ఢిల్లీ పాఠశాలలు

రెండేళ్ళ కిందట, ఢిల్లీలో, ద్వారకా ప్రాంతంలో, ఢిల్లీప్రభుత్వం ఒక స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్స్ ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వంలో విద్యాశాఖామంత్రిగా ఉన్న మనీష్ శిసోడియా ఆ పాఠశాల ప్రారంభిస్తూ, ఒక పాఠశాల ఎంత చక్కగా ఉండాలో అంత చక్కగానూ ఆ కొత్త పాఠశాల కూడా ఉండాలని ఆ పాఠశాల సందర్శకుల పుస్తకంలో శుభాకాంక్షలు ప్రకటించాడు. ఆ తర్వాత మళ్ళా ఒక ఏడాదికి, అంటే పోయిన ఆగస్టులో, ఆ పాఠశాలని సందర్శించినప్పుడు, ఆ పాఠశాల సందర్శకుల పుస్తకంలో తన సంతోషాన్ని ప్రకటించకుండా ఉండలేకపోయాడు. ఆ పాఠశాల తాము కోరుకున్నట్టే వికసిస్తోందని చెప్తూ, విద్యాకార్యక్రమాల పైన ఒక జాతీయస్థాయి సంవాదానికి (national discourse) ఆ పాఠశాల తెరతీయగలదని ఆశాభావం వ్యక్తం చేసాడు.

ఆయన కోరుకున్నట్టే జరిగింది. ఈరోజు ఢిల్లీ పాఠశాలల గురించి మాట్లాడని వాళ్ళు లేరు. ‘విద్య గురించి, వైద్యం గురించి మాట్లాడి ఎన్నికలు గెలవొచ్చని ఈ సారి పూర్తిగా రుజువయ్యింది’ అన్నాడు ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఒక ఉన్నతాధికారి మాతో. ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాధికారులూ, విద్యాకార్యకర్తలూ, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులూ ఢిల్లీ పాఠశాలల్ని చూడటానికి బారులు తీరుతున్నారు. నిన్న ద్వారకా లో మేము చూసిన పాఠశాలకి మా కన్నా ముందే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్ము, కాశ్మీర్ మొదలైన రాష్ట్రాలనుంచి అధికార బృందాలు వచ్చి వెళ్ళినట్లుగా సందర్శకుల పుస్తకం సాక్ష్యమిస్తోంది.

ఢిల్లీ ప్రభుత్వం గత అయిదేళ్ళుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చడం మీద దృష్టి పెడుతూ ఉన్నదని విన్నప్పణ్ణుంచీ, ఆ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో చూద్దామని అనుకుంటూనే ఉన్నాను. నాలుగైదు నెలల కిందట పాఠశాల విద్యాశాఖనుంచి ఇంజనీర్ల బృందాన్ని ఆ పాఠశాలలు చూసి రమ్మని పంపించాము. మన రాష్ట్రంలో పాఠశాల విద్యలో అవసరమైన సంస్కరణలు సూచించడంకోసం ప్రొఫెసరు బాలకృష్ణన్ అధ్యక్షతన ఏర్పాటైన విద్యా సంస్కరణల కమిటీనుంచి కూడా కొందరు సభ్యులు ఒక బృందంగా ఆ పాఠశాలల్ని సందర్శించి వచ్చారు. తాము చూసిన వాటిని మిత్రులతో పంచుకున్నారు కూడా.

ఈ సారి మా వంతు. నిన్నా మొన్నా ఒక ప్రభుత్వ సమావేశానికి హాజరవడానికి వెళ్ళినప్పుడు, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ గారు, ఇంగ్లీషు మీడియం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి వెట్రిసెల్విగారూ, నేనూ కొంత సమయం ఢిల్లిపాఠశాలల్లో వచ్చిన పరివర్తనను చూడటానికీ, తెలుసుకోడానికీ వెచ్చించాం. అందులో భాగంగా మొన్న సాయంకాలం ఢిల్లీ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ గారిని కలిసేం. ఆయన తాము చేపట్టిన సంస్కరణల గురించీ, తాము ప్రవేశపెట్టిన నూతన ఆవిష్కరణల గురించీ దాదాపు రెండు మూడు గంటల పాటు ఎంతో స్పష్టంగా వివరించాడు. తమ శాఖ రూపొందించిన వివిధ రకాల అధ్యయన సామగ్రిని పరిచయం చేసాడు. గత పదేళ్ళుగా తాము ఏమి సంకల్పిస్తూ వచ్చిందీ, వాటిలో ఏ మేరకు కృతకృత్యులయిందీ కూడా సమగ్రంగా పరిచయం చేసాడు.

ఆ నేపథ్యంలో పాఠశాలల పరిస్థితుల్ని కళ్ళారా చూడటానికి నైరుతి ఢిల్లీ ప్రాంతంలోని ఒక స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్స్ నీ, ఒక సీనియర్ సెకండరీ పాఠశాలనీ సందర్శించేం. అక్కడి ఉపాధ్యాయులతో మాట్లాడేం. ఒకచోట, ‘నిష్ట’ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణా శిబిరంలో ఉపాధ్యాయుల్ని ఉద్దేశించి మాట్లాడేం. ఆ పాఠశాలని పర్యవేక్షిస్తున్న జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి అధికారులతో కూడా మాట్లాడేం.

మేం విన్నదాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి, ఢిల్లీలో పాఠశాలల్లో కొత్త ఉత్సాహం, కొత్త చైతన్యం ఉరకలెత్తుతున్నాయని అర్థమయింది. అదేమీ తెలంగాణా లాగా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. కేరళలాగా అత్యంత అక్షరాస్య రాష్ట్రమూ కాదు. ఆ పాఠశాలలు కూడా గత పదేళ్ళలో కొత్తగా తెరిచినవీ కావు. ఆ ఉపాధ్యాయులు కూడా నిన్ననో మొన్ననో ఉద్యోగంలో చేరినవాళ్ళూ కారు. అయినా కూడా ఆ రాష్ట్రమేదో కొత్తగా ఏర్పడ్డట్టుగా, ఆ పాఠశాలని నిన్ననే తెరినట్టుగా, ఆ ఉపాధ్యాయులు నిన్ననే ఉద్యోగంలో చేరినట్టుగా, వాళ్ళంతా ఒక కొత్త అధ్యాయం మొదటి పేజీలు తిప్పుతున్నట్టుగా గొప్ప కుతూహలంతోనూ, అపరిమితమైన ఆశాభావంతోనూ కనబడ్డారు.

ఇదెట్లా సాధ్యపడింది?

అయిదు కారణాలు చెప్పవచ్చు. నిజానికి ఇందులో మూడు కారణాలు ఢిల్లీ ప్రభుత్వ కార్యదర్శి మాతో చెప్పినవే. మొదటిది, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన మీద ఢిల్లీ ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో దాదాపు నాలుగోవంతు విద్యమీద కేటాయిస్తున్నట్టుగా ఇప్పటికే చాలామంది చెప్తూ వచ్చారు. కాని అదెలా సాధ్యపడిందో వారెవరూ చెప్పలేదు. ఢిల్లీ లో పోలీసు వ్యవస్థమీద కర్చు కేంద్రప్రభుత్వానిది కాబట్టి ఆ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి ఆ బరువు తగ్గిపోయింది. రాష్ట్రాలుగాని, దేశాలు గాని పోలీసులమీదా , సైన్యం మీదా వ్యయాన్ని తగ్గించగలిగితే ఆ మేరకు విద్యకీ, వైద్యానికీ కేటాయింపులు పెరుగుతాయని మరో మారు రుజువయ్యింది. పాఠశాలలకి అవసరమైన భవనాలు, ఫర్నిచరు, గ్రంథాలయాలు, లాబరేటరిలు, ఆటస్థలాలు, ఆటవస్తువులూ, కంప్యూటర్లూ, బోధనోపకరణాలూ మొదలైనవాటిని సమకూర్చడంలో ఢిల్లీ ప్రభుత్వం ఎక్కడా వెనకాడలేదని అర్థమవుతూనే ఉంది. ‘ఈ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఇట్లా బలోపేతం చెయ్యకపోయి ఉంటే కూడా మీరిట్లానే పనిచేసి ఉండేవారేనా?’ అని ఉపాధ్యాయుల్ని అడిగినప్పుడు, చేసి ఉండేవాళ్ళమని కొందరు అన్నారుగాని, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాత్రం స్పష్టంగా చెప్పేసింది: ‘మౌలిక సదుపాయాలు ఉపాధ్యాయుల్ని మానసికంగా బలోపేతం చేస్తాయి. బడిని పైకి తీసుకురావాలనే వాళ్ళ సంకల్పానికి చెప్పలేనంత మద్దతు సమకూరుస్తాయి ‘అని.

రెండవ కారణం, ఆ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు. పాఠశాలల ప్రధాన శత్రువు స్తబ్దత. దాన్ని బద్దలు కొట్టడానికి ఎప్పటికప్పుడు కొత్త గాలులు వీస్తూనే ఉండాలి. ఉపాధ్యాయులకి వాళ్ళు మామూలు శిక్షణతో సరిపెట్టలేదు. ప్రతి ఏడాదీ రెండు వందల మంది చొప్పున ఉపాధ్యాయుల్ని కేంబ్రిడ్జి, సింగపూరు పంపించి శిక్షణ అందించారు. మామూలుగా ప్రభుత్వంలో అత్యంత ఉన్నతస్థాయి అధికారులకి మాత్రమే లభ్యంగా ఉండే విదేశీ శిక్షణ ఒక సీనియర్ సెకండరీ స్కూలు ఉపాధ్యాయులకి కూడా అందుబాటులోకి రావడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా, ఐ ఐ ఎం, అహ్మదాబాదుతో కలిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల్లో నాయకత్వ పటిమను పెంపొందించడానికి సాయం చేసింది. శిక్షణ ఇచ్చే స్ఫూర్తిని కొనసాగించడానికి అక్కడ టీచర్-మెంటర్ వ్యవస్థని ఏర్పాటు చేసారు. మెంటర్ కేవలం రిసోర్సు పర్సన్ కాదు. శిక్షణ పూర్తయ్యాక కూడా అతడు తన ఉపాధ్యాయులతో సంవాదం కొనసాగిస్తూనే ఉంటాడు. వాళ్ళ బాగోగుల్ని సరిచూస్తూ వాళ్ళ బోధానాపద్ధతుల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంటాడు.

మూడవది, పాఠశాలల నిర్వహణలో తల్లిదండ్రుల భాగస్వామ్యం. బహుశా ఢిల్లిలో రాజకీయ పరంగా అత్యంత ప్రధానమైన కార్యక్రమమంటూ ఉంటే అది పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలే. అలాగని అవి రాజకీయ సమావేశాలు కావు. తల్లిదండ్రులు అక్కడ చేరేది పాఠశాలల వర్తమానం గురించీ, భవిష్యత్తు గురించీ చర్చించుకోడానికే. కాని ఆ సమావేశాలు సక్రమంగా జరిగితేనే తమ రాజకీయ మనుగడ సాధ్యమవుతుందని అక్కడి రాజకీయపక్షాలు గ్రహించాయి. ఇదే అమర్త్యసేన్ లాంటి ఆర్థికవేత్తలు గత పాతికేళ్ళుగా చెప్తూ వస్తున్నది. రాజకీయ పార్టీలు మానసికంగా ఎంత పరిణతి చెందితే అంతగా విద్యాభివృద్ధి సాధ్యపడుతుందని.

పై మూడూ కాక మరొక రెండు కారణాలు మా అంతట మేము తెలుసుకున్నాం. అందులో ఒక కారణం ఒక ఉపాధ్యాయిని చెప్పింది. గతానికీ, ఇప్పటికీ ప్రధానమైనా తేడా ఎక్కడుందని అడిగినప్పుడు, ఆమె తమకీ, ప్రభుత్వ అధికారవ్యవస్థలకీ మధ్య నిచ్చెనమెట్ల వ్యవస్థ కూలిపోవడంలో ఉందని చెప్పింది. తాము ఎవరితో చర్చించాలనుకున్నా, ఏ సమస్య వచ్చినా, ఏ సలహా అవసరమైనా, ప్రభుత్వంలో ఎవరితోనైనా ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఇప్పుడు లభ్యంగా ఉందని చెప్పింది. ఢిల్లీ విద్యాశాఖామంత్రి గురించి చెప్తూ ఆ శాఖ కార్యదర్శి కూడా ఈ మాటే చెప్పాడు. ఆయన ఎప్పుడూ పాఠశాలలు సందర్శిస్తూ, ఉపాధ్యాయులతో మాట్లాడుతూ, చర్చిస్తూ, చివరికి సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళని పలకరిస్తూనే ఉంటాడని చెప్పాడు. మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి తన ప్రమాణస్వీకారోత్సవాన్ని తిలకించడానికి ఉపాధ్యాయుల్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించాడని తెలిసినప్పుడు, అందుకే, ఆశ్చర్యం కలగలేదు.

ఇక చివరి కారణం, అన్నిటికన్నా ముఖ్యమైన కారణం నాకు కనిపించింది, అక్కడి ఉప్పాధ్యాయుల్లో కనవస్తున్న కొత్త ఉత్సాహం. ఢిల్లీ పాఠశాలల గురించి ఇప్పుడు రాస్తున్నవాళ్ళంతా ప్రధానంగా అక్కడి భవనాల పోటోలు పెడుతూ ఉన్నారు. కాని నిజానికి మనం చూడవలసింది ఆ భవనాలు కాదు, అక్కడి టీచర్స్ డైరీల్ని. ఆ పాఠశాలల్లో వచ్చిన పరివర్తన అంతా ఆ ఉపాధ్యాయుల డైరీల్లో తేటతెల్లంగా ఉంది. తమ వృత్తినీ, వృత్తిలో అనుదినం తాము పొందగల సంతోషాన్ని అమితంగా ప్రేమించగలవారు మాత్రమే తమ దైనందిన ప్రణాళికల్ని అంత స్ఫూర్తిదాయకంగా రాసుకోగలుగుతారు, అమలు చేసుకోగలుగుతారు. ‘నలుగురు ఉపాధ్యాయులు ఒకచోట చేరినప్పుడల్లా, తమ పిల్లల గురించీ, తమ పాఠశాలల గురించీ మాట్లాడుకోకుండా ఉండలేకపోయినప్పుడు మాత్రమే పాఠశాలలు బాగుపడతాయి ‘అన్నదొక ఉపాధ్యాయిని మాతో. ఆ మాటని నేను మరికొంత పొడిగించి ఇలా అంటాను: ఒక సమాజంలో పాఠశాలలు పరివర్తన చెందాలంటే, అక్కడ రాజకీయనాయకులు, పాత్రికేయులు, తల్లిదండ్రులు, ఉపాధాయులు, ఎవరేనాకానీ, నలుగురు కలిసినప్పుడల్లా పాఠశాలల గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. ఒకరినుంచి ఒకరు ఉత్సాహం పొందుతుండాలి, ఒకరినొకరు అభినందించుకోవాలి. ఒకరినొకరు ముందుకు నడుపుకుంటూ ఉండాలి.

సరిగ్గా ఈ పని చేస్తున్నందువల్లనే ఢిల్లీలో మొదటిసారిగా న్యూఢిల్లీ కనబడింది నాకు.

19-2-2020

Leave a Reply

%d bloggers like this: