
1919. స్వాతంత్య్రోద్యమం నడుస్తున్న కాలం. సింధ్ ప్రాంతంలో ‘హింద్ వాసీ ‘అనే పత్రికని నడుపుతున్న సంపాదకుడు జెత్మల్ పరస్ రాం గుల్రాజానీ అనే ఆయన మీద రాజద్రోహం మోపారు, కేసు విచారణకి వచ్చింది. ఆయన తన పత్రికలో సంపాదకీయం రాస్తూ ఒక సుప్రసిద్ధ సూఫీ కవి వాక్యమొకటి ఉల్లేఖించాడు. ‘మద్యశాల దుకాణం ముందు ఎప్పట్లానే వధ్యశాల నడుస్తోంది’ అన్న వాక్యం అది. తాగుబోతుల అంగడి ముందు ఎప్పట్లానే తలకాయలు తెగిపడుతున్నాయనే ఆ చిన్న వాక్యం బ్రిటిష్ ప్రభుత్వాన్ని వణికించింది. అట్లా వణికిస్తుందని తెలిసే ఆ సంపాదకుడు ఆ వాక్యాన్ని ఉల్లేఖించాడా? ఆ కేసు విచారిస్తున్న మాజిస్ట్రేటు ఎచ్.టి.సోర్లీ తన ముందున్న క్రిమినల్ ప్రొసీజరు కోడు ప్రకారం ఆ సంపాదకుడికి రెండేళ్ళ కారాగార శిక్షా, వెయ్యి రూపాయల జరిమానా విధించాడు. కాని, ఆ రాత్రి ఆ మాజిస్ట్రేటు కి నిద్ర పట్టలేదు. తనముందు దోషిగా నించున్న ఆ సంపాదకుడు అంత కఠిన కారాగార శిక్షని మౌనంగా అంగీకరించాడే గాని, ఆ కవితా వాక్యాన్ని ఉల్లేఖించినందుకు భయపడలేదు, క్షమాపణకి సిద్ధపడలేదు. ఒక్క వాక్యం కోసం, ఒక్క పూర్వకవి వాక్యాన్ని మళ్ళా మళ్ళా తలుచుకోవడం కోసం ఆ పాత్రికేయుడట్లా సంతోషంగా చెరసాలకు వైపు నడిచిపోతున్న దృశ్యమే అతడి కళ్ళముందు కదలాడుతూ ఉంది.
‘మద్యశాల దుకాణం ముందు ఎప్పట్లానే వధ్యశాల నడుస్తోంది.’
ఆ వాక్యం సోర్లేని వెంటాడింది. సింధ్ ప్రాంతంలో పనిచేయవలసిన బ్రిటిష్ అధికారిగా అతడు సింధీ నేర్చుకున్నాడుకాని, ఆ భాష తో నిజంగా మొదటిసారి పని పడింది అతడికి. ఆ కవి ఎవరో, అతడి కవిత్వమేమిటో తెలుసుకుని తీరాలనుకున్నాడు. ఆ విధంగా ఇప్పటికి దాదాపు రెండున్నర శతాబ్దాల కిందట సింధ్ లో జీవించి అద్భుతమైన కవిత్వం చెప్పిన షా అబ్దుల్ లతీఫ్ భితాయి (1690-1752) కవిత్వాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగలేదు, తనకి చాతనైన మేరకి ఆ కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. షా అబ్దుల్ లతీఫ్ జీవితాన్నీ, కాలాన్నీ, కవిత్వాన్ని పరిచయం చేస్తూ Shah Abdul Latif of Bhit: His Poetry, Life and Times (1940) అనే పుస్తకం వెలువరించాడు. రాత్రికి రాత్రి సింధీ భాషకి చెందిన ఒక సూఫీ కవి ప్రపంచకవిగా మారిపోయాడు.
ఈ రెండు రోజులుగా నాకు షా అబ్దుల్ లతీఫ్ పదే పదే గుర్తొస్తున్నాడు. ముఖ్యంగా, ఈ వాక్యాలు:
‘నెమళ్ళన్నీ మరణించాయి
ఒక్క హంస కూడా ప్రాణాలతో మిగల్లేదు
ఎక్కడ చూడు, ఇప్పుడు
నా దేశం నిండా కాకులు.’
హిందువులూ, ముస్లిములూ తప్ప మనుషులు కనబడకుండా పోతున్న కాలం ఇది. ఇట్లాంటి కాలంలో ఖుస్రో, భితాయీ, గాలిబ్, మీర్ వంటి కవులు పదే పదే గుర్తుకు రావడం సహజం. వాళ్ళు హిందూ సంకేతాలకీ, ముస్లిం చిహ్నాలకీ అతీతమైన ఒక ప్రేమైక వదనం కోసం పరితపించారు. మనుషుల్ని ప్రేమించేవాళ్ళెవరైనా పంచుకోగలిగేది అటువంటి పరితాపమొక్కదాన్నే.
ఈ రోజు నేను మీతో పంచుకోగలిగేది కూడా అటువంటి ప్రేమైకవిలాపాన్ని మాత్రమే. ఇదిగో, నా ముందు Glimpses of the Beloved: One Hundred Poems from Shah Abdul Latif Bhitai (2017) ఉంది. హసన్ ముజ్తబా అనే ఆయన అనువాదం. ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు జె.పి. వాస్వానీ ఇట్లా రాస్తున్నారు:
‘షా అబ్దుల్ లతీఫ్ ఒక కవియోగి. గురునానక్ ని ఎవరో అడిగారట: ‘ఎవరు నిజమైన యోగి? ‘అని. ‘తాను తీసే ప్రతి శ్వాసలోనూ ఎవరు భగవంతుణ్ణి స్మరిస్తారో అతడే నిజమైన యోగి. అతడి అంతశ్చైతన్యంలో నామసంపదతప్ప మరేమీ ఉండదు’ అని. షా అబ్దుల్ లతీఫ్ అటువంటి యోగి. ఒకసారి అతడి శిష్యులు దోమలబాధ పడలేకపోతున్నామని ఫిర్యాదు చేసారట. అందుకాయన ‘ఆ దోమలకన్నా మీకు మంచి మిత్రులెక్కడ దొరుకుతారు? మీరు ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ ఉండటం కోసమే మిమ్మల్ని నిద్రపోనివ్వట్లేదవి ‘ అని అన్నాడట.’
తమిళనాడులో శివపాదముద్రలు వెతుక్కున్నట్టే పంజాబ్ సింధ్ ప్రాంతాల్లో సూఫీ పాదముద్రలు వెతుక్కునే రోజుని కలగనడమొక్కటే ఇప్పుడు నేనుచేయగలిగిందల్లా.
~
వెనక్కి నడు
1
శతసంతోషాలకి బదులుగా
నా ప్రియతముడి
పోకడల్ని పసిగట్టే
ఒకే ఒక్క వ్యాకులత కోరుకున్నాను.
2
ప్రతి ఒక్కడూ వందలాది మైళ్ళు నడిచేవాడే.
పాంథుడా, నీ అడుగులు తగ్గించి
వేగం పెంచు,
ఒక్క అంగలో గమ్యం చేరుకుంటావు.
3
తొమ్మిది సంకెళ్ళు, పది తాళ్ళు, పదిహేను బంధాలు
బాహువుల్తో పెనవేసుకున్న బంధనాలు
లక్ష ఊచల్తో కట్టుకున్న దేహపంజరం
కాని ప్రియతముడి పిలుపు వినబడగానే
అతడొక్క విదిలింపుతో అన్నీ తెంచేసుకోగలిగాడు.
4
వాళ్ళు నా చర్మం ఊడబెరికి
నా గాయాలమీద ఉప్పు జల్లుతున్నారు
కాని ఏడవడం పిరికి పని.
నేను ఎంత గాఢంగా నిట్టూరిస్తే
ఆయన పట్ల నా ప్రేమ అంత ప్రగాఢమవుతోంది.
5
ప్రేమంటే ఏమిటో
కుమ్మరి వాడి ఆవం చూసి తెలుసుకో
రోజంతా రగులుతూనే ఉంటుందా
గుప్పెడు పొగ కూడా బయటికి రాదు.
6
కూచోకు, మర్చిపోతావు
తలెత్తి గమ్యం దిక్కు కూడా చూడకు
ఎవరు నడక సాగిస్తూనే ఉంటారో
వారికే ప్రియతముడు లభిస్తాడు
7
నా సఖుడి గురించి నీవెంత మాట్లాడితే
నాకంత ప్రాణం లేచి వస్తుంది
కూలిపోయిన గుండె బురుజుని
మళ్ళా కూడదీసి కడుతున్నట్టుంటుంది.
8
నీ స్నేహితుడు నిన్ను పలకరిస్తున్నప్పుడు
మూతిముడుచుకు కూచోకు
సఖుడు తారసపడ్డ క్షణాన
శాస్త్రాలన్నీ దుమ్ములాగా ఎగిరిపోతాయి.
9
ఒకవైపు మోహమయపృథ్విమీద
మండిపోతున్న ఎండ
మరొకవైపు నీ ప్రేమికుడి
ప్రేమాగ్ని
ఈ రెండు మంటల మధ్యా
నువ్వు నడవక తప్పదు.
10
నా ప్రేమికులు నాతో
విరహయోగ సాధన చేయించేదాకా
నాలో ప్రేమ లక్షణాలు పొడసూపలేదు
ఆ తర్వాత కదా
నాకు ప్రేమించే తోవ దొరికింది.
11
నేను, నువ్వు, వాళ్ళు, మనం
ఈ నాలుగు ఇంధనాల్నీ
పక్కన పారేసి చూడు, ఇక
నరకాగ్ని నీ జోలికొస్తే చెప్పు నాకు.
12
నలుగురు చూసే దానికి వ్యత్యస్తంగా చూడు
ప్రజలు నడిచే దారికి ఎదురుదిక్కున నడు
జనాలు కింద ఈదులాడితే
నువ్వు పైన ఈదులాడు
లోపలకి చూపు తిప్పు
నీ ప్రియతముణ్ణి కలుసుకోడానికి
వెనక్కి నడు.
28-2-2020