
చంద్రశేఖర పురం ప్రకాశం జిల్లా వెలిగండ్ల దగ్గర ఒక గ్రామం. దాదాపుగా కడప జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఆ గ్రామం ఏ ప్రధాన రహదారిమీదా లేకపోవడంతో దాన్నొక మారుమూల గ్రామం అన్నా అతిశయోక్తి కాదేమో. కాని మొన్న ఆదివారం ఆ గ్రామం వెతుక్కుంటూ సుదీర్ఘ ప్రయాణం చేయవలసి వచ్చింది.
ఎందుకంటే అక్కడ ఒక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం ఉంది. ఆ బాలికల పాఠశాలలో గత మూడు నెలలుగా మేమొక కొత్త ప్రయోగం చేపట్టి విజయవంతంగా పూర్తి చేసాం. ఆర్థికంగానూ, సాంఘికంగానూ ఎంతో వెనకబడ్డ కుటుంబాల నుంచి వచ్చిన ఆ బాలికలకి మేము కంప్యూటర్ కోడింగ్ చేయడమనే ఒక నైపుణ్యం అలవర్చడం కోసం ఒక కోర్సు నిర్వహించాం. మూడు నెలల పాటు సాగిన ఆ కోర్సులో మొదటి దశ పూర్తయిందనీ, పిల్లలు అద్భుతమైన నైపుణ్యాల్ని సాధించారనీ ఆ కోర్సు నిర్వాహకులు చెప్పడంతో, ఆ పిల్లల్నీ, ఆ పాఠశాలనీ స్వయంగా చూడటానికి ఆ ఊరు వెతుక్కుంటూ వెళ్ళాను.
పిల్లలు ఇంగ్లీషులో చదువుకోవాలా, తెలుగులో చదువుకోవాలా అని మీమాంస పడుతున్నాం గానీ, ఈ రెండు భాషలకన్నా మించిన మరొక భాష నేర్చుకోవలసిన అవసరం ప్రపంచం మనముందుకు తీసుకొచ్చింది. అది కోడింగ్. రానున్న రోజుల్లో పిల్లల భావనిర్మాణం computational thinking కి అనుగుణంగానే సాగవలసి ఉంటుంది. కర్త, కర్మ, క్రియలతో కూడుకున్న ఒక వాక్యాన్ని మనం వ్యాకరణరీత్యా నిర్ధుష్టంగా నిర్మించడం నేర్చుకున్నట్టే, వివిధ సంకేతాల్ని ఇన్ పుట్ గా వాడుకుంటూ ఒక సింటాక్స్ ని నిర్మించడం ద్వారా ఒక అవుట్ పుట్ ని సాధించడం కూడా తప్పనిసరి సామర్థ్యంగా పిల్లలు నేర్చుకోవలసి ఉంటుంది.
21 వ శతాబ్దంలో పేరుకి అడుగుపెట్టామన్న మాటే గాని, ఇంకా పలకలూ, బలపాలే లేని పాఠశాలల్లో, తెలుగు అక్షరమాల నేర్చుకోవడంలోనే తమ మొదటి రెండు మూడేళ్ళ పసికాలాన్ని వ్యయపరుస్తున్న పిల్లలతో మనమింకా ఇరవయ్యవ శతాబ్దంలోకి కూడా అడుగుపెట్టలేదు. ఒకవైపు డిజిటల్ లెర్నింగ్ అనేది ఒక కనీస అభ్యసనసాధనంగా మారిపోయిన ప్రపంచంలో మనమింకా పిల్లల్తో పాఠ్యపుస్తకాలు వల్లెవేయిస్తూనే ఉన్నాం. ఈ దుఃస్థితి దాదాపుగా అన్ని పాఠశాలల్లో కనవచ్చేదే అయినా బీదపిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో మరింత దయనీయంగా కనవస్తుంది. నేనేమనుకుంటానంటే, పిల్లలు ఆర్థికంగానూ, సామాజికంగానూ ఎంత వెనకబడి ఉంటే, వారికి అంత అత్యాధునిక పద్ధతుల్తో బోధన చేపట్టవలసి ఉంటుందని. కాలంలో వాళ్ళిప్పటికే వెనకబడి ఉన్నారు. వాళ్ళకీ, సామాజికంగా ఇప్పటికే ముందున్న వర్గాల పిల్లలకీ మధ్య ఇప్పటికే బాగా దూరం పెరిగిఉంది. ఆ దూరాన్ని మామూలు నడకతో తగ్గించలేం. కాలానికీ, దూరానికీ సంబంధించిన లెక్కల నుంచి నిమ్నవర్గాల పిల్లలు బయటపడాలంటే, వాళ్ళు పాఠ్యపుస్తకాలు ఒక్కటే చదివితే చాలదు, ఇంటర్నెట్ కూడా అందుబాటులోకి రావాలి, ఇంగ్లీషు ఒక్కటే నేర్చుకుంటే చాలదు, కోడింగ్ కూడా సాధ్యం కావాలి.
ఆ రోజు చంద్రశేఖర పురంలో నేను చూసింది అద్భుతమని చెప్పాలి. మేము చేసిందల్లా ఎనిమిది, తొమ్మిది తరగతులు చదువుతున్న నలభై మంది పిల్లలకి నలభై లాప్ టాప్ లు సమకూర్చడం, ఇద్దరు ఉపాధ్యాయుల్ని నియమించడం. అంతే. మొన్న మొన్నటిదాకా లాప్ టాప్ అంటే ఏమిటో తెలియని ఆ పిల్లలు, అప్పటిదాకా లాప్ టాప్ ని స్పృశించని ఉండని ఆ బాలికలు మూడు నెలల వ్యవధిలో ఇంగ్లీషు సింటాక్స్ నీ, కోడింగ్ సింటాక్స్ నీ అర్థం చేసుకోవడమే కాకుండా తమకై తాము ఆ రెండు భాషల్లోనూ వాక్యనిర్మాణాలు చేపట్టగలిగే స్థాయికి చేరుకున్నారు. ఒకసారి వాళ్ళ వేళ్ళతో కీ బోర్డ్ ని తాకడం మొదలుపెట్టాక ఆ పిల్లలు ఒక కొత్త నైపుణ్య సాగరంలో సరికొత్త నౌకాయానాన్ని మొదలుపెట్టేసారు. వాళ్ళల్లో ఒకమ్మాయి ఈ మూడు నెలల వ్యవధిలోనే కనీసం నూట యాభై దాకా ఎక్సర్ సైజులు తనంతట తను చేయగలిగే సామర్థ్యానికి చేరుకుంది. ఇప్పటిదాకా ఏ బాలికల పాఠశాలలో అడుగుపెట్టినా, పిల్లల్ని భవిష్యత్తులో మీరేం కావాలని కోరుకుంటున్నారని అడిగితే, నర్సు, టీచరు, డాక్టరు అని చెప్పే పిల్లలు, మొదటిసారిగా ‘సాఫ్ట్ వేర్’ అని చెప్పడం విన్నాను ఆ రోజు.
విద్యారంగంలో ముఖ్యంగా పేదపిల్లల విద్యకి సంబంధించి గత మూడు దశాబ్దాలకు పైగా నేను చేపడుతూ వస్తున్న ప్రయోగాలన్నీ ఒక ఎత్తూ, చంద్రశేఖరపురంలో చేపట్టిన ఈ ప్రయోగం మరొక ఎత్తూ. మూడు నెలల ఈ స్వల్పకాలిక ప్రయోగం వల్ల ఆ పిల్లలకీ, నాకూ కూడా మొన్న ఆదివారమే 21 వ శతాబ్దం మొదలయిందనిపించింది.
కోడింగ్ ఒక నిపుణురాలిని తయారు చేయగలదు, 21 వ శతాబ్దానికి అవసరమైన ఆలోచనానపుణ్యాల్ని అందించగలదు. నిజమే. కాని ఒక మనిషిని రూపొందించగలదా అనే ప్రశ్న కూడా తలెత్తకుండా ఉండదు. ఇది అత్యంత పురాతనమైన ప్రశ్న. ఛాందోగ్య ఉపనిషత్తులో సనత్కుమారుణ్ణి నారదుడు అడిగిన ప్రశ్న ఇదే: నేను మంత్రవేత్తను కాగలిగాను, కాని, ఆత్మవేత్తను కావడమెట్లా అని. కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో పిల్లలకి కోడింగ్ నేర్పడంతో పాటు మరొకటేదో కూడా నేర్పవలసి ఉంటుంది, అదేమై ఉండవచ్చు అని ఆలోచనలో పడ్డ నాకు, ఆ సాయంకాలం, కనిగిరి కస్తూర్బా విద్యాలయంలో బాలికలు దారి చూపించారు.
చంద్రశేఖరపురం నుంచి మేం కనిగిరి వచ్చేటప్పటికి పొద్దుపోయింది. కాని కనిగిరిలో పిల్లలూ, ఉపాధ్యాయులూ కూడా మా కోసం ఎదురు చూస్తున్నారని తెలియడంతో ఒకసారి వాళ్ళని పలకరించి వెళ్ళిపోదామని అక్కడ అడుగుపెట్టినవాణ్ణి దాదాపు రెండు మూడు గంటల పాటు అక్కణ్ణుంచి కదల్లేకపోయాను. ఆ సాయంకాలం ఆ బాలికలు ఆ పాఠశాల ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. వాళ్ళు నేను చూడాలని బుర్రకథ వినిపించారు. మేము వినాలని పాటలు పాడారు. నాట్యం చేసారు. అన్నిటికన్నా ముఖ్యం మా కోసం ఒక చిన్న రూపకం ప్రదర్శించారు.
అదొక # Me Too కథ. ఒకామె ఒక ఆఫీసులో పనిచేస్తుంటుంది. ఆమె బాస్ ఆమెని లైంగికంగా వేధిస్తుంటాడు. ఆమె తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటుంది. ఇంతలో ఆమెకి # Me Too ఉద్యమం గురించి తెలుస్తుంది. తనకి కూడా అదే గత్యంతరం అనుకుంటుంది. తన బాస్ తనని పెడుతున్న ఇబ్బందుల గురించి ఒక వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేస్తుంది. కాని, ఆ క్షణం నుంచీ ఆమె కష్టాలు పదింతలవుతాయి. ఆ వీడియో పెట్టడం ద్వారా తన ఇంటి పరువు బజారున పడిందని భర్త ఆమెని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. తన కాపురంలో నిప్పులు పోసుకుందనే బాధతో ఆమె తల్లి కూడా ఆమెని నిందిస్తుంది. స్నేహితులు మొహం చాటేస్తారు. రోడ్డున పోయే ప్రతి ఆకతాయి కూడా ఆమెని చూసి ఏదో ఒక కామెంటు విసరకుండా ముందుకు పోడు. ఒక్కసారిగా ఆమె అగమ్యంలో చిక్కుకుపోతుంది. తన సమస్యలనుంచి తాను బయటపడతాననుకుంటే తన జీవితం మరింత సమస్యాత్మకంగా మారిందేమా అని నివ్వెరపోతుంది. తాను ఎవరిని కదిపినా ప్రతి ఒక్కరూ తనని ‘చావు, చావు చావు’ అని మాత్రమే ఎందుకంటున్నారు, ఒక్కరు కూడా తనని ‘బతుకు, బతుకు, బతుకు ‘అని ఎందుకనడంలేదని ఆశ్చర్యపోతుంది. ఏడుస్తుంది. కుప్పకూలిపోతుంది.
చెప్పొద్దూ, నేనూ రచయితనే కాబట్టి, సరిగ్గా, అప్పుడే, ఆ కథకి ఆ చిన్నారి బాలికలు ఏమి మలుపు ఇవ్వబోతున్నారని కుతూహలంగా ముందుకు వంగి ఆసక్తిగా మరు సన్నివేశం కోసం చూపు సారించాను. ఆ పైన చెప్పబోయే వాక్యాల కోసం ఆతృతగా చెవులు రిక్కించాను.
తెలుగు చలనచిత్ర రంగంలో గొప్ప దర్శకులుగా పేరు తెచ్చుకున్నవాళ్ళు కూడా ఆ పద్మవ్యూహంలో అక్కడిదాకానే రాగలరు. ఒక సారి ఆ సమస్యను అట్లా భుజాల కెత్తుకున్న తర్వాత ఆ బరువు మొయ్యలేక వాళ్ళు చతికిల పడిపోవడం ఎన్ని సినిమాల్లో చూడలేదు కనుక మనం! లేదా, సరిగ్గా ఆ క్షణంలోనే మహేష్ బాబునో, ప్రభాస్ నో ‘నేనున్నాను’ అంటో ఏదో ఒక ట్రాక్టరులోనో, లారీలోనో, మా వెనక గోడ బద్దలుగొట్టుకుంటూ వచ్చిపడతారు.
కాని, సరిగ్గా, ఆ క్షణంలోనే, ఆ హైస్కూలు బాలికలు నన్ను విభ్రాంతపరిచారు. అట్లా మా ముందు కుప్పకూలిపోయిన ఆ పాత్రధారి మరునిమిషంలో లేచి నిల్చుని, ‘నేనెందుకు చావాలి? నేనేం తప్పు చేసాను కనుక? నిజంగా తప్పు చేసిన దుర్మార్గుడు, నా బాస్ తలెత్తుకుని తిరుగుతుంటే నేనెందుకిట్లా ఏడుస్తున్నాను? నేను బతకాలి. తప్పకుండా బతకాలి, సగర్వంగా బతకాలి, సంతోషంగా బతకాలి ‘ అంటో రెండు చేతులూ కట్టుకుని ఒక ధీరగంభీరవదనంతో, మూర్తీభవించిన ఆత్మస్థైర్యంతో మా ముందు నిల్చుంది.
రూపకం పూర్తయిపోయింది. నేను చప్పట్లు కొడుతున్నవాణ్ణి అట్లానే చప్పట్లు కొడుతూ ఉండిపోయాను. స్త్రీలకి జరుగుతున్న అన్యాయాల మీదా, వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలమీదా నేను కూడా కొన్ని కథలు రాసినవాణ్ణే కాని, అంత శక్తిమంతమైన కథ నేనిప్పటిదాకా రాయలేదు, ఎవరూ రాయగా చదవలేదు కూడా.
కనిగిరినుంచి ఆ వెన్నెల రాత్రి ఇంటికి తిరిగివస్తూ నాకు నేను చెప్పుకున్నదొకటే మాట: 21 వ శతాబ్దపు విద్యకి కోడింగ్ ఎంత అవసరమో, కథలు కూడా అంతే అవసరం అని.
13-3-2020