మేలిమి సభలు

Reading Time: 4 minutes

ఆరేడేళ్ళ కిందటి మాట. మిత్రుడు రాళ్ళబండి కవితా ప్రసాద్ సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా ఉన్నప్పుడు ఒకసారి ప్రపంచ కవితాదినోత్సవం జరిపించాడు. ఆ రోజు ఆ కార్యక్రమానికి నేను యాంకర్ గా ఉన్నాను. ఆ రోజు తమవీ, ప్రపంచ ప్రసిద్ధ కవులవీ కవితలు చదవడానికి కవులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒక్కొక్కరినీ వరసగా పిలుస్తూనే ఉన్నాను. రాత్రి బాగా పొద్దుపోయింది. ఆ వరసలో, చివరదాకా పిలుపు కోసం వేచి ఉన్నవాళ్ళల్లో కోడూరి విజయకుమార్ కూడా ఉన్నాడు. ఎప్పుడో చిట్టచివర అతడి పేరు పిలిచినప్పుడు కవిత చదవడానికి ముందుకొస్తూ అతనన్నాడు కదా: ‘నాకు అర్థమయింది. భద్రుడుగారికి ఎవరి మీద ఇష్టముంటుందో వాళ్ళని చివర పిలుస్తారన్నమాట’ అని.

నిజమే. ఎందుకో తెలీదు, విజయకుమార్ అంటే నాకు చాలా ఇష్టం. బహుశా నన్ను చూసినప్పుడల్లా అతడి కళ్ళల్లో కదిలే ఒక ఆత్మీయత వల్ల కావచ్చు. ఒకరి మీద ఇష్టం వాళ్ళ కళ్ళల్లో నిర్మలంగా కనిపించేటప్పుడు, అది అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్టే కదా. కాని విజయకుమార్ కి నా పట్ల ఎంత ఇష్టముందో నాకు నిజంగా మొన్ననే తెలిసింది.

‘సార్ నేను చాలాకాలంగా తెద్దామనుకున్న కవిత్వసంపుటాన్ని తీసుకువస్తున్నాను . కాని ఈ ఏడాది నా జీవితంలో గొప్ప విషాదాన్ని మిగిల్చిన సంవత్సరం. మా మేనల్లుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఈ ఏడు. ఆ షాక్ లోంచి నేనింకా తేరుకోనేలేదు. కాబట్టి నా పుస్తకావిష్కరణ పెద్ద సభ జరిపి వేడుకలాగా చెయ్యాలని లేదు. కాని ఆ పుస్తకం మీ చేతులమీదుగా ఆవిష్కారమయితే చాలు. అందుకని మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఆ పుస్తకం రాపర్ మీ చేతుల్తో విప్పితే చాలు’ అన్నాడు.

అందుకని ఆదివారం పొద్దున్న సోమాజిగూడ మినర్వా కాఫీ షాప్ లో ఆ పుస్తకాన్ని విడుదల చేసాం.

‘రేగుపండ్ల చెట్టు’.

మా ఇద్దరితో పాటు ఆ నవశిశువుని తిలకించడానికి ‘ముగ్గురు తూర్పుదేశపు జ్ఞానులు ‘ దర్భశయనం, ఆదిత్య, దేశరాజు కూడా వచ్చారు.

ఆ రెస్టారెంటులో ఆ బల్లమీద, మూడు కొవ్వొత్తులు వెలిగించి ఆ పుస్తకంలో కవితలు చదువుకుంటూ ఉంటే, నాకు నా రాజమండ్రి రోజులు గుర్తొచ్చాయి. నేనూ, నా మిత్రుడు గోపీచంద్ అట్లానే మహాసభలు జరిపేవాళ్ళం. మేమిద్దరం కాక, ఆ మహాసభల్లో మహా అయితే మరొక ఇద్దరు ముగ్గురు శ్రోతలుండేవారు. కాని, అసంఖ్యాక ప్రజానీకం కరతాళధ్వనులతో తొక్కిసలాడుతూ మరీ మా మాటలు వినడానికి గుమికూడుతున్నారన్నట్టే ఉండేది మాకు. ‘ఏ కవిత్వ పఠనంలోనైనా ఆరుగురికన్నా శ్రోతలు ఎక్కువ చేరితే, అది సబ్బుల కంపెనీ ప్రచారం తప్ప కవిత్వం కాదని గుర్తుపెట్టుకో’ అనేవాడు గోపీచంద్ నాతో.

