బన గర్ వాడి

విద్వాన్ గోగినేని కనకయ్యగారు తాడికొండకి చెందిన విద్యావేత్త, విద్యాసంస్థల వ్యవస్థాపకుడు. 1972 లో ప్రభుత్వం కొత్తగా గురుకుల పాఠశాలలు తెరవాలనుకున్నప్పుడు ఆయన పట్టుదల వల్లనే గురుకుల పాఠశాల తాడికొండలో తెరిచారు. నేను తాడికొండలో చదువుకున్న రోజుల్లో ఆయనలేని వార్షికోత్సవం ఉండేది కాదు. గుంటూరు నుంచి అమరావతి ఎవరు వెళ్తున్నారని తెలిసినా వాళ్ళని తాడికొండ ఆహ్వానించేదాకా ఆయనకీ, మా ప్రిన్సిపాలుగారికీ నిద్రపట్టేది కాదు. దాదాపుగా తాడికొండ గురుకుల పాఠశాల చరిత్రలో ఆయన విడదీయరాని భాగమైపోయారు. చివరి సారి నేనాయన్ని చూసింది 2002లో. గురుకుల పాఠశాల రజతోత్సవవ వేడుకలకి ఆయన ముఖ్య అతిథి. అప్పటికి ఆయన పూర్తిగా ఆధ్యాత్మిక జీవితంలోకి మళ్ళిపోయారు. ఆ రోజు ఆయన ఒక ఆధ్యాత్మిక ప్రవచనమేదో ఇచ్చినట్టు కూడా గుర్తు.

తాడికొండలో చదువుకున్నవాళ్ళు కనకయ్యగారికి కూడా ఋణపడి ఉంటారు. మరీ ముఖ్యంగా నాబోటివాడు. తాడికొండ వెళ్ళకపోయి ఉంటే, నా జీవితం నేనిప్పుడు జీవిస్తున్నట్టుగా రూపుదిద్దుకుని ఉండేదే కాదు. అందుకని మొన్న శనివారం తాడికొండలో గోగినేని కనకయ్య విద్యాసంస్థలు తమ వార్షికోత్సవ వేడుకలకి నన్ను ఆహ్వానించినప్పుడు సంతోషంగా వెళ్ళాను. ఆ రోజు గోగినేని కనకయ్యగారి జీవితవివరాల్ని తెలిపే చిన్నపుస్తకమొకటి నా చేతుల్లోకి వచ్చింది. అందులో ఆయన జీవితవిశేషాలు రేఖామాత్రంగా చిత్రించి ఉన్నాయి. కాని ఆ కొద్దిపాటి వివరాలూ చదివగానే నేను గొప్ప ఆశ్చర్యానికి లోనయ్యాను. ఆయన చిన్నతనంలో, అంటే ఇప్పటికి దాదాపు ఎనభయ్యేళ్ళ కిందట చదువుకోడం కోసం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారనీ, పెళ్ళి, ఆస్తిపాస్తులు, కుటుంబ బాధ్యతల కన్నా పై చదువులే ఆయనకి ముఖ్యంగా తోచాయనీ తెలిసినప్పుడు నాకు చిరకాలంగా తెలిసిన మనిషిలో మరొక గొప్ప మానవుడు సాక్షాత్కరించాడు. ఒక గ్రామం నుంచి ఒక్క మనిషైనా సరే ఉన్నతవిద్యావంతుడైతే ఆ గ్రామానికి ఎంత మేలు జరుగుతుందో కనకయ్యగారే ఉదాహరణ. 1950 ల్లో గాంధీగారి నూతనవిద్యావిధానాన్ని అనుసరించి బేసిక్ ట్రైనింగ్ స్కూళ్ళు ఏర్పాటు చేసినప్పుడు అటువంటి పాఠశాల ఒకటి కనకయ్యగారు తాడికొండలో తెరిపించారు. 54 లోనో 55 లోనో తెరిచిన ఆ పాఠశాల దాదాపు ఇరవయ్యేళ్ళ పాటు నడిచాక మూతపడింది. తిరిగి డెభ్భైల్లో పి.వి.నరసింహారావుగారు గురుకుల పాఠశాలలు ప్రారభిస్తున్నప్పుడు మళ్ళా కనకయ్యగారే ఆ పాఠశాలని బేసిక్ ట్రయినింగ్ స్కూలు భవనాల్లో ప్రారంభించేలా చొరవ తీసుకున్నారు.

ఇక ఆయన తన కుటుంబం తరఫునా, తన మిత్రులతోనూ, బంధువులతోనూ కలిసి మొదలుపెట్టిన పాఠశాలలు మరెన్నో ఉన్నాయి. వాటన్న్నింటిలోనూ కలిపి ఈ రోజు వందలాది మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో ప్రాథమిక విద్యనుండి ఉన్నత విద్య దాక అభ్యసిస్తూ ఉన్నారు. ఆ రోజు ఆయన జీవితవిశేషాలు పూర్తిగా తెలుసుకున్న తరువాత, మనం జీవితంలో యాదృచ్ఛికం అనుకునేదేదీ నిజంగా యాదృచ్ఛికం కాదని అనిపించింది. కనకయ్యగారే లేకపోతే గురుకుల పాఠశాల తాడికొండలో తెరిచే వారే కాదు. నేను తాడికొండలో చదువుకోకపోయి ఉంటే నా జీవితమిట్లా ఉండి ఉండేదే కాదు.

ఆ మాటలే చెప్పాను ఆ రోజు పిల్లలకీ, పెద్దలకీ కూడా. ఒక్క మనిషి చదువుకుంటే, చదువుకోడానికి దీపం వెలిగిస్తే ఆ కాంతి అక్కడితోటే ఆగిపోదు అని. బేసిక్ ట్రైనింగ్ స్కూలు నుంచి మా గురుకుల పాఠశాల వారసత్వంగా పొందింది భవనాలు మాత్రమే కాదు, ఒక సంస్కృతి కూడా. బేసిక్ ట్రైనింగ్ స్కూలు గ్రంథాలయం కూడా ఆ సంస్కృతిలో ఒక భాగం. ఆ గ్రంథాలయమే లేకపోయుంటే నేనింత సాహిత్యపిపాసిగా మారిఉండేవాణ్ణే కాదు. వట్టి పిపాస మాత్రమేనా? అక్కడ ఆ పసిప్రాయాన ‘బనగర్ వాడి’ చదవకపోయి ఉంటే నా జీవితమిట్లాంటి మలుపులు తిరిగి ఉండే కాదు.

అవును. ఆ చిన్న నవల నా జీవితాన్ని మార్చేసిందని నేనెన్నిమార్లో చెప్పాను, ఇంతకుముందు చాలాసార్లు రాసేను కూడా. వ్యంకటేశ దిగంబర్ మాడ్గూళ్కర్ మరాఠీ రచయిత. జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త. ఆయన 1954 లో రాసిన నవల అది. (ఆ ఏడాదే తాడికొండలో బేసిక్ ట్రయినింగ్ స్కూలు మొదలయ్యింది). అదొక గ్రామం కథ. ఒక ఉపాధ్యాయుడి కథ, ఒక పాఠశాల కథ. ఒక నిరక్షరాస్య గ్రామంలో ఒక ఉపాధ్యాయుడు మార్పు తేవడానికి ప్రయత్నించిన కథ. ఆ కథ నా రక్తంలోకీ ఇంకిపోయింది. నా పదవ తరగతి పూర్తయ్యాక నాకు నాగార్జున సాగర్ గురుకుల కళాశాలలో ఎంపిసి, బిపిసి ల్లో ఏదో ఒక కోర్సులో ఎంట్రన్సుతో పనిలేకుండా సీటు ఇస్తామన్నా కూడా వద్దనుకుని అక్కడే సియిసిలో చేరడానికి కారణం ఆ పుస్తకం ప్రభావమే అని నిస్సంకోచంగా చెప్పగలను.

తాడికొండలో ఉన్నన్ని రోజులూ ఆ పుస్తకం దాదాపుగా నాతో పాటే ఉండేది. ఆ పుస్తకం తెరిచినప్పుడల్లా నాకు రెండు వివశత్వాలు కలుగుతుండేవి. ఒకటి, నేను కూడా అట్లాంటి ఒక బీద గ్రామంలో నివాసముండి అక్కడి ప్రజల జీవితాల్లో ఏదో ఒక మార్పు తేవాలనేది. రెండోది, అటువంటి నవలనో, కథనో ఏదో ఒకటి రాయాలనేది. బహుశా నవలనే. నేను రాయాలనుకున్న ఆ నవలకి ‘బంజరు భూమి ‘అని పేరు కూడా పెట్టేసాను. కాని, నాలుగైదు వాక్యాలకి మించి రాయలేకపోయాను. ఆ రకంగా ఆ రెండు కోరికలూ నా జీవితంలో నెరవేరలేదు గానీ, నా ఉద్యోగ జీవితం వల్ల వందలాది బన్ గర్ వాడి ల్లో అడుగుపెట్టగలిగాను. వేలాది పాఠశాలలు నిర్వహించగలిగే అవకాశానికి నోచుకున్నాను.

ఆ సాయంకాలం కనకయ్యగారిని స్మరిస్తూ నాలుగు మాటలు మాట్లాడటానికి లేచి నిల్చున్నప్పుడు ఆ పసితనపు వివశత్వం నన్ను మళ్ళా అహ్వానించింది. గాంధీగారూ, గోగినేని కనకయ్యా, మా ప్రిన్సిపాలు సుగుణమ్మగారూ, వ్యంకటేశ మాడ్గూళ్కర్ ప్రతి ఒక్కరూ నా ఊహల్నీ, నా జీవితాన్నీ ఒకేదిక్కుకి నడిపిస్తూ వచ్చారన్న గ్రహింపు రాగానే అదంతా ఒక grand design గా తోచి నా హృదయం చెప్పలేని ప్రకంపనకు లోనయ్యింది.

ఇన్నాళ్ళకు మరొకసారి బనగర్ వాడి చదివాను. దాదాపు నలభై అయిదేళ్ళ తరువాత. ఆ పసిప్రాయంలో నన్నంతగా లోబరుచుకున్న ఆ ప్రాశస్త్యం ఆ నవలదా లేక అప్పటి నా నిష్కళంక హృదయానిదా లేక తాడికొండ పాఠశాలదా అని పరిశీలనగా చదివాను. అదంతా ఆ కథలోని నైర్మల్యమని నాకిప్పుడు బోధపడింది. అదొక సత్యకాల సమాజానికి చెందిన కథ. ‘బనగర్ వాడి లోని ముఖ్య ఆకర్షణ కథా వివరణలోని నిరాడంబరత అనవచ్చు’ అని రాసాడు ఒక విమర్శకుడు ఆ పుస్తకానికి ముందుమాట రాస్తూ. మరొక విమర్శకుడు ఆ పుస్తకం ఇంగ్లీషు అనువాదాన్ని సమీక్షిస్తూ, Discovery of India తరువాత, భారతదేశాన్ని ఆవిష్కరించే పుస్తకం బన గర్ వాడినే అన్నాడు. నేను డిస్కవరీ ఆఫ్ ఇండియా చదవడం కన్నా ముందే బనగర్ వాడి చదివాను. కాబట్టి నా భారతదర్శనం బనగర్ వాడితోనే మొదలయ్యింది. అది నా అదృష్ఠం.

20-3-2020

One Reply to “బన గర్ వాడి”

  1. చాలా హాయిగా చదివాను. ఇంతకీ బంగారు వాడి ఎలా సంపాయించాలి

Leave a Reply

%d bloggers like this: