరు స్పందించకుండా ఉండలేకపోయారు. ‘ఇటువంటి ప్రదర్శన నేనిప్పటిదాకా గాంధీ మీద చూడలేదు’ అన్నారు విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నాతో.

యాభై ఏళ్ళ ప్రయాణం.

అంతకన్నా కూడా, ఈ వైనం మొత్తం ఒక నీతిపాఠాన్ని వినిపిస్తోంది.

పిల్లలకి మీరు చిన్నప్పుడు ఏది చూపిస్తే అదే వాళ్ళ హృదయంలోకి ఇంకిపోతుంది. తర్వాత వాళ్ళని అదే నడిపిస్తుంది. మీరు వాళ్ళ రోల్ మోడల్స్ గా ఎవరిని చూపిస్తున్నారు? ఏ దిశగా వాళ్ళ ఊహల్ని మేల్కొల్పుతున్నారు? యాభై ఏళ్ళ తరువాత మీరూ నేనూ ఉండకపోవచ్చు. కాని ఇప్పుడు మనం మన పిల్లలకి ఏవి చూపిస్తున్నామో, దేన్ని ఆరాధించమని చెప్తున్నామో, దాన్నే వాళ్ళు మరొక యాభై ఏళ్ళ తరువాత కూడా సమాజం ముందు ప్రదర్శిస్తుంటారని మాత్రం మర్చిపోకండి.

29-9-2019

Leave a Reply

%d