ఆ రోజు అచ్చంగా ఆరుగురమే ఉన్నాం. అది నా జీవితంలో నేనింతదాకా హాజరైన కవిత్వావిష్కరణ సభల్లో మరీ మేలిమి సభల్లో ఒకటని మరో మారు చెప్పకుండా ఉండలేకపోతున్నాను.

2

గోపాగని రవీందర్ ది వరంగల్ జిల్లాలో తిమ్మాపురం. కడగండ్లతో కూడిన బాల్యాన్ని ఈది, అక్షరాల్నీ, పుస్తకాల్నీ నమ్ముకుని, ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ, ఎదుగుతూ, తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్ పూర్తి చేసి, ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూ, ఇప్పటిదాకా అయిదు పుస్తకాలు వెలువరించాడు. ‘అంకురం’ అతడి మొదటి కవితా సంపుటి. ఆ తర్వాత వెలువరించిన ‘చిగురు’ కవిత్వ ఆవిష్కరణ సభ వాళ్ళ ఊళ్ళో పాఠశాల ఆవరణలో చెట్టుకింద చేసాడు. ఆ రోజు ఆ సభకి ఆ ఊరు ఊరంతా తరలి వచ్చింది. అక్షరాస్యులూ, నిరక్షరాస్యులూ అనే భేదం లేకుండా ఆ ఊరి వాళ్ళంతా ఆ రాత్రి పొద్దుపోయేదాకా మేము మాట్లాడినదంతా విన్నారు. నేను మరవలేని సాహిత్యసభల్లో అది కూడా ఒకటి.

సుద్దాల అశోక్ తేజ కవిత్వం మీద అతడు ఎంఫిల్ చేసాడు. ‘నేలమ్మా నేలమ్మా గేయరూప కవిత్వం: పరిశీలన ‘ అనే ఆ పుస్తకం ఆవిష్కరణ వరంగల్ లో జరిగినప్పుడు ఆ సభలో కూడా నేనున్నాను. అతడి మూడవ కవిత్వ సంపుటి ‘చెరగని సంతకం’, తెలంగాణా కథానికల పరిచయ వ్యాస సంపుటి ‘కథాంతరంగం’ ల ఆవిష్కరణ సభల్లో కూడా నాకు చోటు దొరికింది.

ఇప్పుడు అతడి కవిత్వం నాలుగవ సంపుటి ‘దూరమెంతైన’ మొన్న హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరణ జరిగినప్పుడు ఆ వేదిక మీద కూడా నాకు చోటు దొరకడం నా భాగ్యం.

రవీందర్ కీ నాకూ మరో రెండు రకాలుగా కూడా అనుబంధం ఉంది. ఒకటి, అతడు మా పెద్ద చెల్లెలి భర్త. వాళ్ళిద్దరూ వరంగల్ లో తెలుగు పండితులుగా శిక్షణ పొందుతున్నప్పుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్ళి మా ఇంట్లో మొదటి కులాంతర వివాహం. అందుకని మా అక్క మా నాన్నగారి కన్నుగప్పి ఆ పెళ్ళి తాను దగ్గరుండి చేయించింది. ఆ పెళ్ళి కూడా నా జీవితంలో నేను చూసిన మహోత్సవాల్లో ఒకటి. ఆ రోజు, మా అక్కావాళ్ళింట్లో ఆ వరుడు, అతడి తరఫున ఒకరో ఇద్దరో పెద్దమనుషులు. వధువు తరఫున నేనూ, మా అక్కా, మా బావగారూ, మా చెల్లెలూ. పెళ్ళి అంటే ఏమిటి? అందరం ఒక చాప మీద కూచున్నాం. మా అక్క వాళ్ళ మధ్య ఒక పళ్ళెం నిండా బియ్యం పోసి పెట్టింది. వరుడూ, వధువూ ఆ బియ్యం దోసిళ్ళతో ఎత్తుకుని ఒకరిమీద ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. నేను శ్రీ శ్రీ ‘కవితా ఓ కవితా’ గొంతెత్తి గానం చేసాను (ఎందుకంటే, నా పెళ్ళిలో నా మిత్రుడు సోమయాజులు నా కోసం అదే చేసాడు కాబట్టి). ఆ సుమూహర్తానికి ఆ కవితావాక్యాలే వేదమంత్రాలు.

పాతికేళ్ళ కిందట నేను ఉట్నూరు కేంద్రంగా అప్పటి అదిలాబాదు జిల్లా కి గిరిజనసంక్షేమాధికారిగా పనిచేసాను. అక్కడున్నది ఏడాదిన్నర కాలమే అయినప్పటికీ, ఆ గిరిజనులు నన్ను తమ హృదయంలో కలిపి కుట్టుకున్నారు. అందుకని ఉట్నూరు అనే పేరు వినబడితే చాలు, నా హృదయంలో ఒక తేనెపట్టు చిందినట్టు ఉంటుంది. రవీందరూ, మా చెల్లెలూ కూడా చాలా ఏళ్ళు అ ఉట్నూరులో ఉపాధ్యాయులుగా పనిచేసారు. అందువల్ల కూడా అతడితో నా అనుబంధం మరింత తీపెక్కింది.

3

కల్లూరి భాస్కరం గారు నా రాజమండ్రి రోజులనాటి మిత్రుడు. 1980 లో ఆయన మల్లాప్రగడ రామారావు అనే మరో మిత్రుడితో కలిసి సాహితీవేదిక అనే ఒక సాహిత్యసంస్థని రాజమండ్రిలో ఏర్పాటు చేసారు. నిజానికి అది సంస్థాగత స్వరూపం లేని సంస్థ. అత్యంత ప్రజాస్వామికమైన వేదిక అది. అక్కడే నాలాంటి సాహిత్యవిద్యార్థులెందరో తమ సాహిత్యానుశీలననీ, సృజనాత్మక అభివ్యక్తినీ పదును పెట్టుకున్నారు. వక్కలంక వసీరా, కొప్పర్తి, ఎమ్మెస్ సూర్యనారాయణ, యర్రాప్రగడ రామకృష్ణ, రాజమండ్రి సావిత్రిగారు, కుప్పిలి పద్మ, నామాడి శ్రీధర్, ఒమ్మిరమేష్ బాబు-ఈ జాబితా చాలా పెద్దది, సాహితీవేదికనే లేకపోతే, నాతో సహా, ఈ మిత్రులెవ్వరూ, తమ సాహిత్య సాధననిట్లా కొనసాగించి ఉండేవారు కారని చెప్పగలను.

భాస్కరం గారితో నా అనుబంధం ఆ తర్వాత కూడ కొనసాగింది. ఆయన వివిధ పత్రికల్లో పనిచేసినప్పుడు, నాతో పనిగట్టుకుని మరీ సాహిత్య వ్యాసాలు రాయించారు. ఇరవయ్యేళ్ళ కిందట నేను హైదరాబాదు వచ్చినప్పుడు, సాహిత్యంలో ఏమి జరుగుతోందో తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఆయన నాతో పుస్తక సమీక్షలు రాయించేరు. మా రాజమండ్రి మిత్రుల దృష్టిలో పుస్తక సమీక్ష చాలా చాలా విలువైన ప్రక్రియ. ఒక సాహిత్య విద్యార్థి సాహిత్యసాధనలో చేరుకునే చిట్టచివరి మెట్టు గొప్ప సమీక్షకుడు కావడమేనని మేమంతా బలంగా నమ్మేవాళ్ళం. అందుకనే, ముప్పై ఏళ్ళ కిందట, ఒక రోజు ఆర్.ఎస్.సుదర్శనంగారు అప్పుడే ప్రెస్ నుంచి వచ్చిన తన ‘నూరు సమీక్షలు’ గ్రంథాన్ని నా చేతుల్లో పెట్టినప్పుడు, నేను కూడా ఎప్పటికన్నా అట్లాంటి పుస్తకం తేగలనా అని ఒకటే కలలుగన్నాను.

భాస్కరంగారితో ముడిపడి మరో అందమైన ముచ్చట కూడా ఉంది. పి.వి.నరసింహారావుగారి ‘ఇన్ సైడర్’ని భాస్కరం గారు ‘లోపలి మనిషి’ పేరిట తెలుగు చేసారు. నా మిత్రుడు ఎమెస్కో విజయకుమార్ ఆ పుస్తకం ప్రచురించి విజయవాడలో ఆవిష్కరణ సభ పె డుతూ, ఆ పుస్తకాన్ని పరిచయం చెయ్యమని నన్నడిగాడు. నరసింహారావుగారు ఆ పుస్తకం రాయడమైతే రాసారు గాని, ఒక ప్రక్రియగా దాన్ని నవలగా పరిగణించవచ్చా లేదా అనే ఒక సందేహం ఆయన్ని వెన్నాడుతూనే ఉంది. ఆ పుస్తకాన్ని ప్రచురించిన పెంగ్విన్ సంస్థ ఆయన్ని పదే పదే ఆ ప్రశ్న అడుగుతూ వచ్చిందట. ఆయన విసిగిపోయి, I do not know whether it is a novel or not, but I am sure, it is a book అన్నారట. కాని ఆ రోజు పుస్తకపరిచయంలో నేను blurring of genres ఒక పోస్ట్ మాడర్న్ లక్షణం అనీ, నిజానికి, అది అత్యంత ప్రాచీన ఇతిహాసాల లక్షణం కూడా అనీ, అందుకనే నన్నయ్య మహాభారతం తెలుగు చేస్తూ అది ఆధ్యాత్మికులకి ఆధ్యాత్మగ్రంథమనీ, రసజ్ఞులకి కావ్యమనీ, నీతికోవిదులకి నీతిశాస్త్రమనీ చెప్పాడని కూడా గుర్తుచేసాను. నా మాటలు నరసింహారావుగారికి గొప్ప రిలీఫ్ ఇచ్చాయని అర్థమయింది. నేనామాటలు చెప్తుండగానే ఆయన చిన్నపిల్లవాడిలాగా ఆ స్టేజిమీద చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయాడు.

ఇప్పుడు భాస్కరం గారు నిజంగానే మహాభారతం మీద మహాభారతమంత విశ్లేషణ వెలువరిస్తూ, ఆ పుస్తకాన్ని కూడా నన్నే పరిచయం చేయమని అడిగారు. మొన్న హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఆయన రచన ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే ‘ అనే పుస్తకాన్ని పరిచయం చేస్తూ పూడూరి రాజిరెడ్డితో పాటు నేను కూడా మాట్లాడేను. ఎనిమిది వందల పేజీల ఆ బృహద్రచన తెలుగు సాహిత్యానికి ఒక జిజ్ఞాసి అందించిన అమూల్యమైన కానుక. నాకు తెలిసి, comparative mythology లో తెలుగులో ఇప్పటిదాకా అటువంటి రచన రాలేదు. ఆ పుస్తకం గురించి వివరంగా మరోసారి.

31-12-2019

Leave a Reply

%d bloggers like this: