నాడు, నేడు

Reading Time: 4 minutes

దాదాపుగా ప్రతి ఏడాదీ పండక్కి రాజవొమ్మంగి రావడం అలవాటే అయినా, ఈసారి మాత్రం ఈ రాక చాలా ప్రత్యేకంగా మారింది. ఈ ఊళ్ళు నన్నొక విద్యాధికారిగా పలకరించాయి. తమతో కూడా ఒక విద్యాధికారిగా మాట్లాడమన్నాయి.

మేము ఇక్కడికి వచ్చినరోజే అంటే పదమూడో తేదీ మధ్యాహ్నం లాగరాయి జిల్లా పరిషత్తు ఉన్నతపాఠశాలలో కొత్త విద్యావిధానం మీద, విద్యలో విలువల మీద విద్యాపరిరక్షణ సమితివారు ఒక సమావేశం ఏర్పాటు చేసారు. లాగరాయి రాజవొమ్మంగి మండలంలో ఒక మారుమూల గ్రామం. కాని, ఆంధ్రప్రదేశ్ గిరిజన చరిత్రలో చారిత్రికంగా శాశ్వత స్థానం సంపాదించుకున్న వీరగడ్డ. రంపపితూరిగా పేరుపొందిన రంపతిరుగుబాటు (1879) కీ , అల్లూరి సీతారామరాజు పితూరీకి మధ్య (1922-24) లాగరాయి కేంద్రంగా గరిమెళ్ళ మంగడు (1914-16) చేసిన పితూరీ ఒకటి ఈ ప్రాంతాన్ని చరిత్రపటంలోకి ఎక్కించింది. ఆ తర్వాత సీతారామరాజు చేపట్టిన తిరుబాటుకి లాగరాయి స్ఫూర్తి. ఆ పితూరీలో పాల్గొని జైల్లో ఉన్న మెట్టడం వీరయ్యదొరని సీతారామరాజు విడిపించి తన దళంలో కలుపుకున్నాడు. లాగరాయి పక్కగ్రామం కొండపల్లి లాగరాయి నుంచి స్ఫూర్తి పొంది సీతారామజు తిరుగుబాటులో గొప్ప ఉత్సాహంతో పాల్గొంది. ఆ ఊరిలోని పోరాటపటిమని అణచెయ్యడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఊరిని తగలబెట్టింది. అదంతా గొప్ప చరిత్ర. చరిత్రపుస్తకాల్లో కనబడని చరిత్ర.

అటువంటి లాగరాయిలో విద్య గురించీ, విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలగురించీ మాట్లాడటం అన్న ఊహే నాకెంతో ఉద్వేగాన్నిచ్చింది. ఆ సమావేశంలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఉపాధ్యాయులు దాదాపు డెభ్భై మందిదాకా పాల్గొన్నారు. ఆ రోజు నాతో పాటు మా అక్క కూడా ఉంది. ఆమె మా గ్రామాలనుంచి ఉన్నత విద్య చదువుకున్న తొలి మహిళ. మొదటి ఉన్నతోద్యోగి, మొదటి రచయిత కూడా. అందుకని ఆమెని కూడా ఆ రోజు అక్కడి ఉపాధాయుల్ని ఉద్దేశించి మాట్లాడమని అడిగాను. నేను వస్తున్నానని తెలిసి తూర్పుగోదావరి జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి విజయభాస్కర్ నన్న్ను చూడటం కోసం అంత దూరమూ వచ్చేసాడు. విజయభాస్కర్ నిజాయితీపరుడైన అధికారి, సంస్కారి. మంచి వక్త. వ్యక్తిత్వ వికాసం గురించి అతడు మాట్లాడుతుంటే ఎంతే సేపేనా వినాలనిపిస్తుంది. ఆ రోజు విజయభాస్కర్ చేసిన ప్రసంగం సహజంగానె అందరినీ ఆకట్టుకుంది.

మర్నాడు అంటే భోగినాడు నేను మరవలేని రోజు. ఆ రోజు మా ఊళ్ళో అంటే శరభవరంలో గ్రామస్థులు తమ మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో ‘నాడు నేడు’ కార్యక్రమం నిర్వహించారు. నాడు నేడు అనేది రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు చేపడుతున్న ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు దాదాపు 45000 దాకా వున్నాయి. ఈ పాఠశాలన్నిటిలోనూ కనీస సదుపాయాలు, తాగునీరు, విద్యుత్తు, ఫాన్లు, లైట్లు, నల్లబల్లలు, బెంచీలు, కుర్చీలు, ప్రహరీగోడ లాంటివి పూర్తిగా అందించాలని ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అది. ఒక్కొక్క ఏడాదీ దాదాపు 15000 పాఠశాలల చొప్పున మూడేళ్ళ కాలంలో మొత్తం పాఠశాలలకి ఈ కనీససదుపాయాలు అందించాలన్నది ప్రభుత్వం ఉద్దేశ్యం. అంతేకాదు, ఆ చేపడుతున్న పనులు కూడా తల్లిదండ్రుల భాగస్వామ్యంతో చేపట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమం చేపట్టడం, దాన్ని తల్లిదండ్రుల భాగస్వామ్యంతో చేపట్టడం అనేది దేశచరిత్రలోనే ఇదే మొదటిసారి.

మా ఊళ్ళో నేను చిన్నప్పుడు చదువుకున్న బడి కూడా ఈ ఏడాదికి ఎంపిక చేసిన పాఠశాలల్లో ఉంది. అందుకని మా బళ్ళో మౌలిక సదుపాయాలు సమకూర్చడం కోసం చేపట్టిన కార్యక్రమానికి నన్ను భూమిపూజ చెయ్యమని ఆ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఆహ్వానించింది. ఆ రోజు నేను మా కుటుంబసభ్యులందరితో ఆ పాఠశాలల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం నా జీవితంలోని అత్యంత మధురక్షణాల్లో ఒకటి. మా అక్కా, చెల్లెళ్ళూ, మేమంతా కూడా ఆ పాఠశాల పూర్వవిద్యార్థులమే. ఈ మధ్య పశ్చిమ గోదావరిజిల్లాలో ఒక పాఠశాలని సందర్శించాను. ఆ పాఠశాల పూర్వవిద్యార్థి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగంలో ఉన్న ఒకాయన ఆ పాఠశాల పూర్వవిద్యార్థిగా ఆ పాఠశాలని ఎంతగా పట్టించుకున్నాడో చూసినప్పుడు, నాకు చాలా సిగ్గనిపించింది. ఆయన చేస్తున్నది కేవలం ధనసహాయం సంపాదించిపెట్టడం కాదు, తనకి ఎవరు పరిచయమైనా, వాళ్ళు తన పాఠశాలకి ఏ విధంగా ఉపయోగపడతారన్నదే అతడి ఆలోచన. ఎవరి నుంచి ఏ చిన్న సహాయం ఆ పాఠశాలకి ఒనగూడుతుందనుకున్నా కూడా ఆయనవాళ్ళని వదలడు. నన్ను కూడా ఆయన తన పాఠశాలకి అహ్వానించి తాము చేపడుతున్న పనులు చూపించినప్పుడు, నేను చదువుకున్న పాఠశాలలకు కూడా నేనట్లా చెయ్యగలనా అనిపించింది. ఆ రోజు మా శరభవరం మండల ప్రాథమిక పాఠశాలలో భూమిపూజలో పాల్గొన్నందుకు నా అంతస్సాక్షి కొంత ఊరడిల్లింది. ఆ రోజు ఆ తల్లిదండ్రుల సమావేశంలో నేను నా చిన్నప్పటి గురువుల్ని తలుచుకున్నాను. మేమంతా ఆ ప్రాథమిక పాఠశాలకు ఎంతగా ఋణపడ్డామో మరీ మరీ విశదీకరించి చెప్పాను.

మేము చదువుకున్నప్పుడు మా బడికి సొంత భవనం లేదు. కొన్నాళ్ళు గ్రామచావడిలోనూ, మరికొన్నాళ్ళు ఊరిమధ్య రామకోవెలలోనూ మా స్కూలు నడిచేది. కాని ఇప్పుడు వెనక్కి తిరిగిచూసుకుంటే, నాకు అప్పుడు బడి అంటే భవనమనీ, సదుపాయాలనీ ఆలోచన లేదనిపిస్తుంది. బడి అంటే మా వజ్రమ్మ పంతులమ్మగారు. అంతే. ఆమెని చూసే చింగిజ్ అయిత్ మాతొవ్ ‘తొలి ఉపాధ్యాయుడు’ పుస్తకం రాసి ఉంటాడు. ఆమె నేను చూసిన పరిపూర్ణ క్రైస్తవురాలు. కాని నాకు రామాయణం, మహాభారతం చెప్పిన తొలి గురువు కూడా ఆమెనే.

మరో సంతోషం ఆ రోజు ఆ చిన్నపాఠశాలలో జరిగిన ఆ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహాము, సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి విజయభాస్కర్ కూడా రావడం. బహుశా జిల్లావిద్యాశాఖాధికారులిద్దరూ అట్లా ఆ స్కూలు రావడం ఆ పాఠశాల చరిత్రలోనే అది మొదటి సారి.

ఆ మధ్యాహ్నం మేమంతా మళ్ళా రాజవొమ్మంగి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జరిగిన భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యాం. శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలపూర్వవిద్యార్థులు నేడు దేశవిదేశాల్లో ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మా అన్నయ్యలిద్దరితో పాటు మా చెల్లెళ్ళలో ఇద్దరు అక్కడే చదువుకున్నారు. ఆ పాఠశాలకి ఇప్పుడు నాబార్డు సహాయంతో రెండుకోట్ల రూపాయల విలువమేరకు పనులు మంజూరయ్యాయి. నేను ఆ పాఠశాలల్లో చదువుకున్నది మొత్తం ఆరునెలలకి మించి లేదు. కాని నా జీవితంలో నా బాల్యంలో రాజవొమ్మంగి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, రాజవొమ్మంగి బ్రాంచి లైబ్రరీ నాకందించిన స్ఫూర్తి అమూల్యం. అందుకని ఆ రోజు పాఠశాల విద్యాశాఖాధికారిగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం నాకెంతో సంతోషాన్నిచ్చింది.

కాని నేను నిజంగా మరవలేని కార్యక్రమం నిన్న సంక్రాంతి పండగ సాయంకాలం మా ఊరి దగ్గరుండే వణకరాయి గ్రామంలో ఏర్పాటైన సమావేశం. వణకరాయి చిన్న గిరిజన కుగ్రామం. మారుమూల గ్రామం. కొండరెడ్ల పల్లె. ఆ ఊరుపొలిమేరలు ఎక్కడ ముగిసి, ఎక్కడ విశాఖ మన్యం మొదలవుతుందో ఎవరూ చెప్పలేరు. అలా ఒక సరిహద్దు గ్రామం కూడా అది. నా చిన్నప్పణ్ణుంచీ ఆ ఊరితో నా కలలు పెనవేసుకుని ఉన్నాయి. ఆ ఊరి గురించి నేను చెప్పింది వినీ వినీ నా స్నేహితుడు సోమయాజులు దాన్ని నా spiritual home అని అనేసాడు కూడా .

కాని ఇన్నాళ్ళూ నేను చూసిన నాకు తెలిసిన వణకరాయి వేరు, నిన్న నేను చూసిన వణకరాయి వేరు. అక్కడ నిన్న సాయంకాలం నాకు విద్యాధికులైన గిరిజన యువతీయువకులు దాదాపు పదిహేను ఇరవై మందిదాకా కనిపించారు. ముఖ్యంగా ఆడపిల్లలు. ఒకామె పొలిటికల్ సైన్స్ లో ఎమ్మే చేసింది. ఒకామే బి డి ఎస్, ఒకామె ఇంజనీరింగ్, ఒకామె టిటిసి, ఒకామె బిఎడ్. మూడువందల జనాభా మించని ఆ గ్రామంలో ఇప్పుడు ప్రతి పదిమందికి ఒక పట్టభద్రురాలు కనిపిస్తున్నది. ఇదొక నూతన గ్రామం. నా తండ్రి జీవించి ఉంటే ఆయన ఆనందానికి హద్దులుండేవి కాదని అనిపించింది నాకు. నన్ను తాడికొండ స్కూల్లో ఆయన జాయిన్ చేసిన కొన్నాళ్ళకి మా దగ్గర తాళ్ళపాలెం, బోయపాడు గ్రామాల్లో గిరిజనసంక్షేమ శాఖ ఆశ్రమపాఠశాలలు తెరిచింది. ఆయన ఆ పాఠశాలల గురించి చెప్తూ ఎంత మురిసిపోయేవారో. ఇప్పుడు తన పల్లెటూళ్ళో ఇంతమంది చదువుకున్న, చదువుకుంటున్న గిరిజన బాలబాలికల్ని చూసి ఆయన సంతోషానికి హద్దు ఉండేది కాదని అనిపించింది. నిన్న ఆ పిల్లల్ని ఉద్దేశించే మాట్లాడేను. ఇన్నాళ్ళకి నేను చదువుకున్న చదువు, చదివిన పుస్తకాలూ, తెలుసుకున్న సంగతులూ ఆ గిరిజన బాలబాలికలతో పంచుకునే అవకాశం దొరికింది నాకు. నేను చదువుకున్న చదువు సార్థకమయింది.

16-1-2020

One Reply to “నాడు, నేడు”

  1. అద్భుతంగ రాశారు అందమైన భాషలో మాతో చెబుతున్నట్లు.

Leave a Reply

%d bloggers like this: