భగవంతుడి లేఖకుడు

జార్జి హెర్బర్ట్ (1593-1633) ఇంగ్లీషు కవి. తన జీవితకాలంలో ఒక్క కవిత కూడా అచ్చుకినోచుకోని వాడు. కాని, తన మరణశయ్యమీద తనను చూడటానికి వచ్చిన ఒక మతపెద్ద చేతుల్లో తన కవితలు పెట్టాడు. 39 ఏళ్ళ తన జీవితకాలం పొడుగుతా తనకోసం తాను రాసుకున్న 167 కవితలు. వాటిని తన మిత్రుడికి చూపించమనీ, వాటివల్ల లోకానికేదైనా ప్రయోజనముందనిపిస్తే అచ్చు వెయ్యమనీ చెప్పాడు. ఉపయోగం లేదనిపిస్తే తగలబెట్టెయ్యమని చెప్పాడు.

కాని అతడి మిత్రుడు నికొలస్ ఫెర్రర్ ఆ కవితల్ని The Temple అనే పేరిట 1633 లో అచ్చువేయించాడు. ఆ నాటినుండి ఈనాటి వరకూ ఆ పుస్తకం తిరిగి తిరిగి అచ్చవుతూనే ఉంది. ఇంగ్లీషు సాహిత్యంలో అంత నాదాత్మకమైన కవి మరొకడు లేడని, క్రైస్తవ భక్తి కవిత్వంలో అగ్రశ్రేణి కవుల్లో ఆయన కూడా ఒకడని రసజ్ఞులు శ్లాఘిస్తూనే ఉన్నారు.

నిన్న అనుకోకుండా ఆయన మీద ఒక వ్యాసం చదివాను. జాన్ పైపర్ అనే ఒక క్రైస్తవ బోధకుడు తన బ్లాగులో రాసిన వ్యాసం. ఆయన అందులో హెర్బర్టు గురించిన రాసిన చాలా మాటలు హెర్బర్టుకి మాత్రమే కాదు, ఏ భక్తి కవికైనా కూడా అన్వయించే మాటలే.

He Saw God Through His Pen అనే ఆ వ్యాసంలోంచి కొన్ని వాక్యాలు చూడండి:

~

‘కవిత్వమంటే హెర్బర్టు దృష్టిలో క్రీస్తు మహిమల్ని కనుగొనడానికీ, స్తుతించడానికీ ఒక సాధనం. మనల్ని భవసాగరం నుంచి బయటపడవెయ్యగల క్రీస్తు ప్రేమ ఒక్కటే ఆయన కవిత్వంలో ప్రధాన ఇతివృత్తం. ఆ ప్రేమని మరింత స్పష్టంగా చూడటానికీ, మరింత లోతుగా అనుభూతి చెందటానికీ, మరింత విస్పష్టంగా చూపించడానికీ ఆయన తపించాడు..కవిత్వ కళ వల్ల అతడికీ, మనకీ కూడా క్రీస్తు మరింత స్పష్టంగా దర్శనిమిస్తున్నాడు.’

హెర్బర్ట్ తనని తాను భగవంతుడి లేఖకుడిగా అభివర్ణించుకున్నాడట. పైపర్ ఇలా రాస్తున్నాడు:

‘హెర్బర్ట్ అద్భుతమైన కౌశల్యంతో రాయగలగడానికి కారణం అతడి ఇతివృత్తం అద్భుతం, మహనీయం కావడమే. The Temple సంపుటిలోని ప్రతి ఒక్క కవితలోని విషయం ఏదో ఒక రూపంలో భగవంతుడే అని ఒక భావుకుడు అన్నాడు. హెర్బర్ట్ The Temper (1) అనే కవితలో రాస్తున్నాడు:

ప్రభూ, నిన్నెట్లా స్తుతించేది, నా పాటల్లో
నీ ప్రేమని ఉక్కులాగా ఎట్లా పోతపోసేది
ఆ కొన్ని క్షణాల్లో నా ఆత్మపొందే మెలకువల్ని
నా ఆత్మ సదా అనుభూతి చెందేదెట్లా!

భగవత్ప్రేమని అనుభూతిచెందడం, దాన్ని ఉక్కులాంటి భాషలో కరిగించి పోతపొయ్యడం, తద్వారా తక్కినవాళ్ళు కూడా ఆ ప్రేమానుభూతికి పాత్రులయ్యేలా చూడటం అతడి ఉద్దేశ్యం. అతడి దృష్టిలో కవిత్వం కేవలం భగవంతుడి కోసమే ఎందుకంటే, ఈ సృష్టిలో ప్రతి ఒక్కటీ సర్వేశ్వరుడి కోసమే కాబట్టి.

అంతేకాదు, భగవంతుడు తన ఈశ్వరసంకల్పంతో సమస్తాన్నీ శాసిస్తున్నాడు కాబట్టి, ప్రతి ఒక్కటీ ఈశావాస్యమనే హెర్బర్టు విశ్వసించాడు. కవి ముందున్న కర్తవ్యమల్లా భగవంతుడి ప్రతిధ్వని కావడమే. లేదా భగవంతుడికి లేఖకుడిగా మారడం. ఒక క్రైస్తవ భక్తి కవి ఎలా ఉండాలో చెప్పిన వర్ణనల్లో నా దృష్టిలో ఒక అత్యుత్తమ వర్ణన హెర్బర్టు చెప్పిన మాటలే. భక్తి కవిని ఆయన Secretarie of thy praise అన్నాడు.

ఓ పవిత్ర సంకల్పమా, ఆద్యంతాల్ని
దృఢంగా, మధురంగా నడిపించేవాడా
నా చేతుల్లో గంటం చుట్టూ నా అంగుళుల్ని
బిగించినవాడా! అవి నీకు న్యాయం చెయ్యకపోవా.

భూచరజలచరాలన్నిటిలోనూ నీ దివ్యలీలని
కనుగొనే శక్తి మనిషికొక్కడికే అనుగ్రహించావు
అతడొక్కడి చేతులకే కలాన్ని బహూకరించావు
అతణ్ణి నీ స్తుతిలేఖకుడిగా మార్చుకున్నావు.

భగవంతుడు హెర్బర్టు చేతుల్లో కలం పెట్టి ఆ కలం చుట్టూ అతడి అంగుళుల్ని వంచాడు. ‘అవి నీకు న్యాయం చెయ్యకపోవా?’-అంటే నేను నీ స్తుతిని శ్లాఘించడానికొక నమ్మదగ్గ లేఖకుణ్ని కాకపోనా?- అంటే-నీ సత్యాన్నీ, నీ సౌందర్యాన్నీ అంతే అందంగా అంతే నమ్మదగ్గట్టుగా చిత్రించకపోనా?’

~

Secretary అనే ఇంగ్లీషు పదానికి secretus అనే లాటిన్ పదం మాతృక. మనమెవరేనా ఒక మనిషికి ఒక రహస్యకర్తవ్యాన్ని అప్పగిస్తే అతడు secretary అవుతాడు. అంటే నమ్మకమైన పని అప్పగించదగ్గ మనిషి అన్నమాట. ఇక్కడ భగవంతుడు తన రహస్యాన్ని గానం చేయడానికి తానై ఎంచుకున్న లేఖకుడు. తెలుగు కవి మాటల్లో చెప్పాలంటే ‘ఊహతెలియంగల లేఖకోత్తముడు ‘

కాని పైపర్ వ్యాసం నన్ను మరింత ముగ్ధుణ్ణి చేసింది, ఆ తర్వాత వాక్యాల వల్ల. ఆయనిలా రాస్తున్నాడు:

~

‘భగవత్ మహిమని గానం చేసే లేఖకుడిగా మారడంలో హెర్బర్ట్ భగవత్ వైభవాన్ని గానం చేయడమేకాక, ఆ రహస్యాన్ని మరింత లోతుగా చూడగలిగాడు కూడా. భగవంతుడి గురించి కవిత్వం చెప్పడమంటే, తాను కవిత రాయకముందు, తనకి అనుభవంలోకి వచ్చిన భగవదనుభవాన్ని ప్రకటించడం మాత్రమే కాదు, అసలు ఆ కవిత రాయడం కూడా భగవదనుభవంలో ఒక భాగమే. అతడు రాసిన ఒక కవిత The Quidditie లో ఈ అంశాన్నే మరింత బలంగా చెప్పాడు. Quidditie అంటే సమస్తవస్తు సారాంశం. భగవంతుడితో నిండకపోతే కవితలు వట్టి బోలు పద్యాలు మాత్రమేనని చెప్తున్నాడు హెర్బర్టు ఈ కవితలో.

నా ప్రభూ, పద్యమంటే ఒక మకుటం కాదు
రాజలాంఛనమో, శిరోభూషణమో కాదు
ఉపకరణం కాదు, విందుకాదు, ఘనతకాదు
ఒక ఖడ్గంకాదు, పిల్లంగోవి కూడా కాదు.

అది గెంతేదికాదు, నాట్యం చేసేదీ కాదు
ఆడేదీ కాదు. ఫ్రాన్సులోనో, స్పెయిన్ లోనో
దొరికేది కాదు, లేదా చతురంగబలాలతో
పాలించేది కాదు, శాసించేదీ కాదు.

అదొక పదవి కాదు, కళకాదు, వార్తకాదు
వాగ్వాదం కాదు, పండితపరిషత్తు కాదు
పద్యమంటే ఒక్కటే, దాన్ని కూరుస్తున్నంతసేపూ
నేన్నీతోనే ఉండేది, వీలైనంత నిన్ను పొదువుకునేది.

అతడి కవితలు ‘వాటిని కూరుస్తున్నంతసేపూ అతడు ఆయనతోనే ఉంటాడని ‘ మనకి తెలియచెప్పేవి. అందుకనే ఒక రసజ్ఞురాలు ‘ఈ వాక్యాలు మనకి తెలియచెప్పేదేమిటంటే, తన కవిత పూర్తయ్యాక కాదు, అసలు పద్యం కూరుస్తున్నప్పుడే కవి భగవత్సాన్నిధ్యాన్ని అనుభవిస్తాడని చెప్తున్నవి. కవిత కూరుస్తున్నంతసేపూ, అంటే, కవిత రాస్తున్నంతసేపూ, సరిచూస్తున్నంతసేపూ, పూర్తయ్యాక మళ్ళా చదువుకుంటున్నంతసేపూనూ.’ భగవంతుణ్ణి దర్శించడం, భగవద్విభూతిలో మైమరచడం, పద్యాలు రాయడం ఈ రెండింటి మధ్యా హెర్బర్టు దృష్టిలో ఎటువంటి సరిహద్దూ లేదు. అతడి కవిత్వకళ కూడా అతడికి భగవత్సందర్శనమే.’

~

ఈ మాటలు చదుతున్నప్పుడు నేనొక అద్వితీయమైన అనుభూతికి లోనయ్యాను. చాలా ఏళ్ళ కిందట మా మాష్టారు ధూర్జటి గురించి చెప్తూ ‘అతడికి శివసాన్నిధ్య సుఖం తెలుసు’ అని అన్న మాటలు గుర్తొచ్చాయి. కవికి కవిత్వం రాయడమంటే ఆ శివసన్నిధి అనుభవంలోకి రావడమే. శివసాన్నిధ్యసుఖం అనుభవమయ్యాక మటుకే కవి కవిత్వం చెప్పడు. కవిత్వం చెప్పడం ద్వారా కూడా అతడు ఆ శివసాన్నిధ్యాన్ని మరింత మరింతగా అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటాడు. అన్నమయ్య ముప్పై రెండువేల కీర్తనలు కూర్చాడంటే దాని అర్థం అంతగా ఆయన ఆ విష్ణు సాన్నిధ్య సుఖాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాడనే కదా.

అందుకనే టాగోర్ ఇలా గానం చేస్తున్నాడు:

నా జీవితంలో నిరంతరం నిన్ను పాటలతో వెతికాను
అవే నన్ను ద్వారం నించి ద్వారానికి తిప్పాయి.
వాటి సహాయంతోనే
ఈ ప్రపంచాన్ని వెతుకుతో స్పృశిస్తో
ఇటూ అటూ తోవ తడుముకుంటూ తిరిగాను.

నేను నేర్చుకున్న విజ్ఞానాన్నంతా
నా పాటలే నాకు బోధించి
అవే అనేక రహస్యమార్గాల్ని చూపాయి.
నా హృదయాంచలంలో మెరిసే ఎన్నో తారల్ని
నా దృష్టి ముందుకి తెచ్చి నిలిపింది నా పాటలే.

దినమంతా హర్షఖేద మర్మ ప్రదేశాలకు
నాకు తోచ చూపిందీ అవే.
నా ప్రయాణాంతంలో సాయంకాలాన నన్ను
ఏ మందిర ద్వారాన్ని చేర్చాయో అవి?

2-3-2020

One Reply to “భగవంతుడి లేఖకుడు”

Leave a Reply

%d bloggers like this: